కేస్ ఆఫ్ కొండాన (Case of Kondana Movie) సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ (OTT) రివ్యూ !

Spread the love

కన్నడ స్టార్ విజయ్ రాఘవేంద్ర , భావన జంటగా నటించిన కేస్ ఆఫ్ కొండాన ( Case of Kondana movie ) క్రైమ్ థ్రిల్లర్ మూవీ జులై 23 , 2026 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చింది .

దేవీప్రసాద్ శెట్టి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ 2024 జనవరిలో థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది . ఇప్పుడు ఓటిటిలో కూడా మంచి రేటింగుతో దూసుకుపోతుంది . క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీలు ఏ భాషలో ఉన్నా వెతుక్కుని చూసే ఆడియన్స్ ఉన్నారని మలయాళం సినిమాల ట్రెండింగ్ చూస్తే అర్ధమౌతుంది . తెలుగు వెర్షన్ లేకపోయినా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో కూడా చాలా సినిమాలు చూసి మంచి రేటింగులు ఇస్తున్నారు . ఆ జానర్ కు ఉన్న క్రేజ్ అటువంటిది . అలాంటిది తెలుగులో వస్తే వదులుతారా ? అందుకే కేస్ ఆఫ్ కొండాన తెలుగు వెర్షన్ ఆడియన్సుకు బాగా కనెక్ట్ అయ్యింది .
ఇప్పుడు మూవీ ఎలా ఉందో చూద్దాం .

కధేంటంటే ?

కర్ణాటకలోని కొండాన ఫారెస్ట్ ఏరియా పరిధిలోని ఒక పోలీస్ స్టేషన్లో విల్సన్ ( విజయ్ రాఘవేంద్ర ) ఎస్సై పోస్టులో కొత్తగా బాధ్యతలు తీసుకుంటాడు . మరోవైపు ఆ జ్యురిస్దిక్షన్లో ఏసిపి పోస్టులో లక్ష్మి ( భావన ) పనిచేస్తుంటుంది . కొండాన ఫారెస్ట్ ఏరియా పరిధిలో వరుస హత్యలు జరుగుతుంటాయి . సీరియల్ కిల్లర్ కి సంబంధించిన ఏ ఒక్క ఎవిడెన్స్ పోలీసులకు దొరక్కపోవడంతో ఆ కేసు అడుగు ముందుకుపడదు . దాంతో పోలీసుల వైఫల్యం మీద మీడియాలో కధనాలు రావడంతో ఏసిపి మీద ప్రెజర్ పెరుగుతుంది .

ఇదిలా ఉండగా కొత్తగా ఎస్సై పోస్టులో జాయిన్ అయిన విల్సన్ డ్యూటీలో అగ్రెసివ్ గా వెళ్లడంతో ఇబ్బందులు పడుతుంటాడు . ఇతడి కోపం వల్ల అనవసరమైన చిక్కుల్లో పడుతున్నాడని విల్సన్ తండ్రి కూడా అతడ్ని కోపం తగ్గించుకోమని హెచ్చరిస్తాడు . ఇదే విషయం విల్సన్ని ప్రేమిస్తున్న డాక్టర్ సహన కూడా చెప్తుంటుంది . మంచి పోలీస్ జాబ్ వచ్చింది కాబట్టి అప్పులన్నీ తీర్చేసి లైఫ్ లో సెటిల్ అయిపోవాలని అనుకుంటారు . అందుకే అంతకుముందు ఇన్స్పెక్టర్ మహేందర్ దగ్గర విల్సన్ చేసిన అప్పులను తీర్చేందుకు సహన అతడికి కొంత క్యాష్ ఇచ్చి పంపుతుంది . ఆమె ఇచ్చిన క్యాష్ తీసుకుని విల్సన్ కారులో వెళ్తుండగా దారిలో ఆక్సిడెంట్ అవుతుంది .

అక్కడే ఉన్న పానీపూరి బండి రాజు అనే కుర్రాడు విల్సన్ ని కారులోనుంచి బయటికి తీసి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు . అయితే ఈ రాజుకు ఓ సమస్య ఉంది . అతడి కొడుక్కు అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటాడు . బాబుకి వైద్యం చేయాలంటే ఐదు లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్ చెప్పడంతో అతడు డబ్బుల కోసం వెతుకుతూ ఉంటాడు . విల్సన్ కారులో డబ్బు కనిపించడంతో రాజు దొంగతనం చేస్తాడు . కానీ విల్సన్ రాజు దొంగతనం చేసాడని గ్రహించి తిరిగి ఆ డబ్బులు లాక్కుంటాడు . ఈ సందర్భంలో జరిగిన ఘర్షణలో రాజు తలకి రాయి తగిలి చనిపోతాడు .

ఊహించని ఈ సంఘటనకు విల్సన్ భయపడిపోతాడు . పోలీసులకు దొరికితే తన ఉద్యోగం పోవడంతో పాటు జైల్లో కూడా వేస్తారని పానిక్ అవుతాడు .

అప్పుడు విల్సన్ ఏం చేస్తాడు ?
అనుకోకుండా రాజును హత్య చేసిన విల్సన్ తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి , పోలీసులకు దొరక్కుండా ఉండటానికి ఎటువంటి ఎత్తులు వేస్తాడు ?
సీరియల్ మర్డర్స్ మిస్టరీ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఏసిపి లక్ష్మి ఈ కేసులో కూడా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సివస్తుంది ? అనేది మిగిలిన కథ .

ఎలా ఉంది ?

క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీల్లో కొంతమంది దర్శకులు నేరుగా కథలోకి వెళ్ళిపోతారు . మరికొంతమంది స్లోగా వెళ్తూ టైమ్ తీసుకుంటారు . ఈ మూవీ కోసం దర్శకుడు దేవీప్రసాద్ శెట్టి రెండో ఫార్ములాని ఎంచుకున్నాడు . మూవీ స్టార్టింగ్ లో విల్సన్ మెంటాలిటీని , అతడి లవ్ స్టోరీని , సీరియల్ మర్డర్స్ గురించి , ఏసిపి లక్ష్మి ఇన్వెస్టిగేషన్ గురించి , సొంతింటి మీద ఆమె తండ్రి త్యాగరాజుకు ఉన్న అటాచ్మెంట్ గురించి చెప్పడానికి దర్శకుడు టైమ్ తీసుకున్నాడు .

మొదటి ముప్పై నిముషాలు అసలు కథలోకి వెళ్లకపోవడంతో దర్శకుడి స్క్రీన్ ప్లే కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది . అసలు ఆయన ఏం చెప్పదల్చుకున్నాడో అర్ధం కాదు . డాక్టర్ సహన అన్న మాటలతో విల్సన్ లవ్ ట్రాక్ కు బ్రేక్ పడుతుంది . ఏసిపి ఇల్లు అమ్మాలనుకోవడం , అతడి తండ్రి అయిష్టంగా ఉండటం వెనుక ఉన్న ఫ్లాష్ బ్యాక్ కొంచం చెప్పి ఉంటే బాగుండేది . ఈ రెండు బిట్లకు కొనసాగింపు ఉండదు . మొదటి ముప్పై నిమిషాలను దర్శకుడు ఆ రకంగా వాడుకున్నాడు అనిపించింది . ఇక సీరియల్ మర్డర్స్ , దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాల మీద దర్శకుడు క్లారిటీ ఇవ్వలేకపోయాడు . ఒకే ఒక వ్యక్తి నలుగురు గూండాలను వెంటేసుకుని తిరుగుతూ ఎంటైర్ పోలీసులనే భయపెట్టడం లాజికల్ గా అతకదు .

అసలు కేస్ ఆఫ్ కొండాన అంటే ఆ సీరియల్ హత్యల గురించే అయి ఉంటుందని మొదట్లో మనం అనుకుంటాం . కానీ ఎప్పుడైతే రాజును ఎస్సై విల్సన్ చంపుతాడో అప్పట్నుంచి అసలు స్టోరీ ఇదేనని మనకు అర్ధమౌతుంది . ఇది సరిగ్గా ఇంటర్వెల్ ముందు రావడంతో సెకండాఫ్ మీద మనకు క్యూరియాసిటీ పెరుగుతుంది . మన అంచనాలకు తగినట్టే సెకండాఫ్ లో కధనం పూర్తిస్థాయి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మోడ్ లో పరుగులు పెడుతుంది . ఒకవైపు సీరియల్ మర్డర్స్ కిల్లర్ ని పట్టుకోవడానికి పోలీసులు వెంటపడటం , మరోవైపు రాజును చంపిన కేసు తన మీద పడకుండా ఉండటానికి విల్సన్ మరిన్ని తప్పులు చేసుకుంటూ వెళ్లడంతో స్టోరీలో గ్రిప్పింగ్ పెరుగుతుంది .

సాధారణంగా ఏ కేసులో అయినా దొంగా .. పోలీస్ ఆట ఉంటుంది . కానీ ఈ మూవీలో దర్శకుడు ఇంటర్వెల్ తర్వాత దొంగా .. పోలీస్ ఆట ముగించి , పోలీస్ ..పోలీస్ ఆట మొదలుపెట్టాడు . ఇక్కడ కిల్లర్ క్రిమినల్ కాదు .. పోలీసే . ఎంత నిజాయితీపరుడైనా అనుకోకుండా తప్పు చేసి ఇరుక్కుంటే ఆ పోలీస్ కథకి ఎలాంటి ముగింపు ఉంటుందో దర్శకుడు చెప్పే ప్రయత్నం చేసాడు .

అయితే సెకండాఫ్ లో విల్సన్ హార్డ్ డిస్కులను దొంగతనం చేయడం , ఫోరెన్సిక్ రిపోర్టులను తారుమారు చేయడం వంటి కొన్ని సన్నివేశాలు లాజిక్ కి అందవు . అటువంటి లాజిక్కుల జోలికి వెళ్లకుండా చూస్తే కధనం మనల్ని స్క్రీన్ మీద లీనం చేస్తుంది . ఓవరాల్ గా ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో స్టోరీకి గ్రిప్పింగ్ ఎక్కువగా ఉంటుంది . ఇక క్లైమాక్స్ రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లోనే ముగుస్తుంది కాబట్టి దాని గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు . క్లైమాక్సులో ఊహించని ట్విస్ట్ ఉంటుందేమో అని ఎదురు చూస్తే మాత్రం నిరాశే మిగులుతుంది .

ఎవరెలా చేసారు ?

ఈ సినిమా మొత్తాన్ని విజయ్ రాఘవేంద్ర తన భుజాన వేసుకుని నడిపించాడు . పోలీస్ పాత్రలో బాడీ లాంగ్వేజ్ ఎంత బాగా మెయింటైన్ చేసాడో , తప్పు చేసిన పోలీస్ పాత్రలో హావభావాలు అంత బాగా పలికించాడు . మొదటినుంచి చివరివరకు ప్రతి సన్నివేశంలో సాలిడ్ గా నటించుకుంటూ వెళ్ళాడు .
ఇక ఏసిపి లక్ష్మి పాత్రలో భావన నటన కూడా బాగుంది .

సాంకేతికత

గగన్ అందించిన సంగీతం బాగుంది . క్రైమ్ సీన్స్ లో అందించిన బీజీఎమ్ కు మంచి మార్కులు పడతాయి .
విశ్వజిత్ రావు అందించిన ఫోటోగ్రఫీ కూడా బావుంది . ముఖ్యంగా నైట్ మోడ్ లో తీసిన సన్నివేశాలు బాగా వచ్చాయి
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి .

విశ్లేషణ

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీలు ఇష్టపడేవారికి కేస్ ఆఫ్ కొండాన మూవీ నచ్చుతుంది. అయితే వాళ్ళకి కూడా ఫస్టాఫ్ అంతగా నచ్చకపోవచ్చు . దర్శకుడు ఎంతకీ అసలు కథలోకి వెళ్లకపోవడంతో సహనం నశిస్తుంది . కానీ సెకండాఫ్ మాత్రం కధనం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మోడ్ లో పరుగులు పెడుతుంది . ఇక్కడే కొన్ని సన్నివేశాలు మనకు థ్రిల్ పంచుతాయి .
ఈటీవీ విన్ లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి చూసేయండి .

నటీనటులు : విజయ్ రాఘవేంద్ర ,భావన , ఖుషి రవి తదితరులు
సంగీతం : గగన్
సినిమాటోగ్రఫీ :విశ్వజిత్ రావు
దర్శకత్వం : దేవీప్రసాద్ శెట్టి
విడుదల :ఈటీవీ విన్ ( 23-07 -2026 )
రేటింగ్ : 2.75 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!