రవిబాబు గారు రేజర్ తో ఒక రేంజిలో కోసేశారు – రేజర్ మూవీ (OTT) రివ్యూ

Spread the love

రవిబాబు సినిమా అనగానే అనసూయ , అవును లాంటి థ్రిల్లర్ మూవీలు గుర్తుకొస్తాయి . స్క్రీన్ ప్లే లో ఇతడి మేకింగ్ అండ్ టేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది . సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలు తీయడంలో తనకంటూ ప్రత్యేక స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు . అందుకే రవిబాబు సినిమాలు చూడటానికి ప్రత్యేకంగా కొంతమంది ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు .

ఈ రవిబాబు ఎవరో చెప్పుకునేముందు నటుడు చలపతిరావు గురించి చెప్పుకోవాలి . క్యారక్టర్ ఆర్టిస్టుగా , విలన్ గా పలుసినిమాల్లో నటించి మెప్పించిన చలపతిరావు తెలుగు తెరకు చిరపరిచితుడు . ఆ చలపతిరావు కొడుకే రవిబాబు . అయితే ఈయన తండ్రిలా పూర్తిస్థాయిలో ఆర్టిస్టుగా స్థిరపడలేకపోయాడు . దాంతో నటిస్తూనే యూ టర్న్ తీసుకుని కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు . రవిబాబు నటించిన పాత్రలలో గులాబీ గోవిందు పాత్ర చాలామందికి గుర్తుండిపోతుంది .

మధ్యలో కెరీర్ పరంగా రవిబాబుకి కొంత గ్యాప్ వచ్చింది . మళ్ళీ ఇన్నాళ్లకు తనే నిర్మాత , నటుడు , రచయిత , దర్శకుడిగా రేజర్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . మే 8 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ జూన్ 19 ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది.

ఇప్పుడు రేజర్ పదును ఎలా ఉందో చూద్దాం .

కధేంటంటే ?

హోమ్ మినిస్టర్ కనకరాజుకి ( వీరన్న చౌదరి ) సీఎం పదవి మీద కన్నుపడుతుంది . అందుకే నేరుగా సీఎం నే ( రామరాజు ) కలిసి పదవి నుంచి తప్పుకోమని వార్నింగ్ ఇస్తాడు . అతడి బెదిరింపులకు సీఎం లొంగకపోగా హోమ్ మినిష్టర్ మీద ఉన్న కేసులను బయటికి తీస్తా అంటాడు . దాంతో కోపం వచ్చిన హోమ్ మినిష్టర్ తన కొడుకులతో కలిసి సీఎం ను హత్య చేసి హార్ట్ అటాక్ తో చనిపోయాడని అందర్నీ నమ్మిస్తారు . కొత్త సీఎం గా తనచేత ప్రమాణస్వీకారం చేయించాలని గవర్నర్ కు లెటర్ ఇస్తాడు .

అయితే సీఎం ఇంటి ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ సిసి కెమెరా పనిచేయడం లేదని కంప్లైంట్ రావడంతో ఆ కంపెనీ నిర్వాహకుడు విష్ణు ( తనీష్ ) ఆ సిసి కెమెరా తీసుకుని చూడగా అందులో సీఎం మర్డర్ విజువల్స్ బయటపడతాయి . దాంతో విష్ణు భయపడి తన స్నేహితుడికి జరిగిన విషయం చెప్తాడు . ఈ విషయం హోమ్ మినిష్టర్ కి తెలిస్తే ఇద్దర్నీ చంపేస్తాడు కాబట్టి వెంటనే వీడియో డిలీట్ చేయమని చెప్తాడు .

అతడు ఊహించినట్టుగానే విషయం తెలుసుకున్న హోమ్ మినిష్టర్ కొడుకులు ముందు విష్ణు స్నేహితుడ్ని చంపి , తర్వాత విష్ణు ఇంటికెళ్లి ఆ వీడియో దొరక్కపోవడంతో అతడిని , అతడి భార్యను కూడా చంపేస్తారు . హోమ్ మినిష్టర్ కొడుకులు హత్య చేయడం విష్ణు కూతురు తేజు చూస్తుంది . చనిపోయేముందు విష్ణు తనకూతురికి ఆ వీడియో గురించి హింట్ ఇస్తాడు . సరిగ్గా అదే టైమ్ లో విష్ణు ఇంటికి వచ్చిన పెట్ డాగ్ కేర్ టేకర్ పనిచేసే రుద్ర ప్రతాప్ ఆ పాపకు ప్రాణహాని ఉందని తెలుసుకుని ఆమెని రక్షించే బాధ్యత తీసుకుంటాడు .

పాప సంరక్షణ బాధ్యత తీసుకున్న రుద్రప్రతాప్ నేపధ్యం ఏంటి ?
విష్ణు ఆ వీడియోని ఎక్కడ దాచిపెడతాడు ?
చివరికి రుద్రప్రతాప్ ఆ వీడియోని సంపాదిస్తాడా ?
హోమ్ మినిస్టర్ కనకరాజు సీఎం అవుతాడా ? లేదా ? అనేది మిగిలిన కథ

ఎలా ఉంది ?

రవిబాబు ఈ సినిమాకి రేజర్ అనే పేరు పెట్టేబదులు ఏ గొడ్డలో , గునపమో అని పెట్టి ఉంటే యాప్ట్ గా ఉండేది . బహుశా రవిబాబు రేజర్ తో షేవింగ్ చేసుకునే టైములో ఈ కథా ఆలోచన వచ్చి ఉంటుంది . అందుకే టైటిల్ వేసేటప్పుడు రవిబాబు రేజర్ తో షేవింగ్ చేసుకుంటున్నట్టు భలే చూపించారు . రేజర్ టైటిల్ కి మూవీకి సంబంధం ఉందో లేదో తెలీదు కానీ మొదటిసారిగా రవిబాబు ఈ మూవీలో పాత ఇనప సామాన్లు విచ్చలవిడిగా వాడేశారు . మాములుగా రవిబాబు సినిమాలు సైకలాజికల్ థ్రిల్లర్ తో , మర్డర్ మిస్టరీతో భయపెట్టేలా ఉంటాయి. కానీ ఈ సినిమా పిల్లలు , పెద్దలతో కలిపి ఇంటిల్లిపాదీ జడుసుకునేలా ఉంటుంది . ఫోర్కులతో కనుగుడ్లు పీకేయడం , గునపం గుండెల్లో దించి మెలిపెట్టడం , డ్రిల్లింగ్ మెషిన్ తో ఎముకల్లో డ్రిల్ చేయడం వంటి బీభత్స భయానక దృశ్యాలను రవిబాబు యథేచ్ఛగా వాడేశారు . అసలు సినిమాకి అంత హింస అవసరం ఏముందో ఎవరికీ అర్ధం కాదు .

టోటల్గా ఈ మూవీలో విలన్లకన్నా హీరో చేసిన హింసే ఎక్కువగా ఉంది . ఇప్పుడు కాసేపు ఆ హింసను పక్కనబెట్టి మూవీ సంగతి చూద్దాం . ఫస్టాఫ్ లో పెట్ డాగ్స్ కేర్ టేకర్ గా రవిబాబు ఎంట్రీ ఇవ్వడం , పాపను అతడు కాపాడటం వంటి సన్నివేశాలు చూసినప్పుడు ఇందులో హోమ్ మినిస్టర్ని ఎదుర్కునే పాత్రలో ఈ డాగ్ కేర్ టేకర్ పవర్ ఫుల్ రోల్ పాటిస్తాడు కాబోలు అనుకుంటాం . కానీ అతడు ఎప్పుడైతే మరో ముగ్గురికి ఫోన్ చేసి ఆపరేషన్ రెడ్ అని కోడ్ వర్డ్ చెపుతాడో ఇతడి క్యారెక్టర్లో ఏదో పెద్ద విషయమే ఉందని తెలుస్తుంది . ప్రారంభంలోనే ఈ ట్విస్ట్ తో రవిబాబు ఆకట్టుకున్నాడు . మళ్ళీ అతడి మార్క్ డైరెక్షన్ మొదలైంది అని మురిసేలోపు రవిబాబు అడ్డొచ్చిన గూండాల గుండెల్లో పొడుస్తూ యాక్షన్ మోడ్ లోకి దిగి ఆశ్చర్యపరిచాడు .

రవిబాబుకి ఫైటింగులు ఇష్టమో ? లేకపోతే ఈ సినిమా కోసం ఫైటింగులు నేర్చుకున్నాడో తెలీదు కానీ రౌడీలా భుజాలదాకా కాలు లేపి మరీ చితకబాదుతాడు . హింసను పక్కనబెడితే నిజంగా ఫైట్స్ కోసం రవిబాబు పడిన కష్టం మూవీ చూసినవాళ్లకు తెలుస్తుంది . దానికి తోడు జిమ్ చేసాడేమో అతడి బాడీ లాంగ్వేజ్ కూడా రుద్రప్రతాప్ పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది .

ఇక ఈ మూవీలో మరో ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఏంటంటే సీఎం మర్డర్ విజువల్స్ ను విష్ణు ఎవరికీ దొరక్కుండా కోడ్ లాంగ్వేజ్ లో దాచిపెట్టడం.. రుద్రప్రతాప్ అండ్ టీమ్ ఒకటొకటిగా డీ కోడ్ చేసుకుంటూ వెళ్లడం .. ఆఖరికి విజువల్స్ ఎక్కడుందో కనుక్కోవడం వంటి అంశాలతో టెక్నికల్ గేమ్ నడిపిన విధానం బాగుంది . అయితే ఇదే క్రమంలో స్టోరీని ఎక్కువగా సాగతీసినట్టు అనిపిస్తుంది . ఇక్కడ కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది .
సెకండాఫ్ లో నటుడిగా రవిబాబు విశ్వరూపం చూపించాడు . ముఖ్యంగా కళ్ళముందే టెర్రరిస్టుల వాళ్ళ భార్యా , కూతురు చనిపోతే అతడు పడిన వేదనను చూసినవారికి రవిబాబు కనిపించడు . రుద్రప్రతాప్ మాత్రమే కనిపిస్తాడు .

అయితే అతడి గతానికి , అతడికి జరిగిన అన్యాయానికి , హోమ్ మినిష్టర్ తో గొడవకు ఎక్కడా కనెక్షన్ ఉండదు . అందుకే అలాంటి ఒక కనెక్షన్ కోసం హఠాత్తుగా కల్నల్ అవతారంలో బెనర్జీని దింపుతారు . ఈ కల్నల్ ని దింపకపోతే ఈ సినిమాకి రెండు కధలు అయ్యేవి .

సినిమాలు చూసేటప్పుడు చాలామంది లాజిక్కులు వెతుకుతారు . అలా లాజిక్కులు వెతికేవాళ్లు ఈ సినిమా చూడకపోవడమే మంచిది . ఎందుకంటే రేజర్ లాజిక్కులకు అందదు . రుద్రప్రతాప్ ను పట్టుకోవడానికి హోమ్ మినిష్టర్ గుండాలు వెతకడం వరకు బాగానే ఉంది కానీ ఏకంగా రెండు బెటాలియన్ల కమెండోలు దిగడం యూ ట్యూబ్ థంబ్ నెయిల్ మాదిరి షాక్ ఇస్తుంది . ఇంకో షాక్ ఏంటంటే స్టెన్ గన్నులు పట్టుకున్న కమెండోలను రవిబాబు కేవలం టార్చ్ లైట్ తో కొట్టి పడేయడం ఏదైతే ఉందో ..అంతే .

ఇలాంటి లాజిక్కుల జోలికి వెళ్లకుండా చూస్తే రవిబాబు మార్క్ సస్పెన్స్ థ్రిల్లర్ కనిపిస్తుంది. కథ విషయానికి వస్తే రొటీన్ స్టోరీనే అని చెప్పాలి . కాకపోతే ఆ రొటీన్ స్టోరీనే రవిబాబు తనదైన మార్క్ స్క్రీన్ ప్లే తో లాక్కొచ్చాడు . హీరో హీరోయిన్లు లేరు కాబట్టి పాటలు లేవు . కామెడీ కోసం సైడ్ క్యారెక్టర్లను దింపకపోవడం పెద్ద రిలీఫ్ . ఓవరాల్ గా మూవీలో ఇనప సామాన్ల ఎరుపు కాస్త తగ్గించి ఉంటే బాగుండేది .

ఎవరెలా చేసారు ?

ఈ సినిమాకి రచయిత , నిర్మాత , నటుడు , దర్శకుడే కాదు వన్ మ్యాన్ ఆర్మీ కూడా రవిబాబే. రుద్రప్రతాప్ పాత్రలో రవిబాబు ఒదిగిపోయాడు . తన పాత్ర పరిధిలో పర్ఫెక్ట్ నటన ప్రదర్శించాడు .

ఇక మిగిలినవాళ్లలో హోమ్ మినిష్టర్ పాత్రలో వీరన్న చౌదరి తేలిపోయాడు . క్యారక్టర్ తాలూకూ పెర్ఫార్మన్స్ చూపించడంలో కొన్నిచోట్ల తడబడ్డారు . బెనర్జీ ఎప్పటిలానే నటించాడు . తేజు పాత్రలో పాప హావభావాలు బాగా పలికించింది . ఆ పాపకు మంచి ఫ్యూచర్ ఉన్నట్టు కనిపిస్తుంది .

సాంకేతికత

భల్ల సత్యనారాయణ అందించిన సినిమాటోగ్రఫీ పర్లేదు .
రాజేష్ అందించిన సంగీతం కూడా యావరేజ్ గా ఉంది .
నిర్మాణ విలువలు పర్లేదు .

విశ్లేషణ

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలు తీయడంలో రవిబాబుకి ఓ బ్రాండ్ ఉంది . తనకంటూ కొంత ఆడియన్స్ బేస్ ఉంది . దానికి తోడు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ కూడా ఈ ప్రాజెక్టులో కలవడంతో సహజంగానే ఈ సినిమా మీద అంచనాలు ఉంటాయి .
అయితే ఈ మూవీ ద్వారా రవిబాబు యాక్షన్ హీరోగా తననితాను ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నారో ఏమో ? కథ మీద పెట్టాల్సిన ఫోకస్ ని ఫైటింగుల మీద పెట్టారు . ఫైటింగుల మీద ఫోకస్ పెడితే పెట్టారు మితిమీరిన హింస మీద ఫోకస్ పెట్టారు .
అంత హింస చూపించకుండా కూడా స్టోరీ లైన్ లాగొచ్చు . కానీ ఎందుకో రవిబాబుకి ఫైటింగుల్లో పూనకాలు వచ్చాయి

సీఎం మర్డర్ విజువల్స్ ని విష్ణు తెలివిగా పెన్ డ్రైవ్ లో దాచిపెట్టడం , రవిబాబు టీమ్ దాన్ని వెతికే పనిలో డీ కోడ్ చేయడం వంటి సన్నివేశాలతో కథ చకచకా పరుగులు పెడుతుంది . సెకండాఫ్ లో రవిబాబు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. ముగింపు మనం ఊహించిన విధంగానే ఉంటుంది కాబట్టి థ్రిల్ అవడానికి ఏమీ ఉండదు . ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న రవిబాబు రేజర్ మూవీని వన్ టైమ్ వాచ్ కింద చూడొచ్చు .

నటీనటులు : రవిబాబు , తనీష్ , బెనర్జీ తదితరులు
సంగీతం : రాజేష్
సినిమాటోగ్రఫీ : భల్ల సత్యనారాయణ
నిర్మాత : రవిబాబు , దగ్గుబాటి సురేష్
దర్శకత్వం : రవిబాబు
విడుదల : ఆహా ఓటిటి ( 19-06-2026 )
రేటింగ్ : 2 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!