తమిళ నటుడు మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన జి డి ఎన్ మూవీ (GDN Movie) సెప్టెంబర్ 4 , 2026 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియో వెర్షన్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఆగస్టులో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
టైటిల్ చూస్తే చాలామందికి ఇదేదో కెజిఎఫ్ తరహాలో ఉందేమిటీ అని అనిపించవచ్చు. మూవీ మేకర్స్ ఈ సినిమాకి షార్ట్ కట్ లో GDN అనే టైటిల్ పెట్టేబదులు ఫుల్ ఫామ్ లో గోపాలస్వామి దొరైస్వామి నాయుడు అని టైటిల్ పెట్టి ఉంటే బాగుండేది.
ఎందుకంటే ఈ సినిమా గోపాలస్వామి దొరైస్వామి నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా చిత్రీకరించారు. ఈ సినిమాకి ఆయనే కథా నాయకుడు.
ఇప్పుడు GDN మూవీ ఎలా ఉందో చూద్దాం.
కధేంటంటే?
ఈ సినిమా కథ 1914 వ సంవత్సర కాలానికి సంబంధించింది. ఒక చిన్న పూరిపాకలో మోటార్ రిపేర్ చేసుకుంటున్న ఓ వృద్ధుడి దగ్గరికి ముగ్గురు ఇన్కమ్ టాక్స్ అధికారులు వచ్చి బ్రిటిష్ ప్రభుత్వానికి టాక్సులు కట్టకుండా ఎగ్గొట్టినందుకు అతడి ఆస్తులు జప్తు చేస్తున్నామని చెప్పడంతో మూవీ స్టార్ట్ అవుతుంది.
కట్ చేస్తే,
మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మీటింగులో పద్మావతి అనే మహిళ GDN జీవిత చరిత్రను ఇంజనీరింగ్ పాఠ్య పుస్తకాల సిలబస్ లో చేర్చాలని కోరుతూ మెంబెర్స్ అందరికీ తాను రాసిన GDN జీవిత చరిత్ర పేపర్లను అందచేస్తుంది.

తమిళనాడు కోయంబత్తూరుకి చెందిన గోపాలస్వామి దొరైస్వామి నాయుడు ( మాధవన్ ) చిన్నప్పట్నుంచీ సొంతంగా నూతన ఆవిష్కరణలు చేస్తూ ఇంజనీరింగ్ అద్భుతాలు సాధిస్తూ ఉంటాడు.
ముఖ్యంగా మోటార్ రంగంలో విదేశాల మీద ఆధారపడకుండా సొంతంగా స్పేర్ పార్టులు తయారు చేసి అందరికీ చౌక ధరలకు అందచేస్తూ ఉంటాడు. అప్పట్లోనే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశంలో మొట్టమొదటిసారిగా మోటార్ యంత్రాన్ని తయారు చేసింది గోపాలస్వామి నాయుడే. మన దేశంలో మొట్టమొదటి పాలిటెక్నిక్ కాలేజీని స్థాపించింది కూడా దొరైస్వామి నాయుడు గారే.
ఆయన జిన్నింగ్ మిల్లులో డైలీ లేబర్ ఉద్యోగం చేస్తూనే రెండేళ్లలో సొంతంగా కాటన్ ప్రెస్ యంత్రాలను తయారు చేసి తన పేరుతోనే మిల్లు ఓపెన్ చేస్తాడు.
GDN అంతటితో ఆగలేదు. తన ప్రతిభతో UMS అనే మోటార్ ట్రాన్స్పోర్ట్ సంస్థను ప్రారంభించి తమిళనాడు రాష్ట్రమంతా బస్సులను తిప్పడం మొదలుపెడతాడు. GDN ఎదుగుదల అప్పటి బ్రిటిష్ పాలకులకు కోపం తెప్పించింది.
గోపాలస్వామి సొంతంగా స్పేర్ పార్టులు కూడా తయారు చేస్తుండటంతో తమ వ్యాపారాలకు నష్టం కలుగుతుందని బ్రిటిష్ వ్యాపారస్తులు అప్పటి అధికారులకు మొర పెట్టుకుంటారు.
దాంతో GDN తమ ప్రభుత్వానికి టాక్సులు ఎగ్గొట్టాడని తప్పుడు ఆరోపణలతో ఓ ఇన్కమ్ టాక్స్ అధికారి తమ సిబ్బందిని పంపి ఆయన్ని వేధించడం మొదలు పెడతారు.
బ్రిటిష్ పాలకుల వేధింపులను గోపాలస్వామి ఎలా ఎదుర్కుంటారు?
భారత దేశం విదేశీ పరిజ్ఞానం మీద ఆధారపడకుండా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో యంత్రాలను తయారు చేసుకోవచ్చని GDN ఎలా నిరూపించారు?
చివరివరకు GDN వెన్నంటే ఉండి ప్రోత్సహించిన పిళ్ళై ఎవరు? అనేది మిగిలిన కథ.. నిజానికి కథ అనే బదులు మిగిలిన చరిత్ర అనడం కరెక్ట్ అనుకుంటా.
ఎలా ఉంది?
నిజం చెప్పొద్దూ.. ఈ సినిమా చూసే వరకు ఈ GDN గారు ఎవరో నాకూ తెలీదు..మన్నించాలి. ఒక గొప్ప వ్యక్తి జీవిత చరిత్రని సినిమా తీయడం ద్వారా వెలుగులోకి తెచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు.
ఎంతసేపూ గజనీ మహమ్మద్ భారత దేశం మీద ఇన్నిసార్లు దండయాత్ర చేశాడు.. యుద్ధాల్లో లక్షలమంది సైనికులు మరణించారు..అప్పటి రాజుల రాజ్య కాంక్ష, మత విద్వేషాల గురించే మన చరిత్ర పాఠాలను నింపారే కానీ అబ్దుల్ కలామ్, గోపాలస్వామి దొరైస్వామి నాయుడు, కే ఎల్ రావు లాంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను పాఠ్యాంశాలలో చేర్చకపోవడం దురదృష్టకరం.
GDN అనేది సినిమా కాదు.. మోటార్ రంగంలో భారతీయులను..భారత దేశాన్ని తల ఎత్తుకునేలా చేసిన ఒక గొప్ప వ్యక్తి నిజ జీవిత చరిత్ర.
ఈ సినిమాలో మనసుకు హత్తుకునే ఓ సన్నివేశం ఉంటుంది. ఓ బ్రిటిషర్ దగ్గర్నుంచి గోపాలస్వామి 250 రూపాయలకు మోటార్ సైకిల్ కొనుక్కుంటాడు. ఇందుకోసం డబ్బులు తక్కువైతే ఆయన భార్య కూడా తాను దాచుకున్న డబ్బులు తెచ్చి అతడి చేతిలో పెడుతుంది. ఆ డబ్బులతో మోటార్ సైకిల్ కొనుక్కుందామని వెళ్తుండగా దారిలో రైతుల కష్టాలు తెలుసుకుని తన దగ్గరున్న డబ్బులు వాళ్ళకిచ్చేస్తాడు.
అయినా సరే మోటార్ సైకిల్ కొనుక్కోవాలనే తన ఆలోచనను ఒదులుకోడు. అందుకోసం ఓ హోటల్లో సప్లయర్ ఉద్యోగంలో చేరి రెండేళ్ల పాటు తాను పోగేసిన డబ్బులతో బ్రిటిషర్ దగ్గరికి వెళ్ళి మోటార్ సైకిల్ కొనుక్కుంటాడు. తన భర్త కష్టపడి సంపాదించిన డబ్బులతో మోటార్ సైకిల్ కొనడంతో సంతోష పడిన ఆయన భార్య కూతురితో కలిసి మోటార్ సైకిల్ రైడ్ కోసం రెడీ అయి చూస్తే గోపాలస్వామి నాయుడు ఆ మోటార్ సైకిల్ స్పేర్ పార్టులు అన్నీ ఉడబెరకడంతో ఆమె షాక్ అవుతుంది. అప్పుడు గోపాలస్వామి భార్యతో ” నేను ఈ మోటార్ సైకిల్ కొన్నది మనం ఎలా రైడ్ చేయాలనేదానికోసం కాదు.. ఇదే బైక్ ను మనం ఇక్కడే సొంతంగా ఎలా తయారు చేయొచ్చో తెలుసుకోవడం కోసం కొన్నాను” అని చెప్తాడు. అదీ గోపాలస్వామి ప్యాషన్.
చాలామంది ఇతరులు కనుగొన్నదానిని అనుసరిస్తారు..అతికొద్దిమంది మాత్రమే తాము కనుగొని ఇతరులు అనుసరించేలా చేస్తారు. గోపాలస్వామి ఆ కోవలోకే వస్తారు.
ఫస్టాఫ్ ప్రారంభంలో గోపాలస్వామి నాయుడి ఆలోచనలను.. క్రియేటివిటీని పరిచయం చేయడం మీద ఫోకస్ పెట్టిన దర్శకుడు సెకండాఫ్ లో ఇన్కమ్ టాక్స్ అధికారులను దింపి కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారేమో అనిపిస్తుంది.
దీంతో కథ గోపాలస్వామి సాధించిన ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అద్భుతాల మీద నుంచి పక్కకు జరిగి ఇన్కమ్ టాక్స్ అధికారులకు..GDN కు మధ్య ఫేస్ టు ఫేస్ వార్ మీద ఫోకస్ అవడంతో కొంత కమర్షియల్ ఎలిమెంట్స్ టచ్ అయినట్టు అనిపిస్తుంది. దాదాపు సెకండాఫ్ అంతా కథ ఇన్కమ్ టాక్స్ అధికారులు..GDN చుట్టూనే తిప్పడంతో కొంత ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఎందుకో సెకండాఫ్ కొంచం సాగతీత గా అనిపిస్తుంది. దాని బదులు ఇంజనీరింగ్ రంగంలో GDN సాధించిన ప్రగతిని ఇంకొంచం నేరెట్ చేసి ఉంటే బాగుండేది.
GDN ను విడిచి పెట్టి మొదటి భార్య ఎందుకు వెళ్ళిపోతుందో సరిగా ఎస్టాబ్లిష్ కాలేదు. ఆయన జీవితంలో రెండో భార్య రాకను కూడా సింపుల్ గా తేల్చేశారు. క్లైమాక్స్ లో GDN ప్లాన్ బాగుంది కానీ దర్శకుడు సినిమాటిక్ లిబర్టీతో అలా పిక్చరైజ్ చేసారో? లేకపోతే నిజంగా జరిగిందో తెలీదు.
లాస్ట్ లో వైస్ ఛాన్సలర్ పద్మావతి దగ్గరికి వచ్చి ఇంతకీ ఈ GDN నీకమవుతారు? అని అడిగినప్పుడు ఆమె చెప్పిన సమాధానం సర్ప్రైజ్ చేస్తుంది.
ఎవరెలా చేశారు?
ఈ సినిమాలో మనకు మాధవన్ ఎక్కడా కనిపించడు.. మొదట్నుంచి చివరి ఫ్రేమ్ వరకు గోపాలస్వామి దొరైస్వామి నాయుడు మాత్రమే కనిపిస్తాడు.
ఆహార్యం..హావభావాలు.. డైలాగ్ డెలివరీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క విషయంలో మాధవన్ GDN ను కళ్లముందు నిలిపాడు. ఒక వ్యక్తిని అనుకరిస్తూ నటించడం వేరు.. ఒక వ్యక్తి పాత్రలో జీవించడం వేరు. మాధవన్ GDN శరీరంలోకి పరకాయ ప్రవేశం చేశాడు.
ప్రియమణి పాత్రకు స్కోప్ లేకుండా చేశారు. అయినా కనిపించిన కాసేపు ప్రియమణి నటన బాగానే ఉంది.
పిళ్ళై పాత్రలో సత్య రాజ్ నటన బాగుంది. ఒకరకంగా మాధవన్ తో పోటీ పడి నటించాడు.
ఇక ఇన్కమ్ టాక్స్ అధికారి కృష్ణన్ పాత్రలో జయరామ్ పెర్ఫెక్ట్ గా నటించాడు.
సాంకేతికత
గోవింద్ వసంత అందించిన సంగీతం బాగానే ఉంది.
అరవింద్ కమలనాథన్ అందించిన ఫోటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టైమ్ మిషన్ లో తన కెమెరాని 1914 కాలానికి తీసుకెళ్లి ఆనాటి దృశ్యాలను అద్భుతంగా క్యాప్చర్ చేశారు. అలాగే ఈ విషయంలో కళాదర్శకుడికి కూడా పూర్తి మార్కులు పడతాయి.
నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
విశ్లేషణ
కమర్షియల్ ఫార్మాట్లో సినిమాలు చూడటానికి ఇష్టపడేవారికి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. ఎప్పుడో స్వాతంత్రానికి ముందే మన భారతీయుడు సాధించిన ఇంజనీరింగ్ అద్భుతాలను ఈనాడు సజీవంగా కళ్లముందు నిలిపారు.
దర్శకుడు ఫస్టాఫ్ లో సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా సాధ్యమైనంత వరకు GDN నిజ జీవిత చరిత్రను యధాతధంగా ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. ఈ క్రమం మనల్ని కొంత ఎంగేజ్ చేస్తుంది.
ఇక సెకండాఫ్ లో కొంత దర్శకుడు కొంత ఫ్రీ హ్యాండ్ తీసుకున్నట్టు ఉంది. కొన్ని సన్నివేశాలు చూస్తే రొటీన్ కమర్షియల్ మూవీ చూస్తున్నట్టు అనిపిస్తుంది.
ముందే చెప్పినట్టు ఇది సినిమా కాదు.. ఒక గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్లకు GDN మూవీ నచ్చుతుంది.
ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఓ లుక్కేయండి.
నటీనటులు : మాధవన్ , సత్యరాజ్, ప్రియమణి, జయరామ్ తదితరులు
సంగీతం: గోవింద్ వసంత
సినిమాటోగ్రఫీ: అరవింద్ కమలనాథన్
నిర్మాత: సరితా మాధవన్ , ఆర్ మాధవన్
దర్శకత్వం: కృష్ణకుమార్ రామ్ కుమార్
ఓటీటీ: నెట్ఫ్లిక్స్
విడుదల: 4-09-2026
రేటింగ్: 3/5
