Ankam Attahasam Movie Review – ఓటిటిలోకి వచ్చిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ అంకం అట్టహాసం ఎలా ఉందంటే?

Spread the love

ఓటీటీలోకి మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ అంకం అట్టహాసం (Ankam Attahasam Movie) స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా ఆగస్టు 28, 2026 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఒరిజినల్ మలయాళం వెర్షన్ లోనే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీని చూడాల్సి ఉంటుంది.
ఇప్పుడు అంకం అట్టహాసం మూవీ ఎలా ఉందో చూద్దాం.

కధేంటంటే?

కేరళ తిరువంతపురానికి చెందిన అజయ్ ( మాధవ్ సురేష్) అలన్ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే వీరి ప్రేమ అలన్ తండ్రికి ఇష్టం ఉండదు. అందుకే ఎలాగైనా అజయ్ ను బెదిరించి తన కూతురు నుంచి అతడు దూరంగా వెళ్ళేటట్లు చేయమని గ్యాంగ్ స్టర్ కాకా సైజు (సైజు కురుప్) సాయం కోరతాడు.

అలన్ తండ్రి కోరిక ప్రకారం కాకా సైజు తన గ్యాంగుతో కలిసి అజయ్ ను కిడ్నాప్ చేసి అలన్ కు దూరంగా వెళ్ళిపొమ్మని బెదిరిస్తాడు. కాకా సైజు బెదిరింపులతో భయపడిపోయిన అజయ్ తండ్రి కొడుకుని కొన్నాళ్ళు ఈ గొడవలకు దూరంగా బెంగుళూరు వెళ్ళిపొమ్మని ఇంటినుంచి పంపేస్తాడు.

అయితే ఈ పరిస్థితుల్లో అజయ్ ప్రేమించిన అలన్ ను ఎవరో హత్య చేయడంతో అజయ్ తిరిగి తిరువనంతపురం వస్తాడు. తన ప్రియురాలి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని శివన్ గ్యాంగుతో కలుస్తాడు.

ఇంతకీ అలన్ ను హత్య చేసింది ఎవరు?
కాకా సైజు గ్యాంగును అజయ్ ఎలా ఎదుర్కుంటాడు?
అజయ్ కు సాయం చేయడానికి ముందుకు వచ్చిన శివన్ ఎవరు?
ఈ గ్యాంగ్ వార్ లో ఎంటర్ అయిన డేవిడ్ అలియాస్ అలెగ్జాండర్ అసలు స్వరూపం ఏంటి? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా అనగానే ఊపిరి బిగపట్టే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లు, గంటకో ట్విస్టుతో సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే స్క్రీన్ ప్లే ఆశిస్తాం. ఈ సినిమాలో కూడా అలా ఆశిస్తే డిజప్పాయింట్ అవుతారు. ఇదొక రొటీన్ రివెంజ్ ఫార్మాట్లో రాసుకున్న క్రైమ్ స్టోరీ. ప్రేమ.. పగ.. ప్రతీకారం చుట్టూ కథ అల్లుకుని రెండు గంటల పాటు కథనాన్ని నడిపిన ఫక్తు రొటీన్ కమర్షియల్ మూవీ.

అంకం అట్టహాసం మూవీలో ప్రేక్షకులు ఆశించే అట్టహాసాలు ఏవీ ఉండవు. క్రైమ్ థ్రిల్లర్ మూవీల్లో ఉండే ఉత్కంఠభరితమైన పోలీస్ ఇన్వెస్టిగేషన్లు ఏమీ ఉండవు. ఇప్పటిదాకా మనం బోలెడు సినిమాల్లో చూసేసిన పోలీస్ అండర్ కవర్ ఆపరేషన్ మళ్ళీ చూపటంతో కొత్తదనం ఏమీ అనిపించదు.

ఈ సినిమా కోసం దర్శకుడు రాసుకున్న కథ కొత్తదేమీ కాదు. పాత చింతకాయ పచ్చడే. కనీసం ఆ పాత చింతకాయ పచ్చడికే కొద్దిగా ఇంగువ పోపు వేసి తిరగమాత పెట్టి ఉంటే ఎలా ఉండేదో తెలీదు కానీ ఈ సినిమాలో అలాంటి పోపు కూడా వేయకపోవడంతో ఫ్లేవర్ కూడా లేకుండా పోయింది.

దర్శకుడు సినిమాని లవ్ ట్రాక్ మొదలుపెట్టి గ్యాంగ్ వార్ తో ముగించారు. సరే, కథ ఎలాగూ పాతదే.. కనీసం కట్టిపడేసే కథనం అన్నా ఉంటే బాగుండేది. గ్యాంగ్ వార్ నేపథ్యంలో సాగే కథనాన్ని నడపడంలో కూడా దర్శకుడు తడబడ్డాడు.

కేరళలో పోలీసులను సైతం గడగడా వణికించే మాఫియా డాన్ కాకా సైజు అంటూ టైటిల్స్ లోనే పావుగంట సేపు భారీ ఎలివేషన్ ఇచ్చిన దర్శకుడు సగంలోనే ఆ పాత్రను ముగించి గాలి తీసేశారు. కాకా సైజు పాత్రకు ఇచ్చిన బిల్డప్ కి.. ఆ పాత్రని ముగించిన తీరుకీ సింక్ కాలేదు. ఇక్కడే దర్శకుడు మొదటి పొరపాటు చేశారు. పోనీ ఈ పొరపాటు గ్రహించి తర్వాత శివన్ పాత్రకైనా న్యాయం చేశారా? అంటే అక్కడా ఇదే పరిస్థితి.

ఇక ఫస్టాఫ్ లో అలన్ ను ఎవరు చంపారు? అనే సస్పెన్స్ క్రియేట్ చేసిన దర్శకుడు సెకండాఫ్ లోకి వచ్చేసరికి మనం ఊహించిన విధంగానే అలన్ హంతకుడి గురించి రివీల్ చేయడంతో అస్సలు థ్రిల్ పంచకపోగా ఈ మాత్రం దానికి ఇంత కథ నడిపారా? అని విసుగు కూడా వస్తుంది.

రొటీన్ రివెంజ్ ఫార్మాట్లో సాగిపోతున్న కథనంలో ట్విస్టులు ఉండకపోతే బాగోదని అనుకున్నారో ఏమో కానీ ప్రీ క్లైమాక్స్ లో అలెగ్జాండర్ అనే పాత్రను దింపారు. సదరు అలెగ్జాండర్ అలియాస్ డేవిడ్ పాత్ర ద్వారా క్లైమాక్సులో అందర్నీ ఒకేసారి సర్ప్రైజ్ చేయాలని దర్శకుడు గట్టి ప్రయత్నమే చేశారు కానీ సీన్ పండలేదు. ఇక అలెగ్జాండర్ ఎవరో తెలిసిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలుసు కాబట్టి ముగింపు పెద్దగా ఆకట్టుకోదు.

అండర్ కవర్ ఆపరేషన్ కోసం పోలీసులకు అజయ్ అవసరమేంటో సరిగా ఎస్టాబ్లిష్ కాలేదు. ఇంతా చేసి గ్యాంగ్ స్టర్ లను పోలీస్ ఆఫీసరే మట్టుపెడతాడు. కాబట్టి పోలీస్ అండర్ కవర్ ఆపరేషన్ ఎపిసోడ్ కూడా సరిగా ఎస్టాబ్లిష్ అవలేదు.

ఓవరాల్ గా ఫస్టాఫ్ లో హీరో లవ్ ట్రాక్.. ఫ్యామిలీ.. ఫ్రస్టేషన్ చుట్టూ కథనాన్ని నడిపిన దర్శకుడు సెకండాఫ్ నుంచి పగ ..ప్రతీకారం.. గ్యాంగ్ వార్ .. ఇలా పక్కా రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లో కథనాన్ని రన్ చేసుకుంటూ పోయాడు. సినిమాలో తర్వాత ఏం జరగబోతుందో అనేది ప్రిడిక్టబుల్ గా ఉండటంతో ఆడియన్స్ ను పెద్దగా ఎంగేజ్ చేయదు.

ఎవరెలా చేశారు?

అజయ్ పాత్రలో మాధవ్ సురేష్ నటన బాగానే ఉంది. తన పాత్ర కోసం అతడు బాగానే కష్టపడినట్టు అనిపిస్తుంది.
కాకా సైజ్ పాత్రలో సైజ్ కురుప్ నటనలో పెద్దగా మెరుపులు లేవు. బహుశా దర్శకుడు ఆ పాత్రని సరిగా డిజైన్ చేయలేకపోవడం వల్ల అయ్యుంటుంది.
మిగిలిన వాళ్ళు తమ పాత్ర పరిధిలో నటించారు.

సాంకేతికత

శ్రీ కుమార్ వాసుదేవ్ అందించిన సంగీతం పర్లేదు.
శివన్ సంగీత్ అందించిన ఫోటోగ్రఫీ కూడా యావరేజ్ అనే చెప్పాలి. మలయాళం సినిమాల్లో ఉండే గ్రీనరీ క్యాప్చరింగ్ పెద్దగా లేదు.
నిర్మాణ విలువలు పర్లేదు.

విశ్లేషణ

మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే మనకొక క్రేజ్ ఉంటుంది. ఊపిరి బిగబట్టే సన్నివేశాలు.. ఉత్కంఠత రేకెత్తించే స్క్రీన్ ప్లే.. ఊహించని ట్విస్టులు.. ఇందులో కనిపించవు. అవి కనిపించకపోతే మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఉండే ఆత్మ మాయం అయినట్టే.

ఈ సినిమాలో జరిగింది అదే. ప్రారంభంలో అలన్ మర్డర్ సినిమా మీద ఆసక్తి కలిగించినప్పటికీ కథ దానికి కొనసాగింపుగా లేకుండా సైడ్ ట్రాక్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. పోర్ట్ కంటైనర్ వేలం పాటలు .. ఇంటర్నేషనల్ మాఫియా లెవెల్లో హైప్ ఇవ్వడాలు కధనాన్ని సాగతీయడానికి పనికొస్తాయే కానీ కథను రన్ చేయడానికి పెద్దగా అవసరం లేదు.

ఫస్టాఫ్ లో కనిపించిన హీరో ఫ్యామిలీ చివరికి ఏమైపోయారో తెలీదు. అందుకే ఫ్యామిలీ ఎమోషన్స్ పూర్తిస్థాయిలో పండలేదు. ఎంతసేపూ హీరో సంఘర్షణ పడతాడే కానీ కధలో సంఘర్షణ కనిపించదు. ఒక్కోసారి హీరో ఎలివేషన్లు చూస్తుంటే ఎప్పుడో తొంబైల్లో రామ్ గోపాల్ వర్మ తీసిన శివ సినిమా గుర్తుకువస్తుంది. శివలో నయం ..కనీసం నాగార్జున చుట్టూ పదిమంది స్నేహితులు ఉంటారు. కానీ ఈ మూవీలో మాత్రం హీరోగారికి కేవలం ఇద్దరంటే ఇద్దరే స్నేహితులు ఉంటారు. ఆ ఇద్దరినే తన అనుచరులుగా చేసుకుని హీరోగారు కేరళ డాన్ అవుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలోనే మనకు నాలుగైదు సినిమాలు కనిపిస్తాయి.

అందుకే అవేమీ ఎక్స్పెక్ట్ చేయకుండా రొటీన్ కమర్షియల్ మూవీ చూస్తున్నామనుకుని అనుకుని చూస్తే పెద్దగా డిజప్పాయింట్ అవరు.
కాకపోతే ఈ సినిమా చూడాలనుకునేవారు సన్ నెక్స్ట్ ఓటిటిలో ఒరిజినల్ మలయాళం వెర్షన్ లోనే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాల్సి ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీలు ఇష్టపడేవారు వన్ టైమ్ వాచ్ మూవీ కింద ఓ లుక్కేయండి.

నటీనటులు: మాధవ్ సురేష్, సైజు కురుప్, అంబిక, తదితరులు
సంగీతం: శ్రీ కుమార్ వాసుదేవ్
సినిమాటోగ్రఫీ: శివన్ సంగీత్
నిర్మాత: అనిల్ కుమార్
దర్శకత్వం: సుజిత్ నాయర్
ఓటిటి : సన్ నెక్స్ట్
విడుదల: ఆగస్టు 28, 2026
రేటింగ్: 2/5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *