The Paradise Movie Review – కేసీఆర్ పాత్రలో మెప్పించిన ప్రియదర్శి!

Spread the love

నాచురల్ స్టార్ నాని ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా నటించిన ది ప్యారడైజ్ సినిమా (The Paradise Movie) ఈ రోజు (24-09-2026) వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అయ్యింది.

గతంలో సినిమాలో నాచురల్ స్టార్ నానీని చూడగానే మన పక్కింటి కుర్రాడు గుర్తుకొచ్చేవాడు. భలే భలే మొగాడివోయ్ సినిమాలో మతిమరుపు పాత్రలో మనల్ని కడుపుబ్బ నవ్వించాడు. జెర్సీ సినిమాలో ఎమోషనల్ డ్రామా నడిపి మన హృదయాలను టచ్ చేసాడు.

టోటల్ గా నానీ అంటే కంప్లీట్ ఫ్యామిలీ హీరో అనే ముద్రతో ఆడియన్స్ హృదయాలలో పాతుకుపోయాడు.
ప్రేక్షకులు కూడా నానీని ఫ్యామిలీ హీరోగానే చూడటం మొదలుపెట్టారు.

కానీ దసరా సినిమాతో నానీ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటిదాకా ఫ్యామిలీ హీరో అనబడే ఇమేజ్ చట్రంలో కూరుకుపోయిన నానీ దసరా మూవీతో యాక్షన్ హీరోగా సరికొత్త అవతారం ఎత్తారు. దసరా మూవీ నానీలోని యాక్షన్ హీరో ప్రేక్షకుల మెప్పు పొందటంతో తాజాగా ప్యారడైజ్ సినిమాతో మరోసారి ఆయన ఊర మాస్ యాక్షన్ హీరో అవతారం ఎత్తారు. ఈ సినిమా తర్వాత నానీ సినీ కెరీర్ గురించి నానీ 2.0 అని చెప్పుకుంటారు.

ఇప్పుడు ది ప్యారడైజ్ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కధేంటంటే?

నైజాంల ఏలుబడిలో సవారీ అనే తెగ రెండు వేల మైళ్ళ దూరం నడిచొచ్చి ప్యారడైజ్ అనే ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉంటారు.

ఎక్కడినుంచో వలస వచ్చిన ఈ తెగకు ప్రభుత్వ గుర్తింపు ఉండదు. ధనవంతుల కుటుంబాలకు చెందిన మాలిక్ (మోహన్ బాబు) కుటుంబీకులు ఈ తెగను తమ చెప్పుచేతల్లో ఉంచుకుని వెట్టి చాకిరీ చేయించుకుంటూ ఉంటారు.
సవారీ తెగకు చెందిన ఐదు వేల కుటుంబాలు మాత్రం తమకు ఐడెంటిటీ కావాలని పోరాటం చేస్తూ ఉంటారు.

కానీ మాలిక్ భయానికి ప్రభుత్వ అధికారులు ప్యారడైజ్ వైపు రావడానికి భయపడతారు. ఈ పరిస్థితుల్లో సమ్మక్క (కులకర్ణి) జడల్ (నానీ) కి జన్మను ఇస్తుంది. ఎప్పటికైనా తన కొడుకు ద్వారా తమ తెగకు ఐడెంటిటీ వస్తుందని ఆమె ఆశలు పెట్టుకుంటుంది.

మాలిక్ కుట్ర వల్ల జైలుకి వెళ్ళిన జడల్ పద్నాలుగేళ్ల తర్వాత జైలునుంచి విడుదలై తిరిగి ప్యారడైజ్ చేరుకుంటాడు.

తిరిగి ప్యారడైజ్ చేరుకున్న జడల్ ఏం చేస్తాడు?
సవారీ తెగని తన చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి మాలిక్ స్థానంలో ఎంటర్ అయిన అతడి కొడుకు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడతాడు?
చివరకు సవారీ తెగకు తాము కోరుకున్న గుర్తింపు వస్తుందా? లేదా? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

కథ చదివారుగా.. ఎప్పుడో దశాబ్దాల క్రితం రెండు వేల మైళ్ళ దూరం నుంచి వలస వచ్చి ప్యారడైజ్ లో స్థిరపడిన ఐదు వేల కుటుంబాల అస్తిత్వ పోరాటమే ప్యారడైజ్ సినిమా కథ.

ఈ పాయింట్ చదవగానే మీకు పెద్ది సినిమా గుర్తుకు వచ్చిందా? నిజమే రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాలో కూడా ఇదే పాయింట్ ఆధారంగా కథ రాసుకుని దర్శకుడు సినిమాని తెరకెక్కించారు. ఊరికి రైలు సౌకర్యం కూడా లేని ఒక కొండ ప్రాంతానికి చెందిన మూడు వేల మంది గిరిజన కుటుంబాలు పెద్ది నాయకత్వంలో తమ గుర్తింపు కోసం పోరాటం చేస్తాయి. ప్యారడైజ్ మూవీలో కూడా సవారీ అనే తెగ తమ గుర్తింపు కోసం జడల్ నాయకత్వంలో పోరాటం చేస్తారు. ఆ సినిమాకి.. ఈ సినిమాకి ఇంతవరకే పోలికలు. మిగతాదంతా ఎవరి స్టైల్లో వాళ్ళు స్టోరీని నేరెట్ చేశారు.

ఇక ప్యారడైజ్ మూవీ విషయానికి వస్తే ఇప్పటిదాకా మనం చూసిన నానీ వేరు.. ఈ సినిమాలో చూసిన నానీ వేరు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రతి ఫ్రేమ్ లోనూ నానీ విశ్వరూపం చూపించాడు. సాఫ్ట్ గా కనిపించే నానీలో ఇంత రఫ్ క్యారెక్టర్ కూడా ఉన్నాడా? అని మనం ఆశ్చర్యపోతాం. ఈ సినిమా నుంచి నానీ గురించి మాట్లాడుకోవాలంటే నానీ 2.0 అని మాట్లాడుకోవాలి.

ఇప్పటిదాకా అల్లు అర్జున్, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి మాస్ యాక్షన్ హీరోలను చూసిన మనం ఇకపై నానీని కూడా ఆ జాబితాలో చూడబోతున్నాం. ఈ సినిమా ఖచ్చితంగా నానీకి ఒక కొత్త ఇమేజ్ ను సృష్టిస్తుంది.
అయితే నానీని మాస్ హీరోగా బ్రాండింగ్ చేయడానికి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎంతకైనా ఫిక్స్ అయిపోయారడానికి మొదట్లో వచ్చే జైల్ సన్నివేశమే ఉదాహరణ.

ఇటీవల కాలంలో వచ్చిన హీరోల ఎలివేషన్లకు పరాకాష్ట ప్యారడైజ్ సినిమాలో నానీ ఎంట్రీ. ఒక పక్క చేతుల నిండా పదునైన బ్లేడ్ లు పట్టుకుని రక్తం కారుతున్నా లేకచేయకుండా వందమంది రౌడీలను ఒకరిమీద ఒకళ్ళను కొండగుట్టలా ఒకేసారి పడుకోబెట్టి ఆ సింహాసనం మీద కూర్చుంటాడు చూసారూ.. నానీ అభిమానులకు పునకాలు తెప్పిస్తుంది.

అందుకే ఈ సినిమా గురించి చెప్పుకునేటప్పుడు ఫ్యాన్స్ దృష్టి కోణంలోనూ.. సాధారణ ప్రేక్షకుడి కోణంలోనూ చెప్పుకోవాలి. ఫ్యాన్స్ దృష్టి కోణంలో అయితే మాత్రం వాళ్ళకి కన్నుల పండుగే. సాధారణ ప్రేక్షకుల దృష్టి కోణంలో అయితే మితిమీరిన హింస చూసి చాలామంది తట్టుకోలేరు.

ముందే చెప్పినట్టు దర్శకుడు నానీని మాస్ హీరోగా బ్రాండింగ్ చేయడం మీదే పూర్తి ఫోకస్ పెట్టి పొడవాటి ఖడ్గాన్ని ఆయన చేతిలో పెట్టి ఇక నీ ఇష్టం అని అన్నట్టుగా ఉంది. ఇప్పటిదాక కొన్ని సినిమాల్లో మీరు హీరో విలన్ల కాలో చెయ్యో తీసేయడం చూసి ఉంటారు. కానీ శరీరాన్ని రెండు భాగాలు చేయడం చూసి ఉండరు. జైలు నుంచి మొదలుపెట్టిన నానీ నరకుడు కార్యక్రమం అప్రతిహతంగా చివరివరకు కొనసాగుతుంది.

మొదటి అర్థగంటలోనే కథ చెప్పేసిన దర్శకుడు ఆ తర్వాత వచ్చే ప్రతి ఐదు నిమిషాలకు వచ్చే భీభత్సమైన ఫైటింగులనే కథగా మలిచారు. ఏం ఇంతకుముందు ఇంతకన్నా ఘోరమైన వయోలెన్స్ ఉన్న సినిమాలు లేవా? అనకండి. ఖచ్చితంగా ఉన్నాయి. ఆ వయోలెన్స్ చూడలేక నెత్తి నోరు కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. మితిమీరిన హింస ఏ భాషలో వచ్చినా.. ఏ హీరో చేసినా అభిమానులు మినహా సాధారణ ప్రేక్షకులు పెద్దగా ఎంకరేజ్ చేయలేరు. ఈ యుద్ధ సన్నివేశాలు చూస్తున్నప్పుడు మనకు ఒక్కోసారి సలార్, కెజిఎఫ్ లాంటి సినిమాలు గుర్తుకు వచ్చే అవకాశం ఉంది.

సరే ఎంతసేపూ ఫైటింగులూ.. వయోలెన్స్ సంగతేనా? ఈ సినిమాలో ఇంకేమీ లేదా? అనే కదా మీ డౌట్?

ఇప్పుడు ఆ సంగతులు చెప్పుకుందాం. ఫస్టాప్ సవారీ తెగ.. జడల్ చిన్ననాటి సంఘర్షణలు..మాలిక్ పాత్ర పరిచయాలతో కథనాన్ని నడిపిన దర్శకుడు సెకండాఫ్ లో మాత్రం నేరుగా వార్ బిట్వీన్ జడల్ అండ్ మాలిక్ గా మలిచాడు. ఇక కాయాదు లోహర్ ను దింపి చిన్న లవ్ ట్రాక్ కూడా నడిపారు కానీ అది పెద్దగా ఆకట్టుకోదు. దానికి తోడు హీరోయిన్ క్యారక్టర్ సరిగా డిజైన్ చేయలేదనిపిస్తుంది. కూతురి అశ్లీల పిక్ లను తల్లి వీడియోలో షూట్ చేయడం ..అవసరం లేకపోయినా హీరోయిన్ చేత సిగరెట్లు తాగించడం కొంత అతి అనిపిస్తుంది.

నానీకన్నాముందు మోహన్ బాబును ఇంట్రడ్యూస్ చేసి దర్శకుడు ఆయన సీనియారిటీకి వాల్యూ ఇచ్చారు. ముంబై నుంచి పట్టుకొచ్చిన బాలీవుడ్ నటుడికి ప్రమోషన్లలో ఆయన చెప్పుకున్నంత స్కోప్ దక్కలేదు. ఎంట్రీలో మోహన్ బాబు పాత్రకు భారీ ఎలివేషన్ ఇచ్చిన దర్శకుడు మెల్లిగా ఆ ఎలివేషన్లు తగ్గించుకుంటూ వచ్చారు. నిజానికి ఈ సినిమాలో నానీ పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో .. మోహన్ బాబు పాత్రకు కూడా అంతే స్కోప్ ఉంటుంది. మోహన్ బాబును దర్శకుడు పూర్తిస్థాయిలో వాడుకోలేదనిపిస్తుంది.

ఈ సినిమాలో ఎవ్వరూ ఊహించని పాత్ర ఒకటుంది. అదే ప్రియదర్శి పోషించిన కేసీఆర్ పాత్ర. ఈ పాత్ర కనిపించగానే థియేటర్లో ఈలలు మారుమోగిపోయాయి. కేసీఆర్ పోలికలే కాదు ..కేసీఆర్ యాసను కూడా ప్రియదర్శి ఒడిసిపట్టుకున్నాడు. ముఖ్యంగా కేసీఆర్ స్టైల్లో ప్రియదర్శి ఎస్ .. ఎస్ అని రెండుసార్లు డైలాగ్ పలికినప్పుడు కళ్ళముందు కేసీఆర్ కనిపిస్తారు. ఈ ఎపిసోడ్ లో దర్శకుడు చేసిన తెలివైన పనేంటంటే ఆంధ్రా , తెలంగాణా విద్వేషాలకు తావు లేకుండా కేసీఆర్ పాత్ర చేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తు చేస్తూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. బహుశా తెలుగు రాష్ట్రాల్లో సినిమా మీద ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా కేసీఆర్ పాత్ర విషయంలో దర్శకుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టున్నారు.

నిజానికి కేసీఆర్ పాత్రకు దర్శకుడు ఇంకా స్కోప్ ఇవ్వాల్సింది. ఎందుకంటే ఈ కధకు ఒక బలమైన ముగింపు ఆ పాత్ర ద్వారానే దక్కింది. సవారీ తెగలు తమ హక్కుల కోసం ఎలా పోరాడుతున్నారో ..అదే విధంగా తెలంగాణా ప్రజల హక్కుల కోసం పోరాడిన ఉద్యమ వీరుడిగా కేసీఆర్ పాత్రను మలిచి ఉంటే కధా బలం పెరిగేది. అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంది. ఇక చివర్లో భారీ ఫైటింగుల అనంతరం పెద్ద హడావుడి లేకుండా క్లైమాక్స్ సీన్ లోకి వెళ్ళిపోయినట్టున్నారు. ఇక తల్లీ కొడుకుల ఎమోషన్స్ పూర్తిస్థాయిలో పండలేదు అనిపిస్తుంది. ఓవరాల్ గా ఫస్టాఫ్ కథ నడిస్తే సెకండాఫ్ యుద్దాలు నడిచాయి.

ఎవరెలా చేసారు ?

ఈ సినిమా మొత్తం ఎటు చూసినా మనకు నానీనే కనిపిస్తాడు. అదీ మాములు మాస్ గెటప్ కాదు..ఊర మాస్ గెటప్ తో అదరగొట్టేసాడు. ఈ సినిమానుంచి నానీ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటాడు. ఈ సినిమా కోసం బాడీ లాంగ్వేజ్ విషయంలో కానీ , డైలాగ్ డెలివరీ విషయంలో కానీ నానీ బాగా కసరత్తులు చేసినట్టున్నాడు. ముఖ్యంగా ముఖానికి కాటుక రాసుకుని మోహన్ బాబు ఇంటికొచ్చి ఫైట్ చేసే సన్నివేశంలో ఫాన్స్ కు నానీ పూనకాలు తెప్పిస్తాడు. కీర్తి సురేష్ తో కలిసి నానీ వేసిన స్టెప్పులకు థియేటర్లో యువత లేచి డాన్సులు చేసారు.
సుబ్బు పాత్రలో కాయదు లోహర్ నటన బాగానే ఉంది కానీ ఆమె పాత్ర కేవలం గ్లామర్ షో వరకు మాత్రమే పరిమితం అయ్యింది.
సమ్మక్క పాత్రలో సోనాలి కులకర్ణికి మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది.
చాలాకాలం తర్వాత తనికెళ్ళ భరణికి మంచి పాత్ర దక్కింది కానీ సినిమాలో ఆయనకు కూడా పెద్ద స్కోప్ లేకుండా పోయింది.
ఇక సినిమా ప్రమోషన్లలో సంపూర్ణేష్ బాబు పాత్ర గురించి తెగ హైప్ ఇచ్చారు కానీ నిజానికి ఆ పాత్రకు ప్రత్యేకత ఏమీ లేదు. అయితే రొటీన్ కామెడీ టైమింగుకి భిన్నంగా ఆయన సీరియస్ పాత్రలో నటించడం కొత్తగా ఉంది.

సాంకేతికత

కథ పాతదే అయినా ఈ సినిమా ఒక మెట్టు పైకి వెళ్లగలిగింది అంటే అది అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మహిమే. నానీ ఎలివేషన్ సీన్లకి అనిరుధ్ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే బీజీఎమ్ అందించారు. కాబట్టి ఈ సినిమాకి అనిరుధ్ కూడా ఒక హీరోనే.
సినిమాటోగ్రఫీ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఎందుకంటే ప్యారడైజ్ మొత్తం నెగడు వెలుగు మినహా చీకట్లోనే ఉంటుంది. కొన్నిచోట్ల విజువల్స్ డార్క్ మోడ్ లోకి వెళ్లిపోవడంతో అక్కడ వేసిన సెట్టింగులు ఏవీ పూర్తిగా కనిపించవు. అలాగే డబ్బింగ్ విషయంలో కూడా ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉండాల్సింది. చాలాచోట్ల డైలాగులు అర్ధం కాక కన్ఫ్యూజ్ అవుతాం.
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

విశ్లేషణ

ఫైనల్ గా ఈ సినిమా ఎలా ఉందో చెప్పాలంటే మనం ఒకేసారి ప్రేక్షకుడి పాత్రలోకి .. అభిమానుల పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలి. ఎందుకంటే నానీ నుంచి వచ్చిన హై వోల్టేజ్ మాస్ యాక్షన్ ఖచ్చితంగా ఆయన అభిమానులను అలరిస్తుంది. కాబట్టి అభిమానుల దృష్టిలో మితిమీరిన వయొలెన్స్ లెక్కలోకి రాదు. దానికి తోడు అనిరుధ్ అందించిన బీజీఎమ్ ఫాన్స్ చేత ఈలలు వేయిస్తుంది.

ఇక సాధారణ ప్రేక్షకుల విషయానికి వస్తే సినిమాలో పెద్దగా కధా బలం లేకపోవడం డిజప్పాయింట్ చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఇంకొంచం ఎమోషనల్ డ్రామా పండిస్తే బాగుండేది. కథ కన్నా ఫైటింగులే సినిమాని ముందుకు నడిపించుకుంటూ పోవడం పెద్దగా ఎంగేజ్ చేయదు. ప్రతి ఐదు నిమిషాలకు పది నిమిషాల ఫైట్ సీన్లు పెడితే ఫ్యామిలీ ఆడియన్స్ కి విసుగు తెప్పిస్తుంది. ఈ సినిమాలో దర్శకుడు హింసకు ఎటువంటి కొలమానాలు పెట్టుకోలేదు. మాగ్జిమమ్ రక్తాన్ని పారించేసారు. అందుచేత ఈ సినిమా నానీ అభిమానులకు నచ్చుతుంది. సాధారణ ప్రేక్షకులను పెద్దగా ఎంగేజ్ చేయదు.

నటీనటులు : నానీ , కాయదు లోహర్ , మోహన్ బాబు , తనికెళ్ళ భరణి , కీర్తి సురేష్ తదితరులు
సంగీతం : అనిరుధ్
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం : శ్రీకాంత్ ఓదెల
విడుదల : 24 -09 -2026
రేటింగ్ : 2.5 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *