Photographer Movie 2026 (OTT) Review – డేంజరస్ ఫారెస్టులో ఇరుక్కున్న ఫోటోగ్రాఫర్!

Spread the love

అష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన ఫోటోగ్రాఫర్ తమిళ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ (photographer Movie) సెప్టెంబర్ 25 , 2026 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాకపోతే ప్రస్తుతానికి ఈ సినిమాని ఒరిజినల్ తమిళ్ వెర్షన్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాల్సి ఉంటుంది.

ఫోటోగ్రఫీ మీద ప్యాషన్ తో డేంజరస్ ఫారెస్టులో అడుగుపెట్టిన ఓ ఫోటోగ్రాఫర్ ఎటువంటి అనుభవాలను ఫేస్ చేస్తాడు? అనే పాయింట్ ఆధారంగా దర్శకుడు కథ అల్లుకుని ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇప్పుడు ఫోటోగ్రాఫర్ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కధేంటంటే?

ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న వీరాని (అష్రాఫ్) ఇకపై తన వ్యాపారాలు చూసుకోవాలని అతడి తండ్రి కోరతాడు. కానీ వీరా గోల్ వేరు. చిన్నప్పట్నుంచీ ఫోటోగ్రఫీ మీద ప్యాషన్ పెంచుకుంటాడు. ఏనాటికైనా ఒక అద్భుతమైన ఫోటో తీసి ప్రపంచంలోనే బెస్ట్ ఫోటో అవార్డు సాధించాలని కలలు కంటుంటాడు. అందుకే తన కలలు నెరవేర్చుకోవడానికి ఒక ఆరునెలలు టైమ్ ఇవ్వాల్సిందిగా తండ్రిని కోరతాడు.

ఇదిలా ఉండగా తమిళనాడులోని కొడైకెనాల్ దగ్గర్లో ఉన్న మేడికెట్టన్ సోలై అనే దట్టమైన ఫారెస్టులో బంగారు వృక్షం ఉందని తన స్నేహితుడి ద్వారా తెలుసుకుంటాడు. ఎప్పుడో రెండు వందల ఏళ్ల క్రితం డగ్లస్ అనే ఒక బ్రిటిష్ పాలకుడు ఈ ప్రాంతంలో చెట్లు నాటించాడని .. వాటిలో ఈ బంగారు వృక్షం కూడా ఉందని తెలుసుకుని ఎలాగైనా సరే ఆ వృక్షాన్ని తన కెమెరాలో క్యాప్చర్ చేయాలని ఆ అడవికి బయలుదేరుతాడు.

అయితే ఆ అడవిలోకి వెళ్లిన వ్యక్తులు ఎవరూ ఇంతవరకు ప్రాణాలతో బయటికి రాలేదని.. అందువల్ల అడవిలోకి వెళ్ళాలన్న ఆలోచన మానుకొమ్మని స్థానికులు వీరాని హెచ్చరిస్తారు.

అయినా వీరా వాళ్ళ మాటలు వినకుండా తన కెమెరా తీసుకుని అడవిలోకి వెళ్తాడు. అడవిలోకి వెళ్లిన తర్వాత వీరాకి ఎటువంటి అనుభవాలు ఎదురౌతాయి? ఒంటరిగా అడవిలో ఇరుక్కుపోయిన వీరా చివరికి ఎలా బయటపడతాడు? తను అనుకున్న విధంగా గోల్డెన్ ట్రీ ఫోటో తీసి లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాడా? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసుకున్న కొడుకుని తన వ్యాపారాలు చూసుకోవాల్సిందిగా తండ్రి కోరడంతో సినిమా మొదలౌతుంది. కానీ ఫోటోగ్రఫీ మీద ప్యాషన్ పెంచుకున్న కొడుకు తండ్రి వ్యాపారాలు చూసుకోవడానికి ఆరు నెలలు టైమ్ అడగడం.. తనని ప్రేమిస్తున్న ప్రియురాలికి కూడా అదే విషయాన్ని చెప్పడం..తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి స్నేహితుడి సాయం కోరడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ రొటీన్ ఫార్మాట్లో రన్ అవుతుంది.

కానీ ఎప్పుడైతే కొడైకెనాల్ దగ్గరున్న డేంజరస్ ఫారెస్టులోకి వెళ్లాలని వీరా అనుకుంటాడో అప్పట్నుంచి సినిమా అడ్వెంచర్ జానర్ లోకి టర్న్ అవుతుంది. మెడికెట్టన్ ఫారెస్టులోకి వీరా ఒంటరిగా ఎంటర్ అయిన దగ్గర్నుంచి మూవీ ఆడియన్స్ ని కొంత ఎంగేజ్ చేస్తుంది.

అయితే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అంతే గ్రిప్పింగ్ గా కథనాన్ని ముందుకు నడిపించడంలో దర్శకుడు తడబడ్డాడు. మోస్ట్ డేంజరస్ ఫారెస్ట్ అంటూ ఫస్టాఫ్ లో దర్శకుడు ఆ ఫారెస్ట్ గురించి ఇచ్చిన ఎలివేషన్లు వీరా ఫారెస్టులోకి ఎంటర్ అయిన తర్వాత కనిపించవు. ఒక్కోసారి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని విజువల్స్ చూస్తే హీరో దట్టమైన అడవిలోకి వచ్చాడా? లేకపోతే లోకల్ గార్డెన్ పార్టీకి వచ్చాడా? అనే అనుమానం కూడా వస్తుంది.

చేతిలో గూగుల్ మ్యాప్ పట్టుకుని హీరో ఫారెస్ట్ అంతా తిరుగుతుంటాడు కానీ కథ ఒక్క అడుగు కూడా ముందుకుపోదు. హీరో ఫారెస్టులో ఇరుక్కుపోయాడు. వాట్ నెక్స్ట్? అనే ప్రశ్నకు దర్శకుడు వెంటనే సమాధానం ఇవ్వలేకపోయాడు. డే వన్ హీరో పొద్దున్నే లేవడం మ్యాప్ పట్టుకుని తిరగడం.. రాత్రికి పడుకోవడం.. మళ్ళీ డే టు సేమ్.. తిరిగి డే త్రీ కూడా సేమ్ అవడంతో మనకు కొంత విసుగు వస్తుంది. అంతటి కీకారణ్యంలో ఒకే ఒక్క జంతువు హీరో వెంటబడుతుంది. మిగతా జంతువులన్నీ ఏమైపోయాయో తెలీదు. పైగా దట్టమైన ఆ అడవిలో డబుల్ బ్యారెల్ గన్ పట్టుకుని హీరో వెంటపడే క్యారక్టర్ ఒకటి పంటికింది రాయిలా తగులుకుంటూ ఉంటుంది.

చాలాకాలం క్రితం గిరిబాబు ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో దేవతలారా దీవించండి అనే అద్భుతమైన సినిమా తీశారు. దట్టమైన ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టారు. కానీ ఫోటోగ్రాఫర్ సినిమాలో మనకు అలాంటి ఫీలింగ్ రాదు. దీనికన్నా మలయాళం సినిమాల్లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తీసే సన్నివేశాలు చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తాయి.

తిండి లేక.. నీళ్ళు లేక అడవిలో హీరో పడే కష్టాలను కూడా సరిగా ప్రోజెక్ట్ చేయలేకపోయారు. మరీ బాగోదనుకున్నారో ఏమో హీరోగారు మొత్తంమీద ఓ పుట్టగొడుగును తిన్నట్టు చూపించారు. ఇక మంచినీళ్ళు తాగడమైతే మరీ ఘోరం.. చెట్టు ఆకునుంచి కారిన మూడు చుక్కలను నాకి కడుపు నింపుకున్నట్టు చూపించారు. ఆ మూడు చుక్కలతోనే హీరోగారు మూడు రోజులు అడవిలో తిరగడం గొప్ప విషయం.

అసలుకు హీరో అడవిలోకి అడుగు పెట్టిందే ఫోటోలు తీయడానికి కదా? దర్శకుడు ఆ విషయాన్ని మర్చిపోయి హీరో కష్టాల మీద ఫోకస్ పెట్టి కథనాన్ని నడపడంతో సినిమా చూసే ప్రేక్షకులకు కూడా కష్టాలు మొదలౌతాయి. మూడు రోజుల అడవి ప్రయాణంలో మొత్తంమీద హీరోగారు మూడు ఫోటోలు తీసారేమో? ఇక ఆ మూడో ఫోటో తీయడంతోనే కెమెరా బ్యాటరీ అయిపోవడంతో హీరోగారికి నాలుగో ఫోటో తీసే అవకాశం లేకుండా పోయింది.

కథని పూర్తిగా అడవి బాట పట్టిస్తే బాగోదని అనుకున్నారో ఏమో సడెన్గా మదర్ సెంటిమెంటును తెర మీదికి తీసుకొచ్చారు. చెట్ల గొప్పతనం గురించి తల్లి పాత్రతో చెప్పించిన సంభాషణలు బాగుంటాయి. చెట్లు కూడా తల్లి లాంటివే అనే సందేశానికి హీరో తల్లి పాత్ర ప్రేరణ ఇస్తుంది. అదే సమయంలో ఆ తల్లి పాత్రను ముగించిన తీరు భావోద్వేగ సంఘర్షణలను రేకెత్తిస్తుంది. సినిమాలో తల్లీ కొడుకుల ఎపిసోడ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అవుతుంది.

ఇంతా చేసి హీరో సాధించిన అచీవ్మెంట్ గురించి క్లైమాక్స్ లో గొప్పగా ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు విఫలం అయ్యారు. ఓవరాల్ గా అడవిలో ఫోటోగ్రాఫర్ మాత్రమే ఉంటాడు. ఫోటోలు ఉండవు.

ఎవరెలా చేశారు?

ఈ సినిమా మొత్తంమీద నాలుగైదు పాత్రలే ప్రధానంగా కనిపిస్తాయి. వారిలో హీరో..హీరోయిన్.. హీరో తల్లితండ్రులు.. హీరో స్నేహితుడు.. హీరో గైడ్ పాత్రలు ఉంటాయి.
కానీ దాదాపు సినిమా మొత్తం కనిపించేది వీరా పాత్ర పోషించిన అష్రాఫ్ మాత్రమే. ఈ సినిమాకి రచయిత , దర్శకుడు , హీరో కూడా అతడే. అందుకే ఈ సినిమా కోసం బాగానే కష్టపడినట్టున్నాడు కానీ సరైన ఔట్పుట్ రాలేదనిపిస్తుంది. హీరో పాత్రని ఇంకాస్త పెర్ఫెక్ట్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది.
మిగిలినవాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతికత

రాజ్ కుమార్ చంద్రశేఖరన్ అందించిన సంగీతం బాగానే ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అందించిన బిజిఎం సినిమాకి ప్రధాన బలం అవుతుంది.
రయీజ్ అహ్మద్ అందించిన సినిమాటోగ్రఫీ యావరేజ్ గా ఉంది. అడవిలో చిత్రీకరించే సన్నివేశాలను ఇంకా బాగా విజువలైజ్ చేసి ఉండాల్సింది.
నిర్మాణ విలువలు కూడా పర్లేదు.

విశ్లేషణ

ఫోటోగ్రఫీ మీద హీరోకి గొప్ప ప్యాషన్ ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేసిన దర్శకుడు అతడి అచీవ్మెంట్ మీద కూడా అంతే గొప్పగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. ఏదైనా ఒక రంగం మీద హీరో ప్యాషన్ పెంచుకోవడం.. తన లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం అవమానాలు పడటం..కష్టపడటం.. చివరికి అనుకున్న గోల్ సాధించి గొప్పవాడు అవడం గతంలో చాలా సినిమాల్లో చూసేసాం.

ఫోటోగ్రాఫర్ సినిమాలో కూడా హీరోకి లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం కష్టపడతాడు. ఆ తర్వాత కథ ఇక్కడే గిరికీలు కొడుతుంది. మనం హీరో కష్టాలు చూడటంతోనే మూడొంతుల సినిమా అయిపోతుంది. అదే ఈ సినిమాకి మైనస్.

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కథనాన్ని ఇంకా బాగా నడిపేందుకు దర్శకుడికి స్కోప్ ఉంది. సినిమాలో ఊహించని ట్విస్టులు.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోవడం ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేస్తుంది.
ఓవరాల్ గా వన్ టైమ్ వాచ్ మూవీ కింద సినిమా చూసేవాళ్ళు ప్రైమ్ లో అందుబాటులో ఉన్న ఈ మూవీపై ఓ లుక్కేయండి.

నటీనటులు: అష్రాఫ్ , కరుణాకరన్ , కల్పడై జై తదితరులు
సంగీతం: రాజ్ కుమార్ చంద్రశేఖరన్
సినిమాటోగ్రఫీ: రయీజ్ అహ్మద్
నిర్మాత: అబ్దుల్ బాసిత్
దర్శకత్వం: అష్రాఫ్
ఓటిటి : అమెజాన్ ప్రైమ్
విడుదల: 25-09-2026
రేటింగ్: 2/5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *