ఫేసెస్ (FACES) మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ (OTT) మూవీ రివ్యూ !

Spread the love

సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో మరో మలయాళం సినిమా ఓటిటిలో (sun next) స్ట్రీమింగ్ కి వచ్చి మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది . ప్రేమ , సంఘర్షణ , మిస్టరీ వంటి అంశాలను ప్రధానంగా తీసుకుని రూపొందించిన ఫేసెస్ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది .

లవ్ స్టోరీతో మొదలైన మూవీ హీరోయిన్ సైకలాజికల్ డిజార్డర్ తో సస్పెన్స్ మోడ్ లోకి వెళ్లి హీరో మిస్సింగ్ తో మిస్టరీలోకి టర్న్ అవుతుంది . ఇందులో హీరోయిన్ ఎవర్ని చూసినా వాళ్లలో తన ప్రియుడి ముఖమే కనిపించడం అనే ఆసక్తికర పాయింటుతో దర్శకుడు కధనాన్ని మొదలుపెడతాడు . అందుకే మూవీకి ఫేసెస్ అనే యాప్ట్ టైటిల్ పెట్టినట్టున్నారు.

ఇప్పుడు ఫేసెస్ మూవీ (Faces movie ) ఎలా ఉందో చూద్దాం .

కధేంటంటే ?

మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీల్లో గమ్మత్తు ఏంటంటే ఏ కథనైనా క్రైమ్ తోనో , మిస్టరీతోనో మొదలుపెడతారు . ఇందులో కూడా హీరోయిన్ ఇంట్లో జరిగిన పేలుడుతో మూవీ మొదలౌతుంది .

నిత్య ( హన్నా రేజి కోషి ) మొబైల్ కోసం వెతుకుతూ వేరే ఫోనుతో రింగ్ ఇస్తుంది . గదిలో ఒక మూల ఉన్న చెక్క కిందనుంచి రింగ్ టోన్ వినిపించడంతో చెక్కను పక్కకు జరిపి చూస్తుంది. అయితే ఫోన్ కనిపిస్తుంది కానీ ఒక్కసారిగా పేలుడు సంభవిస్తుంది .

దాంతో తలకు గాయాలతో హాస్పిటల్లో చేరుతుంది . తలకు తగిలిన దెబ్బతో ఆమెకు జ్ఞాపకశక్తి తగ్గుతుంది . అదేకాకుండా మగవాళ్లలో ఎవర్ని చూసిన వాళ్లలో ఆమెకు తన ప్రియుడు మైకేల్ ( కలేష్ రామానంద్ ) ముఖమే కనిపిస్తుంటుంది . నిత్య.. మైకేల్ ని ప్రేమించి అతడితో లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటుంది . ఇద్దరూ కలిసి మైకేల్ ఇంట్లోనే కలిసి ఉంటారు . కానీ ఇంట్లో ఆ పేలుడు జరిగినదగ్గర్నుంచి నిత్య ప్రియుడు మైకేల్ కనిపించకుండా పోతాడు . ఇదిలా ఉండగా ఆమెకు చికిత్స చేసిన డాక్టర్లు తలకు తగిలిన గాయం కారణంగా నిత్యకు సైకలాజికల్ డిజార్డర్ ఏర్పడిందని , మందులు రాసిచ్చి డిశ్చార్జి చేస్తారు.

ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎవర్ని చూసినా ఆమెకు మైకేల్ ముఖమే కనిపించడంతో సంఘర్షణ అనుభవిస్తుంది . దాంతో మనుషుల్ని పోల్చుకోవడానికి తనఫోనులో ఫేస్ రికగ్నిషన్ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటుంది . అలా సంఘర్షణ అనుభవిస్తూనే ఒకరోజు తిరిగి మైకేల్ తో కలిసి ఉన్న ఇంటికి వెళ్తుంది . అక్కడ మైకేల్ ఉండడు కానీ ఆమెకు కొన్ని అనుకోని అనుభవాలు ఎదురౌతాయి .

అసలు నిత్య ఇంట్లో పేలుడు ఎలా జరిగింది ?
ఆ పేలుడుకి , మైకేల్ కి కనెక్షన్ ఏమన్నా ఉందా ?
పేలుడు జరిగిన తర్వాత ఎవరికీ కనిపించకుండా మైకేల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు ?
మైకేల్ కనిపించకుండా వెళ్లిపోవడంతో నిత్య ఏం చేస్తుంది ?
చివరికి మైకేల్ ..నిత్యని కలుస్తాడా ? లేదా ? అనేది మిగిలిన కథ

ఎలా ఉంది ?

హీరోయిన్ కి ఏ మగవాళ్ళను చూసినా తన ప్రియుడి ముఖమే కనిపించడం అనే పాయింట్ రాసుకోవడానికి బాగుంటుంది కానీ ఆన్ స్క్రీన్ మీదకు వచ్చేసరికి ఎలాంటి గందరగోళం , కన్ఫ్యూజన్లు లేకుండా ప్రేక్షకులకు అర్థమయ్యేలా ప్రెజెంట్ చెయ్యాల్సిన అవసరం ఉంటుంది . ఎందుకంటే ఇలాంటి పాయింటులో హీరోయిన్ కన్ఫ్యూజ్ అయితే అది ప్రేక్షకులకు థ్రిల్ అవుతుంది . అదే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయితే అది సినిమాకే కిల్ అవుతుంది . అలాంటి కన్ఫ్యూజన్లు కొన్ని సీన్లు చూసినప్పుడు ప్రేక్షకులకు కూడా రావడమే ఈ సినిమా మైనస్ .

మొదటి సన్నివేశంలో హాస్పిటల్లో కళ్ళు తెరిచిన నిత్యకు మేల్ డాక్టర్లు , నర్సుల ముఖాల్లో మైకేల్ ముఖం కనిపించడం కొంత థ్రిల్ అనిపిస్తుంది . కానీ పదేపదే ఆమె ఎవరిని చూసినా మైకేల్ ముఖమే చూపించడంతో హీరోయిన్ తో పాటు ఎవర్ని చూసినా మనకు కూడా మైకేల్ ముఖమే చూస్తున్న ఫీలింగ్ వస్తుంది . ఇది నిజంగా ప్రేక్షకులకు హర్రర్ ట్రీట్మెంటే . ఇలాంటి సన్నివేశాల్లో దర్శకుడు కొంత కత్తెరకు పనిచెప్పి ఉంటే బాగుండేది .

ఫస్టాఫ్ అంతా నిత్య గతానికి , ప్రస్తుతం అనుభవిస్తున్న సంఘర్షణ చుట్టూనే కథ తిరుగుతుంది . మైకేల్ మంచి పెయింటర్ . నిత్యకు కూడా పెయింటింగులంటే ఇష్టం . ఇద్దరి అభిరుచులు కలిసాయి . ప్రేమించుకుంటారు . లివ్ ఇన్ రిలేషన్షిప్ తో ఒకే ఇంట్లో కలిసి ఉంటారు . ఇంతవరకు చూస్తే ఇదేదో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనుకుంటాం . అంతవరకూ ఓకే కానీ దర్శకుడు అదేపనిగా నిత్య గతానికి , వర్తమానానికి మధ్య కథను తిప్పి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాడు . ఈ పరీక్ష పాస్ అయి సెకండాఫ్ లోకి వెళ్తే మూవీ కొంత క్యూరియాసిటీని రన్ చేస్తుంది .

సెకండాఫ్ నుంచి నిత్య తిరిగి మైకేల్ ఇంటికి రావడంతో స్టోరీలో మిస్టరీ మొదలౌతుంది.
మైకేల్ ఇంటికి వచ్చిన నిత్యకు కొన్ని అనుమానాస్పద సంఘటనలు ఎదురవడంతో కధలో ట్విస్టులు మొదలౌతాయి . ఈ పరిస్థితుల్లో ఓరోజు మైకేల్ నిత్యను వెతుక్కుంటూ ఇంటికి వస్తాడు . కానీ నిత్య మాత్రం మైకేల్ తిరిగి రావడాన్ని నమ్మదు. ఎందుకు నమ్మదో అనే విషయాన్ని దర్శకుడు క్లైమాక్సులో రివీల్ చేస్తాడు . క్లైమాక్స్ ట్విస్టులో ఎంత బలం ఉందో అంత కన్ఫ్యూజన్ కూడా ఉంది . క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ చేస్తే స్పాయిలర్ అవుతుంది కానీ మీకు ఎంతవరకు అర్థమైందో చెప్పండి . దర్శకుడు క్లైమాక్సును మరింత పకడ్బందీగా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది .

ముందునుంచీ మైకేల్ క్యారక్టర్ ను సాఫ్ట్ గా రన్ చేసి క్లైమాక్సులో దర్శకుడు అసలు విషయాన్ని రివీల్ చేసిన తీరు బాగుంది . ఓవరాల్ గా ఫస్టాఫ్ లో కొంత ల్యాగుడును తగ్గించి సెకండాఫ్ మీద మరింత ఫోకస్ చేసి ఉంటే ఇంకా బాగుండేది . దానికి తోడు డబ్బింగ్ సరిగా సింక్ అవలేదు . కేరళలో దొరికిన తెలుగు మాస్టారితో సంభాషణలు రాయించినట్టున్నారు కానీ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సంభాషణలు లేవు . అదేకాకుండా మలయాళం వాళ్ళకి పాతిపెట్టడం అచ్చివచ్చినట్టుంది . ఇందులో కూడా పాతిపెడతారు .

ఎవరెలా చేసారు ?

పేరుకి సినిమాలో హీరో , హీరోయిన్లు ఉన్నారు కానీ కథ మొత్తం హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది . కెమెరా మాత్రం హీరో ముఖం చుట్టూ తిరుగుతుంది .

సరే , ఆ విషయాన్ని అలా ఉంచితే నిత్య పాత్రలో హన్నా రేజి కోషి పర్ఫెక్ట్ గా నటించింది . ప్రతి ఫ్రేమ్ లో సన్నివేశానికి తగ్గట్టు హావభావాలు పలికించింది . ఆమెనుంచి దర్శకుడు మాగ్జిమమ్ నటన రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు . ఈ సినిమాకి ఆడియన్స్ ను రప్పించడంలో ఆ ఫార్ములా ఉపయోగపడింది .

ఇక మైకేల్ పాత్రలో కలేష్ రామానంద్ ఒదిగిపోయాడు . లవర్ బాయ్ గానూ , నెగిటివ్ షేడ్ లోనూ చక్కగా నటించి మెప్పించాడు . మిగిలినవాళ్లు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

సాంకేతికత

గోపి సుందర్ అందించిన సంగీతం బావుంది .
కోలిన్స్ జోష్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది .
దాదాపు సినిమా మొత్తం ఓకే ఇంట్లో నడుస్తుంది కాబట్టి నిర్మాణ విలువల గురించి పెద్దగా చెప్పుకునేది కూడా ఏమీ లేదు .

విశ్లేషణ

సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారికి ఫేసెస్ మూవీ పూర్తిగా నచ్చుతుంది అని చెప్పలేము కానీ పర్లేదు అనిపిస్తుంది . మొత్తంగా సినిమా చూసినతర్వాత ఎక్కడో కొంచం ఫ్లేవర్ మిస్ అయినట్టుంది అన్న ఫీలింగ్ వస్తుంది . హీరోయిన్ కు ఎవర్ని చూసినా హీరో ముఖమే కనిపించడం అన్న సైకలాజికల్ డిజార్డర్ పాయింట్ బాగానే ఉంది అలా చూసీ చూసీ కానీ కొన్నిసార్లు ప్రేక్షకులకు కూడా కళ్ళు తిరిగి డిజప్పాయింట్ అవుతారు .

సెకండాఫ్ నుంచి కధనం మిస్టరీ మోడ్ లోకి వెళ్లడంతో మనకు కొంత క్యూరియాసిటీని కలిగిస్తాయి . ప్రీ క్లైమాక్స్ ట్విస్టుతో ఉత్సుకతను రేపుతాయి . క్లైమాక్స్ ట్విస్ట్ థ్రిల్ పంచుతుంది కానీ కన్ఫ్యూజన్ కూడా దర్శకుడు మరింత జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సింది . ఈ మూవీకి imdb లో 7 /10 రేటింగ్ ఇచ్చారు . బహుశా ఒరిజినల్ లాంగ్వేజ్ లో బాగా కనెక్ట్ అయ్యుంటుంది .
సన్ నెక్స్ట్ ఓటిటిలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి వన్ టైమ్ వాచ్ మూవీ కింద ప్రయత్నించవచ్చు .

నటీనటులు : కలేష్ రామానంద్ , హన్నా రేజి కోషి తదితరులు
సంగీతం : గోపి సుందరం
సినిమాటోగ్రఫీ : కొలిన్స్ జోష్
నిర్మాత : మురుగేషన్ ఈశ్వరన్
దర్శకత్వం : నీలేష్ ఈకె
విడుదల : సన్ నెక్స్ట్
రేటింగ్ : 2 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!