అన్ని పాత్రలూ అందరూ చేయలేరు
సినిమాల్లో కొన్ని పాత్రలు చేయాలంటే డెడికేషన్ ఉండాలి.. డేరింగ్ ఉండాలి
రాముడి వేషం, కృష్ణుడి వేషంలో ఎంటీవోడ్ని చూసి మురవని అభిమాని ఉండడు
కానీ ఆ వేషం కట్టడానికి ఎన్టీఆర్ పడిన కష్టం ఎంతమందికి తెలుసు?
వొళ్ళంతా ఆభరణాలు దిగేసుకొని మేకప్పు కోసం గంటల తరబడి సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఉండేది
అయినా అన్నిటినీ భరించి ఆయా పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించారు ఎన్టీఆర్
ఈ మేకప్పులు కొంతవరకు భరించొచ్చు
కానీ సిలికాన్ మేకప్పులను భరించాలంటే చాలా సహనం ఉండాలి
కమల్ హాసన్ కి భారతీయుడు సినిమాలో పాత్ర కోసం సిలికాన్ మేకప్ వేసుకోవడానికి రెండు గంటలు.. తీయడానికి రెండు గంటలు పట్టేదట
ఒక్కోసారి అతి మేకప్ వల్ల స్కిన్ అలర్జీలు కూడా వచ్చేవట
అయినా అవన్నీ భరించి కమల్ హాసన్ ఆ సినిమాలో నటించాడు
ఇందుకు డెడికేషన్ మొదటి కారణం కాగా
ఎటువంటి పాత్రనైనా ఛాలెంజింగ్ గా తీసుకుని నటించే సత్తా రెండో కారణం
ఈ జాబితాలో వీరితో పాటు మరికొంతమంది నటీనటులు కూడా ఉన్నారనుకోండి
తాజాగా అలనాటి హీరోయిన్ రాధిక ఒక బామ్మ పాత్రలో నటించి మెప్పించడమే కాదు.. తమిళనాట కలెక్షన్ల సునామీని రాబట్టింది
నిజంగా ఈ సినిమాలో నటించడానికి రాధిక చాలా కష్టపడి ఉంటుంది
ఆవిడ పడిన కష్టం సినిమా చూసినవారికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది
ఇప్పుడు తాయ్ కిళవి మూవీ ఎలా ఉందో చూద్దాం
కథేంటంటే?
తమిళనాడులోని ఓ విలేజ్ లో పపున్ తాయ్ (రాధికా శరత్ కుమార్) అనే బామ్మ వడ్డీలకు డబ్బులు తిప్పుతుంటుంది
అదనపు కట్నం కోసం మొగుడు వదిలేసిన కూతురుని, మనవడిని తన దగ్గరే ఉంచుకుని పోషిస్తూ ఉంటుంది
ముగ్గురు కొడుకులు , కోడళ్ళు ఉన్నా వేరుగా ఉంటారు
ఇక ఈ బామ్మ ఊర్లో ఎవరికి అవసరం ఉన్నా డబ్బులు ఇస్తుంది కానీ వడ్డీ మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తుంది
నోరు పెద్దది
ఎవర్నీ లెక్కచేయదు
అందుకే వడ్డీ వసూలు చేసుకోవడానికి ఆమె వస్తుందంటే ఊరి జనం భయంతో దాక్కుంటారు
ఇలాంటి పరిస్థితుల్లో సడెన్గా ఆమె అనారోగ్యం బారిన పడి మంచానికి పరిమితం అవుతుంది
పక్షవాతం రావడంతో మాట కూడా పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్తుంది
పరిస్థితి తెలుసుకున్న ఊరి జనం ఆమె చనిపోవాలని శాపనార్థాలు పెడుతుంటారు
అయితే పపున్ తాయ్ దగ్గర 160 తులాల బంగారం ఉందని తెలియడంతో ముగ్గురు కొడుకులు, కోడళ్ళు వాటి ఆచూకీ కోసం ఆమె దగ్గర చేరతారు
పపున్ తాయ్ దగ్గర నిజంగా అంత బంగారం ఉందా?
ఉంటే ఎక్కడ దాచింది?
బంగారం చేజిక్కించుకోవడానికి కొడుకులు, కోడళ్ళు ఏం చేస్తారు? అనేది మిగిలిన కథలో తెలుస్తుంది
ఎలా ఉంది?
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్న పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది
పపున్ తాయ్ ఒక సన్నివేశంలో మాట్లాడుతూ ‘ జీవితంలో డబ్బులు అవసరం లేదని ఎవరైనా అంటే వాళ్లకు డబ్బు సమస్య లేదని అర్థం .. అలాంటివారి మాటలను విని మీరు కూడా అలా బతకాలని ప్రయత్నిస్తే అమ్మ నగల కోసమో, నాన్న ఆస్తి కోసమో ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది ‘ అంటుంది
ఈ ఒక్క డైలాగుతోనే బతకడానికి డబ్బు అవసరం ఎంత ఉంటుందో ఆ బామ్మ తేల్చి చెప్పేస్తుంది
మరీ ముఖ్యంగా ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మహిళలు ఒకరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బతికేలా ముందునుంచీ ప్రణాళికలు రూపొందించుకోవాలని తన తల్లి చెప్పేదని కూతురి ద్వారా చెప్పించిన సంభాషణలు హృదయానికి హత్తుకుంటాయి
వయసు మీద పడిన బామ్మ కూడా స్వతంత్రంగా ఎలా బతకవచ్చో పపున్ తాయ్ జీవితం నిరూపిస్తుంది
ఆమె ధైర్యం, ఎవరికీ తల వంచని తత్వం, చాలామంది మహిళలకు ప్రేరణ అవుతుంది
వడ్డీ వ్యాపారం చేస్తుంది కదా అని ఆమె పక్కా కమర్షియల్ ఏమీ కాదు
మొగుడు వదిలేసిన కూతురికి ధైర్యం చెప్పి స్వతంత్రంగా బతికేలా మార్గదర్శనం చేస్తుంది
ఒంటరి మహిళలు భరోసా కోల్పోకుండా జీవితంలో ఎంతో కొంత దాచుకోవాలని ఉద్బోధ చేస్తుంది
సందేశాల సంగతి అలా ఉంచితే ఇందులో కామెడీ ట్రాక్ కూడా తక్కువేమీ లేదు
పపున్ తాయ్ పక్షవాతంతో మంచాన పడిన తర్వాత బంగారం కోసం కొడుకులు , కోడళ్ళు ఆమె చుట్టూ చేరడంతో కథలో సంఘర్షణ మొదలౌతుంది
అదే సమయంలో కామెడీ ట్రాక్ కూడా మొదలౌతుంది
ఆమె దాచిన బంగారం కోసం కొడుకులు లెక్కలు వేసుకోవడం, బంగారం ఎక్కడ దాచిపెట్టిందో అని వెతకడం, బంగారం కోసం పపున్ తాయ్ ని హాస్పిటల్లో చేర్పించి పడిగాపులు కాయడం వంటి సన్నివేశాల్లో కొడుకులు పడే అవస్థలు సరదాగా చూపించారు
అదే సమయంలో అవసాన దశలో ఉన్న తల్లికి వైద్యం చేయించడం ఇష్టం లేక అంబులెన్సులోనే ఆమె ఆక్సిజన్ మాస్క్ తొలగించమని కొడుకు చెప్పడం కంట తడి పెట్టిస్తుంది
నేటి సమాజం తీరు తెన్నుల పట్ల ప్రతి ఒక్క తల్లితండ్రులను ఆలోచింప చేస్తుంది
సెకండాఫ్ లో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు సాగతీతలా ఉండటమే కాకుండా అతి గా కూడా అనిపిస్తాయి
బామ్మ చావు కోసం బ్యాండ్ మేళం వేసుకుని పడిగాపులు కాయడం, ఊరి జనమంతా ఆమె ఇంటి ముందే పడిగాపులు కాయడం వంటి సన్నివేశాలు అతి అయ్యాయి
పనిలోపనిగా తమిళనాడులో ఉన్న రజనీ కాంత్, కమల్ హాసన్ ఫ్యాన్ వీరాభిమానుల అతి ఎలా ఉంటుందో కూడా చూపించారు
అదలా ఉంచితే మొత్తంమీద సినిమా అంతా పపున్ తాయ్ చుట్టూనే తిరుగుతుంది
హాస్పిటల్లో పపున్ తాయ్ కోలుకుని కళ్ళు తెరవగానే బంగారం గురించి చెప్తుందనుకుని ఆశగా ఎదురు చూసిన కొడుకులకు ఆమె చెప్పిన అసలు విషయం నవ్వు తెప్పిస్తుంది
క్లైమాక్స్ లో పపున్ తాయ్ ఇచ్చే సందేశం ప్రతి ఒక్క మహిళను ఆలోచింపచేస్తుంది
ఆఖరి సన్నివేశంలో బల్ల మీద కూర్చుని రాధిక చెప్పే డైలాగులు సినిమాకే హైలెట్
ఎవరెలా చేశారు?
ఈ సినిమాలో తెలుగు వారికి పరిచయం ఉన్న నటి రాధిక మాత్రమే
మిగిలినవారందరూ తమిళ నటీనటులే
అయినా సినిమా చూస్తున్నంతసేపు మనకి రాధిక మాత్రమే కనిపిస్తుంది
ఆమె నట విశ్వ రూపం కనిపిస్తుంది
ఒక్కో సన్నివేశంలో చూస్తుంటే ఈమె నిజంగానే రాధికేనా ? లేకపోతే డూప్ ను పెట్టారా? అన్న అనుమానం కూడా వస్తుంది
ఆ మేకప్ ఆర్టిస్ట్ ఎవరో కానీ చాలా కష్టపడి ఉంటాడు
సినిమాలో మనకు పపున్ తాయ్ మాత్రమే కనిపిస్తుంది
దానికి తోడు పాత్రలో రాధిక పరకాయ ప్రవేశం చేయడంతో సినిమా రక్తి కట్టింది
ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాకి ప్రాణం పోసింది రాధిక మాత్రమే అనడంలో సందేహం లేదు
మిగిలిన నటులు కూడా తమ పరిధిలో బాగానే చేశారు
సాంకేతికత
తమిళనాడు సంస్కృతిని కళ్లకు కట్టినట్టు చూపడంలో కెమెరా పనితనం బాగా ఉంది
అలాగే నేపథ్య సంగీతం కూడా బాగానే ఉంది
నిర్మాణ విలువలు పర్లేదు
ఒకరకంగా 10 కోట్లు ఖర్చు పెట్టి 75 కోట్లు వసూలు చేశారంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి లాక్కున్నట్టే
విశ్లేషణ
వుమెన్ ఎంపవర్మెంట్ గురించి అంతర్లీనంగా చక్కటి సందేశం ఇస్తూ దర్శకుడు కథనాన్ని నడిపిన తీరు బాగుంది.. జీవితంలో ఒక దశలో ఎంతటి మహిళలకు అయినా ఆర్ధిక భద్రత అవసరం అని పపున్ తాయ్ జీవితం ద్వారా చెప్పించిన విధానం కన్విన్సింగ్ గా ఉంది.. ఒకవేళ జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా ఎవరి మీదా ఆధారపడకుండా ధైర్యంగా బతకాలంటే ఆర్ధిక భరోసా అవసరం అని క్లైమాక్సులో రాధిక చెప్పే డైలాగులు ఆలోచింపచేస్తాయి.. అక్కడక్కడా కొన్ని సాగతీత సన్నివేశాలు, కామెడీ ట్రాక్ లో కొంత అతి ఉన్నప్పటికీ రాధిక నటనలో కొట్టుకుపోయాయి .. ఒకరకంగా చెప్పాలంటే తమిళ హీరో శివ కార్తికేయన్ రాధిక మీద నమ్మకంతోనే ఈ సినిమాకి నిర్మాతగా మారాడు అనిపిస్తుంది ..దర్శకుడు కూడా చిన్నవాడే ..అయినా మహిళాసాధికారత మీద పూర్తి అవగాహన ఉన్నట్టుంది..అందుకే చక్కగా తీయగలిగాడు .. జియో హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి హాయిగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు..ఇంతకీ తాయ్ కిళవి అంటే తెలుగులో నాయనమ్మ లేకపోతే బామ్మ అని అర్ధం !
నటీనటులు: రాధికా శరత్ కుమార్ తదితరులు
నిర్మాత: శివ కార్తికేయన్
దర్శకత్వం: శివకుమార్ మురుగేశన్
విడుదల: జియో హాట్ స్టార్
రేటింగ్: 3/5
