ప్రముఖ తమిళ దర్శకులు నిర్మాతలుగా మారి నిర్మించిన చిత్రం 29 . లోకేష్ కానగరాజ్ , కార్తీ సుబ్బరాజులు తమిళంలో పేరొందిన దర్శకులు . వీళ్ళ దర్శకత్వాలలో భారీ బడ్జెట్ సినిమాలు , పాన్ ఇండియా సినిమాలు , బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలు కొన్ని వచ్చాయి . అలాంటి ఈ ఇద్దరు దర్శకులకు మరో దర్శకుడు రత్నకుమార్ చెప్పిన 29 కథ నచ్చింది . దాంతో తామే నిర్మాతలుగా మారి ఆ కథను తెరకెక్కించారు . మే 8 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్సెడ్ రెస్పాన్స్ తెచ్చుకుని జూన్ 5 నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది .
29 టైటిల్ చూడగానే మనకు స్టోరీ లైన్ అర్ధం కాదు . గతంలో త్రిష , విజయ్ సేతుపతి లు , నాయికానాయకులుగా తమిళంలో రిలీజ్ అయిన మూవీ పేరు 96 . ఈ రెండు నంబర్ మూవీలకు కామన్ ప్లాట్ ఏంటంటే లవ్ ట్రాక్ . 96 మూవీలో ఒక కాలానికి సంబంధించిన హీరో , హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ నడిపితే , 29 లో ఏజ్ రిలేటెడ్ అంశంతో లవ్ ట్రాక్ నడిపించారు . ఒక వయసు వచ్చాక గుర్తింపు కోసం పెళ్లికాని ప్రసాదులు అనుభవించే సంఘర్షణను , అంతర్మధనాన్ని లైన్ గా తీసుకుని దర్శకుడు కథ రాసుకున్నాడు .
ఇప్పుడు 29 మూవీ ఎలా ఉందో చూద్దాం .
కధేంటంటే ?
సేలంలో తల్లితండ్రులతో కలిసి నివసించే సత్య ( విధు ) అగ్రికల్చరల్ డిగ్రీ పూర్తిచేసుకుని ఊరిని , వ్యవసాయాన్ని నమ్ముకోకుండా చెన్నై వెళ్ళిపోయి ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ మిత్రులతో కలిసి రూమ్ లో ఉంటాడు . కానీ సత్య తల్లితండ్రులు మాత్రం ఊరిలో చెరువు కబ్జా కాకుండా కాపాడుకోవాలని , చెరువు బాగు చేసుకుని నీటి ఆవాసంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు .
చెన్నైలో తను పనిచేసే ఆఫీసులోనే పనిచేసే విజు ( ప్రీతి అస్రాని ) సత్యకి పరిచయం అవుతుంది . ఆ పరిచయం ప్రేమగా మారుతుంది . విజు తన జీవితంలోకి రావడంతో ఫైనల్గా తనకొక ఐడెంటిటీ వచ్చిందని సత్య సంతోషపడతాడు . కానీ చిన్నతనంలోనే తండ్రి ఇంటినుంచి వెళ్లిపోవడంతో విజును ఆమె తల్లి కష్టపడి చదివిస్తుంది . కూతుర్ని ఐఏఎస్ చదివించి కలెక్టర్ గా చూడాలని ఆ తల్లి కోరిక . తల్లి ఆశయం నెరవేర్చడం కోసం విజు ఐఏఎస్ సాధించడానికి ఢిల్లీ వెళ్ళిపోయి కోచింగ్ తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది . ఆమె నిర్ణయం వీరి ప్రేమకు బ్రేకప్ గా మారుతుంది .
ప్రియురాలి ఎడబాటుతో సత్య ఏం చేస్తాడు ?
సత్య ప్రేమకు బ్రేకప్ చెప్పిన విజు ఐఏఎస్ కావాలనే లక్ష్యాన్ని సాధిస్తుందా ?
చివరకు తల్లితండ్రుల ఆశయం కోసం సత్య ఏం చేస్తాడు ? అనేది మిగిలిన కథ .
ఎలా ఉంది ?
నిజానికి ఇలాంటి కథలతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి . హీరో , హీరోయిన్ల మధ్య ప్రేమలు , బ్రేకప్ లు .. క్లైమాక్సులో తిరిగి కలిసిపోయి శుభం కార్డులు వేయడం ఆల్రెడీ చాలా చూసాం . ఈ మూవీ కూడా ఆ తానులోని ముక్కే .. అయితే ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేమికుల మధ్య జరిగే సన్నివేశాలను దర్శకుడు ఒక అందమైన దృశ్య కావ్యంగా మలచడానికి ప్రయత్నించాడు . అదే ఈ సినిమాకి ప్లస్ అవుతుంది .
వర్షం పడుతున్న వేళ ప్రియుడి గొడుగులో తలదాచుకోవడం , కారు వెళ్తున్నప్పుడు బురద చిమ్మకుండా ప్రియుడి శరీరాన్ని అడ్డు పెట్టుకోవడం , సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బస్ లో వెళ్లాలనుకోవడం , బీచ్ లో వెరైటీగా ప్రపోజ్ చేయాలనుకోవడం , సోది చెప్పించుకోవడం వంటి సన్నివేశాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి .
సముద్రాన్ని చూస్తూ టైటానిక్ మూవీ గురించి మాట్లాడుకోవడం , టైటానిక్ మూవీని 20 సార్లు చూశానని చెప్పిన సత్యని ఆ సినిమాలో నీకేం నచ్చిందని విజు అడుగుతుంది . అతడు షిప్ టాప్ లో హీరో హీరోయిన్లు నిలబడ్డ దృశ్యం గురించి చెప్తాడేమో అనుకుంటే సత్య ఇంకో సీన్ గురించి చెప్పడంతో విజు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం బాగుంది .
ఇదంతా ఫస్టాఫ్ లో కనిపించే సన్నివేశాలు .. వీరి లవ్ ట్రాక్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చూస్తుంటే ఫీల్ గుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది . దానికి తోడు కెమెరా పనితనం కూడా కలిసిందేమో ప్లెజెంట్ గా అనిపిస్తుంది .
ఇక సెకండాఫ్ వచ్చేసరికి సీన్ రివర్స్ అవుతుంది . కథ రొటీన్ ఫార్మాట్ లో సాగుతుంది . విజు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం , సత్యతో బ్రేకప్ చెప్పడం , సత్య గడ్డం పెంచుకుని తాగడం, భగ్న ప్రేమికుడి అవతారం ఎత్తడం , అదే సమయంలో విజు కూడా భగ్న ప్రేమికురాలి అవతారం ఎత్తడం , ఇరువురి ఏడ్పులతో ప్రేక్షకులకు కూడా ఏడ్పులు రావడంతో సెకండాఫ్ కొంత బోర్ కొడుతుంది . లవ్ బ్రేకప్ అయితే హీరో గడ్డం పెంచుకోవాలనే ఫార్ములాకు అన్ని భాషల దర్శకులు ఫిక్స్ అయినట్టున్నారు . ఇందులో కూడా హీరో మెడలదాకా గడ్డం పెంచుతాడు .
హీరో గడ్డం సంగతి అలా ఉంచితే సెకండాఫ్ లో సాగతీత సన్నివేశాలు ఫ్లోలో సాగిపోతున్న కథనానికి స్పీడ్ బ్రేకర్ల మాదిరి అడ్డువస్తూ ఉంటాయి . సడెన్గా ఎమ్మెల్యే కొడుక్కి పాత పగలు గుర్తుకు రావడం , పోలీసులు రంగంలోకి దిగి సత్యని లాకప్ లో వేయడం , వంటి సన్నివేశాలు అనవసరం అనిపిస్తుంది . దీనికన్నా తల్లి ఆశయం కోసం చెరువు బాగు చేయడానికి సత్య రంగంలోకి దిగడం బాగుంది . పూర్తిగా ప్రేమలు , బ్రేకప్ లు , గడ్డాలు పెంచుకోవడాలు చూపిస్తే రొటీన్ రొడ్డకొట్టుడు అవుతుందనుకున్నాడేమో దర్శకుడు చెరువు బాగుచేయడం ద్వారా చివర్లో ఒక సందేశాన్ని కూడా ఇచ్చాడు .
క్లైమాక్సులో విజు తండ్రిని తీసుకొచ్చి సెంటిమెంటుతో కూడిన భావోద్వేగాలు పండిద్దామనుకున్నారు కానీ అది అంతగా సెట్ కాలేదు . సాధారణంగా లవ్ స్టోరీల్లో ముగింపు హ్యాపీ ఎండ్ గానో , సాడ్ ఎండ్ గానో ఉంటాయి . ఆ తలనొప్పులు లేకుండా ఈ ప్రేమికులు కలిసిపోయారా ? విడిపోయారా ? అనేది దర్శకుడు ప్రేక్షకుల ఊహకే వదిలేసాడు .
ఎవరెలా చేసారు ?
కథ మొత్తం సత్య , విజిల చుట్టూనే తిరుగుతుంది . అందుకే ఆల్మోస్ట్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ రెండు పాత్రలే మన కళ్ళముందు కనిపిస్తాయి . 29 ఏళ్ళు వచ్చినా జీవితంలో సెటిల్ కాని తనకంటూ ఒక ఐడెంటిటీ కోరుకునే యువకుడి పాత్రలో విధు చాలా సహజంగా నటించాడు . చాలామంది నేటి యువత అతడి పాత్రకు కనెక్ట్ అవుతారు . ఆ పాత్రలో తమని తాము చూసుకుంటారు . అందుకే ఈ మూవీ ఓటిటిలో పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది .
ఇక విజు పాత్రలో ప్రీతి అస్రాని నటన క్యూట్ గా ఉంది . ఏడ్పు సీన్లలో కన్నా , లవ్ ట్రాక్ లోనే ఆమె ఎక్స్ప్రెషన్స్ క్యూట్ గా ఉన్నాయి .
మిగిలినవాళ్లు తమ పాత్రల పరిధిమేరకు బాగానే నటించారు .
సాంకేతికత
సీన్ రోల్డన్ సంగీతం బాగుంది .
ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ , బలం మాదేష్ కెమెరా పనితనం .. ఫస్టాఫ్ లో కొన్ని దృశ్యాలను చాలా అందంగా చూపించారు .
నిర్మాణవిలువలు బాగానే ఉన్నాయి
విశ్లేషణ
ఈ సినిమాని రెండు భాగాలుగా విడగొట్టుకుని విశ్లేషణ చెయ్యాలి . ఫస్టాఫ్ లో హీరో , హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి . చాలా సహజంగా పిక్చరైజ్ చేసారు . ఈ క్రమంలో మనకి ఎక్కడా బోర్ కొట్టదు . పైగా సెకండాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది . క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో విజు, సంఘర్షణలు ఎదుర్కునే పాత్రలో సత్య లు ఇంప్రెస్ చేసారు .
ఇక సెకండాఫ్ వచ్చేసరికి స్టోరీ రొటీన్ ఫార్మాట్ లోకి వెళ్లిపోవడంతో బోర్ కొడుతుంది . ఎమ్మెల్యే కొడుకు పగలు , పోలీస్ లాకప్ ఎపిసోడ్లు ఇరికించినట్టుగా ఉన్నాయి . హీరో గడ్డం పెంచుకుని చేసే సీన్లు చూస్తుంటే కొన్ని వేరే సినిమాలు గుర్తుకొస్తాయి . ఫస్టాఫ్ లో ఉన్న ఇంట్రెస్ట్ సెకండాఫ్ లో క్రియేట్ చేయలేకపోయింది . ఇక ఒక చిన్న కారణానికే తల్లి సత్యతో మాట్లాడకపోవడం సింక్ కాలేదు . తల్లీకొడుకుల మధ్య ఆ డ్రామా లేకపోయినా కధకు వచ్చిన నష్టం ఏమీ ఉండదు . మంచి బిగినింగ్ తీసుకున్న దర్శకుడు సెకండాఫ్ లోకి వచ్చేసరికి తడబడ్డాడు . హీరో , హీరోయిన్ల చుట్టూ తిరుగుతున్న కథ గాడి తప్పి ఎటో పోతుంది .
ఓవరాల్ గా ఈ మూవీ ఫస్టాఫ్ క్యూట్ గా ఉంటుంది .. సెకండాఫ్ రొటీన్ గా ఉంటుంది . నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కూడా లేకుండా చూడొచ్చు .
నటీనటులు : విధు , ప్రీతి అస్రాని తదితరులు
సంగీతం : సీన్ రోల్డన్
సినిమాటోగ్రఫీ : మాదేష్
నిర్మాత : లోకేష్ కనగరాజ్ , కార్తీక్ సుబ్బరాజు
దర్శకత్వం : రత్నకుమార్
విడుదల : నెట్ ఫ్లిక్స్ ఓటిటి
రేటింగ్ : 2.75 / 5
