దృఢం ( Dridam ) మలయాళం మర్డర్ మిస్టరీ మూవీ (OTT) రివ్యూ

Spread the love

మే 8 న థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిన దృఢం ( Dridam) మలయాళం మర్డర్ మిస్టరీ మూవీ ఈరోజు ( 12-06-2026 ) న జియో హాట్ స్టార్ ఓటిటిలో స్ట్రీమింగ్ కు వచ్చి ,ఇక్కడా అదే ట్రెండ్ లో దూసుకుపోతుంది . దృశ్యం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి సమర్పకుడు కాగా మార్టిన్ జోసెఫ్ దర్శకత్వం వహించారు . నిజానికి ఈ మూవీకి మార్టిన్ జోసెఫ్ దర్శకత్వం వహించినా జీతూ జోసెఫ్ మార్క్ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ కనిపిస్తుంది .

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలు తీయడంలో మలయాళం సినీ ఇండస్ట్రీకి పెట్టింది పేరు . ముఖ్యంగా మర్డర్ మిస్టరీ మూవీల్లో ఫీల్ చెడకుండా మొదటినుంచి క్లైమాక్స్ వరకు అదే టెంపో మెయింటైన్ చేయడంలో మలయాళ దర్శకులు సిద్దహస్తులు . ఇప్పుడు ఆ జాబితాలో మార్టిన్ జోసెఫ్ పేరు కూడా చేరుతుంది .

ప్లెజెంట్ గా మొదలెట్టి వయొలెన్స్ తో ముగించిన ఈ మూవీకి క్లైమాక్స్ ట్విస్ట్ ప్లస్ అవుతుంది.
ఇప్పుడు దృఢం మూవీ ఎలా ఉందో చూద్దాం .

కధేంటంటే ?

కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ఓ హిల్ స్టేషన్ ఏరియాలోని పోలీస్ స్టేషన్ కు ఎస్సై గా విజయ్ ( షేన్ నిగమ్ ) కు పోస్టింగ్ వస్తుంది . కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన విజయ్ ను అక్కడి స్టేషన్ సిబ్బంది ఏఎస్సై కృష్ణన్ , కానిస్టేబుల్స్ బాలన్ , ఆనంద్ , బిబిష్ లు రిసీవ్ చేసుకుంటారు .

అయితే విజయ్ స్టేషన్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే ఊళ్ళో మర్డర్ జరుగుతుంది . ఆ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగానే లోకల్ ఫైనాన్స్ కంపెనీలో యాభై లక్షల కాష్ , బంగారం దొంగతనం జరుగుతుంది . తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే ఊర్లో మర్డర్ , దొంగతనాలు జరగడంతో విజయ్ వత్తిడికి గురి అవుతాడు . ఇదే సమయంలో వరుసగా ఇంకో రెండు మర్దర్లు జరగడంతో పై అధికారులనుంచి విజయ్ మీద ప్రెషర్ పెరుగుతుంది . ఈ హత్యలకు , ఫైనాన్స్ కంపెనీలో దొంగతనానికి కనెక్షన్ ఉందేమో అనే కోణంలో విజయ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు .

ఇంతకీ ఈ వరుస హత్యలు ఎవరు చేసారు ?
బంగారం దొంగతనానికి , ఈ హత్యలకు ఉన్న కనెక్షన్ ఏంటి ?
తన ఇన్వెస్టిగేషన్ విజయ్ హంతకులను కనిపెడతాడా ? అనేది మిగిలిన కథ .

ఎలా ఉంది ?

స్టోరీ లైన్ వినడానికి సింపుల్ గా ఉన్నా టైట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టేలా చేయడంలో దర్శకుడు విజయం సాధించాడు . మూవీ స్టార్టింగ్ ఆహ్లాదకరమైన హిల్ స్టేషన్ల మధ్య హీరో ప్రయాణంతో సాగుతుంది . ఈ బిగినింగ్ చూస్తే మనం సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీలోనే ఉన్నామా ? లేదా ? అని అనుమానం వస్తుంది . సాధారణంగా మలయాళం మర్డర్ మిస్టరీ మూవీలు బీభత్సమైన క్రైమ్ తో ప్రారంభం అవుతాయి . కానీ దృఢం ఓపెనింగ్ అందుకు విరుద్ధంగా ఆహ్లాదకరంగా సాగుతుంది . చుట్టూ అందంగా పరుచుకున్న తేయాకు తోటల మధ్య హీరో ఆగి టీ తాగడం వంటి సన్నివేశంతో ప్లెజెంట్ అట్మాస్పియర్ క్రియేట్ అవుతుంది .

విజయ్ స్టేషన్లో కొత్త ఎస్సైగా జాయిన్ అయిన తర్వాత కూడా ఏఎస్సై , కానిస్టేబుళ్లతో సరదాగా గడిచిపోతుంది . ఎక్కడా టెన్షన్ ఉండదు . మొదటి ముప్పై నిముషాలు ఫీల్ గుడ్ మూవీ మాదిరి సాగుతుంది . విద్య అనే కానిస్టేబుల్ విజయ్ మీద మనసు పడినట్టు చూపించారు కానీ లవ్ ట్రాక్ పెట్టి స్టోరీని డైవర్ట్ చేయకుండా అది అంతటితోనే ఆపెయ్యడం బాగుంది .లేకపోతే స్టోరీ థీమ్ చెడిపోయేది . ఎప్పుడైతే మొదటి మర్డర్ జరుగుతుందో కధనం టర్న్ తీసుకుని పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ లోకి మారిపోతుంది . ఇక అక్కడ్నుంచి దర్శకుడు చాలా తెలివిగా సన్నివేశాలను పేర్చుకుంటూ వచ్చాడు . తాను అనుకున్న మర్డర్ మిస్టరీ జానర్ నుంచి అంగుళం కూడా పక్కకు జరక్కుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో క్లైమాక్స్ వరకు కధనాన్ని నడిపాడు .

వరుసగా జరుగుతున్న మర్డర్లకు , బంగారం దొంగతనానికి ముడిపెడుతూ దర్శకుడు తెలివిగా కధనాన్ని నడిపిన తీరు బాగుంది . తమిళనాడు నుంచి వచ్చిన నలుగురు దొంగల పనే అయ్యుంటుందనే కోణంలో విజయ్ ఇన్వెస్టిగేషన్ సాగడంతో మనం కూడా ఈ హత్యలకు , బంగారం దొంగతనానికి సంబంధం ఉందని అనుకుంటాం . ఈ క్రమంలో ఫైనాన్స్ కంపెనీ ఓనర్ను , మేనేజర్ను , కంపెనీ వేధింపులను తట్టుకోలేని ఖాతాదారులను విజయ్ అనుమానిస్తాడు . మనమూ అనుమానిస్తాం . మన అనుమానమే నిజమైతే ఇక కధలో ట్విస్ట్ ఏముంటుంది ? అందుకే ఊహించని ట్విస్టుతో దర్శకుడు మనల్ని సర్ప్రైజ్ చేస్తాడు . క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మనల్ని వావ్ అనేలా చేస్తుంది .

సాధారణంగా ప్రతి సినిమాలో దర్శకుడు సాగతీత కోసం కొంత స్పేస్ తీసుకుంటాడు . కానీ ఇందులో అలాంటి సాగతీత సన్నివేశాలు ఏమీ కనిపించవు . ప్రతిదీ కధనంలో భాగంగా నడవాల్సిందే . కధకి ఎంతమేరకు అవసరమో అవే ఉంచుకుని మిగిలినవి ట్రిమ్ చేయడం వల్ల ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టదు .

కొత్తగా ఉద్యోగంలో చేరిన ఎస్సై విధి నిర్వహణలో ఎలాంటి వత్తిళ్లు ఎదుర్కొంటాడు ? వాటిని ఎలా పరిష్కరించుకుంటాడు ? అనేవి చాలా సహజంగా చూపించారు . ఇందులో హీరో తల్లితండ్రులను కూడా ఎంతవరకు ప్రెజెంట్ చేయాలో సరిగ్గా అంతవరకే ఆ పాత్రలను డిజైన్ చేసిన తీరు బాగుంది . ఫ్యామిలీ బాండింగ్ , సెంటిమెంట్ , ఎమోషన్ల పేరుతో అనవసరమైన సాగతీత సన్నివేశాలు పేర్చకుండా సింపుల్ గా ముగించిన విధానం బాగుంది.

మూవీ గురించి ఇంత చెప్పుకున్నాం కదా .. మరి హంతకులు ఎవరు ? హత్యలు ఎందుకు చేస్తారు ? హత్యలకు , బంగారం దొంగతనానికి ఉన్న కనెక్షన్ గురించి చెప్పలేదేంటా ? అనే కదా మీ సందేహం . ఈ ప్రశ్నలకు సమాధానమే క్లైమాక్స్ . అది చెప్తే స్పాయిలర్ అవుతుంది. ఆ సమాధానాలు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే . క్లైమాక్స్ చూసి మీరు థ్రిల్ ఫీల్ అవ్వాల్సిందే .

కాకపోతే ఒకే ఒక్క చిన్న విషయంలో కొంత అపశృతి దొర్లినట్టు అనిపిస్తుంది . మూవీ స్టార్టింగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు మూడు మర్దర్లు జరిగినా కనిపించని మితిమీరిన హింస క్లైమాక్సులో కనిపిస్తుంది . అసలా సన్నివేశంలో అంత హింస అవసరం ఏంటో అర్ధం కాదు..ఎవరు పడితే వాళ్ళు హోరాహోరీగా సిల్వర్ స్క్రీన్ ను ఎరుపెక్కించేస్తారు . ఇక్కడ దర్శకుడు కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది .

ఎవరెలా చేసారు ?

మూవీ స్టార్టింగ్ లో ఎస్సై పాత్రలో షేన్ నిగమ్ ను చూస్తే ఇంత స్మార్ట్ గా ఉన్నాడు . జనరల్ గా పోలీస్ పాత్రకు రఫ్నెస్ ఉండాలి కదా ? మరి యితడు సూట్ అవుతాడా ? దర్శకుడి ఛాయిస్ రాంగేమో అనుకుంటాం . కానీ మూవీ చూస్తున్న కొద్దీ దర్శకుడి ఛాయిస్ కరెక్ట్ అన్న విషయం మనకు అర్ధమౌతుంది . కొత్తగా పోలీస్ ఉద్యోగంలో చేరినవాళ్లు విధి నిర్వహణలో ఎటువంటి వత్తిళ్లు ఎదుర్కుంటారు ? అనేది షేన్ నిగమ్ ద్వారా పర్ఫెక్ట్ గా డిజైన్ చేసారు . ఇందులో హీరో ఎక్కడా కనిపించడు . కొత్తగా ఉద్యోగంలో చేరిన ఒక ఎస్సై మాత్రమే కనిపిస్తాడు . తన పాత్రకు షేన్ నిగమ్ పూర్తి న్యాయం చేసాడు .
మిగిలినవాళ్లు తమ పాత్రల పరిధిలో బాగానే చేసారు .

సాంకేతికత

ఈ మూవీకి బీజీఎమ్ ,సినిమాటోగ్రఫీ ప్లస్ అవుతాయి . ఈ రెండింటిలోనూ జీతూ జోసెఫ్ స్టైల్ వాడకం కనిపిస్తుంది .

శ్రీరాజ్ సాజి అందించిన బీజీఎమ్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది . మర్డర్ మిస్టరీ సినిమాకి పడాల్సిన బీట్లు కరెక్ట్ గా పడ్డాయి .

ఇక ఉన్ని కృష్ణన్ కెమెరా పనితనం కూడా మూవీని క్వాలిటీ వరుసలో నిలుపుతుంది . అసలు మూవీ స్టార్టింగ్ చూపించిన ప్రకృతి దృశ్యాలు చూస్తే చాలు ఆయన కెమెరా పనితనం అర్ధమౌతుంది .

నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి .

విశ్లేషణ

మీరు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడితే దృఢం మూవీ బెస్ట్ ఛాయిస్ .. ఖచ్చితంగా నచ్చుతుంది . మర్డర్ మిస్టరీ మూవీ కాబట్టి మితిమీరిన హింస ఉంటుందేమో అని అనుమానపడక్కర్లేదు . ఒక్క క్లైమాక్సులో మినహా ఎక్కడా అతి ఉండదు . మొదటి మర్డర్ దగ్గర్నుంచి మూవీ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టేలా థ్రిల్ పంచుతుంది . పూర్తిగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్లో కధనం సాగుతుంది కాబట్టి మనకు ఎక్కడా బోర్ కొట్టదు .

దర్శకుడు మర్డర్ మిస్టరీ జానర్ నుంచి ఇంచు కూడా పక్కకు జరక్కుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో కధనాన్ని నడపడంతో ఉత్కంఠతకు లోనవుతాం . హంతకులు ఎవరనేది చివరివరకు ఊహాగానాలతో నడిపించి క్లైమాక్సులో రివీల్ చేయడం మూవీకి హైలెట్ అవుతుంది . ఫస్టాఫ్ మొదటి ముప్పై నిముషాలు ఆహ్లాదకరంగా నడిపి మెల్లిగా అసలు కథలోకి నడిపిన విధానం కూడా బాగుంది .

దర్శకుడు మర్డర్ మిస్టరీ కథను తెరకెక్కించడానికి ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు . షుమారు రెండు గంటల సమయంలో తాను చెప్పాలనుకున్నది ప్రెజెంట్ చేసాడు . అనవసరమైన సాగతీత సన్నివేశాలు లేకపోవడం పెద్ద రిలీఫ్ . సాధ్యమైనంతవరకు లాజిక్కులు కూడా మిస్ అవకుండా దర్శకుడు కధనాన్ని నడిపిన తీరు బాగుంది .

ఓవరాల్ గా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో కూడా దృఢం మూవీ మంచి రేటింగ్ తెచ్చుకుని దూసుకుపోతుంది . IMDb లో 10 కి 7.3 రేటింగ్ సాధించింది . జియో హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవాళ్లు లుక్ వేయండి .

నటీనటులు : షేన్ నిగమ్ , దినేష్ ప్రభాకర్ తదితరులు
సినిమాటోగ్రఫీ : ఉన్నికృష్ణన్
సంగీతం : శ్రీరాజ్ సాజి
నిర్మాత : జీతూ జోసెఫ్
దర్శకత్వం : మార్టిన్ జోసెఫ్
విడుదల : జియో హాట్ స్టార్ ( 12-06-2026 )
రేటింగ్ : 3 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!