సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలకు మలయాళం సినీ ఇండస్ట్రీ పెట్టింది పేరు . కానీ అప్పుడప్పుడు కామెడీ డ్రామా సినిమాలు తీసి కూడా మెప్పిస్తూ ఉంటారు . అతిరధి ( Athiradi movie ) మూవీ ఆ కోవలోకే వస్తుంది .
బాసిల్ జోసెఫ్ కధానాయకుడిగా లో బడ్జెట్ తో కాలేజీ బ్యాక్ డ్రాప్ తో సాగిన ఈ మూవీ మే 14 న థియేటర్లలో రిలీజ్ అయి మంచి వసూళ్లను సాధించి జూన్ 19 నుంచి సోని లివ్ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది .
ఓటిటిల ద్వారా బాసిల్ జోసెఫ్ తెలుగు ప్రేక్షకులకు కూడా చిరపరిచితుడు కావడం , కామెడీ డ్రామా జానర్ లో మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఓటిటిలో కూడా మంచి రేటింగ్ సాధించింది .
కధేంటంటే ?
మూవీ ప్రారంభమే ఇంజినీరింగ్ కాలేజీలో ఆరోహణ ఫెస్టివల్ తో మొదలౌతుంది . చదువు పూర్తిచేసుకుని వెళ్లిపోయే స్టూడెంట్లు ఫేర్ వెల్ పార్టీ చేసుకోవడం అన్ని కాలేజీల్లో ఉండేదే. అలాగే ఈ కాలేజీలో కూడా ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఆరోహణ పేరుతో కాలేజీ క్యాంపస్ లో కల్చరల్ ఈవెంట్స్ ప్లాన్ చేసుకుంటారు . ఉత్సాహంగా జరుగుతున్న ఈ ఫెస్టివల్ లో అనుకోని అపశృతి దొర్లి ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు చనిపోతారు . ఈ నింద ఫెస్టివల్ కన్వీనర్ అయిన జోసెఫ్ మీద పడుతుంది . దాంతో కాలేజీ యాజమాన్యం ఇకపై తమ కాలేజీలో ఆరోహణ ఫెస్టివల్ నిర్వహించకూడదని నిర్ణయం తీసుకుంటుంది .
కానీ కాలేజీ స్టూడెంట్లు అందరికీ మళ్ళీ ఆరోహణ ఫెస్టివల్ నిర్వహించుకోవాలని ఉంటుంది .
రెండేళ్ల తర్వాత జోసెఫ్ తమ్ముడు శ్యామ్ కుట్టి ( బాసిల్ జోసెఫ్ ) అదే కాలేజీలో ఇంజినీరింగ్ చేరతాడు . తన అన్న హయాంలో జరిగిన పొరపాటును సరిదిద్ది కాలేజీలో ఆరోహణ ఫెస్టివల్ చేయాలని నిర్ణయించుకుంటాడు .
మరి శ్యామ్ కుట్టి ప్రయత్నం ఫలిస్తుందా ?
ఈ ప్రయత్నంలో అతడికి అవరోధాలు కల్పించే తోట కుట్టన్ ఎవరు ?
కాలేజీ క్యాంపస్ లో ఎలాగైనా ఆరోహణ ఫెస్టివల్ నిర్వహించాలన్న శ్యామ్ కుట్టి చివరకు ఏం చేస్తాడు ? అనేది మిగిలిన కథ .
ఎలా ఉంది ?
కథ చదివారు కదా ..ఇందులో ప్రత్యేకంగా కథ కనిపించదు . కాలేజీలో చదువుకున్న ప్రతి స్టూడెంట్ అనుభవించిన జ్ఞాపకాలే కనిపిస్తాయి . కాలేజీ జీవితం కనిపిస్తుంది . కాలేజీ జీవితంలో చేసిన అల్లరి కనిపిస్తుంది . జూనియర్లు వచ్చినప్పుడు జరిగే వెల్కమ్ పార్టీలు , సీనియర్లు వెళ్లిపోయే సమయంలో జరిగే ఫేర్ వెల్ పార్టీలు కనిపిస్తాయి .
ఇంకోరకంగా చెప్పాలంటే దర్శకుడు ఐదేళ్ల ఇంజినీరింగ్ కాలేజీ జీవితం కళ్ళముందు ఉంచారు . అందుకే ఇందులో కథ కనిపించదు ..కధనం మాత్రమే కనిపిస్తుంది . అన్నచేయలేని పనిని దిగ్విజయంగా పూర్తిచేసిన తమ్ముడు కనిపిస్తాడు . అన్న మీద పడ్డ నిందను రూపుమాపడానికి తమ్ముడు చేసిన ప్రయత్నం కనిపిస్తుంది . ఈ ప్రయత్నంలో శ్యామ్ కుట్టి పడ్డ అవస్థలు , మిత్రుల సాయంతో వాటిని అధిగమించిన తీరు సీరియస్ గా కాకుండా సరదాగా చూపించారు .
ఈ మూవీలో మనకు బాసిల్ జోసెఫ్ కనిపించడు . సరదా సరదాగా అల్లరి చేస్తూ ఆశయసాధన కోసం తపన పడే కాలేజీ కుర్రోడు శ్యామ్ కుట్టి మాత్రమే కనిపిస్తాడు . అలా సరదాగా , అల్లరి చేస్తూ సాగిన శ్యామ్ కుట్టి ప్రయాణం చివరలో ఆరోహణ ఫెస్టివల్ నిర్వహించి హీరో అవడంతో ముగుస్తుంది .
ఫస్టాఫ్ లో ఓపెనింగ్ సీన్ మినహా బాసిల్ జోసెఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరడం , ల్యాబ్ లో సివిల్ ఇంజినీరింగ్ ప్రయోగాలు చేయడం , మిత్రులతో కలిసి ఆరోహణ ఫెస్టివల్ నిర్వహించటానికి ప్లాన్ వేయడం , ఎమోషనల్ గా ఓల్డ్ స్టూడెంట్స్ పేరెంట్స్ ను కూడా ఆరోహణ ఫెస్టివల్ కు ఒప్పించడం వంటి సన్నివేశాలతో కధనం హుషారుగా పరుగులు పెడుతుంది .
ఎలాగైతేనేమి కాలేజీ యాజమాన్యాన్ని ఫెస్టివల్ ఏర్పాటుకు ఒప్పించిన తర్వాత తోట కుట్టన్ ( టోవినో థామస్) రూపంలో అతడికి కష్టాలు మొదలౌతాయి . తోట కుట్టన్ రాక ఒకరకంగా కధకు మలుపు అవుతుంది . ఇంకో రకంగా కాలేజీకి సంబంధం లేని పాత్రను ఇరికించినట్టు అవుతుంది . అప్పటిదాకా కాలేజీ స్టూడెంట్ల మధ్య నడిచిన కథ తోట కుట్టన్ వెర్సస్ శ్యామ్ కుట్టిగా మారిపోయింది .
సెకండాఫ్ లో బాసిల్ జోసెఫ్ కన్నా తోట కుట్టన్ రోల్ ఎక్కువగా నడుస్తుంది . సింగర్ గా ఇంట్రడక్షన్ ఇచ్చిన తోట కుట్టన్ ఫ్లాష్ బ్యాక్ లో గూండా అవడం , కాలేజీలో జరగబోయే ఆరోహణ ఫెస్టివల్ ను అడ్డుకుని తన స్టేజ్ ప్రోగ్రాములను ప్రమోట్ చేసుకోవడం కోసం బాసిల్ జోసెఫ్ తో గొడవ పడటం , కాలేజీలో పాడటానికి వచ్చిన సింగర్ ను కిడ్నాప్ చేయడం , పోలీసులను కొట్టడం వంటి సన్నివేశాలతో అనవసరమైన డ్రామా ఇరికించినట్టు అయ్యింది . అతడి క్యారక్టర్ ఒక్కో సన్నివేశంలో కామెడీ పీస్ గా కనిపిస్తుంది . ఒక్కో సన్నివేశంలో డాన్ మాదిరి కనిపిస్తుంది . దాంతో అతడిద్వారా లేనిపోని కామెడీలకు ప్రయత్నించడం ఎబ్బెట్టుగా ఉంటుంది . ఇంకా అతడికన్నా బాసిల్ జోసెఫ్ తో చేయించిన కామెడీ సహజంగా ఉంది .
దర్శకుడు తోట కుట్టన్ పాత్ర కోసం సెకండాఫ్ లో సాగతీత సన్నివేశాలను ఎంచుకున్నట్టు ఉంది . దాంతో అక్కడక్కడా మనకు కొంచం బోర్ ఫీల్ వస్తుంది . తిరిగి ప్రీ క్లైమాక్సుతో కధనం పుంజుకుంటుంది . కాలేజీ క్యాంపస్ లో ఫెస్టివల్ మొదలవడం , ప్రోగ్రాం లో పాడాల్సిన సింగర్ వినీత్ శ్రీనివాసన్ ను తోట కుట్టన్ కిడ్నాప్ చేయడం , మిత్రులతో కలిసి బాసిల్ జోసెఫ్ సింగర్ వినీత్ ను విడిపించి కాలేజీకి తీసుకొచ్చి పాడించడం వంటి సన్నివేశాలతో కధనం ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది . క్లైమాక్సులో మాత్రం ఎమోషనల్ టచ్ తో ముగించడం బాగుంది .
ఎవరెలా చేసారు ?
సినిమా మొత్తంలో ఇద్దరే లీడ్ రోల్ పోషించారు . వారిలో మొదటివాడు శ్యామ్ పాత్ర పోషించిన బాసిల్ జోసెఫ్ . కాలేజీ కుర్రోడి బాడీ లాంగ్వేజ్ లో బాసిల్ జోసెఫ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు . ఈ మూవీలో ఎక్కడా అతడి హీరోయిజం కనిపించదు . ఒక మాములు స్టూడెంట్ ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు . గాల్లోకి ఎగిరి ఫైటింగులు చేయడాలు , హీరోయిన్ తో డ్యూయెట్లు పాడుకోవడాలు ఉండవు . ఒక్క క్లైమాక్సులోనే మనకు బాసిల్ జోసెఫ్ లో హీరో కనిపిస్తాడు . తనమీద తనకు అంత నమ్మకం ఉండబట్టే బాసిల్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి ఉంటాడు .
ఇక రెండో పాత్ర తోట కుట్టన్ . ఈ పాత్రలో టోవినో థామస్ ఒదిగిపోయాడు . కాకపోతే దర్శకుడు ఇతడి పాత్రను మరింత జాగ్రత్తగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది . సింగర్ గా ఎంట్రీ ఇచ్చిన వినీత్ శ్రీనివాసన్ క్లైమాక్స్ సన్నివేశంలో మెప్పించాడు . స్వాతి పాత్రలో హీరోయిన్ రియా శిబును ఎంచుకున్నారు కానీ ఆమె పాత్రను దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు అనిపిస్తుంది . ఇక మిగిలిన పాత్రలకు పెద్దగా స్కోప్ లేదు .
సాంకేతికత
విష్ణు విజయ్ అందించిన సంగీతం బాగానే ఉంది .
సామ్యూల్ సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు .
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి .
విశ్లేషణ
కామెడీ డ్రామా జానర్ ఇష్టపడేవాళ్ళకి అతిరథి మూవీ నచ్చుతుంది . అందులోనూ బాసిల్ జోసెఫ్ కామెడీ టైమింగ్ తెలిసినవాళ్ళకి ఇంకా నచ్చుతుంది . ఇందులో కథ కన్నా కథనానికి ఎక్కువ మార్కులు పడతాయి . అనవసరమైన హీరోయిజాలకు పోకుండా దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని చాలా సహజంగా నడిపించాడు . ఫస్టాఫ్ బాసిల్ మార్క్ కామెడీతో సరదాగా నడిచిపోతుంది . సెకండాఫ్ లో మాత్రం మనకు కొన్ని సాగతీత సన్నివేశాలు ఎదురై విసిగిస్తాయి . కాలేజీలో సంబంధం లేకుండా తోట కుట్టన్ అనే బయటివ్యక్తితో కథ నడపడం సరిగా సింక్ కాదు . తోట కుట్టన్ పక్కన తిరిగే రౌడీల అతి కూడా ఎక్కువైనట్టు అనిపిస్తుంది . తిరిగి కైమాక్స్ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి .
ఓవరాల్ గా ఈ మూవీ ఒక ఫ్లోలో సాగిపోతుంది . నేటి జెనెరేషన్ యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు . సోని లివ్ ఓటిటిలో తెలుగులో కూడా అందుబాటులో ఉందికాబట్టి ఓ లుక్ వేయొచ్చు .
నటీనటులు : బాసిల్ జోసెఫ్ , టోవినో థామస్ , వినీత్ శ్రీనివాసన్ , రియా శిబూ తదితరులు
సంగీతం : విష్ణు విజయ్
సినిమాటోగ్రఫీ : సామ్యూల్
నిర్మాత : బాసిల్ జోసెఫ్ , అనంతు
దర్శకత్వం : అరుణ్ అనిరుధన్
విడుదల : సోని లివ్ ఓటిటి ( 19-06-2026 )
రేటింగ్ : 2.75 / 5
