గతంలో చెందు ముద్దు దర్శకత్వం వహించిన ఓ పిట్టకథ చూసా.. అప్పుడే అర్థమైంది ఈయన స్క్రీన్ ప్లే లో ఏదో మ్యాజిక్ ఉందని .. మళ్ళీ ఇప్పుడు థాంక్యూ సుబ్బారావు అంటూ సరికొత్తగా మనముందుకు వచ్చారు దర్శకుడు చెందు .
సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలను మలయాళం దర్శకులే కాదు తెలుగు దర్శకులు కూడా అంతకన్నా బాగా తీయగలరని నేరుగా మలయాళ సీమలోనే షూటింగ్ పూర్తిచేసి మరీ నిరూపించారు దర్శకుడు .
చంద్రహాస్ కోట్ల ..లావణ్య సాహుకారలు జంటగా నటించిన ఈ సినిమాకి దినేష్ కుర్ర నిర్మాత. జూన్ 18 నుంచి థాంక్యూ సుబ్బారావు మూవీ ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది .
కధేంటంటే ?
పెద్దసుబ్బారావు కొడుకు చినసుబ్బారావు ( చంద్రహాస్ కోట్ల ) పెళ్ళిచేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటాడు . కానీ నలుగురు చెల్లెళ్ళ పెళ్లి చేసిన తర్వాతనే అతడ్ని పెళ్లి ఆలోచన చేయమంటాడు తండ్రి . సరే అని ఎలాగోలా నలుగురు చెల్లెళ్ళ పెళ్ళిచేయడం పూర్తిచేసి తాను కూడా పెళ్లిచేసుకుందామని చిన సుబ్బారావు పెళ్లిళ్ల పేరయ్య ద్వారా సంబంధాలు చూసుకుంటుంటే నువ్వు పెళ్లిచేసుకుని వెళ్ళిపోతే నా సంగతేంటి? అంటాడు తండ్రి . చివరికి ఆయన హాస్పిటల్లో చేరడంతో బోలెడు అప్పులు అవుతాయి . ఆ అప్పులనే అతడికి ఆస్తిగా ఇచ్చి ఆ తండ్రి పైకి వెళ్లిపోతాడు .
ఏదైనా ఉద్యోగం సంపాదించుకుని అప్పులు తీర్చుకోవాలని ఆలోచనలో ఉన్న సుబ్బారావుకి కేరళలో ఉన్న అతడి స్నేహితుడు పండు టాక్సీ డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తాడు . సుబ్బారావు కేరళ వెళ్ళిపోయి అక్కడే పండుకి చెందిన బోట్ హౌస్ లో ఉంటూ టాక్సీ నడుపుకుంటుంటాడు . అయితే ఎవరైనా మంచి అమ్మాయి దొరికితే పెళ్లిచేసుకోవాలనే ఆలోచనను మాత్రం మానుకోలేదు .
అప్పుడు పరిచయం అవుతుంది వైష్ణవి ( లావణ్య సాహుకార ) . అమెరికానుంచి వచ్చిన వైష్ణవి కేరళలో హోటల్ బిజినెస్ స్టార్ట్ చెయ్యాలని ప్లాన్ చేస్తుంటుంది . అందుకే తన పనులు చూసుకోవడానికి ఒక నెలరోజులపాటు సుబ్బారావు టాక్సీ కిరాయికి మాట్లాడుకుంటుంది . ఆ ట్రిప్ లో ఇద్దరిమధ్య పరిచయం పెరిగి బాగా క్లోజ్ అవుతారు .
కేరళ ట్రిప్ లోనే సుబ్బారావు వైష్ణవిని ప్రేమించడం మొదలుపెడతాడు . కానీ అనుకోకుండా అమెరికా నుంచి ఆమెకు కాబోయే భర్త రోహిత్ దిగడంతో సుబ్బారావు పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది . అక్కడ్నుంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుండగా ఓసారి ముగ్గురూ కలిసి సైట్ సీయింగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఓ చోట సీనరీ బాగుందని వైష్ణవి కారు దిగి వీడియో తీస్తూ ఉంటుంది . రన్నింగ్ ట్రైన్లో ఎవరో అమ్మాయిని నలుగురు కుర్రాళ్ళు గొంతుపిసికి తోసెయ్యడానికి ప్రయత్నం చేస్తున్న దృశ్యం ఆ వీడియోలో రికార్డ్ అవుతుంది .
ఆ ట్రైన్లో ఉన్న అమ్మాయి ఎవరు ?
ఆ అమ్మాయిని ట్రైన్లోనుంచి తోసెయ్యడానికి ప్రయత్నిస్తున్న ఆ నలుగురు కుర్రాళ్ళు ఎవరు?
తన ఫోనులో రికార్డ్ అయిన వీడియో చూసిన తర్వాత వైష్ణవి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ?
ఈ విషయంలో డ్రైవర్ సుబ్బారావు ఆమెకు ఎటువంటి సహకారం అందిస్తాడు ? అనేది మిగిలిన కథ .
ఎలా ఉంది ?
మూవీ స్టార్టింగులోనే తన కథను తాను చెప్పుకునే సుబ్బారావు కనిపిస్తాడు . ఇక్కడ సుబ్బారావు అంటే హీరో చంద్రహాస్ అన్నమాట . అతడ్ని చూడగానే గబుక్కున కళ్ళు నులుముకున్నాను . టైటిల్స్ లో చూస్తే హీరో పేరు చంద్రహాస్ అని వేశారు . మరి ఇక్కడ చూస్తే RX100 మూవీ హీరో కార్తికేయ కనిపిస్తున్నాడు . కొంపదీసి కార్తికేయ పేరు మార్చుకున్నాడా ? అని డౌట్ వచ్చింది . తర్వాత బాగా క్లోజప్ లో చూసిన తర్వాత అర్థమైంది ..ఇతడు కార్తికేయ కాదు ..కార్తికేయలా కనిపించే చంద్రహాస్ అని . కాకపోతే ఈ అబ్బాయి కార్తికేయకన్నా కొంచం బొద్దుగా బాగా ఒడ్డుపొడుగు ఉన్నాడనిపించింది . అయితేనేమి చంద్రహాస్ ముఖంలో ఏదో తెలియని అట్రాక్షన్ ఉంది .
సరే ఈ విషయం అలా ఉంచితే , ఈ మూవీ చూస్తున్నప్పుడు మనకు చాలాచోట్ల మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీల ‘ ఛాయలు ‘ కనిపిస్తాయి . మలయాళం మిస్టరీ సినిమాల్లో కూడా క్రైమ్ సీన్ తో మొదలై ట్విస్టుతో ఎండ్ అవుతాయి . థాంక్యూ సుబ్బారావు కూడా మిస్టరీతో మొదలై ట్విస్టుతో ఎండ్ అవుతుంది . ఈ సినిమాకి ప్లస్ కూడా మిస్టరీ ట్రాకే .
ఇక సుబ్బారావు , వైష్ణవిల లవ్ ట్రాక్ , అప్పటికే వైష్ణవితో ఎంగేజ్మెంట్ అయిపోయిన రోహిత్ ఎంట్రీతో స్టోరీ ట్రయాంగిల్ లవ్ ట్రాక్ లోకి మారడం వంటి థీమ్ చాలా సినిమాల్లో మనం ఇంతకుముందే చూసేసాం . అంతెందుకు ..కొన్ని సన్నివేశాలు చూస్తుంటే మనకు అల్లు అర్జున్ నటించిన ఆర్య మూవీ గుర్తుకొస్తుంది . తాను ప్రేమించిన అమ్మాయికి నవదీప్ తో ఎంగేజ్మెంట్ కావడంతో వాళ్ళ ప్రేమను చెడగొట్టి తాను పెళ్లి చేసుకోవాలని అల్లు అర్జున్ వాళ్ళిద్దరి మధ్యలో దూరి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు . చివరికి హీరోయిన్ నవదీప్ ను వదిలేసి అల్లు అర్జున్ నే పెళ్లిచేసుకుంటుంది . కాబట్టి థాంక్యూ సుబ్బారావులో లవ్ ట్రాక్ మాత్రమే పెట్టి ఉంటే చాలామందికి పాత సినిమాలే రెండో భాగం చూసినట్టు అనిపించేది .
ఈ పాయింటులోనే దర్శకుడు కథను తెలివిగా మలుపుతిప్పి మిస్టరీ ట్రాక్ వైపు మళ్ళించాడు. ట్రైన్ ఎపిసోడ్ లో తనకు దొరికిన వీడియో ఆధారంగా వైష్ణవి ఆ అమ్మాయికి న్యాయం చేసి పోకిరీలకు శిక్ష పడేలా చేయాలని ప్రయత్నాలు చేయడం , ఈ ప్రయత్నంలో వైష్ణవికి సుబ్బారావు సాయం చేయడం , పోలీసులను , లాయర్ ను , ఆ అమ్మాయి తల్లిని ట్రేస్ చేయడం వంటి సన్నివేశాలతో కధనం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ట్రాక్ లోకి వెళ్ళి మనకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది .
ఒకవైపు కధనాన్ని మిస్టరీ జానర్లో నడిపిస్తూనే సమాంతరంగా కామెడీని కూడా నడిపించిన తీరు బాగుంది . హీరో పక్కన నలుగురైదుగురు సైడ్ క్యారెక్టర్లను దింపి అపహాస్యం పాలుచేయకుండా సింపుల్గా సుబ్బారావు .. రోహిత్ లతోనే కామెడీ ట్రాక్ నడపడం ప్రేక్షకులకు రిలీఫ్ ఇస్తుంది . దానికి తోడు లవ్ ట్రాక్ కోసం మిస్టరీ ట్రాక్ నుంచి సైడ్ అయిపోయి హీరో ,హీరోయిన్ల మధ్య అనవసరమైన సన్నివేశాలు , డ్యూయెట్లు ఇరికించకుండా బాలన్సుడ్ గా కధనం నడిపిన తీరు బాగుంది . ఓవరాల్ గా దర్శకుడు ఒకే సినిమాలో మూడు జానర్లు తీసుకున్నా ఎక్కడా ఫీల్ చెడకుండా జాగ్రత్తగా స్క్రీన్ ప్లే హ్యాండిల్ చేసిన విధానం బాగుంది .
ఈ మూవీకి కేరళ లొకేషన్లు కూడా చాలా ప్లస్ అవుతాయి . ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో కేరళ అందాలను మరింత అందంగా చూపించిన సినిమా బహుశా ఇదే అవుతుందేమో . గతంలో ఎన్టీఆర్ , శోభన్ బాబు వంటి హీరోల హయాంలో ఊటీ వంటి అందమైన ప్రదేశాలలో షూటింగ్ చేసేవారు . అందుకే ఆనాటి సినిమాలు ‘కన్నులపండువగా ‘ ఉండేవి . డిజిటల్ యుగం వచ్చిన తర్వాత దాదాపు అన్ని సినిమాలు స్టూడియోలలో గ్రాఫిక్ వర్క్ తోనే నడుస్తున్నాయి . అందుకే మనకు నాచురల్ ఫీల్ రావట్లేదు . కానీ థాంక్యూ సుబ్బారావు చూసిన ప్రతిఒక్కరూ కేరళ అందాలకు ఫిదా కావాల్సిందే . ఈ విషయంలో అద్భుతమైన కెమెరా పనితనం చూపించారు .
ఈ మూవీలో మన సుబ్బారావుని హీరో అని చెప్పుకున్నాం కదా అని అతడితో గాల్లో ఎగిరెగిరి ఫైటింగులు గట్రా చేయించకుండా దర్శకుడు తెలివైన పని చేసాడు . ఆ కుర్రాళ్ళ వెనుక మంత్రి ఉన్నాడని తెలుసుకుని అతడ్ని ఎదుర్కోవడం అసాధ్యం అని మాములు మనిషిలానే మాట్లాడతాడు . క్లైమాక్సులోనే అతడిలోని హీరో మనకు కనిపిస్తాడు . నిజం చెప్పాలంటే ప్రీ క్లైమాక్స్ వరకు చూసినప్పుడు మనకు ఎక్కడో థ్రిల్ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది . ఆ లోటును దర్శకుడు క్లైమాక్సులో ఆఖరి సన్నివేశం ద్వారా తీర్చాడు . ఆ ట్విస్ట్ చెప్తే స్పాయిలర్ అవుతుంది . కాబట్టి మూవీలో చూస్తేనే థ్రిల్ ఫీల్ అవుతారు . కానీ అంతటి ట్విస్టును సింపుల్గా మాటల్తో కాకుండా కొంచం విజువలైజ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది . ఎందుకంటే మూవీకి ఆ సన్నివేశమే ఎక్కువ బలాన్ని ఇస్తుంది .
ఎవరెలా చేసారు ?
మొదటి సన్నివేశంలో చంద్రహాస్ ను చూసినప్పుడు హీరో కార్తికేయలా ఉన్నాడేంటా ? అని అనిపించినా మూవీ చూస్తున్నకొద్దీ మనకు కార్తికేయ గుర్తుకురాడు . చంద్రహాస్ మాత్రమే కనిపిస్తాడు . మొదట్లో ఇంత హైట్ ఉన్నాడేంట్రా బాబూ .. మరి ఈయన పక్కన హీరోయిన్ను పెట్టాలంటే ఇంకెంత పొడుగు ఉండాలో అనుకుంటాం . కానీ చంద్రహాస్ .. లావణ్యల జంట చూసినప్పుడు మాత్రం మనకు అలాంటి ఆలోచన రాదు . ఇద్దరి పెయిర్ బాగుంది . హైట్ సంగతి అలా ఉంచితే చంద్రహాస్ నటనలో కూడా పొడుగు మార్కులు కొట్టేసాడు .
ఇక లావణ్య సాహుకార కూడా లీడ్ రోల్ లో బాగా నటించింది . కథాపరంగా సుబ్బారావుకన్నా వైష్ణవికే ఎక్కువ స్కోప్ ఉంటుంది . తనకిచ్చిన రోల్ కి లావణ్య పూర్తి న్యాయం చేసింది . ఇక మూడోవాడు రోహిత్ .. అతడు కూడా తన పాత్రకు న్యాయం చేసాడు .
సాంకేతికత
థాంక్యూ సుబ్బారావులో సాంకేతికత గురించి చెప్పుకోవాలంటే మొదట ఫోటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి . కేరళలోని బ్యూటిఫుల్ లొకేషన్ల చుట్టూ కెమెరాని తిప్పి అద్భుత దృశ్యాలను అందంగా చూపించిన పంకజ్ ఫోటోగ్రఫీ పనితనానికి ప్రకృతి ప్రేమికులు ఫిదా అవ్వాల్సిందే .
తర్వాత చెప్పుకోవాల్సింది ప్రిన్స్ హెన్రి సంగీతం గురించి ..చక్కటి మ్యూజిక్ అందించారు .
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి .
విశ్లేషణ
సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారికి థాంక్యూ సుబ్బారావు మూవీ నచ్చుతుంది . అలా అని మూవీ మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో నడవదు . మధ్యలో కామెడీ ట్రాక్ ఎదురయి మనకి రిలీఫ్ ఇస్తుంది . మరోవైపు లవ్ ట్రాక్ ఎదురయి దిల్ కాస్తా ఫీల్ గుడ్ అవుతుంది . ఇంకోవైపు ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి . ఒక్కమాటలో చెప్పాలంటే దర్శకుడు మెనులో అన్ని ఐటమ్స్ కవర్ చేసాడు .
కానీ అంతిమంగా మనం కనెక్ట్ అయ్యేది సెకండాఫ్ లో వచ్చే మిస్టరీ ట్రాకునే . ఆ ట్రాక్ లేకపోతే థాంక్యూ సుబ్బారావు కూడా రొటీన్ మూవీ అయిపోయేది . ఓవరాల్ గా ఈ మూవీ మిమ్మల్ని డిజప్పాయింట్ చేయదు .
నటీనటులు : చంద్రహాస్ కోట్ల , లావణ్య సాహుకార , రోహిత్ తదితరులు
సంగీతం : ప్రిన్స్ హెన్రి
సినిమాటోగ్రఫీ : పంకజ్
నిర్మాత : దినేష్ కుర్ర
దర్శకత్వం : చెందు ముద్దు
విడుదల : ఆహా ఓటిటి ( 18-06-2026 )
రేటింగ్ : 2.75 / 5
