జయముంది భయమేల మనసా యూత్ ఎంటర్టైనర్ మూవీ జూన్ 18 న నేరుగా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది . టీజర్ చూడగానే ఇదేదో యూత్ కి కనెక్ట్ అయ్యే కధే అని తెలుస్తుంది . తమ తమ లక్ష్యాలను సాధించుకుని జీవితంలో సెటిల్ అవడానికి ప్రయత్నించే ముగ్గురు స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుంది . కథ హైద్రాబాదు నుంచి రోడ్ ట్రిప్ తో మొదలై ముంబై చేరుకోవడంతో ముగుస్తుంది .
ఇందులో నటించిన ముగ్గురు కుర్రాళ్ళు వెండితెరకు కొత్తవాళ్లే . ఆ కొత్తవాళ్లతో దర్శకుడు సాగించిన ప్రయాణమే జయముంది భయమేల మనసా మూవీ .
ఇప్పుడు మూవీ ఎలా ఉందో చూద్దాం .
కధేంటంటే ?
బీటెక్ పూర్తిచేసిన ముగ్గురు స్నేహితులు వరుణ్ , కిరణ్ , సురేష్ లది ఒక్కొక్కరిది ఒక్కో కథ . వరుణ్ కి మంచి స్టోరీ రైటర్ గా ఎదగాలని కోరిక . కానీ ఎంతోమంది ప్రొడ్యూసర్లని సంప్రదించినా అతడి కధలను వినటానికి ఎవరూ ముందుకురారు . యూ ట్యూబర్ గా ఎదగాలని సురేష్ లక్ష్యం. సరైన కంటెంట్ పడక అతడు పూర్తిగా క్లిక్ కాలేకపోతాడు. కానీ కిరణ్ మాత్రం విఫల ప్రేమికుడిగా ఏ లక్ష్యం మీద కాన్సంట్రేషన్ చేయలేక కుమిలిపోతుంటాడు.
ఒకపక్క వరుణ్ ను జాబ్ చేసుకోమని అతడి తండ్రి రోజూ పోరుతూ ఉంటాడు . కానీ ఎప్పటికైనా తాను పెద్ద రైటర్ గా ఎదగాలని వరుణ్ ఆలోచిస్తుంటాడు . లవ్ బ్రేకప్ అయి కిరణ్ , యూ ట్యూబర్ గా క్లిక్ కాలేక సురేష్ , రైటర్ అవ్వాలని వరుణ్ మానసిక వత్తిడితో ఉంటారు .
అందుకే ఈ వత్తిడి నుంచి బయటపడి చిల్ అవడానికి ఎక్కడికైనా రోడ్ ట్రిప్ వేయాలని ముగ్గురు మిత్రులు నిర్ణయించుకుంటారు . పూణే దగ్గర ఉన్న హిల్ స్టేషన్ అయితే రిలాక్స్ అవ్వొచ్చని సురేష్ చెప్పడంతో ముగ్గురూ హైద్రాబాదు నుంచి పూణెకి సైకిళ్ళ మీద బయలుదేరతారు . ఈ ప్రయాణంలో వాళ్ళకెదురైన అనుభవాలే మిగిలిన కథ .
ఎలా ఉంది ?
కధలా చెప్పుకుంటే ఇందులో ఏమీ ఉండదు . ముగ్గురు స్నేహితుల ప్రయాణపు అనుభవాలు చెప్పుకుంటే బోలెడు ఉంటాయి . కధలో ముగ్గురు స్నేహితులకీ ఒక్కో సమస్య ఉంది . ఒక్కో లక్ష్యం కూడా ఉంది . ఎవరి ఆలోచనలు వాళ్ళవి . ఎవరి అనుభవాలు వాళ్ళవి. మూవీ ప్రారంభంలో ముగ్గురి మధ్య సమాంతరంగా మొదలైన కథ , మధు అనే అమ్మాయి రాకతో వరుణ్ పాత్ర ప్రధానంగా సాగుతుంది .
వరుణ్ చదువు పూర్తిచేసుకోవడం , ఉద్యోగం చేసుకోమని తండ్రి పోరడం వంటి రొటీన్ ఫార్మాట్ లోనే ఈ మూవీ కథ కూడా మొదలౌతుంది . ముగ్గురూ కలిసి రోడ్ ట్రిప్ వేసి చిల్ అవ్వాలని సైకిళ్ళ మీద బయలుదేరడం , దారిలో హల్ట్ చేస్తూ ముందుకు సాగడం వంటి సన్నివేశాలు చూసినప్పుడు ట్రావెలర్ బ్లాగ్ చూస్తున్నట్టు అనిపిస్తుంది . మనం ఇప్పటికే యూ ట్యూబ్ వీడియోల్లో ఇలాంటి ట్రావెలాగ్ వీడియోలు చాలా చూసే ఉంటాం . మళ్ళీ మూవీ ఫస్టాఫ్ లో కూడా అలాంటి సన్నివేశాలు రిపీట్ అవుతున్నట్టు అనిపించి బోర్ ఫీల్ అవుతాం . కధనంలో కొత్తదనం లేకపోగా యూ ట్యూబ్ వీడియోలు చూస్తున్న ఫీలింగ్ రావడంతో డిజప్పాయింట్ అవుతాము . ఇలా ఫీల్ అవుతామని దర్శకుడు ఊహించాడేమో సురేష్ చేత తమ ట్రావెల్ విశేషాలను యూ ట్యూబ్ లో అప్లోడ్ చేయిస్తున్నట్టు సన్నివేశాలను కలిపారు .
ఎప్పుడైతే కథలోకి మధు అనే అమ్మాయి ప్రవేశిస్తుందో కధనం లవ్ ట్రాక్ లోకి మళ్లుతుంది . స్కూల్లో చదువుకునే రోజుల్లో వరుణ్ , మధుని ప్రేమించడం , కానీ ఆ విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పలేక భయపడటం , స్కూల్ చదువులు ముగిసి ఎవరిదారిన వాళ్ళు వెళ్లిపోవడం వంటి సన్నివేశాలతో కథ ఫీల్ గుడ్ ట్రాక్ లోకి వస్తుంది .
ముగ్గురు మిత్రుల రోడ్ ట్రిప్ గురించి యూ ట్యూబ్ వీడియోలలో చూసిన మధు వరుణ్ కి ఫోన్ చేయడం , పుణేలో తనని కలవమని కోరడంతో స్టోరీ ముగ్గురు మిత్రుల నుంచి వరుణ్ వెర్సస్ మధుల చుట్టూ తిరుగుతుంది . దర్శకుడు వాళ్ళిద్దరి మధ్య నడిపిన లవ్ ట్రాక్ బాగుంది . అన్నేళ్లు అయినా వరుణ్ లో భయం పోలేదు . తాను మధును ప్రేమిస్తున్నాని అప్పుడైనా ధైర్యంగా ఆమెకు చెప్పలేకపోతాడు . అందుకే దర్శకుడు టైటిల్లో భయమేల అని వరుణ్ ను ఉద్దేశించే పెట్టి ఉంటాడు . ఇక ఇద్దరి ప్రేమికుల ఎడబాటు ఊహించినట్టే ఉండటంతో కొత్తదనం అనిపించలేదు . ఇలాంటి ఎడబాట్లు గతంలో చాలా సినిమాల్లో చూసేసాం . ఆల్రెడీ మొదట్లోనే కిరణ్ బ్రేకప్ చూపించిన దర్శకుడు చివరికి వరుణ్ లవ్ ఫెయిల్యూర్ కూడా చూపించడం కధకి సరిగా సింక్ అవలేదు . వరుణ్ ప్రేమ విషయంలో దర్శకుడు ఎటువంటి మ్యాజిక్కుల జోలికి వెళ్లకుండా రొటీన్ ఫార్మాట్లో క్లోజ్ చేసేసారు . దర్శకుడు వరుణ్ భయం మీద పెట్టిన ఫోకస్ లవ్ ట్రాక్ మీద కూడా పెట్టి ఉంటే బాగుండేది. దాంతో కధలో ఎక్కడో ఫీల్ చెడిన భావన వచ్చింది .
ఇప్పుడు కిరణ్ సరసన వరుణ్ కూడా చేరతాడు . చివరికి ముగ్గురు స్నేహితులూ ముంబైకి చేరతారు . ఈ ప్రయాణంలో తమకు ఎదురైన అనుభవాలను తల్చుకుని కన్నీరు పెట్టుకుంటారు . నవ్వుకుంటారు . చివరికి జీవితమంటే నచ్చినట్టు బతకడమే అనుకోవడంతో ముగుస్తుంది .
ఎవరెలా చేసారు ?
ఈ మూవీలో నటించిన ముగ్గురు కుర్రాళ్ళు నూతన నటులు అన్నారు కానీ మూవీ చూసినవాళ్ళకి అలా అనిపించదు . ఎంతో అనుభవం ఉన్న నటుల్లా చాలా సహజంగా నటించారు . ముగ్గురూ పోటీపడి నటించారు .
వరుణ్ ఫేసులో ఏదో మ్యాజిక్ ఉంది. ఒక్కోసారి అతి మంచితనంతో గుడ్ బాయ్ లా అనిపిస్తాడు . ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయలేని పిరికివాడిలా చూసినప్పుడు జాలేస్తుంది . ఫ్రస్టేషన్ వచ్చి స్నేహితుడ్ని తిట్టడం , అంతలోనే ఫ్రెండ్షిప్ గుర్తొచ్చి హగ్ చేసుకునే గుడ్ ఫ్రెండ్ పాత్రలో చూస్తే ఫీల్ గుడ్ అనిపిస్తుంది .
అలాగే భగ్న ప్రేమికుడి పాత్రలో కిరణ్ ఒదిగిపోయాడు . కధలో భావోద్వేగాలను పంచటానికి అతడి పాత్ర ఉపయోగపడింది .
ఇక సురేష్ పాత్ర కామెడీ పండించటానికి ఉపయోగపడింది . ముగ్గురు స్నేహితులూ కలిసి ఓవరాల్ గా సినిమాకి కావాల్సిన దినుసులను అందించారు .
సాంకేతికత
సాంకేతికత గురించి చెప్పుకోవాలంటే ముందుగా ఫోటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి . వర్షం సన్నివేశాలలో మల్టీ కలర్ షేడ్స్ లో సన్నివేశాలను క్యాప్చర్ చేసి కలర్ ఫుల్ చేసారు . ఈ విభాగంలో చక్కటి కెమెరా పనితనం అందించిన దిలీప్ కుమార్ కి పూర్తి మార్కులు పడతాయి .
కళ్యాణ్ నాయక్ అందించిన సంగీతం బాగానే ఉంది .
నిర్మాణ విలువలు పర్లేదు .
విశ్లేషణ
జయముంది భయమేల మనసా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ గా యువతరానికి కనెక్ట్ అవుతుంది . ఓవరాల్ గా ఇందులో కథ కన్నా కధనం బాగుంది . కాకపోతే ఫస్టాఫ్ లో సాగతీత సన్నివేశాలతో బోర్ కొడుతుంది . ఎంతకీ అసలు కథలోకి వెళ్లక ముగ్గురు మిత్రుల సైకిల్ యాత్ర చుట్టూ కధనం నడిపి దర్శకుడు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాడు . మూవీ అంతా ట్రావెలర్ గైడ్ మాదిరే నడుస్తుందా అని విసుగొస్తుంది . ఫస్టాఫ్ లో దర్శకుడు కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది .
సెకండాఫ్ లో లవ్ ట్రాక్ ఎంటర్ అవడం , మిత్రుల మధ్య భావోద్వేగ సన్నివేశాలు ఉండటం , ఇంట్రెసింగ్ గా అనిపిస్తాయి . ప్రయాణంలో మిత్రులు గొడవపడటం , మళ్ళీ అంతలోనే కలిసిపోవడం , స్నేహితుల బాండింగ్ గుర్తుచేస్తుంది . ఇందులో ఒక సన్నివేశం బాగుంటుంది . ఫ్రస్టేషన్ లో ఉన్న వరుణ్ సిగరెట్ వెలిగించుకుందామని జేబులోనుంచి సిగరెట్ తీసుకుని అగ్గిపెట్టె గురించి చూసుకుంటే కనపడదు . అసలే పూణే వెళ్లలేమన్న టెన్షన్ లో ఉన్న వరుణ్ కి కోపం వచ్చి అంతా నీవల్లే జరిగిందని కిరణ్ ను విసుక్కుంటాడు . కానీ కిరణ్ మాత్రం వరుణ్ అగ్గిపెట్టె కోసం విసుక్కుంటున్నాడేమో అనుకుని జేబులోనుంచి అగ్గిపెట్టె తీసి అతడికిస్తాడు . ఇది చూసి సురేష్ పగలబడి నవ్వుతాడు . వరుణ్ కూడా నవ్వు ఆపుకోలేక కిరణ్ని పట్టేసుకుని హాయిగా నవ్వేస్తాడు . ఇలాంటి ఫ్రెండ్షిప్ బాండింగ్ సన్నివేశాలు చూసినప్పుడు మనకి కూడా కొన్ని జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి . దర్శకుడు ముగింపు మీద కూడా మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది . సందేశం ఇచ్చి సింపుల్గా ముగించేశారు . ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న జయముంది భయమేల మనసా మూవీని వన్ టైమ్ వాచ్ కింద ఓ లుక్ వేయొచ్చు .
నటీనటులు : భరణ్ , రవి , రాజేష్ తదితరులు
సంగీతం : కళ్యాణ్ నాయక్
సినిమాటోగ్రఫీ : దిలీప్ కుమార్
నిర్మాత : శ్యామ్ దొండపాటి
దర్శకత్వం : రంజిత్ పాశం
విడుదల : ఈటీవీ విన్ ( 18-06-2026 )
రేటింగ్ : 2 / 5
