Home » సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ రివ్యూ

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ రివ్యూ

Spread the love

ఇరవై ఏళ్ల క్రితం ఫస్ట్ ఇన్నింగ్స్ లో హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే సినిమాలు చేసిన శివాజీ తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు

దండోరా, కోర్ట్ వంటి సినిమాల్లో శివాజీ చక్కటి పెర్ఫార్మెన్స్ చూపించి ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు

నటుడిగా శివాజీ తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు అనడంలో ఎటువంటి సందేహాలు లేవు
అదే సమయంలో వ్యక్తిగా శివాజీ విమర్శల వలయంలో కూరుకుపోతున్నాడు అనేది కూడా వాస్తవం

ఆ మధ్య సినిమాల మీద ఫోకస్ తగ్గించుకుని రాజకీయాల్లో ఎడం కాలు పెట్టి గరుడ పురాణం అంటూ వివాదాస్పద వాఖ్యలు చేసి శివాజీ వార్తల్లో నిలిచాడు
దాంతో అతడి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అయ్యింది

ఇటూ సినీ అవకాశాలు తగ్గిపోయి, అటు రాజకీయాల్లో కొత్త అవకాశాలు రాక కొన్నాళ్ళు త్రిశంకు స్వర్గంలో వేలాడాడు

చివరికి అసలు విషయం తెలుసుకుని రాజకీయాలు తగ్గించుకుని సినిమాల మీద దృష్టి పెట్టాడు

వేళావిశేషం ఏంటో కానీ శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ దశ తిరిగింది
అతడి చేతిలో మంచి సినిమాలు పడ్డాయి

ఆ సినిమాల్లో ప్రత్యేకంగా అతడి పాత్ర గురించే ప్రేక్షకులు మాట్లాడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి

ఈ పరిస్థితుల్లో తిరిగి ఓ సినిమా ఫంక్షన్లో హీరోయిన్ల వస్త్ర ధారణ గురించి వివాదాస్పద వాఖ్యలు చేసి మరోసారి వార్తలకెక్కాడు

ఆ వ్యాఖ్యల తో ఇండస్ట్రీలోని హీరోయిన్ల నుంచి నెగిటివ్ కామెంట్స్ రావడంతో క్షమాపణలు చెప్పి తిరిగి సినిమాల మీద ఫోకస్ పెట్టాడు

ఈసారి కేవలం సినిమాల మీద ఫోకస్ పెట్టడమే కాదు ఏకంగా చిత్ర నిర్మాణంలోకే అడుగుపెట్టాడు

అదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని
దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత లయతో కలిసి శివాజీ నటించి నిర్మించిన సినిమా ఇది

గతంలో ఈ పెయిర్ హిట్ కొట్టడంతో ఈ సినిమా మీద కూడా ఇండస్ట్రీలో కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి

దాంతో మొదట్లో ఈటీవీ విన్ లో నేరుగా రిలీజ్ చేద్దామనుకున్న సినిమా అంచనాలు అందుకుని థియేటర్ రిలీజ్ కి వెళ్ళింది

ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లోకి స్ట్రీమింగ్ అవుతుంది
మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం

కథేంటంటే?

టైటిల్ చూసారుగా
కొత్తకోట పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీరామ్ (శివాజీ) సంప్రదాయాలను పాటిస్తూ నిజాయితీ పరుడిగా పేరు తెచ్చుకుంటాడు
టైటిల్లో మొదట చెప్పుకున్న సంప్రదాయిని శివాజీ గురించే

ఇక అతడి భార్య ఉత్తర (లయ)చాలా గడుసుది
తన తెలివి తేటలతో సుప్పనాతి వేషాలు వేస్తుంటుంది
వీళ్ల కొడుకు మిట్టు(రోహన్)రీల్స్ పిచ్చిలో తింగరి వేషాలు వేసే సుద్దపూస

సినిమా ప్రారంభంలోనే తన భార్య కొడుకుల స్వభావాల గురించి శివాజీ చెప్తాడు
అయితే వీరి జీవితాల్లో అనుకోని సంఘటన జరుగుతుంది

ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై విక్రమ్ (ప్రిన్స్) అనూహ్యంగా శ్రీరామ్ ఇంటికి వచ్చి హత్యకు గురి అవుతాడు

హత్యా నేరం తమ కొడుకు మీద పడుతుందేమో అన్న భయంతో దంపతులు వణికిపోతారు
దాంతో ఈ హత్య కేసునుంచి బయటపడటానికి భార్య ప్రోద్బలంతో శ్రీరామ్ ఒక ప్లాన్ వేస్తాడు

అసలు ఎస్సై విక్రమ్ శ్రీరామ్ ఇంటికి ఎందుకొస్తాడు?

అక్కడ ఎస్సైని హత్య చేసింది ఎవరు?

కేసునుంచి బయటపడటానికి శ్రీరామ్ అండ్ ఉత్తరలు వేసిన ప్లాన్ ఏంటి?

ఎస్సైని నిజంగా శ్రీరామ్ కొడుకే చంపుతాడా?

అసలు హంతకుడు ఎవరు? అనే విషయాలు మిగిలిన కథనంలో తెలుస్తుంది

ఎలా ఉంది?

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో హిట్ కొట్టాలంటే పకడ్బందీ అయిన స్క్రీన్ ప్లే తో పాటు క్లైమాక్సులో అదిరిపోయే ట్విస్ట్ ఉండాలి

మలయాళ దర్శకులు ఇదే ఫార్ములాను ఫాలో అవుతారు
సినిమా అంతా సస్పెన్సుతో స్లోగా నడిపి ఆఖర్లో ప్రేక్షకులు ఊహించని ట్విస్టుతో ముగిస్తారు

దాంతో చాలామందికి థ్రిల్లింగ్ మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది
ఈ మూవీలో కూడా అదే ఫార్ములాని ఫాలో అయినట్టు ఉన్నారు

ప్రారంభంలో శ్రీరామ్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో కామెడీ సీన్లు రాసుకున్న దర్శకుడు హఠాత్తుగా శ్రీరామ్ ఇంట్లో జరిగిన ఎస్సై విక్రమ్ హత్యతో కథని సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లోకి మలిచారు

ఎస్సై హత్యతో కథలో అసలు సంఘర్షణ మొదలౌతుంది

శ్రీరామ్ అండ్ ఉత్తరలు కలిసి హత్యకు సంబంధించిన ఆధారాలు చెరిపేసేయడం , పోలీసుల కంటపడకుండా శవాన్ని మాయం చేయడానికి కారులో తరలించడం వంటి సన్నివేశాలతో కథనంలో వేగం పెరుగుతుంది

కథనం మరీ సీరియస్ గా సాగిపోయి ప్రేక్షకులకు బోర్ కొడుతుందని ఊహించాడో ఏమిటో ఆలీ పాత్రని దింపటం ద్వారా దర్శకుడు వాతావరణాన్ని చల్లబర్చాడు
అతడు ఊహించినట్టే తన కామెడీ టైమింగ్ తో ఆలీ నవ్వులు పంచాడు

నవ్వించడానికి జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ ను కూడా రంగంలోకి దింపారు కానీ ఎందుకో అతడి పాత్ర అంతగా రక్తి కట్టలేదు

సీరియస్ గా సాగిపోతున్న సినిమాలో జోష్ పెంచటానికి బండ్ల గణేష్ తో హుషారైన సాంగ్ కి స్టెప్పులు వేయించారు

అయితే ఫస్టాఫ్ లో మొదలైన ఎస్సై హత్య సెకండాఫ్ లో అతడి శవాన్ని మాయం చేయడం వరకు కథనం మెల్లిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది
దీనికి తోడు అక్కడక్కడా సాగతీత సన్నివేశాలు ఉన్నాయి

రఘుబాబు , పృథ్వీ లతో చేయించిన సన్నివేశాలు కామెడీ ట్రాక్ కోసం కథ మధ్యలో అతికించినట్టు ఉన్నాయి
నిజానికి ఆ సన్నివేశాలు లేకపోయినా కథకు వచ్చిన నష్టం ఏమీ ఉండదు

ఇదేకాకుండా మధ్య మధ్యలో ఆ ఎమ్మెల్యే తిమ్మప్ప గోల కూడా ఎక్కువైనట్టు అనిపిస్తుంది
హత్య కేసు నుంచి కథను సైడ్ ట్రాక్ పట్టించేలా ఉంది తప్ప కథనంలో సరిగా అతకలేదు

ఇక విన్నకోట ప్రదీప్ తో చేయించిన కామెడీ కొద్దిగా ఎఫ్ 2 ను గుర్తు చేస్తుంది

ఇవన్నీ అలా ఉంచితే సినిమాకి ఊపిరి పోసింది మాత్రం క్లైమాక్స్ ట్విస్టే

అప్పటిదాకా ఎంత రీల్స్ పిచ్చి ఉన్నా శివాజీ కొడుకు మిట్టు ఏకంగా ఓ ఎస్సైని చంపడం ఏంటని? కొంత జస్టిఫికేషన్ కోసం ఎదురు చూసే ప్రేక్షకులకు క్లైమాక్స్ ట్విస్ట్ ద్వారా దర్శకుడు సమాధానం చెప్పాడు

ఈ ట్విస్ట్ చూస్తే గబాల్న మనకు దృశ్యం మూవీ గుర్తుకొస్తుంది
గుర్తుకొస్తే గుర్తుకొస్తుంది కానీ క్యూరియాసిటీని కలుగచేస్తుంది

క్లైమాక్స్ ట్విస్ట్ లేకపోతే మిగిలిన కథనమంతా రొటీన్ రోడ్డ కొట్టుడు ఫార్ములా అయ్యేది

ఎవరెలా చేశారు?

కొన్ని సినిమాలు విజయం సాధించటానికి సమిష్టి కృషి ఉంటే మరికొన్ని సినిమాలు విజయం సాధించడానికి ఏ ఒక్కరి కష్టమో ఉంటుంది

అలా ఈ మూవీ విజయానికి శివాజీ నటన ప్రధాన కారణం అవుతుంది
నటన పరంగా చాలా బ్యాలెన్స్డ్ గా చేశాడు
సీరియస్ సన్నివేశాల్లో లయ కామెడీ చేసినా శివాజీ మాత్రం తన పాత్ర పరిధి నుంచి ఇంచు కూడా పక్కకు జరగలేదు
ఇతడు కూడా కామెడీ చేసి ఉంటే కథనంలో సీరియస్నెస్ మిస్ అయ్యేది
ఒక నిజాయితీ పరుడైన వ్యక్తి జీవితంలో సమస్య వస్తే ఏ విధంగా మధన పడతాడో, ఏ విధంగా ఎదుర్కుంటాడో అదే రకంగా నటించాడు
ఒక రకంగా శ్రీరామ్ పాత్రలో శివాజీ పరకాయ ప్రవేశం చేశాడు

ఇక లయ గురించి చెప్పాల్సి వస్తే ఆరంభంలోనే దొంగకు కరెంట్ షాక్ పెట్టడం వంటి అతి మినహా మిగిలిన సన్నివేశాల్లో చాలా సహజంగా నటించింది
లయ కొడుకు రీల్స్ పిచ్చి కుర్రాడిగా రోహన్ నటన కొద్దిగా ఎక్కువైనట్టు అనిపిస్తుంది

ఆలీ ఎప్పటిలానే తన తాగుబోతు మార్క్ నటన చూపించి నవ్వులు పూయించాడు
రఘుబాబు , పృథ్వీ ల నటన పర్లేదు
క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చిన ధనరాజ్ నటన బాగుంది

సాంకేతికత

సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే కథ హార్స్లీహిల్ ప్రాంతంలో జరిగినట్టు చూపించారు
పనిలోపనిగా అక్కడి అందాలను మరింత అందంగా తమ కెమెరా లో చిత్రీకరించారు
ఓవరాల్ గా సినిమాటోగ్రఫీ బాగుంది

ఇక నేపథ్య సంగీతం విషయానికి వస్తే బండ్ల గణేష్ సాంగుతో జోష్ తెప్పించారు
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి

విశ్లేషణ

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అంటే డార్క్ మోడ్ లో సాగుతుంది.. కానీ ఈ సినిమాలో డే లైట్ నే ఎక్కువగా వాడుకున్నా సస్పెన్స్ ఫీల్ నుంచి ప్రేక్షకులు పక్కకు పోకుండా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు.. సెకండాఫ్ లో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు సాగతీతలా అనిపించినా ప్రీ క్లైమాక్స్ కి వచ్చేసరికి కథనంలో కలిసిపోతాయి.. ఫస్టాఫ్ లో కామెడీ ట్రాక్ టచ్ చేసిన దర్శకుడు సెకండాఫ్ లో క్రైమ్ థ్రిల్లర్ వైపు సినిమాని మలుపుతిప్పి క్యూరియాసిటి పెంచాడు.. క్రైమ్ నేపధ్యం ఉన్న సినిమా అయినా ఎక్కడా మోతాదును మించిన అశ్లీల సన్నివేశాలు కానీ, వయోలెన్స్ సన్నివేశాలు కానీ లేవు కాబట్టి ఇంట్లోనే ఓటీటీ లో ఫ్యామిలీతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు

నటీనటులు: శివాజీ, లయ, రోహన్, ఆలీ, రఘుబాబు, పృథ్వీ ,ధనరాజ్ తదితరులు
సంగీతం: రంజిన్ రాజ్
సినిమాటోగ్రఫీ :రిత్విక్ రెడ్డి
నిర్మాత: శివాజీ
దర్శకత్వం: సుధీర్ శ్రీరామ్
విడుదల: నెట్ ఫ్లిక్స్
రేటింగ్: 2.75 /5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!