Maharaja Hostel movie Review – మహారాజా హాస్టల్ హార్రర్ కామెడీ మూవీ రివ్యూ!

Spread the love

మహారాజా హాస్టల్ లో చేరిన ముగ్గురు ఇంజనీరింగ్ స్టూడెంట్లకు దయ్యాలతో ఎదురైన విచిత్రమైన అనుభవాలే ఈ మూవీ ప్రధాన కథాంశం.

గత జూన్ 24 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మలయాళం మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇదే సినిమా సెప్టెంబర్ 11 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో తెలుగు ఆడియో వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. హార్రర్ కామెడీ జానర్లో రూపొందిన ఈ సినిమా కి చారువాకన్ దర్శకత్వం వహించారు.

ఇప్పుడు మహారాజా హాస్టల్ (Maharaja Hostel Movie) సంగతేంటో చూద్దాం.

కథేంటంటే ?

గర్భంతో ఉన్న ఓ గిరిజన యువతి అర్ధరాత్రి దాహం వేసి మంచినీటి కోసం తమ ఇంటికి అనుకుని ఉన్న ఫారెస్టు దగ్గరి చెరువులో నీళ్లు తెచ్చుకుని తిరిగి వస్తుండగా నొప్పులు రావడంతో అక్కడే కొలువై ఉన్న వనదేవత ఆలయం ముందు బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూయడంతో సినిమా మొదలౌతుంది.

కట్ చేస్తే,

అరవింద్, మిథున్, వర్కి అనే ముగ్గురు స్నేహితులు తమ ఇంజనీరింగ్ చదువుల కోసం కోచిలో ఉన్న కాలేజీలో జాయిన్ అవుతారు. కాలేజీ చదువుల కోసం తల్లితండ్రులను విడిచిపెట్టి వేరే సిటీకి రావడంతో హాస్టల్లో ఉండాల్సి వస్తుంది.

అయితే ఖరీదైన హాస్టల్లో చేరితే ఇంటినుంచి పంపే డబ్బులు దానికే సరిపోతాయని.. అదే చీప్ గా దొరికే హాస్టల్ అయితే ఖర్చు తక్కువ అవడమే కాకుండా డబ్బులు కూడా మిగులుతాయని.. ఆ డబ్బులతో జల్సాలు చేసుకోవచ్చని ప్లాన్ చేస్తారు.

అందుకే చీప్ గా దొరికే హాస్టల్ కోసం ఊరంతా గాలిస్తారు. ఈ క్రమంలో వీళ్ళకి మహారాజా హాస్టల్ కనిపిస్తుంది. ఉన్నవాటిలో అన్నిటికన్నా ఇదే చీప్ అవడంతో ఈ హాస్టల్లో దిగుతారు. వాళ్ళ ప్లాన్ ప్రకారమే తక్కువ ఫీజుకి హాస్టల్ దొరకడంతో మందు తాగి జల్సాలు చేసుకుంటారు.

జల్సాలతో సాగిపోతున్న వీళ్ల హాస్టల్ జీవితాల్లోకి హఠాత్తుగా ఓ వార్డెన్ ఎంట్రీ ఇవ్వడంతో కథ మారిపోతుంది. అక్కడి హాస్టల్ వార్డెన్ చాలా స్ట్రిక్ట్ కావడంతో వీళ్ళ అల్లరి కంట్రోల్ చేస్తూ ఉంటాడు.

ఇదిలా ఉండగా అరవింద్ తాను ప్రేమించిన దీపిక అనే అమ్మాయి కోసమే తమని ఈ కాలేజీలో జాయిన్ చేయించాడని తర్వాత మిగిలిన ఇద్దరికీ తెలిసి అతడి మీద అలుగుతారు. అయితే తాను ప్రేమిస్తున్న దీపికని కాలేజీలో సీనియర్ అయిన శంభు కూడా ప్రేమిస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అరవింద్ అతడితో గొడవ పెట్టుకుంటాడు.

ఈ గొడవ తర్వాత దగ్గరలో ఉన్న ఫారెస్టుకు వెళ్ళి అక్కడున్న రెడ్ క్లాత్ పట్టుకు రావాలని శంభు.. అరవింద్ కు టాస్క్ ఇస్తాడు. అడవికి వెళ్ళిన ముగ్గురు స్నేహితులకు వనదేవత ఆలయం దగ్గర దయ్యం కనిపించడంతో భయపడి పారిపోయి హాస్టల్ కు వచ్చేస్తారు. హాస్టల్ కు వచ్చిన ముగ్గురికీ వార్డెన్ గురించి భయంకరమైన నిజం తెలుస్తుంది.

అడవిలో వనదేవత ఆలయం దగ్గర దయ్యం తిరుగుతుండటం వెనుక ఉన్న అసలు కథేంటి? హాస్టల్ వార్డెన్ గురించి వీళ్ళు తెలుసుకున్న అసలు నిజం ఏంటి? అడవిలో దయ్యానికీ , హాస్టల్ వార్డెన్ కీ.. ఈ ముగ్గురు స్నేహితులకీ ఉన్న లింక్ ఏంటి? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

సాధారణంగా దర్శకులు హార్రర్ జానర్లో కథలను ఎన్నుకునేటప్పుడు రెండు రకాల ప్రయోగాలు చేస్తారు. పూర్తి హార్రర్ సినిమా అయితే ఒక రకంగా కథను రాసుకుంటారు. కొంతమంది దర్శకులు అదే హార్రర్ జానర్ కి కాస్తంత కామెడీ రసాన్ని కలిపి మిక్సీలో వేసి తిప్పి బయటికి తీసి ఇంకో రకమైన ప్రయోగం చేస్తారు.

నిజానికి ఏ దర్శకుడికైనా ఈ రెండు ప్రయోగాలు టఫ్ టాస్కులే. పూర్తిగా 100% హార్రర్ ఎలిమెంటుతో సినిమా తీయాలంటే కథలో కూడా అంతే దమ్ము ఉండాలి.. ఊహించని ట్విస్టులు ఉండాలి.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు ఉండాలి.. కళ్ళు చిట్లించి చూసే డార్క్ మోడ్ లో గుండెలు గుభేల్మనే బిజిఎంతో అదరగొట్టాలి. ప్రేక్షకుడ్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టాలంటే ఇవన్నీ అవసరమే. అతికొద్ది మంది దర్శకులు మాత్రమే ఈ ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. మిగిలిన చాలామంది ఇలాంటి ప్రయోగాలు చేసి పల్టీలు కొట్టి పడుకున్నారు.

ఇక హార్రర్ ఎలిమెంట్ కి కామెడీ రసాన్ని జోడించి ఆడియన్స్ ని నవ్వుతూ భయపెట్టడం ఇంకో టాస్క్. ఇప్పటివరకు చాలామంది దర్శకులు ఈ ప్రయోగాలు చేసి కూడా పల్టీలు కొట్టారు.. నిజానికి దర్శకులకు మొదటి టాస్క్ కన్నా రెండో టాస్క్ తేలిక. ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టి టెన్షన్ తో గోళ్ళు కొరుక్కునేలా చేయాలంటే చాలా కష్టపడాలి. అదే హార్రర్ స్టోరీకి కొంత కామెడీ మిక్స్ చేస్తే దర్శకత్వ లోపాలు ఏవన్నా ఉన్నా దానిలో పడి కొట్టుకుపోతాయి. అందుకే చాలామంది దర్శకులు రెండో టాస్కునే ఎంచుకుంటారు. ఇది వాళ్లకు సులువు.

ఇక ఇలాంటి సినిమా చూసి నవ్వాలా?,ఏడవాలా?, భయపడాలా? అనే మూడు ఛాయిస్ లలో ఒకదానిని ప్రేక్షకుడు తన విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించి కనుగొంటాడు. ఇప్పుడు మహారాజా హాస్టల్ విషయంలో కూడా ప్రేక్షకుడికి అటువంటి విచక్షణా జ్ఞానం వాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే ఒకే జారు లో రెండు వేరు వేరు జాతులకు చెందిన భీభత్స.. హాస్య రసాలను పోసి మిక్సీలో వేసి గిర్రున తిప్పితే వచ్చిన ఔట్పుట్ మహారాజా హాస్టల్ సినిమా.

ఇందాక చెప్పినట్టుగా సినిమా స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అర్థరాత్రి నిండు గర్భిణి.. దాహం వేయడం.. చెరువులో నీరు పట్టుకోవడం.. తిరిగి వస్తూ వనదేవత ఆలయ ప్రాంగణంలో బిడ్డకు జన్మనిచ్చి కన్ను మూయడం వరకు ఒక లైన్ ఇచ్చి ఆపిన దర్శకుడు దానికి కంటిన్యూ గా ముగ్గురు స్నేహితులను దింపి కామెడీ మోడ్ లోకి వెళ్ళిపోయారు.

సరే.. ముగ్గురు స్నేహితులు.. చీప్ హాస్టల్.. జల్సాలు..అరవింద్.. దీపికల లవ్ ట్రాక్ ల చుట్టూ కథనం నడిపి దర్శకుడు ఆడియన్స్ ను నవ్వించే ప్రయత్నం గట్టిగానే చేశారు. వీటిలో కొన్ని సన్నివేశాలు నిజంగానే నవ్వించాయి.

కొన్ని సన్నివేశాలు మాత్రం పక్కనోడ్ని చూసి నవ్వుకోవాలి. ఎందుకంటే చిన్నప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు వెళ్ళినప్పుడు చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇంగ్లీషులో ఏదన్నా జోక్ పేలితే లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల జోక్ అర్థం కాకపోయినా పక్కోడు నవ్వితే మనం కూడా పగలబడి నవ్వేవాళ్ళం కదా.. అట్లన్నమాట. సరే దర్శకుడు దాదాపు ఫస్టాఫ్ అంతా కామెడీ మీద ఫోకస్ పెట్టి హార్రర్ ఎలిమెంట్ మీద చిన్న చూపు చూసాడు. సెకండాఫ్ లోకి వచ్చిన తర్వాత కానీ తాను హార్రర్ ఎలిమెంట్ మర్చిపోయిన సంగతి గుర్తుకు రాలేదు.

అందుకే హాస్టల్ వార్డెన్ పాత్రను దింపాడు. హాస్టల్ వార్డెన్ రాకతో మళ్ళీ మనలో క్యూరియాసిటి కలుగుతుంది. ఎంట్రీ బలంగానే ఉంది. కానీ రాన్రానూ ఆ క్యారక్టర్ బలాన్ని తగ్గించేసి కామెడీ పీస్ చేయడంతో కథనంలో గాఢత తగ్గింది. ఎప్పుడైతే కథనంలో గాఢత తగ్గుతుందో ఆడియన్స్ కి అవులింతలు కూడా పెరుగుతాయి. ఈ సినిమాలో జరిగింది అదే. ప్రేక్షకులను అటు పూర్తిగా భయపెట్టలేక.. ఇటు పూర్తిగా నవ్వించలేక నానా తంటాలు పడ్డారు.

ఆ తడబాటులో ప్రీ క్లైమాక్స్ అస్తవ్యస్తం అయిపోయింది. దాంతో స్క్రీన్ ప్లే తేలిపోయింది. నిజానికి ఈ సినిమాకి సెకండాఫ్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. దానికి తోడు సెకండాఫ్ ఆల్మోస్ట్ ప్రిడిక్టబుల్ గా ఉండటంతో ఆడియన్స్ ని పెద్దగా ఎంగేజ్ చేయదు. క్లైమాక్స్ లో కూడా ఊహించని ట్విస్టులు లేకపోవడం నిరాశ పరుస్తుంది.

ఎవరెలా చేశారు?

స్నేహితులుగా నటించిన ముగ్గురు కుర్రాళ్ల నటనలో ఎలాంటి లోపం లేదు.. ఎవరి మటుకు వాళ్ళు కష్టపడ్డారు. కాకపోతే కొన్ని సన్నివేశాల్లో అరవింద్ ను చూస్తుంటే ఫాహద్ ఫాసిల్ పోలికలు కనిపించాయి. హాస్టల్ వార్డెన్ నటన కూడా బాగుంది.

సాంకేతికత

అశ్విన్ రామ్ అందించిన సంగీతం కూడా బాగానే ఉంది.
అస్కర్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది కానీ కొన్ని సన్నివేశాల్లో విజువలైజేషన్ తేలిపోయింది.
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి

విశ్లేషణ

ముందే చెప్పినట్టు ఈ సినిమా ఎంతవరకు నచ్చుతుంది అనేది జానర్ మీద ఆడియన్స్ కు ఉన్న ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కామెడీగా తీసుకునేవాళ్లకి నిరాశ పరచదు. అలాగే హార్రర్ జానర్లో భారీగా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిజప్పాయింట్ అవుతారు.

ఓవరాల్ గా చూసుకుంటే ఫస్టాఫ్ బావుంది. సెకండాఫ్ యావరేజ్ గా ఉంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో తెలుగు ఆడియో వెర్షన్ అందుబాటులో ఉంది కాబట్టి వన్ టైమ్ వాచ్ మూవీ కింద ఓ లుక్కేయండి.

నటీనటులు : అభిత్, శరత్, సందీప్ తదితరులు
సంగీతం: అశ్విన్ రామ్
సినిమాటోగ్రఫీ : అస్కర్
నిర్మాత : సాయి ప్రకాష్
దర్శకత్వం: చారువాకన్
ఓటిటి/ స్ట్రీమింగ్: అమెజాన్ ప్రైమ్
విడుదల: 11-09–2026
రేటింగ్: 2/5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *