హైద్రాబాదు చుట్టుపక్కల చూడాల్సిన అందమైన ప్రదేశాలు , అద్భుతమైన దేవాలయాలు చాలా ఉన్నాయి . కొన్ని సరైన ప్రచారం లేక వెనుకబడి ఉన్నాయి . కానీ వీటి గురించి తెలుసుకున్నవాళ్ళు మాత్రం వీకెండ్స్ ప్లాన్ చేసుకుంటున్నారు .
కిందటివారం స్వర్ణగిరి శ్రీవెంకటేశ్వర దేవాలయం ట్రిప్ గురించి రాసాను కదా .. ఈ ఆదివారం కమల్ ధామం ప్లాన్ చేసుకున్నాం . ఆ విశేషాలను రచ్చబండ కబుర్లు పాఠకుల కోసం ఇక్కడ పంచుకుంటున్నాను .
కమల్ ధామం మందిర్ ( lotus Temple ) ఎక్కడ ఉంది ?
హైద్రాబాదు నుంచి చేవెళ్ల వెళ్లే మార్గంలో చిలుకూరు బాలాజీ దేవాలయానికి షుమారు 3 కిలోమీటర్ల దూరంలో ప్రధాన రహదారికి అనుకునే ఈ అద్భుతమైన కమల్ ధామం మందిరం కనిపిస్తుంది . మీరు హైద్రాబాదు నుంచి వికారాబాద్ – చేవెళ్ల రహదారిలో వెళ్తుంటే ఎడమవైపు లోటస్ ఆకారంలో మందిర్ కనిపిస్తుంది . దానికి అనుకునే స్వామి రామ్ నారాయణ్ గురుకుల విద్యాసంస్థలు కనిపిస్తాయి . ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కమల్ ధామం స్వామి రామ్ నారాయణ్ ట్రస్ట్ వారిచే నిర్వహించబడుతుంది .
మందిర్ ప్రాంగణంలో ఏముంది ?
హైవే మీద వెళ్ళేవాళ్ళు వాహనాలు పార్క్ చేసుకోవడానికి మందిర్ ప్రాంగణంలో ప్రత్యేకంగా పార్కింగ్ ఏరియా లేదు . కాబట్టి వాహనాలను హైవేకు అనుకుని ఉన్న కాంపౌండ్ వాల్ గేట్ బయటనే పార్క్ చేసుకోవాల్సి వస్తుంది . అక్కడ్నుంచి మనం మెయిన్ గేట్ ద్వారా మందిర్ ప్రాంగణంలోకి రాగానే ఎదురుగా లోటస్ ఆకారంలో కమల్ ధామం అనే అక్షరాలతో కూడిన పెద్ద చిహ్నం కనిపిస్తుంది . పూర్తిగా మార్బుల్ రాతితో చేయబడిన మందిర్ గుమ్మడం కనిపిస్తుంది . ఆ మందిర్ చేరుకోవడానికి షుమారు ఒక పది మెట్లు ఎక్కాల్సి ఉంటుంది . కింద ఇరువైపులా కలశం ఆకారంలో రెండు ఉపాలయాలు కనిపిస్తాయి . ఒకవైపున శ్రీవెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉంటుంది . మరోవైపున స్వామి నారాయణ్ విగ్రహం ఉంటుంది .
గోశాల
అక్కడ దర్శనాలు చేసుకుని వెంకటేశ్వర స్వామి వారి ఉపాలయం మీదుగా ముందుకు వెళ్తే గోశాల కనిపిస్తుంది . గోవులకు ప్రత్యేకంగా ఆహారం సమర్పిద్దామనుకునేవారు , గోపూజ చేద్దామనుకునేవారు అక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది . దానికి పక్కనే హోమ గుండం , గణపతి విగ్రహంతో కూడిన మందిరం కూడా ఉంటుంది . అక్కడ్నుంచి చూస్తే పక్కనే ఉన్న స్వామి నారాయణ్ గురుకుల విద్యాసంస్థల సముదాయం కనిపిస్తుంది .
స్నాక్స్ కౌంటర్లు – చిల్డ్రన్స్ పార్క్
అక్కడ్నుంచి ముందుకు వెళ్తే దూరప్రాంతాల నుంచి వచ్చే వారికోసం స్నాక్స్ కౌంటర్లు ఏర్పాటు చేసారు . బహుశా ఇవి ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి అనుకుంటా . ఈ కౌంటర్లకు అనుకునే బ్యాక్ డోర్ లో చిల్డ్రన్స్ పార్క్ అనే బోర్డు కనిపిస్తుంది . పిల్లలు పార్కులో ఆడుకోవడానికి 20 రూపాయల టికెట్ కూడా పెట్టారు . బయటినుంచి చూస్తే పార్క్ సరిగా మెయింటైన్ చేస్తున్నట్టు అనిపించలేదు . స్నాక్స్ కౌంటర్ల దగ్గరే కూర్చోవడానికి బల్లలు కూడా ఏర్పాటు చేసారు . ఆ పక్కనే వాష్ రూమ్ కూడా ఉంది .
గ్రీనరీ
మందిర్ కింది భాగంలో చుట్టూ గడ్డితో లాన్ వేయడంతో చక్కటి గ్రీనరీతో ఆహ్లాదంగా , ప్రశాంతంగా అనిపిస్తుంది .
లోటస్ మందిర్
ఇప్పుడు మెట్ల మీదుగా లోటస్ మందిర్ లోకి చేరుకుంటే ఎదురుగా శివలింగం కనిపిస్తుంది. మందిర్ చుట్టూ బయటివైపు శివుడు , పార్వతీదేవి , సుబ్రమణ్య స్వామి , వెంకటేశ్వర స్వామి , శ్రీకృష్ణుడు , వినాయకుడు తదితర దేవుళ్ళ విగ్రహాలు కనిపిస్తాయి . అక్కడ ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత శివలింగం ఉన్న మందిరంలోకి అడుగుపెడతాం . భక్తులు శివుడికి జల అభిషేకాలు చేసేందుకు వీలుగా మందిరంలోనే ఒకవైపు మంచినీటి పంపు , నీటితో నిండిన డ్రమ్ములు ఉంటాయి . ఇక్కడ మనకు లభించే అవకాశం ఏంటంటే ఏ భక్తులైనా అక్కడి రాగి బిందెతో నీళ్లు తీసుకుని స్వామివారికి అభిషేకం చేయొచ్చు . దీనికోసం ఎటువంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు .
ఇక్కడ ఉన్న శివలింగం విశిష్టత ఏంటి ?
కొన్ని దశాబ్దాల క్రితం నర్మదా నదీ తీరంలో ఒక భక్తుడికి ఈ శివలింగం దొరికింది . ఈ శివలింగం సాధారణమైంది కాదు . కొన్ని విశిష్టతలు ఉన్నాయి . ఈ శివలింగాన్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కంటిముందు సాక్ష్యాత్కరించినట్టు అనిపిస్తుంది . ఇక్కడ ప్రతిష్టించిన శివలింగంలో యజ్నోపవీతం , నాభి , రుద్రాక్ష , త్రినేత్రం స్పృష్టంగా కనిపిస్తాయి . తరువాయి కాలంలో స్వామి నారాయణ్ సేవా సంస్థల ద్వారా ఈ శివలింగం లోటస్ మందిరంలో ప్రతిష్టించడం జరిగింది . కానీ ఈ శివలింగాన్ని చూడగానే మనసు ఆధ్యాత్మిక భావనతో పులకించిపోవడం ఖాయం . ఇక్కడ ప్రత్యేకంగా ఆవుపాలతో , విభూదితో , మారేడు దళాలతో రుద్ర అభిషేకాలు కూడా చేస్తారు . కానీ వీటికి మాత్రం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది . ఈ అభిషేకాల కోసం 200 నుంచి 1200 రూపాయల వరకు రుసుము చెల్లించాలి . ఆ రోజు స్వామివారికి అభిషేకం చేయించే అదృష్టం మాకు దక్కింది . అక్కడ ఉన్న పూజారి కూడా చిన్నవాడే . కానీ అద్భుతంగా మంత్రోచ్ఛారణ చేసారు .
విద్యుత్ దీపాల కాంతిలో మెరిసిపోయిన మందిర్ ప్రాంగణం
సాయంత్రం 6 గంటలనుంచి మందిర్ ప్రాంగణంలో లైట్లు వేస్తారు . విద్యుత్ దీపాల ధగధగలో ఆ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది . మేము సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో మందిర్ చేరుకున్నాం . అప్పటికే అక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీగా కనిపించింది . ఆదివారం కావడంతో బహుశా రష్ ఎక్కువ ఉందేమో అనిపించింది .
టైమింగ్స్
ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30 వరకు
ప్రశాంత వాతావరణం
హైద్రాబాదు నుంచి షుమారు 30 కిలోమీటర్ల దూరంలోనే ఈ అద్భుతమైన లోటస్ మందిర్ ఉంది కాబట్టి ఇప్పటివరకు సందర్శించనివారు ప్లాన్ చేసుకోండి . చుట్టూ గ్రీనరీతో చక్కటి ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ మందిర్ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మీరు హాయిగా రిలాక్స్ అవుతారు . అక్కడ కూర్చోవడానికి కూడా ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి చక్కగా ధ్యానం కూడా చేసుకోవచ్చు .
చిలుకూరు బాలాజీ దేవాలయం
ఇక్కడ దర్శనాలు ముగించుకుని అక్కడికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న చిలుకూరు బాలాజీ దేవాలయానికి కూడా వెళ్ళాము . లోటస్ టెంపుల్ కి వెళ్లడం ఇదే మొదటిసారి కానీ చిలుకూరు బాలాజీ దేవాలయానికి గతంలో చాలాసార్లు వెళ్ళాం . మేము వెళ్లేసరికి 6.45 అయ్యింది . రాత్రి 7 గంటలకే గుడి కట్టేస్తారని అక్కడివారు చెప్పడంతో వేగంగా లోనికి వెళ్ళాం . కానీ అక్కడ గతానికీ , ఇప్పటికీ చాలా మార్పులు కనిపించాయి . దేవాలయం లోపల ప్రదక్షిణాలు బంద్ చేయడంతో లోపల ఎటువంటి హడావుడి కనిపించలేదు . క్యూ లైన్ లో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నాం . ఎప్పుడూ భక్తులను నవ్వుతూ పలకరించే రంగరాజన్ గారి కోసం చూసాను . వారు కనిపించలేదు . బహుశా టెంపుల్ దర్శన వేళలు ముగిసినందున వెళ్ళిపోయి ఉంటారని అనుకున్నా . బయటికి వెళ్లేదారి షాపుల మీదుగా ఏర్పాటు చేయడంతో ఎవరైనా అటునుంచి వెళ్లాల్సిందే .
డాబాలు , రెస్టారెంట్లు
తిరుగు ప్రయాణంలో చిలుకూరు నుంచి హైద్రాబాదు వెళ్తుంటే దారిపొడవునా కొత్తగా వెలిసిన డాబాలు , రెస్టారెంట్లు బోలెడు కనిపించాయి . అన్నీ కిటకిటలాడుతున్నాయి . లేట్ గా రిటర్న్ అయ్యేవాళ్ళకి ఫుడ్ కోసం ఈ రెస్టారెంటులే ఛాయిస్ అవుతాయి .
మృగవాని ఫారెస్ట్ పార్క్
మీరు హైదరాబాద్ రిటర్న్ అవుతుంటే దారిలో హైవే కు అనుకుని మృగవాని అనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి జింకల పార్క్ కనిపిస్తుంది . ముందుగా ప్లాన్ చేసుకుంటే ఈ ఫారెస్ట్ పార్క్ విజిటింగ్ కూడా మంచి ఛాయిస్ అవుతుంది . అయితే సాయంత్రం 6 గంటల లోపలే ఈ ఫారెస్టు లోపలికి అనుమతిస్తారు . వెళ్ళేటప్పుడే మేము ట్రై చేసాము కానీ అప్పటికే అక్కడ రష్ ఎక్కువగా ఉండటం , వర్షం పడేలా ఉండటంతో టికెట్ సేల్ బంద్ చేసేసారు .
ముగింపు
వీకెండ్స్ లో ఒకరోజు మొత్తం ట్రిప్ ప్లాన్ చేసుకునేవారు హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్ళేదారిలో 75 కిలోమీటర్లు వెళ్తే అనంతగిరి హిల్స్ వస్తుంది . పచ్చటి ప్రకృతితో అలరారే ఈ కొండల్లోనే అద్భుతమైన అనంత స్వామి దేవాలయం ఉంది . ట్రెక్కింగ్ , హిల్ వ్యూ , బోట్ టూరిజం ఇక్కడి ప్రత్యేకతలు . ఈ సీజన్లో బాగుంటుంది కానీ వర్షం లేనప్పుడు ప్లాన్ చేసుకోండి . ఎందుకంటే అంతదూరం వెళ్లి వానలో ఇరుకుపోతారు . మార్నింగ్ నేరుగా అనంతగిరి హిల్స్ కు వెళ్లి సాయంత్రానికి రిటర్న్ లో నేను చెప్పిన ప్రదేశాలు చూసుకుంటూ వస్తే ఖచ్చితంగా మీకు మెమొరబుల్ ట్రిప్ అవుతుంది . ప్రయత్నించి చూడండి .
