Thudakkam Movie Review – ఓటిటిలోకి వచ్చిన మోహన్ లాల్ కూతురి సినిమా!

Spread the love

మలయాళ లెజండరీ స్టార్ మోహన్ లాల్ కూతురు విస్మయ నటించిన మొదటి చిత్రం తుడక్కమ్ మూవీ (Thudakkam Movie) ఆగస్టులో థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు అదే మూవీ ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో సెప్టెంబర్ 18 నుంచి తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.

విస్మయ లెజెండరీ హీరో మోహన్ లాల్ కూతురు కావడంతో ఈ సినిమా పై ఆయన అభిమానులతో పాటు మలయాళ సినీ ఇండస్ట్రీ కూడా బోలెడు అంచనాలు పెట్టుకుంది. ఆమెకు ఇదే మొదటి సినిమా కావడంతో దర్శకుడు కథపై కూడా బాగా కసరత్తులు చేసి ఉంటారని అందరూ భావించారు.

మరి అందరి అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉందో? లేదో ఇప్పుడు చూద్దాం.

కథేంటంటే?

షరా మామూలుగా మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాల మాదిరే ఈ సినిమా కూడా ఒక సైకో కిల్లర్ చేసే మూడు మర్డర్లతో మొదలౌతుంది.

కట్ చేస్తే,

మీను (విస్మయ) స్వతంత్ర భావాలు కలిగిన మహిళ. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో తండ్రి పెంపకంలోనే పెరుగుతుంది. ఆయనకు కూతురంటే ప్రాణం. వృత్తినే దైవంగా నమ్మే ఆమె తండ్రి తన కాళ్ళు చచ్చుబడిపోయినా సరే కుంగిపోక విలేజ్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాడు.

మరోవైపు మీను తన గురువు (మోహన్ లాల్) ద్వారా మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సంపాదించుకుంటుంది. తాను నేర్చుకున్న విద్యతో సాటి అమ్మాయిలకు కూడా కరాటే ద్వారా ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో శిక్షణ ఇవ్వడం కోసం క్లాసులు కూడా ఓపెన్ చేస్తుంది.

ఇదిలా ఉండగా ఓ రోజు ఎగ్జామ్ రాయడానికి మీను ఎర్నాకులం వెళ్తుంది. పరీక్ష రాసి తిరిగి తన ఊరికి బయలుదేరుతుండగా బస్సులో ఉన్న ఇద్దరు అమ్మాయిలను ఒక సైకో ఫాలో అవుతున్నట్టు గమనిస్తుంది. సైకో బారినుంచి ఆ అమ్మాయిలను కాపాడటానికి మీను కూడా వాళ్ళ ఇంటిదాకా సాయం వెళ్ళి డ్రాప్ చేస్తుంది.

ఆ తర్వాత నుంచి మీను కనిపించకుండా పోతుంది. పరీక్ష రాయడానికి వెళ్లిన కూతురు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన ఆమె తండ్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు.

ఇద్దరు అమ్మాయిలను డ్రాప్ చేసి తిరుగు ప్రయాణం అయిన మీను ఎలాంటి ఆపదలో చిక్కుకుంది?
పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది?
సైకో కిల్లర్ మీనును మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తాడు? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

లెజెండరీ హీరో మోహన్ లాల్ కూతురి ఎంట్రీ అంటే మామూలుగా ఉండదనే అందరూ అనుకుంటారు కదా? అందరి సంగతులు ఒదిలేయండి.. తమ అభిమాన హీరో కూతురి తెరంగేట్రం కాబట్టి ఫ్యాన్స్ కూడా బోలెడు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా?

మరి ఇంతమంది ఇంత ఎక్స్పెక్ట్ చేస్తారని తెలిసినప్పుడు దర్శకుడు కథ మీద ఎంత ఎఫర్ట్ పెట్టి ఉండాలి? కూతురి సినిమా కాబట్టి మోహన్ లాల్ కూడా కొండ మీద కథని తీసుకొచ్చి నేల మీదకు దింపుతాడనే కదా అందరూ అనుకుంటారు?

కానీ దర్శకుడు కానీ, మోహన్ లాల్ కానీ కథని సీరియస్ గా తీసుకోకుండా లైట్ తీసుకుంటే ఏమౌతుంది? ఇంకేమౌతుంది? తుడక్కం మూవీ అవుతుంది.

బాలయ్య భగవంత్ కేసరి సినిమా చూసారు కదా? అందులో బాలయ్య శ్రీ లీలకు గురువై కరాటే లాంటి విద్యలు నేర్పించి ఆమెను డేరింగ్ డాషింగ్ విమెన్ గా తీర్చి దిద్దాలని అనుకుంటాడు. శ్రీ లీల కూడా తనకున్న ఫోబియాతో ముందు భయపడుతుంది. కానీ గురువు బాలయ్య ఇచ్చిన ప్రోత్సాహంతో కరాటే నేర్చుకుని ఫోబియాని జయిస్తుంది. ఆ కథనే కొద్దిగా అటూఇటూ తిప్పి జన నాయగన్ తీశారు. ఇప్పుడు ఆ కథనే ఇంకొంచం అటూఇటూ తిప్పి తుడక్కం చేశారు.

కాబట్టి ఇందులో కథ చెప్పుకోవడానికి కొత్తగా ఏమీ ఉండదు. తెలిసిన కథే కాబట్టి మనకూ కొత్తగా ఏమీ అనిపించదు. ఈ పాయింటులోనే విషయం ఏమీ లేదనే సగం విషయం మనకు తెలిసిపోతుంది. పోనీ కథనం ద్వారా అయినా సరే దర్శకుడు ఏవన్నా మెరుపులు మెరిపిస్తాడేమో అని చూస్తే అక్కడా మబ్బులు తేలిపోవడంతో డిజప్పాయింట్ చేస్తుంది.

సైకో కిల్లర్ ఎంట్రీతో సినిమాని ప్రారంభించిన దర్శకుడు కాసేపు అతడ్ని పక్కనబెట్టి మోహన్ లాల్ కూతురి మీద ఫోకస్ పెట్టారు. మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్న అమ్మాయిగా ఆమె పాత్ర పరిచయం.. తండ్రి పాత్ర.. పక్కింటి జోసెఫ్ మాస్టారి పాత్రల పరిచయాల ద్వారా కొంత ఫ్యామిలీ డ్రామా జానర్ లో కథ నడిపిన దర్శకుడు మీను పాత్ర ఎర్నాకులం వెళ్ళడం ద్వారా క్రైమ్ జానర్ లోకి కథనాన్ని టర్న్ చేసినంతవరకు ఓకే.

సరే, ఆమె ఎర్నాకులం వెళ్ళి తిరిగి వస్తూ బస్సులో ఉన్న ఇద్దరు అమ్మాయిలను కాపాడటానికి వెళ్ళి తాను ప్రమాదంలో చిక్కుకోవడం వరకు కథనం మనల్ని కొంత ఎంగేజ్ చేస్తుంది. ఇక అక్కడ్నుంచి సాగతీత కార్యక్రమం మొదలౌతుంది?

సైకో నుంచి ఆ అమ్మాయిలను కాపాడటం కోసం దారిలో కనిపించిన కుర్రాళ్ళ దగ్గర ఉన్న స్కూటీ కొనడానికి మీను అడగడం.. హామీగా తన గోల్డ్ చైన్ వాళ్ళ దగ్గర పెట్టడం.. తిరిగి స్కూటీ ఇచ్చేటప్పుడు గోల్డ్ చైన్ వాళ్ళనే ఉంచుకోమనడం.. అనబడే ఎపిసోడ్ కన్విన్సింగ్ గా ఉండదు.

ఇక ఇక్కడనుంచి మొదలయ్యే కిల్లర్ ఛేజింగ్ దృశ్యాలు.. పోలీసుల సెర్చింగ్ దృశ్యాలు చప్పగా సాగుతాయి. దీనికోసం దర్శకుడు దాదాపు ఫస్టాఫ్ అంతా సాగతీయడంతో విసుగు వస్తుంది. ఇంతా చేసి మీను ఇంటికి తిరిగి చేరుకోవడంతో అప్పటిదాకా ఏదేదో ఊహించుకున్న సస్పెన్స్ కాస్తా తుస్సుమంటుంది.

పోనీ సెకండాఫ్ లో అయినా దర్శకుడు ఏవన్నా మ్యాజిక్కులు చేస్తాడేమో అని ఎదురు చూసినవారికి నిరాశ మిగులుతుంది. నీకు నువ్వే రక్షణ కల్పించుకోలేనిదానివి సాటి అమ్మాయిలకు కరాటే నేర్పి ఏం రక్షిస్తావ్? అనబడే లోకుల సూటిపోటి మాటల రొటీన్ సీన్లు కొన్ని నడిచిన తర్వాత మోహన్ లాల్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. మోహన్ లాల్ ను చూసిన తర్వాత మనకు మండు వేసవి లో నిమ్మకాయ సోడా తాగినంత ఫీల్ వస్తుంది.

ఈ అమ్మాయితో ఎటూ కథ ముందుకు సాగడం లేదు.. ఇకనుంచి కనీసం మోహన్ లాల్ అయినా కథను ముందుకు తీసుకెళ్తాడని ఆశ పడతాం. కానీ ఆ ఆశ కూడా కాసేపే.. చిన్న గీతోపదేశంతో మోహన్ లాల్ పాత్ర కూడా పక్కకు వెళ్ళడంతో కథ మళ్ళీ మీను చుట్టూ తిరగడం మొదలుపెడుతుంది. దాంతో మనం మీను చుట్టూ తిరగడం మొదలు పెడతాం. ఇక అక్కడ్నుంచి కథనం ప్రిడిక్టబుల్ గా సాగుతుండటంతో మనల్ని ఎంగేజ్ చేయకపోగా ఎండ్ కార్డ్ కోసం ఎదురు చూసేలా చేస్తుంది.

ఓవరాల్ గా తుడక్కం మోహన్ లాల్ కూతురి కోసం సృష్టించబడిన సినిమా.

ఎవరెలా చేశారు?

మొదటి సినిమా అయినా విస్మయ నటనలో ఈజ్ కనిపించింది. హావభావాల్లో కానీ.. డైలాగ్ డెలివరీలో కానీ ఎక్కడా తడబాటు లేదు. ఈ సినిమా విస్మయ కు ట్రయల్ రన్ మాదిరి ఉపయోగపడుతుంది. ఇక మోహన్ లాల్ గురించి కొత్తగా చెప్పేది ఏముంటుంది? అతిధి పాత్రలో కాసేపే కనిపించినా మూవీకి బోలెడు ఎనర్జీని తీసుకొచ్చాడు.
మిగిలినవాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతికత

జెక్స్ బిజోయ్ అందించిన సంగీతం బాగానే ఉంది.
జొమాన్ జాన్ అందించిన సినిమాటోగ్రఫీ యావరేజ్ గా ఉంది. ఫోటోగ్రఫీ పని తీరుకు ఇంకా స్కోప్ ఉంది కానీ అది మిస్ అయ్యింది.
మోహన్ లాల్ స్థాయితో పోలిస్తే నిర్మాణ విలువలు యావరేజ్ గానే ఉన్నాయని చెప్పాలి.

విశ్లేషణ

క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీ కాబట్టి.. అందులోనూ మోహన్ లాల్ కూతురి సినిమా కాబట్టి అతిగా అంచనాలు పెట్టుకుని చూస్తే డిజప్పాయింట్ అవుతారు. కథ కూడా గతంలో మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసేసాం కాబట్టి పెద్దగా మనల్ని ఎంగేజ్ చేయదు.

విమెన్ ఎంపవర్మెంట్ సందేశం ఆధారంగా దర్శకుడు కథను అల్లుకుని తెరకెక్కించారు. సందేశం అయితే బాగానే ఉంది కానీ సందేశాన్ని ప్రెజెంట్ చేసిన విధానమే మనకు పెద్దగా కిక్ ఇవ్వదు. కాబట్టి సినిమా మీద పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వన్ టైమ్ వాచ్ మూవీ కింద జియో హాట్ స్టార్ లో తెలుగులో చూడాలనుకునేవారు ఓ లుక్కేయండి.

నటీనటులు: విస్మయ, మోహన్ లాల్ తదితరులు
సంగీతం: జెక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: జొమాన్ జాన్
దర్శకత్వం: జుడే ఆంటోనీ జోసెఫ్
ఓటిటి: జియో హాట్ స్టార్
విడుదల: 18 -09 -2026
రేటింగ్: 2.5 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *