sukhamano sukhamann మూవీ (OTT) రివ్యూ – ఆత్మలతో కలిసి ప్రయాణించిన ఓ కుర్రాడి ప్రేమ కథ!

Spread the love

ఈ మూవీ 2026 ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలై మంచి వసూళ్లను రాబట్టుకుంది . తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చి మంచి రేటింగ్ సాధించింది . దర్శకుడు అరుణ్ లాల్ రామచంద్రన్ ఫాంటసీ , కామెడీ జోనర్ లో కథ రాసుకుని ఈ మూవీని తెరకెక్కించాడు . మాధ్యు థామస్ , దేవిక సంజయ్ లు నటించిన ఈ సినిమాలో కాసిని నవ్వులు ఉంటాయి ..హృదయాలను మెలిపెట్టే భావోద్వేగ సంఘర్షణలూ ఉంటాయి .

ఈ మూవీలో హీరో తనకంటూ ఎవరూ లేని ఒంటరివాడు . కానీ అదే ఒంటరి మనిషి తన లోన్లినెస్ పోగొట్టుకోవడానికి ఆత్మలనే తన బంధువులుగా భావించుకుంటే ఎలా ఉంటుంది అనే లైనులో స్టోరీ సాగుతుంది . సొంత బంధువులు లేనివాళ్లు తమకు నచ్చినవాళ్లనే ఆత్మ బంధువులుగా చేసుకుని ప్రయాణం సాగిస్తారు కదా .. ఇందులో హీరో , హీరోయిన్లు అదే చేస్తారు .

ఇప్పుడు మూవీ ఎలా ఉందో చూద్దాం .

కధేంటంటే ?

థియో ( మాధ్యు థామస్ ) ఎవరూ లేని ఒంటరివాడు . తన చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల సైకలాజికల్ డిప్రెషన్ తో బాధపడుతుంటాడు . ఊర్లో అతడ్ని మెంటల్ అని ఎగతాళి చేస్తుంటారు . ఓరోజు అతడు అనుకోకుండా ఓ ఇంట్లో అడుగుపెడతాడు . ఆ ఇంట్లో ముసలాయన చనిపోయి ఉంటాడు . అందరూ ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఒక గదిలో ముసలాయన ఆత్మ థియో కి మాత్రమే కనిపిస్తుంది . ఎవరూ లేని థియో ఆయన్ని తన తాతగా భావిస్తాడు . దాంతో ఆ ఆత్మ కూడా థియో ఇంటికి వచ్చేస్తుంది .

ఇదిలా ఉండగా ఐపి ( జగదీశ్ ) ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ . ఈ ఐపిది కూడా ఓ విషాదగాధ . కొడుకు చేసిన నేరానికి శిక్ష తనమీద వేసుకుని పన్నెండేళ్ళు జైలుశిక్ష అనుభవించి బయటికి వస్తాడు . తండ్రి జైలుకు వెళ్లినట్టు తన భార్యకు తెలిస్తే ఇంటికి రానివ్వదని చెప్పి ఆ కొడుకు తండ్రిని దూరం పెడతాడు . కుటుంబాలకు దూరం అయిన ఐపి , థియో లు దగ్గర అవుతారు . అందుకే తన అంబులెన్సులో అతడికి డ్రైవర్ ఉద్యోగం ఇస్తాడు . థియో తన అంబులెన్సులో తీసుకెళ్లిన డెడ్ బాడీల ఆత్మలు అతడి ఇంటికి చేరతాయి . ఎవరూలేని థియో ఆత్మలనే తన బంధువులుగా భావించుకుని డిప్రెషన్ పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు . ఈ పరిస్థితుల్లో థియో కి ఒక మంచి అమ్మాయితో పెళ్లి జరిపించి అతడ్ని ఓ ఇంటివాడ్ని చేయాలని ఆత్మలు రంగంలోకి దిగుతాయి .

థియో కి పెళ్ళిచేయాలని ఆత్మలు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా ?
థియో జీవితంలోకి చారు ( దేవిక సంజయ్ ) ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది ?
చారుకు ఉన్న జబ్బు ఏంటి ?
చివరికి థియో , చారుల ప్రేమ ఫలించి పెళ్లిచేసుకుంటారా ?
థియో ప్రేమ ప్రయాణంలో ఆత్మలు ఏం చేస్తాయి ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది.

ఎలా ఉంది ?

ఒంటరితనం , డిప్రెషన్స్ తో బాధపడుతున్న నాయికా , నాయకులు ఒకటై కలిసి ప్రయాణించాలని అనుకోవడంతో అసలు కథ మొదలౌతుంది . అంతకుముందు థియో తన ఇంట్లో ఆత్మలనే తన ఫ్యామిలీ ట్రీ గా చేసుకుని వారి ద్వారా తన లోన్లినెస్ పోగొట్టుకోవాలని ప్రయత్నించడం , ఆత్మలు కూడా థియో ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయి అతడికి అండగా నిలబడుతూ పెళ్లి కూడా చేయాలనుకోవడం , థియో కి ఐపి కూడా తోడు అవడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ కధనం నడుస్తుంది . ఈ క్రమంలో మనకు కొన్ని సాగతీత సన్నివేశాలు కూడా ఎదురౌతాయి . ఆత్మలతో కామెడీ చేద్దామని దర్శకుడు ప్రయత్నించినా మనకు ఫ్రెష్ ఫీల్ రాదు . ఎందుకంటే అలాంటి సన్నివేశాలు గతంలో చాలా సినిమాల్లో మనం చూసేసాము .

ఇక సెకండాఫ్ లో చారు ఎంటర్ అవడంతో కథ ఫాంటసీ నుంచి రియల్ డ్రామాలోకి ఎంటర్ అవుతుంది . చారుకి కూడా సంఘర్షణతో కూడి ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఉండటం , నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుందని తెలియడం , థియో ఆమె ప్రేమలో పడటం , థియో ఫ్లాష్ బ్యాక్ కూడా రివీల్ కావడంతో అసలు స్టోరీ పూర్తిగా అర్థమైపోతుంది .

అయితే ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలే హృదయాలను మెలి పెడతాయి . థియో , చారు లు ఉయ్యాలలో కూర్చుని ఆట ఆడుకుంటూ ఒకరినొకరు తెలుసుకునే సన్నివేశం , తన ఆఖరి కోరిక తీర్చమని చారు అడగడం , దానికి థియో చెప్పే సమాధానం కంట తడి పెట్టిస్తుంది . వీళ్లిద్దరి మధ్య నడిచే సంభాషణలు బావుంటాయి

అలాగే ఐపి కూడా చర్చిలో తన కన్నకొడుకుని కలిసి ‘ సార్ ! ఒక్క నిమిషం ఇటు వస్తారా ?’ అని పక్కకి పిలిచి థియో , చారులు తన పిల్లలని పరిచయం చేసే సన్నివేశం హృదయాలను మెలిపెడుతుంది . ఈ సన్నివేశం సినిమాకి హైలెట్ గా నిలిచిపోతుంది .

థియో చిన్నతనంలోనే అతడి తల్లి ఇంట్లోనుంచి వెళ్ళిపోయి రెండో పెళ్లి చేసుకోవడం , తండ్రి ఆత్మహత్య చేసుకోవడం వంటి సంఘటనలతో అతడు లోన్లినెస్ తో డిప్రెషన్లోకి వెళ్తాడు . అందుకే ఆత్మలనే తన బంధువులుగా భావించుకుని భ్రమలలో ఉంటాడు . ఇంచుమించుగా ఇలాంటి పరిస్థితుల్లోనే ఒంటరితనం అనుభవిస్తున్న ఐపి , చారుల చుట్టూ కథ నడుస్తుంది .

ఇలా ఎక్కడెక్కడివాళ్ళనో ఒక కుటుంబంగా కలిపి థియో , చారుల ప్రేమకు కనెక్ట్ అయ్యే విధంగా కథను మలిచిన విధానం బాగుంది . ఇక క్లైమాక్స్ అనేది మనం ముందే ఊహించేస్తాం కాబట్టి కొత్తగా ఫీల్ అయ్యేది ఏమీ ఉండదు . మళ్ళీ లైఫ్ మొదటినుంచి స్టార్ట్ చెయ్యమని ఆత్మలు థియోకి చెప్పడం , చారు జ్ఞాపకాలతో థియో ఒంటరితనం పోవడంతో ఆత్మలు కూడా అతడికి వీడ్కోలు చెప్పి వెళ్లిపోవడం బాగుంది .

ఎవరెలా చేసారు ?

థియో పాత్రలో మాధ్యు థామస్ నటన బాగుంది . కానీ భావోద్వేగాలు పండించే సన్నివేశాల్లో అతడి నటన ఇంప్రూవ్ కావాలి . మొదటినుంచి చివరివరకు ఒకే రకమైన హావభావాలను ప్రదర్శించాడు . కొన్ని సన్నివేశాల్లో అతడి నటన పేలవంగా కూడా ఉంది .

ఐపి పాత్ర ద్వారా జగదీష్ హృదయాలను మెలిపెట్టే భావోద్వేగాలను పండించాడు . ముఖ్యంగా చర్చిలో కొడుకుతో మాట్లాడిన సన్నివేశం కంట తడి పెట్టిస్తుంది .

చారు పాత్రలో దేవిక సంజయ్ నటన బాగుంది . చక్కటి అందంతో ఆమె థియో మనసునే కాదు ప్రేక్షకుల మనసులను కూడా కొల్లగొడుతుంది .
మిగిలినవారు తమ పాత్రల పరిధిమేరకు బాగానే చేసారు .

సాంకేతికత

టోబిన్ థామస్ అందించిన సినిమాటోగ్రఫీ పర్లేదు .
నిపిన్ బీసెంట్ అందించిన సంగీతం బాగానే ఉంది .
నిర్మాణ విలువలు పర్లేదు .

విశ్లేషణ

మూవీ ఫాంటసీతో మొదలై డ్రామాతో ముగుస్తుంది . ఫాంటసీ అంటే గాల్లో దయ్యాలు వేలాడటం , తెల్లబట్టలు వేసుకుని భయపెట్టడాలు ఏమీ ఉండవు . దర్శకుడు చాలా సహజంగా ఆ పాత్రలను తీర్చిదిద్దిన విధానం బాగుంది . ఆత్మలతో కామెడీ చేయించాలనుకున్న ప్రయత్నం సరిగా ఫలించలేదు . ఫస్టాఫ్ లో కొన్ని సాగతీత సన్నివేశాలు భరిస్తే సెకండాఫ్ లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు మనల్ని టచ్ చేస్తాయి . ముఖ్యంగా దర్శకుడు ఐపి పాత్రను బాగా వాడుకున్నాడు . ఇక చారు ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేయడంతో ప్రీ క్లైమాక్స్ లోనే అసలు స్టోరీ అర్దమైపోవడంతో క్లైమాక్స్ మనకు కొత్తగా అనిపించదు .

ఓవరాల్ గా ఫస్టాఫ్ యావరేజ్ గా ఉంటుంది . సెకండాఫ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది . మొదటినుంచి నెమ్మదిగా నడిపిన కధనం థియో .. చారుల మధ్య లవ్ ట్రాక్ వచ్చేసరికి హడావుడిగా నడిపినట్టు అనిపిస్తుంది . ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు మాత్రం ఖచ్చితంగా మనల్ని టచ్ చేస్తాయి . కధలో కొత్తదనం లేకపోయినా దర్శకుడు కధనంలో ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించాడు . క్లైమాక్స్ రొటీన్ గా కాకుండా కొంచం డిఫరెంట్ గా ప్రయత్నించి ఉంటే బాగుండేది . మూవీ మొత్తానికి థియో .. చారుల మధ్య నడిచిన లవ్ ట్రాక్ బాగుంటుంది . థియో అమాయకత్వం .. చారు తెలివితేటలు .. సెన్స్ ఆఫ్ హ్యూమర్ లతో పాత్రలను మలచిన విధానం బాగుంది .

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మలయాళం కామెడీ ఫాంటసీ మూవీని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు .

నటీనటులు : మాధ్యు థామస్ , దేవిక సంజయ్ , జగదీష్ తదితరులు
సినిమాటోగ్రఫీ : టోబిన్ థామస్
సంగీతం : నిపిన్ బీసెంట్
దర్శకత్వం : అరుణ్ లాల్ రామచంద్రన్
విడుదల : అమెజాన్ ప్రైమ్
రేటింగ్ : 2.5 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!