బ్లాస్ట్ జోన్ యాక్షన్ మూవీ (OTT) రివ్యూ !

Spread the love

బ్లాస్ట్ జోన్ మూవీ గురించి చెప్పుకోవాలంటే ముందు యాక్షన్ కింగ్ అర్జున్ గురించి చెప్పుకోవాలి . హీరోగా అర్జున్ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు . చాలామంది హీరోలు రీల్ లైఫ్ లో కరాటే వీరులు . కానీ కొంతమంది హీరోలు మాత్రమే రియల్ లైఫ్ లో కూడా కరాటే వీరులు . అందులో అర్జున్ కూడా ఒకరు . తన సినిమా కెరీర్ ప్రారంభంలో ఫైటింగ్ కంపోజింగ్ లో కరాటే ఉండేలా చూసుకునేవాడు . కరాటే మీద అర్జున్ కున్న ప్యాషన్ సినిమా ,సినిమాకి పెరిగిందేకానీ తగ్గలేదు.

మళ్ళీ చాలాకాలం ద్వారా బ్లాస్ట్ జోన్ మూవీ ద్వారా అర్జున్ కరాటే మాస్టర్ అవతారం ఎత్తాడు. మామూలుగానే అర్జున్ కు యాక్షన్ కింగ్ అని పేరుంది . దానికి తోడు కరాటే మాస్టర్ లాంటి పవర్ ఫుల్ రోల్ లో నటించడంతో అభిమానుల్లో ఈ మూవీ మీద అంచనాలు పెంచింది .

ఇప్పుడు బ్లాస్ట్ జోన్ మూవీ ఎలా ఉందో చూద్దాం .

కధేంటంటే ?

రాజారామ్ ( అర్జున్ ) కరాటే ఇన్స్టిట్యూట్ పెట్టి పిల్లలకు కరాటే నేర్పుతుంటాడు . ఇతనికి కూతురు నీల ( ప్రీతి ముకుందన్) అంటే ప్రాణం . కూతురికి చిన్నతనం నుంచే ఆత్మరక్షణ పద్దతుల గురించి నేర్పుతాడు . అందులో భాగంగా కూతురికి కూడా కరాటే ట్రైనింగ్ ఇస్తాడు. నీల తల్లి ( అభిరామి ) కూడా పెళ్ళికి ముందే కరాటే నేర్చుకుని పోటీలలో రాజారామ్ నే ఓడిస్తుంది . రాజారామ్ ఒకపక్కన కరాటే ఇన్స్టిట్యూట్ నడుపుతూనే మరోవైపు నీల బాబాయికి చెందిన మెడికల్ షాప్ కూడా నడుపుతుంటాడు .

తండ్రి శిక్షణలో నీల కరాటేలో ప్రావీణ్యం సంపాదిస్తుంది . ఓ రోజు హోటల్లో జరిగిన గొడవలో తండ్రి ఒక చిన్న కుర్రాడ్ని కాపాడటంతో , ‘ ఆ కుర్రాడు నీకు తెలుసా? ‘ అని తండ్రిని అడుగుతుంది . ‘ఎవరికైనా అన్యాయం జరుగుతుంది అని తెలిసినప్పుడు మనకి తెలిసినవాళ్ళు కాదు కదా అని చూసి వదిలేయకూడదు . పోరాడి అయినా సరే వాళ్ళకి న్యాయం చేయాలి ‘ అని తండ్రి చెప్పడంతో నీల ఆ మాటలు గుర్తుపెట్టుకుంటుంది .

అందుకే పెరిగి పెద్దయిన నీల ఓ ముసలవ్వ స్థలాన్ని కబ్జా చేయాలని చూసిన రౌడీలతో పోట్లాడి మరీ ఆమె స్థలాన్ని తిరిగి ఇప్పిస్తుంది . చదువు పూర్తి అయిన తర్వాత జాబ్ లో చేరుతుంది కానీ తన ఆటిట్యూడ్ మార్చుకోదు .

ఇదిలా ఉండగా ఓ రోజు బాబాయ్ బయటికి వెళ్లడంతో నీల మెడికల్ షాపులో కూర్చుంటుంది. కృపాకర్ అనే రౌడీ మెడికల్ షాపుకు వచ్చి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒక మెడిసిన్ అడుగుతాడు . దాంతో ప్రిస్క్రిప్షన్ లేనిదే మెడిసిన్ ఇవ్వనని నీల చెప్పడంతో ఇద్దరికీ గొడవ అవుతుంది . గొడవ తర్వాత పోలీసులు వచ్చి కృపాకర్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు . కృపాకర్ ను మెడిసిన్ కోసం పంపిన గ్యాంగ్ స్టర్ అబ్రహం (అర్జున చిదంబరం) నీలను వెతుక్కుంటూ బయలుదేరతాడు .

కృపాకర్ కు , అబ్రహం కు ఉన్న కనెక్షన్ ఏంటి ?
గ్యాంగ్ స్టర్ అబ్రహం నీల ఇంటికి ఎందుకు వెళ్తాడు ?
భార్య , కూతురు సాయంతో రాజారామ్ ఆ గ్యాంగును ఎలా ఎదుర్కొంటాడు ?
ఏడువేల కోట్ల మైనింగ్ డీల్ కుదుర్చుకున్న వరుణ్ కి , గ్యాంగ్ స్టర్ అబ్రాహానికి ఉన్న లింకేంటి ?
అబ్రహం దగ్గర ఉన్న వంద రూపాయల నోటుకు , ఏడువేల కోట్ల రూపాయల డీల్ కు ఉన్న కనెక్షన్ ఏంటి ? అనేది మిగిలిన కథ

ఎలా ఉంది ?

మూవీ స్టార్టింగ్ కూతురికి తండ్రి నేర్పించే ఆత్మరక్షణ పాఠాలతో మొదలౌతుంది . ప్రతి ఆడపిల్ల జీవితంలో ధైర్యంగా ఎదగాలని రాజారామ్ కూతురికి చెప్తుంటాడు . అందుకే చిన్నప్పట్నుంచి తన కూతురికి కరాటే నేర్పిస్తూ ఉంటాడు . భార్య , భర్త , కూతురు , బాబాయిలతో కలిపి ఒక ఫ్యామిలీ స్టోరీలా మొదలౌతుంది . కాకపోతే అసలు కథ వేరు . ఆ కథలోకి రావడానికి దర్శకుడు కొంత టైమ్ తీసుకున్నాడు . నీల చిన్నప్పుడు కరాటే నేర్చుకోవడం , పెద్దయ్యాక రౌడీలతో గొడవ పడటం , తల్లి మందలించడం , తండ్రి సపోర్ట్ చేయడం , బాబాయ్ మెడికల్ షాప్ వ్యవహారాలతో మొదటి ముప్పై నిముషాలు ఫక్తు ఫ్యామిలీ స్టోరీ నడుస్తుంది .

ఎప్పుడైతే కృపాకర్ అనే రౌడీ మెడికల్ షాపులోకి వచ్చి నీలతో గొడవ పడతాడో అప్పట్నుంచి స్టోరీ యాక్షన్ మోడ్ లోకి వెళ్తుంది . కృపాకర్ ను వెతుక్కుంటూ ఐదుగురు రౌడీలు నీల ఇంటికి రావడం , కరాటే ఫైటర్లు అయిన రాజారామ్ కుటుంబం వాళ్ళని మట్టుబెట్టడంతో యాక్షన్ ఘట్టాలు కంటిన్యూ అవుతాయి . వీళ్ళ తర్వాత గ్యాంగ్ స్టర్ అబ్రహం కూడా నీల ఇంటికి వెతుక్కుంటూ రావడం , అక్కడ అతడ్ని కూడా కొట్టి బంధించడం , అసలు ఈ రౌడీలు తమవెంట ఎందుకు పడుతున్నారో తేల్చుకోవాలని కూతుర్ని వెంటపెట్టుకుని రాజారామ్ నేరుగా అబ్రహం గ్యాంగ్ లోని రౌడీల స్థావరానికి వెళ్లడం , అక్కడ దీనివెనుక ఉన్న మాస్టర్ మైండ్ వరుణ్ గురించి , అతడి అక్రమ మైనింగ్ డీల్ గురించి కూడా తెలుసుకోవడం వరకు యాక్షన్ సన్నివేశాలు నాన్ స్టాప్ గా పరుగులు పెడతాయి .

సెకండాఫ్ లో ఒకదానివెనుక ఒకటిగా వచ్చే యాక్షన్ సన్నివేశాలు తరువాతి సన్నివేశం మీద ఉత్సుకత పెంచేలా చేస్తాయి . ఒకపక్కన అబ్రహం కోసం పోలీసుల వెతుకులాట , మరోపక్క వరుణ్ గ్యాంగ్ కోసం రాజారామ్ వెతుకులాటలో కధనం పరుగులు పెడుతుంది .

ఫైనల్గా క్లైమాక్స్ మాత్రం రొటీన్ ఫార్మాట్ లోనే ముగుస్తుంది . ఆ మాటకొస్తే కథ కూడా కొత్తదేమీ కాదు . గతంలో ఇలాంటి కథలతో కొన్ని సినిమాలు వచ్చాయి . కాకపోతే ఈ మూవీకి స్క్రీన్ ప్లే అడ్వాంటేజ్ అవుతుంది . సెకండాఫ్ లో ఎక్కడా బోర్ కొట్టకుండా కథను పూర్తిగా యాక్షన్ మోడ్ లో నడపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు .

అలా అని దర్శకత్వంలో లోటుపాట్లు లేవని కాదు . ఒకేసారి ఇరవై మంది రౌడీలు కత్తులు కటార్లతో రాజారామ్ ఇంటికి వస్తే , రాజారామ్ భార్య , నీల అంకుల్ లు ఇద్దరు కలిసి ఉట్టి చేతులతో రౌడీలను చితకబాదటం ‘ అతి ‘ మీరిన ఫైటింగుకు పరాకాష్ట . ఇందులో ఎక్కడా సహజత్వం ఉండదు . అదేంటి వాళ్ళ చేతుల్లో కత్తులు ఉన్నాయి కదా ? మరి ఈ ఇద్దరు చేతిలో ఆయుధాలు గట్రా లేకుండా వాళ్ళని ముక్కు పగిలేలా పడేసి ఎలా కొట్టారు ? అలాగే క్లైమాక్స్ ఫైటింగులో కూడా వరుణ్ చుట్టూ రివాల్వర్లు పట్టుకుని బాడీ గార్డులు ఉన్నా రాజారామ్ , నీలల మీద ఒక్క బుల్లెట్ కూడా వాలదు . అదెలా సాధ్యం లాంటి లాజిక్కులు వెతకకుండా చూస్తే ఆ ఫైటింగ్ కూడా బాగుంటుంది .

అన్నట్టు లాజిక్ అంటే గుర్తుకొచ్చింది . పోలీస్ వ్యవహారాల్లో కూడా మనం లాజిక్కులు వెతకకూడదు . గతంలో ఓ హోటల్లో ఇరవైమందిని చంపిన గ్యాంగ్ స్టర్ గురించి అతడి ఫోటో చూసేదాకా పోలీస్ కమిషనర్ కి తెలీదు . పోలీస్ కస్టడీలో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అతడు ఇరవై మంది పోలీసులను చంపి పారిపోయాడంటే అతడి ఫోటో టీవీ వార్తల్లో వచ్చి ఉంటుంది కదా ? అంతటి నోటోరియస్ క్రిమినల్ గురించి పోలీస్ రికార్డులలో లేకపోవడం ఆశ్చర్యంగా ఉంటుంది . పైగా ఆ గ్యాంగ్ స్టర్ కూడా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఒంటరిగా వెళ్తాడు . కానీ పోలీసులకి మాత్రం దొరకడు .

ఇలాంటి లాజిక్కులను పక్కనబెడితే మూవీ ఫస్టాఫ్ యావరేజ్ , సెకండాఫ్ ఇంట్రెస్టింగ్ అనేలా ఉంటుంది .

ఎవరెలా చేసారు ?

రాజారామ్ పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒదిగిపోయాడు . పైగా కెమెరా పనితనమో? ఫిట్నెస్ మహత్యమో తెలీదు కానీ అర్జున్ వింటేజ్ లుక్ లో మెరిశాడు . తండ్రి పాత్రలోను ..భర్త పాత్రలోనూ ఫ్యామిలీ మ్యాన్ టైపులో పర్ఫెక్ట్ గా నటించాడు . రౌడీలతో తలపడేటప్పుడు మాత్రం మరోసారి యాక్షన్ కింగ్ అవతారం ఎత్తాడు .

రాజారామ్ భార్యగా అభిరామి నటన బాగుంది . కానీ ఆమె ఫ్లాష్ బ్యాక్ గురించి కేవలం మాటలతో సరిపుచ్చకుండా చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి ఉంటే బాగుండేది . తల్లి పోరాటపటిమ గురించి కూతురితో రాజారామ్ పదేపదే చెప్తాడు . కానీ తల్లిమాత్రం కూతుర్ని గొడవలకు వెళ్ళొద్దని సగటు ఇల్లాలి మాదిరి మాట్లాడుతుంది . ఇదొక్కటే ఆమె క్యారక్టరైజేషన్ లో లోపం అనిపిస్తుంది .

నీల పాత్రలో ప్రీతి ముకుందన్ నటన కూడా బాగుంది . కాకపోతే ఆమె క్యారక్టర్ కేవలం ఫైటింగుల వరకే పరిమితం చేయకుండా విస్తరించి ఉంటే బాగుండేది .

సాంకేతికత

ఈ మూవీలో రవి బన్సూర్ అందించిన బీజీఎమ్ గురించి ముందుగా చెప్పుకోవాలి . కెజిఎఫ్ లో తన మార్క్ బీజీఎమ్ తో కుర్రకారును ఊపేసిన రవి మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసారు .
అరుణ్ రాధాకృష్ణన్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది . ముఖ్యంగా కొండప్రాంతంలోని విలేజ్ బ్యాక్ డ్రాప్ ను తన కెమెరాతో మరింత అందంగా క్యాప్చర్ చేసారు .
నిర్మాణవిలువలు కూడా బాగానే ఉన్నాయి .

విశ్లేషణ

పూర్తిస్థాయి యాక్షన్ మూవీలను ఇష్టపడేవారికి బ్లాస్ట్ జోన్ నచ్చుతుంది . ఇందులో కథ కన్నా కధనం ప్రాముఖ్యత వహిస్తుంది . మొదటి ముప్పైనిమిషాలదాకా మూవీ అసలు కథలోకి వెళ్ళదు . రాజారామ్ ఫ్యామిలీ చుట్టూనే కథ తిరుగుతుంది .

సెకండాఫ్ లో మాత్రం రాజారామ్ ఫ్యామిలీ వెర్సస్ వరుణ్ గ్యాంగ్ చుట్టూ కథ నడుస్తుంది . ఈ భాగంలో వచ్చే యాక్షన్ సీన్స్ అలరిస్తాయి . చాలాకాలం తర్వాత అర్జున్ లోని యాక్షన్ హీరోని మరోసారి చూస్తాం . ఈ మూవీకి అర్జున్ నటన కూడా ప్లస్ అవుతుంది . పోలీస్ సన్నివేశాలలోనూ , ఫైటింగులలోనూ కొన్ని లాజిక్కులు మిస్ అయి మనల్ని డిజప్పాయింట్ చేస్తాయి . చిన్నచిన్న లోపాలను పక్కనబెడితే రాజారామ్ కుటుంబంలో నలుగురూ ధైర్యంగా విలన్ గ్యాంగును ఎదుర్కుంటారు అనే పాయింటును ఫోకస్ చేస్తూ దర్శకుడు కధనాన్ని నడిపించిన తీరు బాగుంది . ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కూడా లేకుండా చూడొచ్చు .

నటీనటులు : అర్జున్ , అభిరామి , ప్రీతి ముకుందన్ తదితరులు
సంగీతం : రవి మన్సూర్
సినిమాటోగ్రఫీ : అరుణ్ రాధాకృష్ణన్
దర్శకుడు : సుభాష్ కె రాజ్
విడుదల : నెట్ ఫ్లిక్స్ ఓటిటి (25-06-2026)
రేటింగ్ : 2.75 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!