Home » సంభవం అధ్యాయం ఒన్ను మూవీ రివ్యూ

సంభవం అధ్యాయం ఒన్ను మూవీ రివ్యూ

Spread the love

ఈ మలయాళం దర్శకులు ఉన్నారే
వీళ్లకు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కొట్టిన పిండి

రొటీన్ రోడ్డ కొట్టుడు ఫార్ములాలకు భిన్నంగా డిఫరెంట్ ఆలోచనలతో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలు తీయడంలో వీళ్ళు ముందుంటారు

కాకపోతే వీళ్లతో ఒకే ఒక కంప్లైంట్ ఉంది
ఎంత సస్పెన్స్ థ్రిల్లర్ అయినా స్లోగా నడుస్తుంది

కానీ ట్విస్టులు మాత్రం ఫాస్ట్ గా ఉంటాయి
వీటన్నిటికి తోడు క్లైమాక్స్ ట్విస్ట్ ఆశ్చర్యపోయేలా ఉంటుంది
అదే వీళ్ల మ్యాజిక్

గతంలో థియేటర్ రిలీజ్ రోజుల్లో లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఇతర భాషా ఆడియన్స్ కి వీళ్ళ సినిమాలు ఎక్కువగా కనెక్ట్ కాలేదు
ప్రస్తుతం ఓటీటీ యుగం రావడం, స్థానిక భాషలో డబ్బింగ్ వెర్షన్లు రావడం వంటి మార్పులతో మలయాళ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆదరణ పెరిగింది

తాజాగా సంభవం అధ్యాయం ఒన్ను పేరుతో ఓ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది

టైటిల్లోనే మొదటి చాప్టర్ అని క్లియర్ గా చెప్పారు కాబట్టి దీనికి కొనసాగింపుగా రెండో చాప్టర్ కూడా ఉంటుందని తెలుస్తుంది

ఇప్పుడు మూవీ ఎలా ఉందో చూద్దాం

కథేంటంటే?

సినిమా ఆరంభమే దట్టమైన అడవిలో డార్క్ మోడ్ లో ఒక మహిళ లాంతర్ పట్టుకుని దారి చూపిస్తుండగా కొంతమంది రెండు శవాలను మోసుకుంటూ వెళ్తుంటారు

అడవిలో ఓ చోట శవాలను పారేసిన తర్వాత ఆ మహిళ తన ప్రియుడు జేమ్స్ పేరును కలవరిస్తుంది
ఆమె పిలుపులు విని వచ్చిన జేమ్స్ ఆ మహిళ ముఖం మీద ఉమ్మేసి పారిపోతాడు

మరోపక్క ఆనంద్ (అస్గర్ ఆలీ)అనే పోలీస్ అధికారికి కర్ణాటక, కేరళ బోర్డర్ లో ఉన్న పోలీస్ స్టేషన్ కు బదిలీ అవడంతో డ్యూటీలో జాయిన్ కావడానికి ప్రెగ్నెంట్ గా ఉన్న భార్యను వదిలి వెళ్లాల్సివస్తుంది

అతడు అడవి మార్గంలో జీపులో వెళ్తుండగా ఆక్సిడెంట్ జరిగి మరో పోలీస్ ఆఫీసర్ గాయపడతాడు
ఆనంద్ అతడ్ని అదే జీపులో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు

అక్కడ ఆనంద్ ని లోకల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశోకన్ కలుస్తాడు
వీరు మాటల్లో ఉండగా అడవి దారిలో ఏదో గొడవ జరుగుతుందని తెలిసి వెళ్తారు
అక్కడ వీరికి ఒక శవం కనిపిస్తుంది

మరోపక్క ఇందాక గాయపడిన పోలీస్ ఆఫీసర్ వాకీ టాకీ నుంచి తాను అడవిలో ఇరుక్కుపోయానని , తనని కాపాడమని ఇంకో పోలీస్ ఆఫీసర్ స్టీపెన్ ఏడుస్తూ చెప్పడంతో అతడిని కాపాడటానికి ఆనంద్, అశోకన్ లు రెజీ అనే పోలీస్ అధికారిని వెంటపెట్టుకుని అడవిలోకి వెళ్తారు

అడవిలో మనిషి శరీరానికి కాకి తల ఉన్న విగ్రహం దగ్గరకు చేరుకున్న తర్వాత వీరికి విచిత్రమైన అనుభవాలు ఎదురౌతాయి

ఆనంద్ జీపులో వెళ్తుండగా ఆక్సిడెంట్ కు గురి అయిన పోలీస్ ఎవరు?

అడవి దారిలో ఉన్న శవం ఎవరిది?

కాకి తల ఉన్న మనిషి శరీరం విగ్రహం వెనుక ఉన్న కథ ఏంటి? అనేవి మిగిలిన కథనంలో తెలుస్తుంది

అసలు సినిమా ప్రారంభంలో కనిపించిన మహిళకు ,జేమ్స్ కు , అడవికి ఉన్న కనెక్షన్ ఏంటి ?

ఎలా ఉంది?

మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలు అంటే సాధారణంగా 90 శాతం మర్డర్ మిస్టరీ కోణంలో ఉంటాయి

హత్యలు జరగడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగడం, ఆఖరికి హంతకులు ఎవరో రివీల్ కావడం వంటి ఫార్ములాలతో ఉంటాయి
ఈ మధ్యలో ట్విస్టులు మామూలే

అయితే ఈ మూవీలో దర్శకుడు ఎన్నుకున్న కథాంశం విభిన్నమైనది
టైం లూప్ అనే కాన్సెప్ట్ ఆధారంగా కథ అల్లుకుని దానికి కొద్దిగా ఫాంటసీ టచ్ ఇచ్చి డిఫరెంట్ గా మలిచాడు

నిజానికి ఈ టైమ్ లూప్ అన్న ఫార్ములా కూడా కొత్తదేమీ కాదు
హాలీవుడ్ సినిమాలు చూసే వారికి ఈజీగా అర్థమవుతాయి

మన వైపు కూడా ఒకట్రెండు సినిమాల్లో ప్రయత్నించారు కానీ పెద్దగా ఎక్కలేదు
ఎందుకంటే టైమ్ లూప్ లో వేరు వేరు కాలాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా కథ అల్లుకోవాలి
ఆ కాలానికి నేటి కాలానికి సింక్ అయ్యే విధంగా కథనం నడపాలి
కొంచెం జాగ్రత్తగా కసరత్తు చేసిన తర్వాతనే తెరకెకించాల్సిన సబ్జెక్ట్ ఇది
ఈ మూవీ కోసమేమలయాళ దర్శకుడు జీతు సతీషన్ ఆ పరంగా గట్టి కసరత్తే చేసినట్టున్నాడు
లేకపోతే తక్కువ బడ్జెట్లో సినిమా తీసి కోట్లలో కొల్లగొట్టడం అంటే మాటలు కాదు కదా?

కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇలాంటి సినిమాలు చూడాలంటే ప్రేక్షకులు కూడా కసరత్తులు గట్టిగానే చెయ్యాలి
సినిమాని ఏకబిగిన చూస్తేనే అర్థమౌతుంది
ఓటిటీ నే కదా అని మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటూ చూస్తే ప్రస్తుతం మనమే కాలంలో ఉన్నామో వెతుక్కోవాల్సి ఉంటుంది
సన్నివేశానికి, సన్నివేశానికి మధ్య ఇంటర్ కనెక్షన్ లింకులు ఉంటాయి
అవి మిస్ అయితే కథ అర్థం కాదు
అప్పటికీ తదేకంగా కన్నార్పకుండా చూసినా కొన్ని చోట్ల మనం కన్ఫ్యూజ్ అవుతాము
ఎందుకంటే ఇందులో చాలా సన్నివేశాలు రిపీట్ అవుతాయి
కానీ రిపీట్ అయిన సన్నివేశానికి గతంలో ఎక్కడో ఓ లింకో , గొళ్ళెమో ఉంటుంది
ఒక రకంగా ఈ సినిమా సైన్స్ పాఠం లాంటిదన్నమాట
ప్రతి ఫార్ములాను గుర్తు పెట్టుకోవాలి

ఆనంద్ మిగిలిన ఇద్దరు పోలీస్ అధికారులతో కలిసి అడవిలో ఆలయం దగ్గరికి వెళ్లిన తర్వాత నుంచి కథలో సంఘర్షణ మొదలౌతుంది

ఆనంద్ అడవిలోకి వెళ్ళేదాకా ఇదేదో మర్డర్ మిస్టరీ స్టోరీ అనుకుంటాం
అందుకుతగినట్టుగానే మొదట్లో అడుగుకో పోలీస్ కనిపిస్తాడు

మొదట అడవి దారిలో చనిపోయిన వ్యక్తి గురించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ సాగుతుంది అనుకుంటాం
కానీ ఆనంద్ మిగిలిన ఇద్దరితో కలిసి అడవిలో విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు స్టోరీ వేరే ఉందని అర్ధమౌతుంది

అడవిలో టైం లూప్ లో కొంతమంది ఇరుక్కోవడం వెనుక అసలు విషయాలు ఒక వ్యక్తి ద్వారా రివీల్ చేసిన తర్వాత మనుషుల మాయం వెనుక అసలు కారణాలు మనకు తెలుస్తాయి
ఈ నేపథ్యంలో అడవిలో జరిగే కొన్ని సన్నివేశాలు మనలో ఉత్సుకతను రేకెత్తిస్తాయి

ముప్పై ఏళ్ళ క్రితం చనిపోయాడు అనుకున్న స్టీపెన్ అనే పోలీస్ ఆనంద్ తో వాకీ టాకీ లో మాట్లాడే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి
ఆలయంలో కాకి తల ఉన్న మనిషి శరీరం విగ్రహం వెనుక ఉన్న కథ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది
అడవిలో పొరపాటున ఎవరి రక్తమైనా చిందితే వాళ్ళు టైమ్ లూప్ లో ఇరుక్కుపోతారు అనే కాన్సెప్ట్ కొత్తగా ఉంది

ముప్పై ఏళ్ల క్రితం అడవిలో తప్పిపోయి టైమ్ లూప్ లో ఇరుక్కుపోయిన నలుగురు పోలీసు ఆఫీసర్లు, నలుగురు దొంగల చుట్టూ కథ తిరుగుతుంది

ఇంతవరకు బాగానే ఉంది కానీ పదేపదే కొన్ని సన్నివేశాలు రిపీట్ కావడం, అదే మనుషులు మళ్ళీ మళ్ళీ కనిపించడం, అసలు ఎవడు బతుకున్నాడో, ఎవడు మర్డర్ అయ్యాడో తెలియక గందరగోళం అవడం,1994-2024 మధ్య కథా కాలాల గురించి అయోమయం నెలకొనడం వంటి సన్నివేశాలు చూసిన తర్వాత సినిమాలో నటించిన ఆనంద్ తో పాటు ప్రేక్షకులు కూడా కన్ఫ్యూజ్ అవుతారు

తిరిగి క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ ద్వారా రెండో భాగం కూడా ఉందని దర్శకుడు హింట్ ఇచ్చాడు కాబట్టి ఇందులో మిగిలిపోయిన డౌట్లకు అందులో సమాధానాలు వేసుకోవాల్సిందే

ఎవరెలా చేశారు?

ఈ మూవీలో మొదటినుంచి చివరివరకు కనిపించే పాత్ర పోలీస్ అధికారి ఆనంద్ మాత్రమే
ఈ పాత్రలో అస్గర్ ఆలీ నటన బావుంది
కానీ ఎందుకో మిగిలిన పోలీసులతో పోలిస్తే ఇతడిలో పోలీస్ లక్షణాలు తక్కువగా కనిపిస్తాయి
బహుశా యూనిఫాం లేకపోవడం వల్లనేమో
మిగిలిన వాళ్ళు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు

సాంకేతికత

అడవి నేపథ్యంలో సినిమా సాగుతుంది కాబట్టి కెమెరా పనితనం గట్టిగా ఉండాల్సిందే
సినిమాటోగ్రఫీ బాగానే ఉంది
ఇక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకు బిజిఎం ప్రాణం పోస్తుంది
ఇలాంటి సినిమాలకు అసలు మ్యాజిక్కంతా బిజిఎం లోనే ఉంటుంది
బిజిఎం బాగానే ఉంది కానీ ఇంకాస్త బెటర్ ఉంటే కిక్ వేరే లెవెల్లో ఉండేది
టైమ్ లూప్ అనే సబ్జెక్టును మ్యానేజ్ చేయడం అనే ప్రక్రియ చాలా కష్టంతో కూడుకున్న పని
ఈ విషయంలో దర్శకుడు జీతు సతీషన్ కష్టం కనిపిస్తూనే ఉంది

విశ్లేషణ

అసలుకే ఇది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. పైగా టైమ్ లూప్ కి సంబంధించిన కథాంశంతో కూడుకుని ఉంటుంది కాబట్టి కష్టమో నష్టమో సినిమాని ఏకబిగిన చూడాల్సిందే.. ఓటీటీ నే కదా అని మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి చూసారో ప్రస్తుతం మనం ఏ కాలంలో ఉన్నామో వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.. అందుచేత సినిమా చూద్దాం అనుకున్న వారు ఏకబిగిన ఒకేసారి చూసేయండి.. అప్పటికీ అడవిలో కొన్ని సన్నివేశాల్లో అక్కడక్కడా కొంత కన్ఫ్యూజ్ అవుతారు.. మీకు ఆ కన్ఫ్యూజన్ తీరాలంటే నెక్స్ట్ సన్నివేశం వచ్చే వరకు వెయిట్ చేయండి.. మీరు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడితేనే ఈ మూవీ చూడటం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అన్నమాట.. మలయాళం మూవీ అయినా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఉంది కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు.. ఇక ఇదేదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కాబట్టి మితిమీరిన వయోలెన్స్, అశ్లీలత దృశ్యాలు ఉంటాయేమో అని భయపడక్కట్లేదు.. ఇంట్లో ఫ్యామిలీతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు

నటీనటులు: అస్గర్ ఆలీ, సిద్ధార్థ్ భరతన్ తదితరులు
రచన, దర్శకత్వం: జీతు సతీషన్
విడుదల: జియో హాట్ స్టార్
రేటింగ్: 3/5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!