Home » మృత్యుంజయ్ మూవీ రివ్యూ

మృత్యుంజయ్ మూవీ రివ్యూ

Spread the love

బాబూ శ్రీవిష్ణు.. నువ్వు చక్కటి నటుడివే.. కాదనను
ఈ మధ్య జోరుగా సినిమాల స్పీడు పెంచినట్టున్నావ్.. అదీ ఓకే
అన్నేసి సినిమాలు ఈ వయసులో కాక ఇంకే వయసులో చేస్తావ్? అదీ ఓకే

కానీ ఈ స్పీడులో కథల ఎంపికలో కొంచం నిర్లక్ష్యం చేస్తున్నావ్ అనిపిస్తుంది

మొన్ననే కింగ్ ఆఫ్ ఎంటర్టైనర్ అంటూ ఓ ట్యాగ్ లైన్ తో విష్ణు విన్యాసాలు అనే కామెడీ చేశావ్

ఇప్పుడు కింగ్ ఆఫ్ కంటెంట్ ట్యాగ్ లైన్ తో మాకందరికీ బోలెడు థ్రిల్ పంచడానికి మృత్యుంజయుడవై మళ్ళీ మా ముందుకు వచ్చేశావ్

సినిమా సినిమాకి ఈ ట్యాగ్ లైన్లు బాగానే ఉన్నాయి.. నీ నటనకు కూడా ఎలాంటి ఢోకా లేదు
కానీ మాదో విన్నపం

గతంలో మాదిరే కథలు విని సినిమాలు ఒప్పుకో
ఆ కథలు కూడా గతంలో ఏ సినిమాలో వాడలేదని నిర్ధారించుకున్న తర్వాతనే ఒప్పుకో
నీకు తిరుగుండదు

అన్నట్టు నేనిలా అన్నానని ఫీలైపోయి సినిమాలు వదిలేయకు
మునుపటిమాదిరే చక్కటి సినిమాలు చేసి మమ్మల్ని అలరించ ప్రార్థన

ఇట్లు నీ శ్రేయోభిలాషి

ఇప్పుడు నీ లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్ గురించి చెప్పుకుందాం

కథేంటంటే?

జయ్ ( శ్రీవిష్ణు) స్వేచ్ఛ అనే న్యూస్ పేపర్లో యాడ్స్ కలెక్ట్ చేసే విభాగంలో పనిచేస్తూ ఉంటాడు
కానీ క్రైమ్ రిపోర్టర్ కావాలనేది అతడి లక్ష్యం

అదే విషయం ఎడిటర్ని అడిగితే అనుభవం లేదు కాబట్టి తర్వాత ఆలోచిద్దాం అంటాడు

పేపర్లో యాడ్స్ సంపాదించటానికి జయ్ వినూత్న మార్గం ఎంచుకుంటాడు
చనిపోయిన వారి ఇళ్లకు వెళ్ళి వారికి మాయమాటలు చెప్పి శ్రద్ధాంజలి యాడ్స్ ఇచ్చేలా చేస్తాడు

ఈ క్రమంలో చనిపోయిన అచ్యుత రావు ( బాలాదిత్య) ఇంటికి కూడా వెళ్తాడు
అక్కడ అచ్యుత రావుది సహజ మరణం కాదు.. మర్డర్ అని అనుమానపడతాడు

అచ్యుత రావు కూతురు అంజలిని చూసి తన గతం గుర్తొచ్చి ఎలాగైనా ఆ పాపకు సాయం చేయాలి అనుకుంటాడు

సరిగ్గా అచ్యుత రావు మరణించిన మూడు రోజులకు విక్రాంత్ కూడా అదే తరహాలో అనుమానాస్పదంగా మరణిస్తాడు

దాంతో ఎవరో సీరియల్ కిల్లర్ ఈ హత్యలు చేస్తున్నాడని జయ్ అనుమానపడి ఏసిపి సీత ( రెబా మోనిక ) దృష్టికి తీసుకెళ్తాడు

కానీ సరైన ఆధారాలు లేకపోవడం, పై అధికారుల వత్తిడి వల్ల ఏసిపి సీత ఈ కేసులో జోక్యం చేసుకోదు

దాంతో హంతకుడిని కనిపెట్టడానికి జయ్ స్వయంగా రంగంలోకి దిగుతాడు

మరి జయ్ సీరియల్ కిల్లర్ ఆచూకీ కనిపెడతాడా?

సీరియల్ కిల్లర్ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు?

అసలు సీరియల్ కిల్లర్ ఎవరు? అనేది మిగిలిన కథనంలో తెలుస్తుంది

ఎలా ఉంది?

సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది
కాకపోతే ఆరంభం తర్వాత వచ్చే సన్నివేశాలు చాలామందికి పెద్దగా నచ్చదు

మెట్రో దిగిన బాలాదిత్య తనను ఎవరో ఫాలో అవుతున్నారని భయపడుతూ ఇంటికి చేరడం వంటి ఇంట్రోతో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూస్తున్నామన్న ఫీలింగ్ కలిగించిన దర్శకుడు యాడ్ల కోసం శ్రీవిష్ణు చావు ఇళ్లకు వెళ్ళడం చూపించి గాలి తీసేశారు

తను పనిచేసే న్యూస్ పేపర్ కి యాడ్స్ సంపాదించడం కోసం శ్రీవిష్ణు ఏ మతస్తులు అయితే ఆ మతస్తుల వేషంతో చనిపోయిన వారి ఇళ్లకు వెళ్ళి ఏవో మాయమాటలు చెప్పి యాడ్స్ సంపాదించడం చాలా ఎబ్బెట్టుగా ఉంది

దాదాపు సినిమా మొదలైన అర్థగంట వరకు చావులు, యాడ్లు చూసి చూసి ప్రేక్షకులకు బోర్ కొడుతుంది

ఎప్పుడైతే బాలాదిత్య హత్యకు గురవుతాడో అప్పటినుంచి కథలో సంఘర్షణ మొదలౌతుంది

బాలాదిత్యది హత్యే అని శ్రీవిష్ణు అనుమానపడి తనదైన స్టైల్ లో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడంతో కథలో వేగం పెరుగుతుంది

అతడి ఇన్వెస్టిగేషన్ తో సాధు (వీర్ ఆర్యన్ ) తెరమీదకు రావడంతో మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ వైపు టర్న్ తీసుకుంటుంది

ఇక అక్కడ్నుంచి కిల్లర్ కి, శ్రీవిష్ణు కి మధ్య మైండ్ గేమ్ స్టార్ అవడంతో కథ ఇంట్రెస్టింగ్ మలుపు తీసుకుంటుంది

జయ్ ను చంపటానికి కిల్లర్ వెంటపడటం.. కిల్లర్ ఎవరో తెలుసుకోవడానికి జయ్ ఇన్వెస్టిగేషన్ చేయడం వంటి ఎపిసోడ్లతో సెకండాఫ్ చకచకా పరుగులు పెడుతుంది

మధ్య మధ్యలో జయ్ కి ఏసిపి సీతకు లవ్ ట్రాక్ పెట్టడాలూ.. నాలుగు పాటలు పెట్టడాలు వంటి రొటీన్ రోడ్డ కొట్టుడు ఫార్ములాల జోలికి పోకుండా సస్పెన్స్ థ్రిల్లర్ అనుకున్న ఫార్మాట్ ను పూర్తిస్థాయిలో యధాతధంగా దించేసి దర్శకుడు తెలివైన పని చేశాడు

అన్ని విషయాల్లో తెలివైన పని చేసిన దర్శకుడు కొన్ని చోట్ల మాత్రం తడబడ్డాడు
అసలు దర్శకుడి మదిలోకి ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందో కానీ ఆరంభమే శ్రీవిష్ణు తన పేపర్ యాడ్స్ కోసం శవాల చుట్టూ తిరగడం బాలేదు

సరే కథ మెల్లిగా ట్రాక్ లో పడింది
హీరో.. విలన్ల మధ్య మైండ్ గేమ్ భలే ఉందిలే అనుకునేంతలోనే చప్పున జులాయి మూవీ గుర్తుకొస్తుంది

అక్కడా అల్లు అర్జున్.. సోనూ సూద్ ల మధ్య మైండ్ గేమ్ నడుస్తుంది
అక్కడా చేతకాని పోలీస్ రాజేంద్ర ప్రసాద్ ఉంటాడు

ఇక్కడా శ్రీవిష్ణు ..విలన్ ల మధ్య మైండ్ గేమ్ నడుస్తుంది
ఇక్కడ చేతకాని ఏసిపి సీత ఉంటుంది

సేమ్ టు సేమ్

పోలీసులు చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ హీరోలు చేస్తారు
హీరోలకు అసిస్టెంట్లుగా పోలీసులు ఉంటారు

మృత్యుంజయ కథ కొత్తదేమీ కాదు
గతంలో చాలా సినిమాల్లో చూసాం అని మనకు అర్థమవటానికి ఎక్కువ టైమ్ పట్టదు

పోనీ కథ పాతది అయితే అయ్యిందిలే కథనం కొత్తగా ఉంటుందేమో అని చూస్తే అక్కడా చాలా చోట్ల నిరాశ ఎదురౌతుంది

ఒక సన్నివేశంలో విలన్ కాలికి మేకు దిగి రక్తం కారుతున్నా కనీసం కుయ్ అని కూడా అనకుండా జాగింగ్ చేస్తున్నట్టు పరిగెత్తడం చూపిస్తారు
ఈ సన్నివేశం వెనుక పరమార్థం ఏంటో ఎంత గింజుకున్నా ఎవరికీ అర్థం కాదు

అలాగే విలన్ని చూసిన శ్రీవిష్ణు రెండోసారి అతడు కనిపించినా గుర్తు పట్టలేకపోతాడు
విలన్ ఉంటున్న ఫ్లాట్ అడ్రస్ కూడా మర్చిపోయి అతడి కోసం ఎక్కడెక్కడో గాలిస్తూ ఉంటాడు

ఇక క్లైమాక్స్ సన్నివేశాలు చూస్తే ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే
శ్రీవిష్ణు విలన్ వీపులో ఇంత పొడవు గునపం దించుతాడు
మాములు విలనైతే అబ్బా అంటూ కిందపడి గిలగిలా తన్నుకుంటూ చచ్చిపోవాలి
కానీ ఇక్కడ విలన్ సూపర్ మ్యాన్ లెక్క అన్నమాట
అంత పొడవు గునపాన్ని పొట్టలోనుంచి బయటకు తీసి పక్కనపడేసి తాపీగా నడుచుకుంటూ శ్రీవిష్ణుతో మాట్లాడటం మొదలుపెడతాడు

శ్రీవిష్ణు మాత్రం తక్కువ తిన్నాడా?

కాలిలో.. చేతిలో బుల్లెట్లు దిగినా అంతే తాపీగా నడుచుకుంటూ విలన్ తో మాట్లాడుతాడు
ఈ సన్నివేశాల్లో లాజిక్ వెతక్కుండా చూస్తే హీరో..విలన్ల మధ్య గొప్ప మైండ్ గేమ్ చూసినట్టు ఉంటుంది

క్లైమాక్స్ సన్నివేశాన్ని సినిమాటిక్ లిబర్టీ కింద తీసుకుని వదిలేస్తే ఇబ్బంది లేదు
మిగతాదంతా బాగానే ఉంటుంది

ఎవరెలా చేశారు?

ఈ సినిమాలో ఎవరెలా చేశారు అంటే ఇద్దరి గురించి చెప్పుకోవాలి

మొదటిది శ్రీవిష్ణు నటన
విష్ణు విన్యాసం లో కామెడీ ఎంటర్టైనర్ గా మెప్పించిన శ్రీవిష్ణు ఇందులో సస్పెన్స్ థ్రిల్లర్ రోల్ లో నటించి మెప్పించారు
చాలా మెచ్యుర్డ్ గా ఉంది శ్రీవిష్ణు నటన
కామెడీ ట్రాక్ జోలికి వెళ్లకుండా జయ్ పాత్ర డిమాండ్ చేసినంతమేరకు చాలా బ్యాలెన్స్డ్ గా నటించాడు
సన్నివేశాలకు తగ్గ హావభావాలు ప్రదర్శించడంలో కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్ డెలివరీ విషయంలో కానీ పక్కా గ్రౌండ్ వర్క్ చేసి నటించినట్టున్నాడు
తాను కామెడీ జానర్ లో అయినా సరే, సీరియస్ జానర్ లో అయినా సరే నటించి మెప్పించగలనని మరోసారి నిరూపించుకున్నాడు

రెండోది విలన్ నటన
ఈ సినిమాకి వీర్ ఆర్యన్ నటన కూడా హైలెట్ అవుతుంది
ఎందుకంటే తన ముఖంలో ఎంతవరకు క్రూరత్వం పలికించాలో అంతవరకు తూకం వేసుకుని మరీ పలికించాడు
అతడి హావభావాలు విలనిజానికి సరిగ్గా సరిపోయాయి

ఇక హీరోయిన్ రెబా మోనిక క్యారెక్టర్ సాధించిన ప్రగతి ఏంటో అర్థం కాదు
అసలు ఆ పాత్ర లేకపోయినా సినిమాకి వచ్చిన నష్టం ఏమీ లేదు
అన్ స్కిల్డ్ పోలీస్ ఆఫీసర్ ఒకరు ఉండాలి కాబట్టి సీత పాత్ర ఆమెకు ఇచ్చినట్టున్నారు
అయినా నటన పరంగా ఆమె బాగానే చేసింది

ఇక మిగిలిన కొన్ని పాత్రలు స్మశానంలో కూర్చుని మాట్లాడటానికి పనికొచ్చాయి కాబట్టి వారి గురించి పెద్దగా చెప్పుకునేది ఏమీ లేదు

సాంకేతికత

ఇది సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కాబట్టి బిజిఎం అండ్ సినిమాటోగ్రఫీ ప్రాధాన్యత వహిస్తాయి
ఆ పరంగా రెండూ యావరేజ్ గానే అనిపిస్తాయి
ఈ రెండు విభాగాల మీద మరింత శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి

విశ్లేషణ

సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీలు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది
నిజానికి మృత్యుంజయ్ కథ కొత్తదేమీ కాదు.. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే మీకు గతంలో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు గుర్తుకు రావొచ్చు.. యాడ్ల కోసం శ్రీవిష్ణు డ్రామాలు ఆడే సన్నివేశాలను పక్కనబెడితే బాలాదిత్య హత్య తర్వాత వచ్చే సన్నివేశాలు మనకు ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలుగచేస్తుంది .. ఇందులో హీరో వెర్సెస్ విలన్ల మధ్య నడిచే మైండ్ గేమ్ మూవీ మీద క్యూరియాసిటి పెంచుతాయి.. అయితే కథనంలో అక్కడక్కడా లాజిక్కులు మిస్ అవుతాయి.. కొన్ని సన్నివేశాల్లో దర్శకత్వ లోపాలు కనిపిస్తాయి.. వీటిని పట్టించుకోకుండా చూస్తే సినిమా బోర్ అయితే కొట్టదు.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా అయినప్పటికీ ఎక్కడా అసభ్యత, అశ్లీల సన్నివేశాలు లేవు కాబట్టి ఫ్యామిలీతో కలిసి ఓటీటీ లో నిరభ్యంతరంగా చూడొచ్చు

నటీనటులు: శ్రీవిష్ణు, రెబా మోనిక , వీర్ ఆర్యన్ తదితరులు
సంగీతం: కాలభైరవ
నిర్మాత: సందీప్ గుణ్ణం
దర్శకత్వం: హుస్సేన్ షా కిరణ్
విడుదల: నెట్ ఫ్లిక్స్ (ఓటీటీ)
రేటింగ్: 2.5/5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!