కర్మాఖ్య సస్పెన్స్ థ్రిల్లర్ హార్రర్ మూవీ (OTT) రివ్యూ – Karmakhya Movie Review

Spread the love

ఈ వారం మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కర్మాఖ్య ఓటిటిలోకి వచ్చేసింది. సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన కర్మాఖ్య మూవీ ( Karmakhya Movie) సెప్టెంబర్ 18, 2026 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ , జియో హాట్ స్టార్ లలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. జులై 31 న థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కర్మాఖ్య మూవీ ఓటిటి లో కూడా ట్రెండింగ్ అవుతుంది.

ఇప్పుడు కర్మాఖ్య మూవీ ఎలా ఉందో చూద్దాం.

కధేంటంటే?

ఓ పల్లెలో తాంత్రిక పూజలు చేసి గర్భవతిని బలి ఇచ్చాడని తెలుసుకున్న ఊరి జనం ఆ తాంత్రికుడిని చంపేయడంతో సినిమా మొదలౌతుంది.

కట్ చేస్తే,

పద్మావతి హాస్టల్లో ఉంటున్న వర్కింగ్ విమెన్స్ ప్రవల్లిక (శరణ్య ప్రదీప్ ), కామాఖ్య (సమైరా) ల మధ్య చక్కటి స్నేహ బంధం ఉంటుంది. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బాగా క్లోజ్ అవుతారు.

కామాఖ్య తీసుకున్న లోన్ తీర్చలేదని బకాయి వసూలు కోసం లోన్ రికవరీ ఏజెంట్లు హాస్టల్ కి వచ్చి గొడవ చేయడంతో ప్రవల్లిక తన దగ్గరున్న డబ్బులిచ్చి తన స్నేహితురాలిని ఆదుకుంటుంది.

ఇదిలా ఉండగా ఓ రోజు ప్రవల్లిక ఫ్యామిలీ ఫంక్షన్ కు ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అదే రోజు ఆమె చేస్తున్న జాబ్ తాలూకు ఇన్సూరెన్స్ వెరిఫికేషన్ ఫీల్డ్ వర్క్ ఉండటంతో ప్రవల్లిక స్థానంలో కామాఖ్య ఫీల్డ్ వర్క్ కి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది.

స్నేహితురాలికి ఇచ్చిన మాట ప్రకారం కామాఖ్య ఇన్సూరెన్స్ వెరిఫికేషన్ కోసం ఊరికి దూరంగా ఉన్న ఓ ఇంటికి వెళ్తుంది. అయితే ఆ ఇంట్లో ఆమెకు విచిత్రమైన మనుషులు ఎదురౌతారు. కారు ప్రమాదంలో తన రెండు కాళ్ళతో పాటు కూతుర్ని కూడా కోల్పోయిన ఓ తండ్రి.. అమాయకంగా కనిపించే తల్లి.. మెంటల్ డిజార్డర్ తో బాధ పడుతున్న కొడుకు ఆ ఇంట్లో ఉంటుంటారు.

వాళ్ళ కూతురి ఇన్సూరెన్స్ ఫారాల వెరిఫికేషన్ పూర్తి చేసుకుని కామాఖ్య తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో ఆ దంపతులు భోజనం చేసి వెళ్లాలని కోరడంతో కామాఖ్య అయిష్టంగానే ఒప్పుకుంటుంది. భోజనం అయిన తర్వాత ఆమె బయలుదేరబోతుంటే ఆ దంపతులు కామాఖ్య ను ఆ రాత్రికి తమ ఇంట్లోనే ఉండి పొమ్మని బలవంతం చేస్తారు. దాంతో తనకేదో అపాయం జరగబోతుందని ఆమె గ్రహిస్తుంది.

అప్పుడేం జరుగుతుంది?
ఆ దంపతులు కామాఖ్యని తమ ఇంట్లోనే ఉండిపోవాలని ఎందుకు బలవంతం చేస్తారు?
ఆ దంపతుల కూతురి మరణానికి కామాఖ్యని తమ ఇంట్లో బంధించడానికి ఉన్న అసలు లింక్ ఏంటి? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

గతంలో తాంత్రిక పూజలు, మూఢ నమ్మకాల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కథకి కూడా మూఢ నమ్మకాలు , తాంత్రిక పూజలు ప్రధాన ముడి సరుకు.

అయితే మూఢ నమ్మకాల పర్యవసానాలు చూపించటానికి ఒక్కో దర్శకుడు ఒక్కో రకమైన ప్లాట్ తీసుకుంటాడు. కొంతమంది దర్శకులు కథలో భాగంగా స్లోగా మూఢ నమ్మకాలను..పర్యవసానాలను చూపిస్తూ ముందుకెళ్తారు. మరికొంతమంది దర్శకులు దొరికిందే ఛాన్స్ అని స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు మూఢ నమ్మకాల నేపథ్యంలో డ్రమ్ములకు డ్రమ్ములు రక్తాన్ని పారించి మితి మీరిన వయోలెన్స్ మార్గాన్ని ఎంచుకుంటారు.

సినిమా చూసే చాలామందికి రెండో మార్గం వెగటు పుట్టిస్తుంది. ఒక పక్కన మూఢ నమ్మకాల వల్ల దుష్ప్రభావాలు అంటూనే పరిష్కారాల బదులు మూఢ నమ్మకాల మీద మరింత ఫోకస్ పెట్టి స్క్రీన్ మొత్తం ఎరుపెక్కిస్తారు.

కానీ కర్మాఖ్య దర్శకుడు మాత్రం మొదటి మార్గాన్ని ఎంచుకోవడం ప్రేక్షకులకు రిలీఫ్ ఇస్తుంది. మితిమీరిన హింసకు బదులు మూఢ నమ్మకాల దుష్ప్రభావాలను కథలో భాగంగా స్లోగా చెప్పుకుంటూ పోయాడు. ఇంకో రకంగా చెప్పాలంటే కథ పాతదే అయినా కథనం మాత్రం కొత్తగా ఉంది. అదే ఈ సినిమాకి ప్రధాన బలం.

ఎప్పుడైతే కామాఖ్య ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందో అప్పట్నుంచి కథనం సస్పెన్స్ థ్రిల్లర్ టోన్ లో సాగుతూ మనల్ని ఎంగేజ్ చేస్తుంది. ఇక్కడ దర్శకుడు చేసిన తెలివైన పనేంటంటే ఆ ఇంట్లో ఉన్న మూడు క్యారెక్టర్లను పెర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకున్నారు. వాకర్ సపోర్ట్ తో నడిచే తండ్రి , మెంటల్ డిజార్డర్ తో విచిత్రంగా ప్రవర్తించే కొడుకు.. అమాయకంగా కనిపించే తల్లి.. ఇలా ఈ మూడు పాత్రలకు ఒక ప్రత్యేకమైన మ్యానరిజం క్రియేట్ చేయడం ఆయా పాత్రల బలాన్ని పెంచాయి.

ఇక మధ్య మధ్యలో ఎస్సై తిరుపతి (సముద్రఖని) పాత్ర ఎంట్రీ ఇస్తుండటంతో సీరియస్ టోన్ లో సాగే కథనంలో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసమే ఆయన పాత్రను దింపారని అనుకుంటాం. కానీ క్లైమాక్స్ చూస్తే కానీ సముద్రఖని పాత్రను దర్శకుడు ఎంత పవర్ఫుల్ గా తీర్చి దిద్దాడో మనకు అర్థం కాదు. సినిమాలో సముద్రఖని పాత్ర కూడా పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. నీతి నిజాయితీ అంటూ ఎస్సై తిరుపతి పాత్రను రొటీన్ ఫార్మాట్లో చూపించకుండా నిజ జీవితంలో మన కళ్లముందు కనిపించే చాలామంది పోలీస్ ఆఫీసర్ల మాదిరి చాలా నాచురల్ గా డిజైన్ చేశారు.

కాకపోతే దర్శకుడు దాదాపు ఫస్టాఫ్ అంతా ఆ ఇంటి చుట్టూనే తన కథనాన్ని నడిపారు. దానికి తోడు కొంచం స్లో నేరేషన్ కావడంతో కథ ఎంతకీ ఆ ఇంటినుంచి బయటికి రావడం లేదనిపిస్తుంది. Don’t relax అనే ట్యాగ్ లైన్ తో దర్శకుడు ఇచ్చిన ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది.

ఇక ఈ సినిమాకి ప్రధాన బలం సెకండాఫ్ ట్విస్టులే.. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి సాగే కథనం మనల్ని పూర్తిగా ఎంగేజ్ చేస్తుంది. క్లైమాక్స్ రొటీన్ గానే ముగించినా ఆఖర్లో ఇచ్చిన ట్విస్ట్ బాగుంది.

ఈ సినిమాలో లోపాలేమన్నా ఉన్నాయంటే అది ఎడిటింగ్ లోనే ఉన్నాయి. సినిమా ప్రారంభమైన గంట వరకు ఎపిసోడ్ల మాదిరి స్టోరీ రన్ అవుతుంది. పల్లెలో తాంత్రిక పూజ.. కట్ చేస్తే.. హాస్టల్లో ఇద్దరి స్నేహితురాళ్ల బాండింగ్ ఎపిసోడ్.. కట్ చేస్తే.. ఇన్స్పెక్టర్ తిరుపతి ఎపిసోడ్.. ఇలా బిట్లు బిట్ల మాదిరి కథనం రన్ అవుతుండటంతో కొంచం కన్ఫ్యూజ్ అవుతాం. సెకండాఫ్ నుంచి స్టోరీ ఒకే లైన్లో ముందుకు సాగుతుంది. (ఇక్కడా ఎవరో ఎమ్మెల్యే ఇంట్లో పార్టీ అనే అనవసరమైన ఎపిసోడ్ ఉందనుకోండి) ఇలాంటి ఒకట్రెండు సాగతీత సన్నివేశాలను ట్రిమ్ చేస్తే ఇంకా బాగుండేది.

ఆఖర్లో డెడ్ బాడీ మాయం అయ్యిందని డాక్టర్లతో చెప్పించి ఈ సినిమాకి కంటిన్యూగా సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని దర్శకుడు హింట్ ఇచ్చాడు.

ఎవరెలా చేశారు?

ఈ సినిమాలో కొన్ని పాత్రలు మాత్రమే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. వాటిలో కామాఖ్య , ప్రవల్లిక, ఎస్సై తిరుపతి , ఆ ఇంట్లో ఉండే ఫ్యామిలి ముఖ్యమైనవి.

కామాఖ్య పాత్రలో నటించిన సమైరా కి ఇది మొదటి చిత్రమైనా బాగా నటించింది. ఇక ఆ ఇంట్లోని మూడు క్యారెక్టర్లు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
డిఫరెంట్ మ్యానరిజంతో సముద్రఖని నటన ఆకట్టుకుంటుంది.

సాంకేతికత

గ్యాని అందించిన సంగీతం యావరేజ్ గా ఉంది.
రమేష్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ బాగానే ఉంది కానీ విజువల్ ఎఫెక్ట్స్ మీద ఇంకొంచం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

విశ్లేషణ

సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్ జానర్ మూవీలు ఇష్టపడేవారికి కర్మాఖ్య సినిమా నచ్చుతుంది. సాధారణంగా హార్రర్ సినిమాలంటే బస్తాలకు బస్తాలు నిమ్మకాయలు కోసేయడాలు.. బుగ్గన పులిపిరి కాయతో జడలు విరబోసుకుని ఉండే భూతాల మాంత్రికుడు.. అర్థరాత్రి ఏడ్పులు.. మాటిమాటికీ కరెంట్ పోవడాలూ.. టీఎంసీల లెక్కన రక్తాన్ని పారించడాలు ఉంటాయి.

కానీ ప్రేక్షకుల అదృష్టం పండి ఈ సినిమాలో అలాంటి రొటీన్ ఫార్మాట్ జోలికి దర్శకుడు పోలేదు. తాంత్రిక పూజలు చేసే మాంత్రికులు కూడా హాయిగా మాములు మనుషుల్లానే ఉంటారు. సినిమా మొత్తంమీద దర్శకుడు ఒకే ఒక్క నిమ్మకాయను చాలా పొదుపుగా వాడారు. ఇక రక్తపాతాలను కూడా టీఎంసీల లెక్కన కాకుండా మిల్లీ లీటర్ల లెక్కన పారించడం ప్రేక్షకులకు ఉపశమనం కలిగించే అంశం. కాకపోతే మనల్ని భయపెట్టి థ్రిల్ పంచేంత హార్రర్ ఎలిమెంట్ కూడా పెద్దగా ఏమీ లేదు.

ఓవరాల్ గా ఈ సినిమాను కథ కన్నా కథనమే ముందుకు నడిపించింది. అమెజాన్ ప్రైమ్ లో తెలుగు లో అందుబాటులో ఉంది కాబట్టి ఓ లుక్కేయండి.

నటీనటులు: సముద్రఖని, సమైరా, అభిరామి , ఆనంద్ , శరణ్య ప్రదీప్ , తదితరులు
సంగీతం: గ్యాని
సినిమాటోగ్రఫీ: రమేష్ రెడ్డి
నిర్మాత: వడ్డేపల్లి శ్రీవాణి
దర్శకత్వం: అభినయ కృష్ణ
ఓటిటి : అమెజాన్ ప్రైమ్
విడుదల: 18-09-2026
రేటింగ్ : 2.75 /5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *