కొన్ని దశాబ్దాలుగా మలయాళ సినిమా ఇండస్ట్రీలో మమ్ముట్టి ఎవర్ గ్రీన్ హీరోగా వెలుగొందుతున్నాడు . లేటెస్టుగా మలయాళ ఇండస్ట్రీ దాటి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన వయసు 74 సంవత్సరాలు .. అయినా ఆయనలో గ్రేస్ ఇంచు కూడా తగ్గలేదు . ఆయన ఆరోగ్య రహస్యం ఏంటో కానీ ఇప్పటికీ యాంగ్రీ యాంగ్ మాన్ మాదిరే కనిపిస్తాడు . థియేటర్ రిలీజ్ రోజుల్లో మమ్ముట్టి అన్ని సినిమాలు ఇతర రాష్ట్రాల్లో షో రన్ అయ్యేది కాదు . కానీ మలయాళం , తెలుగు , తమిళం , హిందీ భాషల్లో రిలీజ్ చేసిన ఆయన సినిమాలు కొన్ని బాక్సాఫీస్ కలెక్షన్లు బద్దలుకొట్టాయి . వాటిలో దళపతి ఒకటి .. ఇందులో రజనీకాంత్ , మమ్ముట్టిలు పోటీ పడి నటించారు . ఈ సినిమాతో మళయాళీలే కాదు తెలుగు ,తమిళ ప్రేక్షకులు కూడా మమ్ముట్టి అభిమానులుగా మారారు .
ప్రస్తుతానికి వస్తే సిబిఐ 5 ది బ్రెయిన్ సినిమాలో నటించి మమ్ముట్టి మరోసారి తన గ్రేస్ నిరూపించుకున్నాడు . 2022 లోనే మలయాళంలో థియేటర్ రిలీజ్ అయిన ఈ మూవీ మంచి వసూళ్లను సాధించింది . ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటిటి లో తెలుగు డబ్బింగ్ వెర్షన్లో స్ట్రీమింగ్ అవుతుంది .
సిబిఐ అనే టైటిల్ చూడగానే అందరికీ అర్థమై ఉంటుంది . మూవీ స్టోరీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఉంటుంది అని . మనం గతంలో చాలా సినిమాల్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టోరీలు చూసి ఉంటాం . కానీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో అతి కొద్ది సినిమాలు మాత్రమే వచ్చాయి . వాటిలో ఇది కూడా ఒకటి . సిబిఐ ఫ్రాంచైసీ లో ఐదవ భాగం మమ్ముట్టితో రావడంతో ఈ సినిమా మీద ఇండస్ట్రీలోనూ , ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరిగాయి . మరి ఆ అంచనాలను ఈ మూవీ అందుకుందో ? లేదో ఇప్పుడు చూద్దాం .
కధేంటంటే ?
సినిమా ప్రారంభమే ప్రొబేషనరీ ఐపీఎస్ లకు సిబిఐ కార్యాలయంలో ట్రైనింగ్ ఇచ్చే సెషన్ తో మొదలౌతుంది . ఈ ట్రైనింగ్ లో సిబిఐ ఆఫీసర్ బాలు గెస్ట్ లెక్చర్ ఇస్తూ , తమ జీవితంలో అత్యంత క్లిష్టమైన కేసును ఎలా ఛేదించింది చెప్తాడు . కేరళ రాష్ట్ర హోమ్ మంత్రి అబ్దుల్ సమద్ విమానంలో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు వస్తుంది . దాంతో అదే ఫ్లయిట్లో ప్రయాణిస్తున్న ఒక డాక్టర్ ఆయనకి సిపిఆర్ చేసినా బతకడు . దాంతో మంత్రిగారు హార్ట్ అటాక్ తో మరణించారని భావించి అంత్యక్రియలు చేస్తారు . ఇది జరిగిన తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్ జోష్ ను ఎవరో గుర్తు తెలియని కిల్లర్ కారుతో గుద్ది చంపడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు . సాండ్ కాంట్రాక్టర్ శ్యాం మీద పోలీసులు అనుమానపడతారు . ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ కు చెందిన సాండ్ లారీలను సీఐ గతంలో సీజ్ చేసాడని తెలియడంతో కక్ష పెంచుకుని అతడే ఈ హత్య చేసాడని పోలీసులు అనుమానిస్తారు . దీనితర్వాత జర్నలిస్ట్ బాషురన్ , మంత్రిగారి పర్సనల్ డాక్టర్ వేణు , అతడి డ్రైవర్ లు వరుసగా హత్యకు గురికావడంతో పోలీసులకు అనుమానం వస్తుంది .
అదే సమయంలో మీడియాలో బాస్కెట్ మర్డర్స్ అని కధనాలు రావడంతో కేసు సిబిఐ కి అప్పచెప్పాలని పోలీసులు భావిస్తారు .
ఈ పరిస్థితుల్లో ఈ కేసు సిబిఐ ముందుకు వచ్చింది . ఈ కేసును ఛేదించటానికి సేతురామ అయ్యర్ ను ( మమ్ముట్టి ) దర్యాప్తు అధికారిగా నియమిస్తారు . ఈ వరుస హత్యలకు .. గుండెపోటుతో మరణించిన మంత్రిగారి మరణానికి ఏదో లింక్ ఉండే ఉంటుందని సిబిఐ అనుమానపడుతుంది . గుండెపోటుతో మరణించిన మంత్రిగారిది సహజ మరణం కాదని , అది మర్డర్ అని అనుమానం రావడంతో కేసు కొంత గందరగోళంగా మారింది . ఇది మర్డర్ అని నిరూపించటానికి కావాల్సిన ఏ ఒక్క చిన్న ఎవిడెన్స్ కూడా దొరక్కపోవడంతో కేసు మిస్టరీగా మారిపోయింది .
అయినా సేతురామ నాయకత్వంలో బాలు మరికొందరు సిబిఐ ఆఫీసర్లు ఈ కేసును మంత్రిగారి మరణానికి లింక్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు . ఆశ్చర్యంగా వారి ఇన్వెస్టిగేషన్ లో చాలామంది అనుమానితులుగా కనిపిస్తారు . వారిలో ఎస్పీ , అతడి భార్య అడ్వొకేట్ ప్రతిభతో పాటు ,ఒక ఇన్స్పెక్టర్ మీద కూడా అనుమానపడతారు . చివరికి సేతురామ అసలు కిల్లర్ ను సాక్ష్యాధారాలతో సహా పట్టుకుంటాడు .
ఎలా ఉంది ?
చిన్నప్పుడు అపరాధపరిశోధన నవలలు చదివినవారికి ఇలాంటి జానర్ సినిమాలు నచ్చుతాయి . క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో వచ్చే సినిమాలకు ఒక సెగ్మెంట్ ఆడియన్స్ ఎప్పుడూ ఉంటారు . ఎందుకంటే నేరస్తుడు తెలివిగా నేరం చేసి తప్పించుకున్నాను అనుకోవడం , అంతలోనే పోలీసులు అంతకన్నా తెలివిగా నేరస్తుడ్ని సాక్ష్యాధారాలతో సహా పట్టుకోవడం ప్రతి అపరాధపరిశోధన కధల్లో ఉండేదే . క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో పోలీసుల తీరు ఒకరకంగా ఉంటుంది , సిబిఐ తీరు మరోలా ఉంటుంది . కాకపోతే సిబిఐ అధికారులకు యూనిఫార్మ్ కోడ్ ఉండదు కాబట్టి సినిమాలో చూసేటప్పుడు మాములుగా అనిపిస్తుంది .
ఇక ఈ సినిమా సిబిఐ 5 ది బ్రెయిన్ అనే టైటిల్లోనే ఉంది ఈ కధకి మూలం ఏంటో అనేది . కొన్ని నేరాలు ఛేదించాలంటే సాంకేతికత మాత్రమే సరిపోదు , తార్కికంగా ఆలోచిస్తే చాలావరకు చిక్కుముడులు సునాయాసంగా విడిపోతాయనేది సేతురామ ఆలోచన . ఈ సినిమా అటువంటిదే . హత్యలు చేయడానికి కిల్లర్ టెక్నాలజీని వాడుకుంటాడు . టార్గెట్ ని హత్య చేయాలంటే కత్తి , పిస్టల్ వంటి ఆయుధాలతో పనిలేకుండా , అసలు మనిషిని టచ్ చేసే పని కూడా లేకుండా ఎక్కడ్నుంచో ఓ చిన్న లాప్టాప్ ద్వారా సునాయాసంగా హత్య చేసే సాంకేతికతను కిల్లర్ డెవలప్ చేస్తాడు . అదే ఈ సినిమాకి కీ పాయింట్ . లేకపోతే రొటీన్ స్టోరీ అయిపోయి ఉండేది .
ఇక ఫస్టాఫ్ లో కొంత సాగతీత సన్నివేశాలు కనిపిస్తాయి . పోలీసుల అతి ఎక్కువగా ఉంటుంది . ఎవడు ఎవడ్ని ఎందుకు తిడతాడో అర్ధం కాదు . పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే డిసిప్లిన్ కొంచం కూడా కనిపించదు . వాళ్లకన్నా సిబిఐ పాత్రలే కొంచం బెటర్ అనిపించేలా ఉన్నాయి . ఉన్నంతలో అందరూ హుందాగా ఉంటారు .
సినిమాలో దర్శకత్వ లోపాలు కూడా కొన్ని ఉన్నాయి . మమ్ముట్టి పాత్రను మరింత పవర్ ఫుల్ గా తీర్చిదిద్ది ఉండాల్సింది . సినిమాలో మమ్ముట్టి పాత్ర మలయాళీలకు నచ్చి ఉండొచ్చేమో కానీ పాత్ర స్వభావం మేరకు అతడి కాస్ట్యూమ్స్ విషయంలో కానీ , మేకప్ విషయంలో కానీ మరింత శ్రద్ద తీసుకుని ఉండాల్సింది . మరీ ముఖ్యంగా మేకప్ బాగా ఎక్కువైంది అనిపిస్తుంది . ఆయన పెదాలకు పూసిన లిప్ స్టిక్ కూడా స్పృష్టంగా కనిపిస్తుంది . దానికి తోడు మమ్ముట్టికి పవర్ ఫుల్ పంచ్ డైలాగులు లేవు . చాలా క్లుప్తంగా మాట్లాడుతాడు . సినిమా అంతా ఒకేరకమైన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి . ఒక్క సౌబిన్ సాహిర్ ను కొట్టేటప్పుడు , క్లైమాక్సులో ఐజి ని పట్టుకునేటపుడు మాత్రమే కాస్త డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు . దానికి తోడు అవసరం ఉన్నా లేకపోయినా చేతులు వెనక్కి పెట్టుకుని నడవడం అసంబద్ధంగా అనిపిస్తుంది . మమ్ముట్టి మార్క్ నటన వేరేగా ఉంటుంది . అభిమానులు కోరుకునేలా ఆయన్ని చూపించడం దర్శకుడికి చేతకాలేదు అనిపిస్తుంది .
ఇక సౌబిన్ సాహిర్ ను అరెస్ట్ చేసి కూడా సిబిఐ లాంటి అత్యున్నత సంస్థ అంత తేలిగ్గా ఎందుకు విడిచిపెడుతుందో తెలీదు . అతడు మారుపేర్లతో ప్రయాణాలు చేయడం , అతడి మెడలో పెన్ డ్రైవ్ ఉండటంలాంటివి చాలు అతడి మీద అనుమానపడి ఇంటరాగేషన్ కొనసాగించటానికి . ఒకవేళ విడిచిపెట్టినా అతడి మీద నిఘా పెట్టినట్టు చూపించి ఉంటే బాగుండేది .
చివరికి ముగింపు కూడా పాత సినిమాల ఫార్ములాలో ఎండ్ చేసాడు దర్శకుడు . ఇలాంటి క్లైమాక్సులు చూసీ ,చూసీ ప్రేక్షకులు కూడా ఎపుడో సిబిఐ రేంజుకు ఎదిగిపోయారు . క్లైమాక్స్ కొంచం డిఫరెంట్ గా ప్రయత్నించి ఉండాల్సింది .
ఎవరెలా చేసారు ?
ఈ సినిమాలో ముఖ్యంగా ఇద్దరి గురించే చెప్పుకోవాలి . అందులో మొదటివారు మమ్ముట్టి . మమ్ముట్టి నటనలో వంకలు పెట్టడం అంటే తాతకు దగ్గులు నేర్పటమే . కాకపోతే మమ్ముట్టిని పూర్తిస్థాయిలో దర్శకుడు వాడుకోలేకపోయాడు అనిపిస్తుంది . మమ్ముట్టి స్టైల్ కొంచం , మమ్ముట్టి మార్క్ పంచ్ డైలాగులు కొన్ని ఉంటే ఇంకాస్త పేలేది . సినిమాలో మమ్ముట్టిని చూస్తుంటే ఒక సాధారణ ఆర్టిస్టు చూసినట్టే అనిపించింది కానీ మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని చూసినట్టు లేదు . కనీసం భారీ సంగతి అలా ఉంచి అక్కడక్కడా మమ్ముట్టికి చిన్న , చిన్న ఎలివేషన్లు ఇచ్చి ఉంటే బాగుండేది .
ఇక రెండోవారు సౌబిన్ సాహిర్ . ఇతడి నటన గురించి కూడా కొత్తగా చెప్పేది ఏమీ లేదు . షరామామూలుగా తనదైన శైలిలో నటించి మెప్పించాడు . మిగిలినవారు తమ పాత్రల పరిధిలో నటించారు .
సాంకేతికత
జాక్స్ బిజోయ్ అందించిన మ్యూజిక్ బాగుంది . సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది .
నిర్మాణవిలువలు పర్లేదు .
విశ్లేషణ
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జానర్ ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చుతుంది . ఈ తరహా సినిమాలు గతంలో చాలా వచ్చినప్పటికీ కధలో టెక్నాలజీ అనే కొత్త ప్లాట్ వాడటంతో కధనం ఆసక్తికరంగా అనిపిస్తుంది . ఫస్టాఫ్ కేరళ పోలీసుల పాత్రలతో కొంత అతి చేయించినప్పటికీ ,సెకండాఫ్ లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ పార్ట్ చకచకా వేగంగా కదలడంతో సినిమాలో లీనం అయిపోతాం . దర్శకుడు మమ్ముట్టిని పూర్తిస్థాయిలో వాడుకుని ఉంటే మరింత బాగుండేది . రొటీన్ ముగింపు కాకుండా కొంచం డిఫరెంట్ గా ఎండ్ చేసి ఉంటే సినిమా రిజల్ట్ ఇంకాస్త మెరుగ్గా ఉండేది . అయినా మరీ బోర్ కొట్టేంత సినిమా అయితే మాత్రం కాదు . వన్ టైం వాచ్ కింద మూవీని చూడొచ్చు . పైగా నెట్ ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కూడా ఉండదు .
నటీనటులు : మమ్ముట్టి , సౌబిన్ సాహిర్ తదితరులు
సంగీతం : జాక్స్ బిజోయ్
దర్శకత్వం : మధు
విడుదల : నెట్ ఫ్లిక్స్
రేటింగ్ : 2 .75 / 5
