అనగనగా ఒక అడవిలో ఒక బ్రహ్మ రాక్షసుడు ఉంటాడు . అతడికి ఆకలి వేసినప్పుడల్లా అడవికి అనుకుని ఉన్న పల్లెటూరి లో మనుషులను చంపి తింటూ ఉంటాడు . ఈ బ్రహ్మ రాక్షసుడి బాధలు పడలేక ఆ గ్రామ ప్రజలు రాజుగారిని కలిసి తమను కాపాడాలని వేడుకుంటారు . అప్పుడు ఆ రాక్షసుడి పని పట్టడానికి తండ్రి అనుమతి తీసుకుని యువరాజు అడవికి బయలుదేరతాడు . అడవిలోకి వెళ్లిన యువరాజు రాక్షసుడితో భీకరంగా పోరాటం చేసి అతడ్ని అంతమొందిస్తాడు . రాక్షసుడి పీడ అంతం అవడంతో గ్రామస్తులు సుఖంగా ఉంటారు .
ఏంటీ ? ఇది రాకాసి మూవీ స్టోరీ అనుకుంటున్నారా ? కానేకాదు . చిన్నప్పుడు మనం చందమామ కధల్లో అడవిలో బ్రహ్మ రాక్షసుల గురించి చదివాం గుర్తుందా ? . ఈ తరహా సోషియో ఫాంటసీ కధలు అప్పట్లో పాఠకుల ఆదరణ బాగా పొందేవి . తర్వాత విఠలాచార్య వంటి దర్శకులు ఫాంటసీ కథలతో చాలా సినిమాలు తీశారు . ఆ సినిమాలు కూడా బ్రహ్మాండంగా ఆడేవి .
మళ్ళీ చాన్నాళ్లకు చందమామ కధలను గుర్తు చేస్తూ రాకాస సినిమా వచ్చింది . కాకపోతే అడవిలోని రాక్షసుడు ఇందులో కోటలో ఉంటాడు . ఈ కాలంలో కూడా ఇంకా బ్రహ్మ రాక్షసులు ఏంటి ? అనుకుంటున్నారా ? సోషియో ఫాంటసీ కధల్లో ఏదైనా సాధ్యం అవుతాయి . ట్రైలర్ చూసినప్పుడు ఇదేదో దయ్యాలకు సంబంధించిన రొటీన్ సినిమా అనుకుంటాం . ఎందుకంటే ఇప్పటిదాకా దయ్యాల సినిమాలు అన్ని భాషల్లో చూసీ చూసీ ప్రేక్షకులకు కూడా కనుగుడ్లు పైకి పోయాయి . అందుకే రాకాస దర్శకురాలు పూర్తిగా దయ్యాల జోలికి వెళ్లకుండా ఓ బ్రహ్మ రాక్షసుడ్ని సృష్టించింది . రొటీన్ దయ్యాల సినిమాకి , ఈ సినిమాకి ఉన్న తేడా అదే .
ఇక ఈ సినిమాకి హైప్ రావడానికి కొణిదెల నీహారిక కూడా ఒక కారణం . కమిటీ కుర్రాళ్ళు మూవీ తర్వాత నీహారిక మనసు పెట్టి పూర్తి సమయం కేటాయించిన సినిమా రాకాస . ఒకరకంగా చెప్పాలంటే సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి పట్టిన సమయం కన్నా , నీహారిక మూవీ ప్రమోషన్ కోసం కేటాయించిన సమయమే ఎక్కువ . కొణిదెల వారి పిల్ల గట్టిగా ప్రమోషన్ చేయడం వల్లనేమో సినిమాకి టాక్ వచ్చింది .
ఇప్పుడు రాకాస మూవీ ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా ఉందో ? లేదో ? చూద్దాం .
కధేంటంటే ?
సినిమా ప్రారంభమే రెండువేల సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభం అవుతుంది . రాకవనం అనే గ్రామానికి అనుకుని ఉన్న కోటలో బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడని , ప్రతి సంవత్సరం అతడికి ఎవరో ఒకరిని నరబలి ఇవ్వడం ఆచారంగా వస్తూ ఉంటుంది . ఒకవేళ ఎవరైనా నరబలి ఇవ్వడం కోసం ముందుకు రాకపోతే ఆ బ్రహ్మ రాక్షసుడు కోటలోనుంచి బయటికి వచ్చి విలయం సృష్టిస్తాడని ప్రజలు నమ్ముతుంటారు . నరబలి సమయం వచ్చినప్పుడు కోట నుంచి మూడు హెచ్చరిక సంకేతాలు వస్తాయని , ఆ సంకేతాలు రాగానే గ్రామస్తుల్లో ఎవరో ఒకరు నరబలి కోసం త్యాగం చేయడానికి ముందుకొచ్చి కోటలోకి వెళ్తారు . ఒకసారి కోటలోకి వెళ్లిన వారెవరూ ప్రాణాలతో బయటపడలేరు .
ఇదిలా ఉండగా కోటలో రాక్షసుడి సంగతి తెలుసుకున్న ఒక రాజు సైన్యంతో కోటలోకి వెళ్లి యుద్ధం చేస్తాడు కానీ రాక్షసుడి చేతిలో మరణిస్తాడు . కానీ రాక్షసుడ్ని చంపే ఉపాయం తెలుసుకున్న ఒక సైనికుడు మాత్రం అతడి చావు రహస్యాన్ని కోటలో రాతి మీద రాసి చనిపోతాడు . రాజు గారి మరణంతో ప్రజలు మరింత భయపడి ప్రతి సంవత్సరం తమలో ఒకరిని కోటలోకి పంపి నరబలి ఇచ్చుకుంటూ వస్తుంటారు .
ఇప్పుడు కథాకాలం 2026 లోకి వస్తుంది . అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న వీరబాబు ( సంతోష్ శోభన్ ) చాన్నాళ్లకు తన సొంతూరికి వస్తాడు . అదే ఊరికి చెందిన సుకన్యను అతడు చిన్నప్పట్నుంచి ప్రేమిస్తూ ఉంటాడు . కానీ సుకన్య వేరే వ్యక్తిని పెళ్లిచేసుకోవటంతో భగ్న ప్రేమికుడిగా మిగిలిపోతాడు . ఇలా ఉండగా అదే ఊరికి చెందిన సుబ్బలక్ష్మి ( నయన్ సారిక ) వీరబాబును ప్రేమిస్తుంది . ఈ పరిస్థితుల్లో కోటనుంచి హెచ్చరిక సందేశాలు రావడంతో వీరబాబు స్నేహితుడు బాలరాజును ( గెటప్ శ్రీను ) ను నరబలికి పంపాలని ఊరి పెద్దలు ప్రతిపాదిస్తారు . దాంతో ఇవన్నీ మూఢ నమ్మకాలు మాత్రమే అని , కావాలంటే బాలరాజు బదులు తానే కోటలోకి వెళ్తానని చెప్పి వీరబాబు ఒకడే కోటలోకి వెళ్తాడు .
కోటలోకి వెళ్లిన వీరబాబుకు ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి ?
కానీ అంతకన్నా ముందే సోము ( వెన్నెల కిషోర్ ) కోటలోకి ఎలా వెళ్తాడు ?
కోటలోని రాక్షసుడి వెనుక ఉన్న కధేంటి ?
చివరకు ఏమౌతుంది ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది .
ఎలా ఉంది ?
సినిమా ప్రారంభంలోనే కోట ,నరబలులు లాంటి సన్నివేశాలు చూపించడంతో ముందు ఇదేదో హర్రర్ సినిమా అనుకుంటాం . కానీ కాసేపటికే అమెరికా నుంచి వీరబాబు ( సంతోష్ శోభన్ ) ఎంటర్ అవడంతో స్టోరీ కామెడీ ట్రాక్ లోకి ఎంటర్ అయ్యింది . సుకన్యతో అతడి లవ్ అఫైర్ ఫెయిల్ అవడం .. సుబ్బలక్ష్మి అతడ్ని ప్రేమించడం .. సోము హత్య కేసులో ఊరి పెద్దలు అతడికి శిక్ష వేయడం .. లాంటి సన్నివేశాలు అన్నీ కామెడీ ట్రాక్ కోసం వాడుకుంది దర్శకురాలు . దాదాపు ఫస్టాఫ్ అసలు కథలోకి వెళ్లకుండా సంతోష్ శోభన్ తో కామెడీ చేయిద్దామని ప్రయత్నించి కథని అక్కడక్కడే గింగిరాలు తిప్పింది . దీంతో ఈ ప్రహసనం పెద్ద సాగతీతలా అనిపిస్తుంది . గెటప్ శ్రీనుతో చేయించాల్సిన కామెడీ కూడా సంతోష్ శోభన్ తో చేయించడం సరిగా కుదరలేదు . మాములుగా సంతోష్ శోభన్ కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది కానీ ఇందులో ఎందుకో అతడి కామెడీ మోతాదు కొంచం ఎక్కువైనట్టు అనిపిస్తుంది . కొంచెంలోకొంచెం సెకండాఫ్ లో సంతోష్ శోభన్ కామెడీ కొంచం బాగుంది . ఈ మూవీలో కామెడీ ట్రాక్ పండింది అంటే అది కేవలం వెన్నెల కిషోర్ వల్లనే . సెకండాఫ్ కామెడీ ట్రాక్ లీడ్ తీసుకుని పాత్రకు పూర్తి న్యాయం చేసాడు . సుబ్బలక్ష్మి , వీరబాబుల మధ్య సెపరేట్ లవ్ స్టోరీ ట్రాక్ నడపకుండా సింపుల్ గా తేల్చేసిన విధానం బాగుంది . లేకపొతే వాళ్ళ లవ్ ట్రాక్ కోసం ఇంకో ఐదు రీళ్లు సాగతీయాల్సి వచ్చేది .
ఇక ఇది సోషియో ఫాంటసీ కథ కాబట్టి లాజిక్కులు జోలికి పోకుండా చూడాలి . కోటలోకి వెళ్ళటానికి ప్రతి ఒక్కడూ భయపడుతుంటే సుబ్బలక్ష్మి మాత్రం బాలరాజుని తీసుకుని ఇంకో గేటులోనుంచి నేరుగా కోట లోపలి వెళ్లి వీరబాబు కోసం వెతుకుతూ ఉంటుంది . అలాగే కోటలోపలికి ఎవరు వెళ్లినా ప్రాణాలతో బయటపడరని రెండువేల సంవత్సరాల చరిత్ర చెప్తున్నా సోము ( వెన్నెల కిషోర్ ) మాత్రం కోటలో ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు . అతడికి తోడు వీరబాబు కూడా యాడ్ అవుతాడు . ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కోట మొత్తం పిక్నిక్ స్పాట్ మాదిరి తిరుగుతూ ఉంటారు . ఇక్కడా కామెడీ ట్రాక్ కోసం కోటలోపలి సీరియస్నెస్ ను పోగొట్టేసారు . కోటలో ఏదో జరుగుతుందని ఊహించుకున్న ప్రేక్షకులకు పాత విఠలాచార్య సినిమాలో మాదిరి బండరాయి దొర్లుకుంటూ రావడం .. కత్తులు మీద పడటం వంటి రొటీన్ సన్నివేశాలు కనపడటంతో గాలి తీసేసినట్టు అయ్యింది . రెండువేల సంవత్సరాల చరిత్రను రెండు నిమిషాల కామెడీ ట్రాక్ తో తేలిక చేసేసారు . కోటలో సన్నివేశాలు భయపెట్టలేకపోయాయి . ఇంతా చేసి రాక్షసుడికి కూడా ఓ సెంటిమెంట్ స్టోరీ అల్లి సింపుల్ గా ముగించారు . ఈ ముగింపు ఎలా ఉందంటే అదేదో ఏనుగు సామెతలా ఉంది . ఈ మూవీలో బిగ్ రిలీఫ్ వెన్నెల కిషోర్ కామెడీ మాత్రమే .
ఎవరెలా చేసారు ?
వీరబాబు పాత్రలో సంతోష్ శోభన్ నటన బాగానే ఉంది కానీ ఎందుకో కామెడీ టైమింగ్ లో అతడి శైలి మిస్ అయ్యింది . కొన్ని చోట్ల ఆ కామెడీ డోస్ మోతాదు మించినట్టుగా కూడా అనిపిస్తుంది .
ఇక సుబ్బలక్ష్మి పాత్రలో నయన్ సారిక నటన బాగుంది . మూవీలో ఆమెకు మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కినప్పటికీ దర్శకురాలు ఆమె నటనను పూర్తిగా వాడుకోలేకపోయారని అనిపిస్తుంది . అసలు సినిమా మొదలు చూస్తున్నప్పుడు సుకన్య హీరోయిన్ అయ్యుంటుందేమో అన్న అనుమానం కూడా వస్తుంది . నయన్ పాత్ర నిడివి ఇంకాస్త పెంచి ఉంటే బాగుండేది .
వెన్నెల కిషోర్ తనదైన శైలిలో హాస్యం పండించాడు . జబర్దస్త్ నటుడు గెటప్ శ్రీను నటన బాగానే ఉంది కానీ కామెడీ ట్రాక్ లో అతడ్ని కూడా సరిగా వాడుకోలేకపోయారు అనిపిస్తుంది. ఇక బ్రహ్మాజీ , తనికెళ్ళ భరణి , ఆశిష్ విద్యార్థి లు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు .
సాంకేతికత :
హర్రర్ , ఫాంటసీ కధలకు బీజీఎమ్ ప్రముఖ పాత్ర వహిస్తుంది . అనుదీప్ అందించిన బీజీఎమ్ బాగుంది .
రెండువేల సంవత్సరాల క్రితం కాలం నుంచి వర్తమానం వరకు లొకేషన్లు మార్చుకుంటూ చూపించాలంటే చక్కటి కెమెరా పని తనం ఉండాలి . రాజు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది .
సినిమా కోసం వాడిన విఎఫ్ఎక్స్ వర్క్స్ యావరేజ్ గా ఉన్నాయి . ఫాంటసీ కాలం నాటి సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ ఇంకాస్త పై స్థాయిలో ఉంటే బాగుండేది .
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి
విశ్లేషణ :
చిన్నప్పుడు చందమామ లో చదువుకున్న సోషియో ఫాంటసీ కధలను ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చుతుంది . కధలో రాక్షసుడ్ని కాకుండా దయ్యం అనే కాన్సెప్ట్ తో తీస్తే రొటీన్ సినిమా అయిపోయి ఉండేది . రాక్షసుడు అన్న కాన్సెప్టే ఈ సినిమాలో వెరైటీ . కాకపోతే ఆ రాక్షసుడి పాత్రను ఇంకాస్త జాగ్రత్తగా తీర్చి దిద్దిఉంటే మరింత బాగుండేది . ఫాంటసీ సినిమా కాబట్టి లాజిక్కుల జోలికి పోకుండా చూస్తే డిజప్పాయింట్ కారు . ఫస్టాఫ్ లో చాలా సన్నివేశాలు సాగతీత కోసం ,కామెడీ ట్రాక్ కోసం వాడుకోవటంతో అసలు స్టోరీ కోసం మనం సెకండాఫ్ వరకు వేచి చూడాల్సి ఉంటుంది . సెకండాఫ్ లో సంతోష్ శోభన్ కోటలోకి ఎంట్రీ అవడంతో అసలు కథలోకి వెళ్తాము . అయితే ఇందులో సంతోష్ శోభన్ ఫక్తు ఫార్ములా హీరోలా వాడుకోకుండా కామన్ మ్యాన్ మాదిరి చూపించిన విధానం బాగుంది . ఇందులో ఎక్కడా అతడి హీరోయిజం కనిపించదు . అందరిలానే భయపడుతూ ఉంటాడు. చివరివరకు పిరికివాడిలానే ఉంటాడు . ఈ కాన్సెప్ట్ సహజంగా ఉంది . హీరో హీరోయిన్ల కోసం సెపరేట్ లవ్ స్టోరీ ట్రాక్ నడపకుండా కధలో భాగంగా నడిపించిన విధానం బాగుంటుంది . ఓవరాల్ గా ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ లోనే ఈ మూవీ బాగుంటుంది . పేరుకు హర్రర్ సినిమా అయినా భయపడే సన్నివేశాలు ఏమీ లేవు . అలాగే మోతాదును మించిన అశ్లీల సన్నివేశాలు కానీ ,వయొలెన్స్ కానీ ఇందులో లేవు కాబట్టి ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఓటిటిలో నిరభ్యంతరంగా చూడొచ్చు .
నటీనటులు : సంతోష్ శోభన్ , నయన్ సారిక , వెన్నెల కిషోర్ , గెటప్ శ్రీను , తనికెళ్ళ భరణి , బ్రహ్మాజీ తదితరులు
సంగీతం : అనుదీప్
సినిమాటోగ్రఫీ : రాజు
నిర్మాత : కొణిదెల నీహారిక
దర్శకత్వం : మానస శర్మ
విడుదల : నెట్ ఫ్లిక్స్
రేటింగ్ : 2 .5 / 5
