వంగవీటి మోహన రంగా పోరాట పంథాని గుర్తుకు తెస్తున్న వారసురాలు ఆశాకిరణ్!

Spread the love


“సార్! ఈ కుర్రాళ్ళని వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేయకపోతే ధర్నా చేయడానికి వంగవీటి మోహన రంగా స్వయంగా ఇక్కడికి రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సర్ ” నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ చెప్పాడు కానిస్టేబుల్.

“అయితే? ఏంటయ్యా? రంగా వస్తున్నాడని కుర్రాళ్ళని వదిలేసి పారిపోవాలా?” అసహనంగా విసుక్కున్నాడు కొత్తగా వచ్చిన ఎస్సై

” సార్! రంగా బయలుదేరితే ఒక్కడు రాడు సార్..ఆయన వెంట జనం వస్తారు సార్”

“ఎంతమంది వస్తారయ్యా? పది మందా? ఇరవై మందా?”

“పది మంది.. ఇరవై మంది కాదు సార్.. ఆయన ధర్నా చేస్తే పది నుంచి ఇరవై లారీల జనం వస్తారు సార్.. జనాల్ని ఆపటానికి మన ఫోర్స్ సరిపోదు సార్” టెన్షన్ గా చెప్పాడు కానిస్టేబుల్.

“వాట్.. రంగా బయలుదేరితే జనం లారీల్లో వస్తారా? ఎక్కడ్నుంచి వస్తారయ్యా? అంతమంది జనాలు? ఆశ్చర్యంగా అడిగాడు కొత్త ఎస్సై.

“చెప్పలేం సార్.. లంక గ్రామాల నుంచి కావొచ్చు.. గోదావరి జిల్లాల నుంచి కావొచ్చు..ఇంకెక్కడుంచైనా రావొచ్చు సార్..లారీలు..ట్రాక్టర్లు.. జీపులు ఏది దొరికితే అవి పట్టుకుని జనాలు వచ్చేస్తారు సార్”

ఈ సంభాషణ జరుగుతుండగానే స్టేషన్ ల్యాండ్ లైన్ ఫోన్ మోగింది
ఫోన్ కాల్ అటెండ్ అయిన రైటర్ ఎస్సై దగ్గరికి వచ్చి మెల్లిగా చెప్పాడు.

“సార్! రంగా మన స్టేషన్లో ధర్నా చేయడానికి వస్తున్నారని జనాలకు తెలిసిపోయింది.. ఇప్పుడే నాగాయలంక నుంచి రెండు లారీల్లో జనాలు బయలుదేరారని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్”

షాక్ అయినట్టు చూసాడు ఎస్సై
ఇంకా రంగా బయలుదేరకుండానే ఊళ్ళ నుంచి జనాలు లారీల్లో బయలుదేరారు
మరి రంగా ఇంటి నుంచి బయలుదేరితే?
స్టేషన్ కి తీసుకొచ్చిన ఒక కాలేజీ కుర్రాడి కోసం రంగా ఇంతలా రియాక్ట్ అవుతాడా?
ఆయన నడుపుతున్న విద్యార్ది సంస్థ యు ఐ తరపున పనిచేస్తున్న ఒక కుర్రాడి కోసం జ్వరాన్ని కూడా లెక్కచేయకుండా స్వయంగా స్టేషన్ కి బయలుదేరడం ఏంటి?
ఆయన బయలుదేరుతుంటే ఊళ్ళ నుంచి జనాలు బయలుదేరడం ఏంటి?
ఒక మామూలు వ్యక్తికి ఇంత నెట్ వర్క్ ఎక్కడిది?
ఇంకొకళ్ళైతే ఏ లాయర్నో.. ద్వితీయ శ్రేణి నాయకుడినో స్టేషన్ కి పంపి ఫార్మాలిటీస్ పూర్తి చేసి కుర్రాళ్ళని విడిపించుకుపోతారు. కానీ ఈయనేంటి? ఒక కుర్రాడి కోసం స్వయంగా బయలుదేరుతున్నాడు? రంగా గురించి నేను విన్నది నిజమేనా? రంగా వెనుక ఇంతమంది జనం ఉన్నారా? అసలు రంగా ఇంతమంది అభిమానం ఎలా సంపాదించుకోగలిగాడు?

అదే ప్రశ్న కానిస్టేబుల్ ను అడిగాడు
“సార్! మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది.. మనం రోజూ చూస్తునే ఉంటాం కద సార్.. ఎవర్నైనా పొలిటికల్ పార్టీ కార్యకర్తలను స్టేషన్ కి తీసుకొస్తే ఆ పార్టీ నాయకులు మనకి ఫోన్ చేసి వాళ్ళని విడిచిపెట్టమని రిక్వెస్ట్ చేయడమో.. లేకపోతే వాళ్ళ లాయర్ను పంపాటమో చేస్తారు. కానీ రంగా అలా కాదు సార్.. కావాలంటే తను జైలుకు వెళ్తాడు కానీ తనను నమ్ముకున్న కాలేజీ కుర్రాళ్ళ మీద కానీ తన అనుచరుల మీద కానీ ఈగ వాలనివ్వరు. వెంటనే రియాక్ట్ అవుతారు. ఆయన రియాక్షన్ కూడా చాలా బలంగా ఉంటుంది. ఆయన రంగంలోకి దిగితే అడుగు ముందుకే పడుతుంది కానీ ఒక్క అడుగు కూడా వెనక్కి పడదు. అందుకే రంగా వెనక అంతమంది జనం ఉన్నారు సార్ “

“అది సరే.. రంగా వెనుక తిరిగే కుర్రాళ్లందరినీ లోనెయ్యమని పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి కదా.. ఇప్పుడేం చేద్దామంటావ్?”

“సార్! వాళ్ళదేముంది సార్.. ఇక్కడ ఏదైనా జరగరానిది జరిగితే పోయేది మన ఉద్యోగాలే కదా? అంతెందుకు సార్.. ఒక రిక్షా కార్మికుడు పోలీస్ లాకప్ లో చనిపోతే ఇదే రంగా అతడి శవాన్ని తీసుకుని సాక్షాత్తు హోమ్ మినిస్టర్ దగ్గరికే పోయి ప్రశ్నించాడు. అప్పుడు మన పై అధికారులు కూడా రంగాను ఆపలేకపోయారు. ఆ రోజు హోమ్ మినిస్టర్ కే సెక్యూరిటీ కల్పించలేక మన డిపార్ట్మెంట్ తల్లకిందులు అయ్యింది.. అందుకే వదిలేద్దాం సార్.. రంగా ఇక్కడికి వచ్చేలోపు ఈ కుర్రాళ్ళని వదిలేద్దాం.. నిజానికి వీళ్ళని లోన వేసేంత కేసు కూడా ఏమీ లేదు”


ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకున్నాడు ఎస్సై. ఇంతలో వంగవీటి మోహన రంగా తన అనుచరులతో పోలీస్ స్టేషన్ కి రావడం.. ఆయన వెనక జనం రావడం చకచకా జరిగిపోయాయి.

పోలీస్ అధికారులకు పరిస్థితి అర్థమైపోయింది
వెంటనే ఆ కుర్రాళ్ళని వదిలేసి జనాల్ని అక్కడ్నుంచి డిస్పర్స్ చేసేయమని ఎస్సైకి ఫోన్ చేసి చెప్పారు.

ఏంటీ ఇదంతా సినిమా స్టోరీ అనుకుంటున్నారా ? కానే కాదు.. ఎనబైయ్యవ దశకంలో విజయవాడలో నిజంగా జరిగిన సంఘటనే. అయితే ఒకట్రెండు సంభాషణలు సినిమాటిక్ గా రాయడం జరిగింది. పోలీసులు యు ఐ విద్యార్థులను అరెస్ట్ చేయడం నిజమే.. ఆ కుర్రాళ్లను విడిపించడానికి 102 జ్వరంలో వంగవీటి మోహన రంగా పోలీస్ స్టేషన్ కు బయలుదేరడం నిజమే.. ఊళ్ళనుంచి జనం లారీల్లో విజయవాడ బయలుదేరడం కూడా నిజమే.

ఇప్పుడిదంతా ఎందుకంటే నిన్న తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో పోలీసులు తన తండ్రి విగ్రహాన్ని తొలగించారని తెలుసుకుని వంగవీటి మోహన రంగా వారసురాలు ఆశాకిరణ్ అక్కడికి చేరుకుని పోలీసులను ప్రశ్నించిన విధానం ఒకప్పుడు పోలీసులను ఆమె తండ్రి ప్రశ్నించిన విధానాన్ని గుర్తుకు తెస్తుంది.

చుట్టూ వందలాది పోలీసులు.. అయినా ఆశాకిరణ్ భయపడలేదు. ధైర్యంగా ఆ పోలీసులనే ప్రశ్నించింది. తన తండ్రి విగ్రహాన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది? తొలగించిన విగ్రహాన్ని పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందని నిలదీసింది. పోలీసుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తన తండ్రి విగ్రహాన్ని తిరిగి తనకు అప్పగించేంత వరకు అక్కడే కూర్చుంటానని నడి రోడ్డు మీదే కూర్చుని ధర్నా చేసింది.

వెంటనే పోలీసులు తమ లాఠీలకు పని అప్పచెప్పారు. భారీగా చేరుకున్న కార్యకర్తలను చెల్లాచెదురు చేశారు. ఆశాకిరణ్ ముఖ్య అనుచరులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లడం మొదలుపెట్టారు.

కార్యకర్తల విషయంలో ఒక్కో నాయకుడి స్పందన ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమంది కార్యకర్తలను గాల్లో వదిలేసి ధర్నా కార్యక్రమాలను తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకుంటారు. తమకు రావాల్సిన మీడియా కవరేజ్ వచ్చాక నిదానంగా అక్కడ్నుంచి తప్పుకుంటారు. కొంతమంది మాత్రమే నమ్ముకున్న కార్యకర్తలకు తమ ప్రాణాలు అడ్డు వేసి కాపాడుకుంటారు. వంగవీటి మోహన రంగా ఆ కోవలోకే వస్తారు. నిన్న ఉండ్రాజవరంలో ఆశాకిరణ్ ధర్నా కార్యక్రమం టీవీల్లో చూసిన చాలామందికి ఆమెలో కూడా వంగవీటి రంగా పోరాట పంధా గుర్తుకు వస్తుంది. తన అనుచరుడ్ని పోలీసులు ఈడ్చుకెళ్తుంటే శివంగిలా తిరగబడింది. లాఠీ దెబ్బ పడాలంటే ముందు తన మీదే పడాలని పోలీసులకు ఎదురెళ్లి నిలిచింది. కార్యకర్తల ఒంటి మీద ఒక్క లాఠీ దెబ్బ పడినా ఊరుకునేది లేదని గర్జించింది.

ఉండ్రాజవరం ఘటనలో ఆశాకిరణ్ వీడియోలు చూసిన ఎవరికైనా ఆమె తండ్రి వంగవీటి మోహన రంగా గుర్తుకురాక మానరు. రంగా అభిమానులు ఆయన వారసుల నుంచి కోరుకునేది ఇటువంటి నాయకత్వాన్నే. ఏడాది క్రితం రంగా వారసురాలిగా తెర మీదకి వచ్చిన ఆశాకిరణ్ మెల్లి మెల్లిగా తండ్రి పోరాట పంథాని పుణికిపుచ్చుకుని ముందుకు సాగుతుండటంతో అభిమానుల్లో తిరిగి సరికొత్త జోష్ వస్తుంది.

ఉండ్రావజవరంలో మీడియాతో ఆశాకిరణ్ మాట్లాడిన మాటలు ఆమెలోని పరిణితిని తెలియచేసింది.
తాను ఇక్కడికి గొడవలు చేయడానికి రాలేదని.. తన తండ్రి విగ్రహాన్ని తనకు ఇచ్చేస్తే వెళ్ళిపోతానని చెప్పారు. పోలీసులకు అది కేవలం రాతి విగ్రహం కావొచ్చు.. కానీ మాకు దేవుడితో సమానం. అందుకే మా దేవుడ్ని మాకు అప్పగిస్తే వెంటనే ఇక్కడనుంచి వెళ్ళిపోతాం. అలా కాకుండా మొండి పట్టుదలలకు.. రాజకీయాలు చేస్తే అవతలి వాళ్ళు ఏ పార్టీ అయినా సరే ఊరుకునేది లేదని తేల్చి చెప్పేశారు.

ఆశాకిరణ్ కేవలం రంగా విగ్రహాల ఆవిష్కరణలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యల మీద జనంలోకి రావడం కూడా మొదలు పెట్టారు. విజయవాడ బీసెంట్ రోడ్ హాకర్ల విషయంలో ఆశాకిరణ్ వాళ్లకు అండగా నిలబడతానని ముందుకు రావడంతో చిరు వ్యాపారులు కష్టకాలంలో తమను ఆదుకున్న రంగాని మరోసారి గుర్తు చేసుకున్నారు.

ఏది ఏమైనా ఉండ్రాజవరం సంఘటనలో ఆశాకిరణ్ పోరాట పటిమను చూసిన వంగవీటి మోహన రంగా అభిమానులు ఇకముందు కూడా ఆమె ఇలాగే రంగాని నమ్ముకున్న కార్యకర్తలు, అనుచరులకు అండగా నిలబడాలని కోరుకుంటున్నారు.


Spread the love

One thought on “వంగవీటి మోహన రంగా పోరాట పంథాని గుర్తుకు తెస్తున్న వారసురాలు ఆశాకిరణ్!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *