చేతిలో కత్తితో హీరోలు వెంకటేష్ , కళ్యాణరామ్ ల మీదకు వచ్చిన అనిల్ రావిపూడి – షాక్ లో హీరోయిన్లు !

Spread the love

ఎంతటి దర్శకుడైనా తన సినిమా ప్రమోషన్ కోసం కెమేరాతోనో , ల్యాప్ టాప్ తోనో వస్తారు..కానీ అనిల్ రావిపూడి ఏకంగా కత్తితో వచ్చాడు . అదీ అట్లాంటిఇట్లాంటి మాములు కత్తి కాదు . పదునైన పొడవాటి కత్తి . చేతిలో కత్తితో సెట్లోకి వస్తున్న అనిల్ రావిపూడిని చూసి హీరోయిన్లు కీర్తి సురేష్ , కృతి శెట్టిలు భయపడిపోయి హీరోలు వెంకటేష్ , కళ్యాణరామ్ ల దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి ‘ సార్ ..సార్.. ఇక్కడేం జరుగుతుందో చూడండి ‘ అంటూ అనిల్ రావిపూడిని చూపిస్తారు .

అటుచూస్తే చేతిలో కత్తితో ,తలమీద పాగాతో అనిల్ రావిపూడి వస్తూ కనిపించాడు . అనిల్ని చూడగానే అంతటి వెంకీ మామ కూడా భయపడిపోయాడు .’హేయ్..ఏంటి ?..ఏంటిది?’ అంటూ కత్తివంక చూస్తూ గాభరాగా అడిగాడు

“కొత్త సినిమాకోసం కత్తిలాంటి ఐడియాతో వస్తున్నానని తెలిసి చేతిలో కత్తి , తలపాగా పెట్టి నా ఫాన్స్ సన్మానం చేసారు . అయినా ఎప్పుడూ కత్తిలాంటి ఐడియాలు నేనొక్కడ్నే ఇవ్వాలా ? ఏం మీరు ఇవ్వకూడదా ?” అంటూ వెంకీ మామని రెచ్చగొట్టాడు అనిల్

దాంతో వెంకటేష్ కి , కళ్యాణరామ్ లకు అసలు విషయం అర్థమైంది . ఇంకా అనిల్ తమ మీద ఏదో అఘాయిత్యం చేయడానికి వస్తున్నాడేమో అనుకుని హడలిపోయిన హీరోయిన్లు కూడా రిలాక్స్ అయ్యారు .

వెంకీ మామ ఊరుకుంటాడా ,
“కొత్త సినిమా .. కొత్త ఐడియా .. అంతేకదా ? ఏది ఆ కత్తి ఇలా ఇయ్యి..ఇయ్యమ్మా” .. అంటూ అనిల్ చేతిలోని కత్తిని తన చేతిలోకి తీసుకుని చటుక్కున అతడి బొటనవేలు మీద గీకి నుదుట నెత్తుటి తిలకం దిద్దాడు .
దెబ్బకు బాధతో కెవ్వుమన్నాడు అనిల్ .

మరి ఇంకో హీరో కళ్యాణరామ్ మాత్రం తక్కువ తిన్నాడా ?

“ఈ సినిమాలో నేను ఇంకో హీరోని కదా .. నేను కూడా వీర తిలకం దిద్దకపోతే బాగుంటుందా? అని కత్తితో అనిల్ బొటనవేలు చెక్కి నుదుట రక్త తిలకం దిద్దాడు .దాంతో పుండుమీద కారం చల్లినట్టు అయ్యింది అనిల్ పరిస్థితి .

మేమేం తక్కువతిన్నామ్ అంటూ ఇద్దరు హీరోయిన్లు కూడా అనిల్ నుదుట రక్తతిలకం దిద్దారు . దాంతో అనిల్ కెవ్వుమంటూ ” ఎంత రాయలసీమ బ్యాక్ డ్రాప్ అయితేమాత్రం మరీ ఇంత రక్తపాతమా ? ఇకపై రాయలసీమలో రక్తపాతం బ్యాక్ డ్రాప్ ఉండదు .. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఉంటుంది ” అంటూ తన వేలిని చూసుకుంటూ అరిచాడు .

ఏంటీ ? ఇదంతా చదివి అనిల్ రావిపూడి అంటే తన సినిమాలతో మనల్ని సరదాగా నవ్వించే ఒక గిలిగింతల దర్శకుడు అనుకున్నాం కానీ మరీ ఇంతలా కత్తి పట్టుకుని మా హీరోల మీదికే వస్తాడా ? అని షాక్ అవుతున్నారా ?

ఇలా మనకు షాకులు ఇచ్చి ఫిలిం ప్రమోషన్ చేసుకోవడంలో అనిల్ దిట్ట అండీ బాబు .
ఇంతకీ అసలు విషయం ఏంటంటే ప్రతి సంక్రాంతికి వెంకీ మామతో కలిసి మనూళ్ళో సందడి చేయడానికి వచ్చే అనిల్ రావిపూడి ఈసారి 2027 సంక్రాంతికి సందడి చేయడానికి ఇప్పట్నుంచే రెడీ అవుతున్నాడన్నమాట . ఈసారి వెంకిమామ పక్కన నందమూరి వారబ్బాయి కళ్యాణరామ్ ను దింపాడు . ఈ మధ్యనే ఈ మూవీకి ఇలా క్లాప్ కొట్టారో లేదో అనిల్ తనదైన మార్క్ ప్రమోషన్ తో రంగంలోకి దిగిపోయాడు . పైన చెప్పిన కత్తి ఎపిసోడ్ కూడా అనిల్ రావిపూడి స్టైల్ ఫిలిం ప్రమోషన్లో భాగమే .

సరే కత్తితో హీరో , హీరోయిన్లను భయపెట్టిన అనిల్ ఈసారి ఏకంగా సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ను , పాటల రచయిత అనంత శ్రీరామ్ లను భూమిలో పాతిపెట్టి మరీ పాటలకు కంపోజింగ్ చేయమని పట్టుపట్టాడు .

అదెలా చేసాడంటే ,

వివాహ భోజనంబులో సుత్తి వీరభద్ర రావుగారు బ్రహ్మానందంగారిని బీచు ఒడ్డులో భూమిలో పాతిపెట్టి మరీ ఆదిలాబాదు , నిజామాబాదు , హైద్రాబాదు అని అన్ని ఊర్లపేర్లు చెప్పినట్టు తన సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ను పీకల్లోతు భూమిలో పాతి పెట్టి క్లాసు పాట , మాసు పాట , మెలోడీ పాట , ఆస్కారు పాట అంటూ మాంచి ట్యూన్లు కట్టమంటాడు .

అనిల్ దెబ్బకు మెంటలెక్కిపోయిన ప్రకాష్ ‘ ఇలా భూమిలో పాతిపెట్టి పాటలకు ట్యూన్లు కట్టమనడం ఏంటి మహాప్రభో ‘ అని వాపోతాడు .

మ్యూజిక్ డైరెక్టర్ ప్రకాష్ చాలా బిజీ కాబట్టి అతడ్ని కట్టేసి అయినా ట్యూన్లు కట్టించుకోమని ప్రొడ్యూసర్ చెప్పాడు కాబట్టి కట్టేసి బదులు వెరైటీగా భూమిలో పాతిపెట్టేసి ట్యూన్లు కట్టించుకోవాలని డిసైడ్ అయ్యాను అంటాడు అనిల్ .

“మహాప్రభో కనీసం హార్మొనీ వాయించటానికైనా నా చేతులు బయట ఉండాలి కదా .. అంచేత భూమిలోనుంచి నన్ను బయటికి తెస్తే ట్యూన్లు కడతా” అని వాపోతాడు మ్యూజిక్ డైరెక్టర్ .

” హార్మోని వాయించాలంటే చేతులతోనే కదా పని .. అందుకే నీ రెండు చేతులను విడుదల చేస్తున్నాను .. హార్మొనీ వాయించు” అంటాడు అనిల్

” సరే చేతులతో ఎలాగోలా హార్మొనీ వాయిస్తాను కానీ ముందా పాటల రచయితను పిలిపించండి మహాప్రభో ” అని వేడుకుంటాడు ప్రకాష్

” పాటల రచయితను ఆల్రెడీ రెండ్రోజుల క్రితమే భూమిలో పాతి పెట్టేసాను .. అటుచూడు” అని చూపిస్తాడు .

అదే బీచులో కొద్దిదూరంలో పాటల రచయిత అనంతశ్రీరాం పీకల్లోతు భూమిలో కప్పబడి ‘ క్లాసు పాట ..మాసు పాట , ఆస్కారు పాట ‘ అని పాడుతూ ఉంటాడు .

చూసారా ? అనిల్ రావిపూడి బరితెగింపు .. తన సినిమాకోసం అవసరమైతే హీరో , హీరోయిన్లను కత్తితో బెదిరించైనా సరే గిలిగింతల నటన రాబట్టుకుంటా అంటున్నాడు . మ్యూజిక్ కంపోజర్ను , పాటల రచయితను భూమిలో పాతిపెట్టి అయినా సరే మంచి ట్యూన్లు కట్టించుకుంటా అంటున్నాడు . అంతేకాదు సోషల్ మీడియాలో ప్రమోషన్ వీడియోలు రిలీజ్ చేసి అందరి చూపులను మరోసారి తనవైపు తిప్పుకున్నాడు . అందుకే ఇప్పుడు అనిల్ ప్రమోషనల్ వీడియోలు ట్రెండింగ్ అవుతున్నాయి .

ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది ? ఈసారి సంక్రాంతికి మనల్ని కితకితలు పెట్టడానికి అనిల్ రావిపూడి పెద్ద స్కెచ్చే వేస్తున్నాడు అనిపించడం లేదూ ? డౌటేముంది ? ఇంతకుముందు ఇలాంటి ప్రమోషన్లు చేసే కదా ఫ్యామిలీ డైరెక్టర్ అనీ , ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ అనీ బోలెడు ట్యాగులు సొంతం చేసుకున్నాడు .

అసలు అనిల్ ఎఫ్ 2 నుంచే ఈ వెరైటీ ఫిలిం ప్రమోషన్ మొదలెట్టాడు . సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ ప్రమోషన్ పీక్ కి వెళ్ళిపోయింది . వెంకీ మామను , బుల్లిరాజును వెంటపెట్టుకుని సంక్రాంతికి అందరిళ్ళకుపోయి పిండివంటలు తిని మరీ తన సినిమాని ప్రమోట్ చేసుకున్నాడు . బుల్లిరాజుతో కలిసి కొరికేస్తా .. కొరికేస్తా అంటూ టీవీ స్టూడియోలో అనిల్ చేసిన హంగామా అంతాఇంతా కాదు .

ఇంతటితో ఆగాడా ? మన శంకర వర ప్రసాద్ గారు మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవితోనే వెరైటీ ప్రమోషన్ చేయించాడు . బాస్ ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్ లైన్ తో టీమ్ ను సెట్లో మెగాస్టార్ కు పరిచయం చేసాడు . ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతారను చెన్నైనుంచి హైదరాబాద్ రప్పించి మరీ ఫిలిం ప్రమోషన్ చేయించాడు . దాంతో ఇండస్ట్రీలో మన శంకర వరప్రసాద్ గారు మూవీకి భారీ హైప్ వచ్చింది . అంతకుముందు ఆచార్య ఫెయిల్యూర్ తో స్పీడ్ తగ్గిన మెగాస్టార్ తిరిగి శంకర వరప్రసాద్ అవతారం ఎత్తి హిట్ కొట్టారు . ఈ మూవీకోసం చిరంజీవి .. వెంకటేష్ ల కాంబోతో అనిల్ చేయించిన ప్రమోషనల్ వీడియోలు సినిమా థియేటర్లలోకి రాకముందే నవ్వులు పూయించాయి .

ఎంత భారీ బడ్జెట్ తో సినిమా తీసినా దాన్ని సరైన విధంగా ప్రమోట్ చేసుకోకపోతే జనంలోకి పెద్దగా రీచ్ అవ్వదు. చాలామంది పెద్దనిర్మాతలు చేసే పొరపాటు ఇదే . కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసి సింపుల్గా ల్యాప్ టాప్ లో టీజర్ రిలీజ్ చేస్తారు . సరైన ప్రచారం లేకపోవడంతో కొద్దివారాలకే ఓటిటీలకు చేరుకుంటాయి . కానీ అనిల్ రావిపూడి స్టైల్ వేరు . సినిమా మీద ఎంత శ్రద్ద పెడతాడో .. దాన్ని మార్కెట్ చేసుకోవడం మీద కూడా అంతే శ్రద్ద పెడతాడు .

ప్రస్తుతం మనం డిజిటల్ యుగంలో ఉన్నాం . ఏ ప్రొడక్ట్ అయినా మార్కెట్ చేసుకోవాలంటే సోషల్ మీడియాని మించింది లేదు . అందులోను మూవీలు ప్రమోట్ చేసుకోవాలంటే సింపుల్ మార్గం సోషల్ మీడియానే . ఇందుకోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు . కొత్త కాన్సెప్ట్ తో , కొత్త ఐడియాలతో ప్రమోషన్ వినూత్నంగా ప్లాన్ చేస్తే చాలు . రీచ్ ఆటోమేటిగ్గా చేరుకుంటుంది . ప్రస్తుతం అనిల్ రావిపూడి చేస్తుంది అదే .


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!