సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ప్రాణవాయువులాంటిది . క్రైమ్ నేపథ్యంలో తీసుకునే కథ ఎటువంటిదైనా కానివ్వండి . ఆ కథను సరైన గ్రిప్పింగ్ తో వెండి తెర మీదకు ఎక్కించినప్పుడే పాజిటివ్ ఫలితాలు ఉంటాయి . ఈ విషయంలో మలయాళ దర్శకులు ముందుంటారు . క్రైమ్ కధలన్నీ ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి . కానీ వాటిని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడంలోనే అసలైన మ్యాజిక్ ఉంటుంది .
తాము ఎంచుకున్న జానర్ కు కట్టుబడి టైటిల్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఒకేరకమైన టెంపోతో కధనాన్ని నడపటమే మలయాళ క్రైమ్ సినిమాల విజయ రహస్యం . క్రైమ్ కధలను తెరకెక్కించడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో రకమైన శైలి ఉంటుంది . కొంతమంది మూస ధోరణిలో హీరో , హీరోయిన్ల మధ్య డ్యూయెట్లతో , మధ్య మధ్యలో కామెడీ ట్రాక్ కలిపి సినిమాలను వండి వారుస్తారు . ఇలాంటి సినిమాల్లో థ్రిల్ ఫీలయ్యే అవకాశం ఎక్కడ ఉంటుంది . క్రైమ్ సీన్ లోనుంచి హఠాత్తుగా కామెడీ ట్రాక్ లోకి సినిమాని తీసుకెళ్తే నాన్సెన్స్ అనుకోవడమే కానీ సస్పెన్స్ అని ఫీలయ్యే అవకాశం ఎక్కడ ఉంటుంది . అలా తీసే ఓవర్ టాలెంటెడ్ దర్శకులు ఎవరో కూడా మీకు తెలిసిందే .
ఇక కొంతమంది దర్శకుల శైలి మాత్రం స్పెషల్ గా ఉంటుంది . సినిమా మొదలుపెట్టడమే క్రైమ్ సీన్ తో మొదలుపెడతారు . ఒక థ్రిల్లింగ్ సన్నివేశంతో సినిమా పట్ల ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలుగచేస్తారు . మీరు గమనించండి , చాలా మలయాళం సస్పెన్స్ , క్రైమ్ సినిమాలు ఒక క్రైమ్ సీన్ తోనే మొదలుపెడతారు . దీన్నే ఆకట్టుకునే ప్రారంభం అంటారు . అక్కడ్నుంచి చివరివరకు అదే టెంపోతో కధనాన్ని లాక్కొచ్చి ప్రేక్షకులను థ్రిల్ చేస్తారు .
హెవెన్ సినిమా కూడా అటువంటిదే . 2022 లోనే మలయాళంలో థియేటర్ రిలీజ్ అయిన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది . ఇప్పుడు జియో హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్లో స్ట్రీమింగ్ అవుతుంది .
మరి హెవెన్ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం .
కధేంటంటే ?
సినిమా ప్రారంభమే ఒక మర్డర్ తో మొదలౌతుంది . ఎన్సీసీ క్యాడెట్లు డ్రిల్ లో భాగంగా అడవిలోకి వెళ్లినప్పుడు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న డెడ్ బాడీని కనుక్కుంటారు . ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు తమ డిపార్ట్మెంట్లోనే సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న పీటర్ (సూరజ్ వెంజరమూడు ) ఈ హత్య చేసాడని భావించి అరెస్ట్ చేసి కోర్టులో పెడతారు .
కట్ చేస్తే పీటర్ ఫ్లాష్ బ్యాక్ మొదలౌతుంది .
పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక కేసులను సులువుగా పరిష్కరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పీటర్ కు మంచి పేరుంటుంది . ఓసారి ఇతడి పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఒకఇంట్లో మర్డర్ జరిగినట్టు కాల్ రావడంతో పోలీసులను తీసుకుని అక్కడికి వెళ్తాడు . అక్కడ మాధ్యుస్ అనే వ్యక్తితో పాటు అతడి భార్య , కూతురు కూడా హత్య చేయబడి ఉంటారు . కానీ అదే ఇంట్లో వేరే గదిలో తన కొడుకు కూడా హత్య చేయబడి ఉండటంతో పీటర్ షాక్ అవుతాడు . దాంతో అతడు డిప్రెషన్లోకి వెళ్లి డ్యూటీకి సెలవు పెడతాడు . ఎస్పీ ఈ హత్య కేసును పరిశోధించడానికి వేరే పోలీస్ టీమ్ ను నియమిస్తుంది .
పోలీస్ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేసినా హంతకుల ఆచూకీ దొరకకపోవడంతో పీటర్ ఎస్పీని కలిసి ఈ కేసులో తనని కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా ఇన్క్లూడ్ చేయమంటాడు . కానీ మొదట ఎస్పీ ఒప్పుకోదు . కానీ ఈ కేసుకు సంభంధించిన కొన్ని ఆధారాలను సంపాదించి ఎస్పీకి చూపించడంతో ఆమె పీటర్ ని కూడా ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి అనుమతిస్తుంది . దాంతో పీటర్ తన సెలవును రద్దుచేసుకుని డ్యూటీలో జాయిన్ అయి కొడుకు మర్డర్ కేసును తనే స్వయంగా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడతాడు .
ఇంతకీ కిల్లర్ ఎవరు ?
పీటర్ ఇన్వెస్టిగేషన్ కిల్లర్ ఎవరో తెలుస్తుందా ?
కిల్లర్ పీటర్ కొడుకుని ఎందుకు చంపుతాడు ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది .
ఎలా ఉంది ?
ఈ మలయాళం వాళ్ళకి సినిమాలో ఒకసారైనా ఫారెస్ట్ చూపించకపోతే నడవదు అనుకుంటా. బహుశా ఫారెస్ట్ లో తీసిన సినిమాలు హిట్ అవడంతో ఆ సెంటిమెంట్ వచ్చిందేమో .. ఇందులో కూడా అంతే ఫారెస్టుతోనే సినిమా ప్రయాణం మొదలౌతుంది .
సరే ,ఆ సెంటిమెంటును అలా ఉంచితే సస్పెన్స్ , క్రైమ్ సినిమాల బిగినింగ్ కూడా వినూతనంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు . సినిమా జానర్ కు తగ్గట్టు సన్నివేశాలు మొదలుపెడతారు . ఇందులో కూడా అంతే .. సినిమా ప్రారంభమే ఓ మర్డర్ తో మొదలౌతుంది . ఆ మర్డర్ కి కిల్లర్ కి లింకేంటనేది క్లైమాక్సులోనే మనకు తెలుస్తుంది . అప్పటిదాకా కిల్లర్ ఎవరై ఉంటారా అని రకరకాల ఊహాగానాలు చేయడంతోనే ప్రేక్షకులని కూడా సినిమాలో లీనమైపోయేలా చేస్తారు మలయాళ దర్శకులు .
పీటర్ కొడుక్కి , అతడి నాయనమ్మకు ఉన్న బాండింగ్ , డ్యూటీయే ప్రాణంగా భావించి తిరిగే పీటర్ ఎపిసోడ్లతో ఫస్టాఫ్ స్లోగా నడుస్తుంది . దీంతో కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అయినట్టు అనిపిస్తాయి . స్టోరీ క్రైమ్ లోనుంచి సెంటిమెంట్ వైపు వెళ్తున్నట్టు అనిపిస్తుంది .
ఎప్పుడైతే పీటర్ కొడుకు మర్డర్ అవుతాడో అప్పుడు స్టోరీ ఫుల్ టర్న్ తీసుకుంటుంది . ఇక అక్కడ్నించి కిల్లర్ కోసం పీటర్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం , మాధ్యుస్ హత్యకు ,కిల్లర్ కు ఉన్న కనెక్షన్ కనిపెట్టడం , పాత పేపర్ కటింగులు తీసి అనుమానిత కిల్లర్ ను కనిపెట్టడం వంటి సన్నివేశాలతో సెకండాఫ్ చకచకా పరుగులు పెడుతుంది . చివరికి పీటర్ కిల్లర్ ఎవరో కనుక్కుని మట్టుబెట్టడంతో సినిమా ముగుస్తుంది .
పీటర్ కిల్లర్ ను కనుక్కునేదాకా దర్శకుడు స్టోరీ లైన్ ను బాగానే తీసుకొచ్చారు కానీ , కిల్లర్ పీటర్ కొడుకుని చంపడం వెనుక ఇంకాస్త బలమైన ప్లాట్ సృష్టించి ఉంటే బాగుండేది . కిల్లర్ కి పీటర్ ఫ్యామిలీకి నేరుగా ఎటువంటి గొడవలు ఉండవు . కిల్లర్ టార్గెట్ మాధ్యుస్ మాత్రమే కానీ కిల్లర్ వేరే గదిలో ఆడుకుంటున్న పీటర్ కొడుకుని వెతుక్కుంటూ వెళ్లి మరీ మర్డర్ చేయడం కధనంలో అంతగా సింక్ కాదు .
ఇక క్లైమాక్స్ సన్నివేశం చూస్తుంటే మనకు ఒక్కోసారి దృశ్యం మూవీ గుర్తుకువస్తుంది . పీటర్ చాలా తెలివిగా చట్టానికి దొరక్కుండా కిల్లర్ ను మట్టుబెట్టే ప్లాన్ వేస్తాడు . దృశ్యంలో వెంకటేష్ ఫ్యామిలీ మొత్తం బస్ లో వేరే ఊరికి వెళ్లి సినిమా చూసి టికెట్లు దగ్గరపెట్టుకున్నట్టు ఇందులో పీటర్ కూడా దుబాయ్ వెళ్లి ఎలిబీ సృష్టించుకుంటాడు . అదేకాకుండా క్లైమాక్స్ కొంచం హడావుడిగా ముగించినట్టున్నాడు . ఒక్కో సన్నివేశాన్ని జాగ్రత్తగా పేర్చుకుంటూ వచ్చిన దర్శకుడికి క్లైమాక్సులో మాత్రం అంత తొందర దేనికో అర్ధం కాదు . క్లైమాక్స్ సన్నివేశానికి ఇంకాస్త సమయం కేటాయించి ఉంటే బాగుండేది .
ఎవరెలా చేసారు ?
ఈ సినిమాలో మొదటి ముప్పై నిమిషాల తర్వాతనుంచి చివరివరకు మనకు పీటర్ కనిపిస్తూనే ఉంటాడు . ఈయనకు తోడుగా ఆ ఏఎస్సై పిళ్ళై కూడా కనిపిస్తూనే ఉంటాడు . ఇదిలాఉండగా పీటర్ పాత్రలో సూరజ్ వెంజరమూడు ఒదిగిపోయాడు . అతడి బాడీ లాంగ్వేజ్ పోలీస్ ఆఫీసర్ పాత్రకు సరిపోయింది . సన్నివేశాలకు తగ్గట్టుగా హావభావాలు ప్రదర్శించాడు . కాకపోతే సెంటిమెంట్ సన్నివేశాల్లో ఇంకాస్త ఎఫర్ట్స్ పెట్టి ఉండాల్సింది . ఏఎస్సై పిళ్ళై మాత్రం చాలా ఫెమిలియర్ గా ఉన్నాడు . చాలా కూల్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.
సాంకేతికత
గోపి సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి మార్కులు పడతాయి . అతడు అందించిన బీజీఎమ్ వల్ల సినిమాకి హైప్ పెరుగుతుంది .
ఇక వినోద్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది . సినిమా ప్రారంభంలో ఫారెస్ట్ అందాలను బాగా చూపించారు . ఇడుక్కి బ్యాక్ డ్రాప్ లో కూడా చక్కటి కెమెరా పనితనం చూపించారు .
నిర్మాణవిలువలు కూడా బాగానే ఉన్నాయి .
ఇక దర్శకుడు ఉన్ని గోవిందరాజ్ కూడా స్టోరీ లైన్ ను బాగానే నడిపించారు . ఈయన కథా రచనలో కూడా భాగం పంచుకున్నారు కాబట్టి క్లైమాక్స్ మీద ఇంకొంచం శ్రద్ద పెట్టి ఉండాల్సింది .
విశ్లేషణ
మీరు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారైతే ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది . కాకపోతే ఫస్టాఫ్ కొద్దిగా స్లోగా నడిచి కొంచం నిరాశ కలిగిస్తుంది . ఇక సెకండాఫ్ నుంచి మాత్రం కథ చకచకా పరుగులుపెట్టి పూర్తి క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది . ముఖ్యంగా తన కొడుకు మర్డర్ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి పీటర్ స్వయంగా రంగంలోకి దిగడంతో కధనంలో వేగం పెరిగి మంచి క్యూరియాసిటీ కలిగిస్తుంది . ఇందులో అనవసరమైన కామెడీలు , లవ్ ట్రాక్ లు గట్రా ఏమీ ఉండవు .. ఉన్నది ఒకటే మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ . సినిమా అంతా పోలీస్ ట్రయల్ మాదిరిగా సాగిపోతుంది . జియో హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి మూవీ చూడొచ్చు . క్రైమ్ సినిమా అయినా ఇందులో అభ్యంతరకర సన్నివేశాలు ఏమీ లేవు కాబట్టి సినిమా చూడటం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు . ఏ జానర్ మూవీలు చూసేవారైనా వన్ టైం వాచ్ కింద ఈ మూవీని చూడొచ్చు .
నటీనటులు : సూరజ్ వెంజరమూడు , అలెన్సెర్ తదితరులు
సంగీతం : గోపి సుందర్
సినిమాటోగ్రఫీ : వినోద్
దర్శకత్వం : ఉన్ని గోవిందరాజ్
విడుదల : జియో హాట్ స్టార్
రేటింగ్ : 2.75 / 5
