Home » అనుకోని అతిథి – సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ రివ్యూ

అనుకోని అతిథి – సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ రివ్యూ

Spread the love

సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో మూవీలు తీయడంలో మలయాళ దర్శకులు ముందుంటారు . అందుకే ఈ జానర్ ఇష్టపడే ప్రేక్షకులు వాళ్ళ మూవీలు వెతుక్కుని మరీ చూస్తారు. గతంలో థియేటరిక్ రిలీజ్ ఉన్నప్పుడు మనకు నచ్చిన మూవీ ఒకవేళ మిస్ అయితే తిరిగి చూడటానికి రీ రిలీజ్ వరకు ఆగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు . ప్రస్తుతం మనం ఓటిటీ ల కాలంలో ఉన్నాం. మనకు నచ్చిన మూవీ ఒకవేళ థియేటర్లో చూడటం మిస్ అయినా ఇప్పుడు ఓటిటిల్లో వెతుక్కుని హాయిగా ఇంట్లోనే కూర్చుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో మూవీలు ఇష్టపడేవారు పాత సినిమాలు వెతుక్కుని మరీ చూడొచ్చు. అనుకోని అతిథి మూవీ అలా చూసిందే.

నిజానికి ఈ మూవీ 2021 లోనే మలయాళంలో థియేటరిక్ రిలీజ్ అయ్యింది. అక్కడ మంచి వసూళ్లు రాబట్టడంతో అదే మూవీని తెలుగులో డబ్ చేసి ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు.
తెలుగులో కూడా చాలామంది ఈ మూవీని చూసి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. అందుకు ఒక కారణం ఉంది. మూవీ స్ట్రెయిట్ మలయాళం సినిమా అయినా తెలుగు డబ్బింగ్ వెర్షన్లో కూడా అందుబాటులోకి రావడంతో చాలామంది దీని మీద కన్నేశారు. దానికి తోడు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో మంచి నటుడిగా పేరున్న ఫహద్ ఫసల్ ఇందులో హీరోగా నటించడం.. అతడికి జోడీగా సాయి పల్లవి నటించడం.. ముఖ్యమైన పాత్రలో ప్రకాష్ రాజ్ నటించడం వంటి అంశాల వల్ల తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ మూవీ మీద ఇంట్రెస్టింగ్ కలిగింది. మరి అందరి అంచనాలను ఈ అనుకోని అతిధి అందుకోగలిగాడా ? ఫహద్ ఫసల్ తన మార్క్ నటన చూపించాడా ? అసలు ఈ అనుకోని అతిధి ఎవరు ?

ఇప్పుడు అనుకోని అతిథి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే?

సినిమా ప్రారంభమే 1967 నాటి కాలంతో ప్రారంభం అవుతుంది .చల్లపల్లి జమీందార్ల కుటుంబంలో నలుగురు హత్య గావించబడటంతో కథ మొదలౌతుంది .

కట్ చేస్తే,

కేరళ ఫారెస్టుకు సమీపంలో షుమారు ఐదొందల ఎకరాల స్థలంలో డాక్టర్ బెంజిమన్ ( అతుల్ కులకర్ణి) ఒక మానసిక చికిత్సాలయం నిర్వహిస్తూ ఉంటాడు. బయటివాళ్ళు ఎవరైనా ఇతడి ఆసుపత్రికి రావాలంటే అడవి దారిలో మైళ్ళ దూరం నడుచుకుంటూ రావాలి. ఆసుపత్రిలో ఇతడు అందించే చికిత్స ఏమిటో, అతడి దగ్గర ఉన్న పేషెంట్ల వివరాలు ఏంటో బయటి ప్రపంచానికి తెలీదు.

ఇదిలా ఉండగా ఈ ఆసుపత్రిలో ఏం జరుగుతుందో తెలుసుకుని నివేదిక ఇమ్మని తిరువనంతపురం మెడికల్ కాలేజీ అధికారులు నంద కిషోర్ ( ఫహద్ ఫసల్) అనే డాక్టర్ను పంపిస్తారు. అతికష్టంమీద అడవి దారిలో నడుచుకుంటూ హాస్పిటల్లో అడుగుపెట్టిన డాక్టర్ నంద కిషోర్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. కానీ నంద కిషోర్ రావడం, తన హాస్పిటల్లో పరిశోధనలు చేయడం డాక్టర్ బెంజిమన్ కు ఇష్టం ఉండదు. అందుకే డాక్టర్ నంద కిషోర్ అడ్డు తొలగించుకోవాలని బెంజిమన్ ప్లాన్ చేస్తూ ఉంటాడు.

ఆసుపత్రిలో పరిశోధనలు మొదలుపెట్టిన డాక్టర్ నంద కిషోర్ కు నిత్య ( సాయి పల్లవి) అనే మానసిక పేషెంటును గదిలో బంధించి చికిత్స చేయడం గమనిస్తాడు. కానీ బెంజిమన్ మాత్రం ఆమెను తన కూతురిగా చెప్తాడు. అటిజం వ్యాధితో బాధపడుతున్న తన కూతురికి ట్రీట్మెంట్ చేయిస్తున్నట్టు చెప్తాడు .

కానీ నంద కిషోర్ పరిశోధనల్లో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నిత్య డాక్టర్ బెంజిమన్ కూతురు కాదని..చల్లపల్లి వంశానికి చెందిన జమీందార్ల కూతురు అని తెలుస్తుంది. దీనితో ఆ హాస్పిటల్లో ఏదో జరుగుతుందని నంద కిషోర్ కి అర్ధమౌతుంది . డాక్టర్ రూపంలో బెంజిమన్ ఏవో అకృత్యాలకు పాల్పడుతున్నాడని పసిగడతాడు . ఎలాగైనా నిత్యను ఆ చెరనుంచి విడిపించాలని రంగంలోకి దిగుతాడు .

చల్లపల్లి జమీందార్ల కూతురు నిత్య బెంజమిన్ హాస్పిటల్లో ఎందుకుంటుంది ?

చికిత్స పేరుతో ఆమెను హాస్పిటల్లో చేర్పించింది ఎవరు?

అసలు హస్పిటల్ పేరుతో బెంజమిన్ చేసే వ్యవహారాలు ఏంటి?

హస్పిటల్ వ్యవహారాలు పరిశీలించడానికి వచ్చిన నంద కిషోర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనేది మిగిలిన కథనంలో తెలుస్తుంది.

ఎలా ఉంది?

మీరు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడతారా ? అందులోనూ సైకలాజికల్ జానర్ ఇష్టపడతారా? అయితే ఈ సినిమా మీకు నచ్చుతుంది. నచ్చుతుంది అన్నాను కాబట్టి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూసేయకండి. మీరు డిజప్పాయింట్ అవుతారు . ఏ అంచనాలు లేకుండా చూసేయండి. థ్రిల్ అవుతారు.. క్లైమాక్సులో అయితే ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. సినిమా ప్రారంభం నుంచి రొటీన్ ఫార్ములా ఫాలో అయిన దర్శకుడు క్లైమాక్స్ మాత్రం డిఫరెంట్ గా చూపించటానికి ప్రయత్నం చేసాడు .నిజానికి ఈ సినిమా ఓ హాలీవుడ్ సినిమా ఆధారంగా తీశారు . ఆ ఇంగ్లీష్ మూవీ ఆల్రెడీ చూసిన వాళ్లకు ఈ మూవీలో కొత్తదనం కనిపించదు.
ఫస్ట్ టైమ్ చూసినవాళ్ళకు మాత్రం కొంచం థ్రిల్ పంచుతుంది.

కాకపోతే ఫస్టాఫ్ లో కొద్దిగా సాగతీత సన్నివేశాలు ఉంటాయి. ఉదాహరణకు డాక్టర్ నంద కిషోర్ బెంజమిన్ ఆసుపత్రికి చేరుకోవడానికి అడవి, సెలయేర్లు, గుట్టలు దాటుకుంటూ నడుస్తూనే ఉంటాడు. రీళ్ళకు రీళ్ళు, మైళ్లకు మైళ్లు అతడు నడుస్తూనే ఉంటాడు కానీ ఎంతకీ బెంజిమన్ ఆసుపత్రి రాదు. ఈ ప్రయాణం సుదీర్ఘ సాగతీత అయి ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. దీనికోసం అన్ని రీళ్లు తగలేయడం అవసరమా అనిపిస్తుంది .

ఎట్టకేలకు బెంజిమన్ హస్పిటల్ కు చేరుకున్న డాక్టర్ నంద కిషోర్ తన పరిశోధనలు మొదలు పెట్టినప్పుడు గదిలో నిత్యను బంధించి ట్రీట్మెంట్ చేయడం గమనించడంతో కథలో సంఘర్షణ మొదలౌతుంది.

అక్కడ్నుంచి నిత్యను మాములు మనిషిని చేయడానికి డాక్టర్ నంద కిషోర్ ప్రయత్నం చేయడం.. మిగిలిన పేషెంట్లతో అతడి అనుభవాలు వంటివి నడుస్తాయి. బెంజమన్ హస్పిటల్ ఎపిసోడ్లు కూడా స్లోగా నడుస్తాయి. అసలు ఆ హాస్పిటల్లో ఎవడు పేషెంటో , ఎవడు డాక్టరో డాక్టర్ నంద కిషోర్ తో పాటు మూవీ చూసే ప్రేక్షకులకు కూడా తెలీదు. ఇక్కడ కొంత గందరగోళంగా ఉంటుంది. నిత్య బ్యాక్ గ్రౌండ్ తెలిసిన తర్వాత మనకు స్టోరీ కొద్దిగా అర్థమౌతుంది. డాక్టర్ బెంజమన్ ఆ హస్పిటల్ ఎందుకు నడుపుతున్నాడో కొద్దిగా క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా అదొక పిచ్చాసుపత్రి అన్న విషయం ఒక్కటే మనకు అర్ధం అవుతుంది .

ఇదిలా ఉండగా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే డాక్టర్ బెంజమన్ నంద కిషోర్ విషయంలో మాత్రం అంత ఉదారంగా ఎందుకుంటాడో అర్ధం కాదు. తన హాస్పిటల్ రహస్యాలు బయటపెట్టడానికి వచ్చాడని తెలిసినా నంద కిషోర్ తో దొంగా పోలీస్ ఆటలు ఆడతాడు కానీ అతడ్ని లేపెయ్యడు. అప్పటికీ డాక్టర్ఆ బెంజిమన్ పిఎ నెత్తినోరు కొట్టుకుని చెప్పినా చుట్ట కాలుస్తాడే కానీ యాక్షన్ లోకి దిగడు . అటెండర్ ను మైళ్ళదూరం పంపించి పేపర్ తెప్పించుకుంటాడు కానీ చదవడు . డాక్టర్ నంద కిషోర్ ఇచ్చిన లెటర్ చదవకుండానే మంటల్లో వేసేస్తాడు . ఆఖర్లో ప్రకాష్ రాజ్ చెప్పినట్టు బెంజిమన్ పిచ్చాసుపత్రి డాక్టరో , లేకపోతే పిచ్చి డాక్టరో సినిమా చూస్తున్న ప్రేక్షకులతో సహా ఎవరికీ తెలీదు . స్టార్టింగ్ అతడికి భారీ ఎలివేషన్ ఇచ్చి ఎండింగ్ లో గాలి తీయడం బాగాలేదు .

ఇదిలాఉంటే అసలా జమీందార్ల వంశం మధ్య గొడవలేంటో క్లారిటీ ఉండదు . జమీందార్ల ఎపిసోడ్లో నిత్యకు కేరళ కలరి యుద్దాలు నేర్పించడం ఒక్కటే బాగుంటుంది . తర్వాత నిత్యను డాక్టర్ బెంజిమన్ చేతుల్లో పెట్టడం వెనుక సరైన కారణాలను ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు .

ఈ సినిమా మొత్తానికి మనకు థ్రిల్ పంచేది ఆఖరి పదిహేను నిమిషాల సన్నివేశాలే ..ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ఎంటర్ అయిన తర్వాత ఇచ్చిన ట్విస్ట్ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది . ఆ ట్విస్ట్ ఏంటో చెప్పేస్తే థ్రిల్ పోతుంది. అది మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే .

ఎవరెలా చేశారు?

ఈ సినిమాలో ఫహద్ ఫసల్ నుంచి ఎక్కువ నటన ఎక్స్పెక్ట్ చేస్తే డిజప్పాయింట్ అవుతారు. ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో ఫహద్ ఫసల్ నటన చూడటం కోసమే సినిమాలు చూసే వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకో ఈ మూవీ లో అతడి మార్క్ నటన కనపడలేదు. రొటీన్ హీరో మాదిరి నటించాడు . అతడి ఎక్స్ప్రెషన్స్ కూడా మామూలుగా ఉంటాయి.

ఇక సాయి పల్లవి నటన గురించి చెప్పుకోవాలంటే అటిజం పేషెంట్లో పరకాయ ప్రవేశం చేసింది అని చెప్పాలి. మానసిక వికలాంగురాలి పాత్రలో జీవించింది. సినిమా మొత్తానికి ఆమెకు ఒకట్రెండు డైలాగులు తప్ప మాటలే ఉండవు. అంతా సాయి పల్లవి హావభావాల మీదనే నడుస్తుంది. మానసిక వికలాంగురాలిగా నడకలో కానీ, సన్నివేశాలకు తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో కానీ సాయి పల్లవి చాలా గ్రౌండ్ వర్క్ చేసినట్టుంది . బాగా నటించింది .

అతుల్ కులకర్ణి తనదైన శైలిలోనే నటించి మెప్పించాడు.
ఇక ప్రకాష్ రాజ్ గురించి కొత్తగా చెప్పేది ఏముంటుంది? క్లైమాక్సులో వచ్చిన తనదైన మార్కును చూపించాడు.

మిగిలిన వాళ్ళు తమ పాత్రల పరిధి లో బాగానే నటించారు.

సాంకేతికత:

ఈ మూవీకి బాగా కలిసొచ్చిన అంశం జిబ్రాన్ అందించిన బిజిఎం. సన్నివేశాలకు తగ్గట్టుగా అతడు అందించిన బిజిఎం మూవీకి హైలెట్ అవుతుంది.

ఇక కేరళ అందాలను మరింత అందంగా చూపించిన అను మూతేదత్ కెమెరా పనితనం అడుగడుగునా కనిపిస్తుంది. ప్రకృతి సహజమైన అడవులు, సెలయేర్లు వంటి లొకేషన్లను అందంగా చూపించారు.

నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.

విశ్లేషణ :

మీరు సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీలు ఇష్టపడితే ఈ మూవీ హాయిగా చూసేయండి. అలా అని అతిగా అంచనాలు పెట్టుకుని చూడకండి. రొటీన్ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో ఉన్నట్టు ఇందులో అడుగడుగునా ట్విస్టులు ఉండవు. కానీ క్లైమాక్సులో వచ్చే ఒకేఒక్క ట్విస్టుతో మనల్ని ఆశ్చర్యపరుస్తాడు . ఫహద్ ఫసల్ నటన ఆశించిన స్థాయిలో లేకపోయినా సాయి పల్లవి మాత్రం మంచి స్కోప్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఇదేదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కాబట్టి ఊహించని అభ్యంతరకర సన్నివేశాలు, మితిమీరిన వయోలెన్స్ ఉంటుందని అనుమానపడక్కర్లేదు.. ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి హాయిగా ఆహా అనుకుంటూ ఓటిటీ లో చూసేయవచ్చు .

నటీనటులు: ఫహద్ ఫసల్, సాయి పల్లవి, ప్రకాష్ రాజ్ తదితరులు
సంగీతం: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: అను మూతేదత్
దర్శకత్వం: వివేక్
విడుదల: ఆహా ఓటీటీ
రేటింగ్: 2.5/5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!