Home » మలయంకుంజు మూవీ రివ్యూ – చివరి ముప్పై నిమిషాల ఫహద్ నటన సినిమాని నిలబెట్టింది!

మలయంకుంజు మూవీ రివ్యూ – చివరి ముప్పై నిమిషాల ఫహద్ నటన సినిమాని నిలబెట్టింది!

Spread the love

ఫహద్ ఫాసిల్ మలయాళంలో చక్కటి నటుడిగా తనను తాను ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు . కథ లేకపోయినా కేవలం ఫహద్ ను చూడటానికి మాత్రమే సినిమాకి వెళ్లే మలయాళీలు ఉన్నారు . అతడిదగ్గర ఓ గమ్మత్తు ఉంది . స్క్రిప్ట్ రైటర్లు ఇతడి కోసం పెద్ద పెద్ద డైలాగులు రాయాల్సిన అవసరం లేదు . కేవలం కళ్ళతోనే భావాలను పలికించగలడు . సింపుల్ గా ఒకట్రెండు మాటలతోనే ఆడియన్సుని ఆకట్టుకోగలడు . అందుకే ఇతను మలయాళీలకు మాత్రమే కాకుండా అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాడు . పార్టీ లేదా పుష్ప అంటూ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు .

ఓటీటీలు వచ్చిన తర్వాత చాలామంది ప్రేక్షకులు ఫహద్ ఫాసిల్ సినిమాలు వెతుక్కుని మరీ చూస్తున్నారు . అలాంటి ఒక సినిమానే మలయంకుంజు మూవీ . 2022 లోనే మలయాళంలో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి వసూళ్లను సాధించింది . ఈ సినిమా నిలబడటానికి రెండే రెండు కారణాలు ఉన్నాయి . చివరి ముప్పై నిమిషాల్లో ఫాహద్ ప్రదర్శించిన అత్యుత్తమమైన నటన మొదటికారణం కాగా , ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ రెండో కారణం . ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో మలయాళం వెర్షన్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతుంది .

కమల్ హాసన్ నటించిన వసంత కోకిల సినిమా చాలామంది చూసే ఉంటారు . అందులో కమల్ హాసన్ , శ్రీదేవిలు పోటీ పడి నటించారు . సినిమా అంతా ఒకెత్తు .. క్లైమాక్సులో కమల్ హాసన్ నటన ఒకెత్తు . తనని గుర్తుపట్టకుండా ట్రైన్ లో బయలుదేరుతున్న శ్రీదేవికి పాత జ్ఞాపకాలు గుర్తు చేయడానికి ప్లాట్ ఫార్మ్ మీద కమల్ హాసన్ చేసిన నటన ఇప్పటికీ చాలామందికి గుర్తుండిపోతుంది . అలాగే మలయంకుంజు సినిమా అంతా ఒకెత్తు . చివరి ముప్పై నిముషాలు ఫహద్ చేసిన నటన ఒకెత్తు . ఒక నటుడిగా ఫహద్ ఇంకో మెట్టు పైకి ఎదిగాడు .

ఇప్పుడు మలయంకుంజు సినిమా ఎలా ఉందో చూద్దాం

కధేంటంటే ?

కేరళలోని వయనాడ్ కొండప్రాంతం కింద అనిల్ కుమార్ ( ఫాహద్ ఫాసిల్ ) తల్లితో కలిసి నివాసం ఉంటాడు . తనకున్న టెక్నికల్ స్కిల్స్ తో ఇంట్లోనే ఒక గదిలో ఎలక్ట్రికల్ వర్క్స్ చేస్తుంటాడు .చుట్టుపక్కల ఎవరికి ఎలక్రికల్ పనుల అవసరం వచ్చినా ఇతడ్నే పిలుస్తారు . ఊళ్ళో అందరూ ఇతడ్ని అన్నికుట్టన్ అని పిలుస్తుంటారు .

అయితే ఇతడి స్వభావం విచిత్రంగా ఉంటుంది . దైవభక్తి విపరీతంగా ఉంటుంది . తెల్లవారి మూడుగంటలకే లేచి బావి దగ్గర స్నానం చేసి దేవుడికి దీపం పెట్టికానీ పనులు మొదలుపెట్టడు . రిపేర్లకు వచ్చిన టీవీలను , కంప్యూటర్లను గదిలోనే బాగు చేస్తూ ఉంటాడు. బయటికి వెళ్ళేది తక్కువ . ఊళ్ళో ఎవరితోనూ కలవడు . పైగా కులం పేరుతో అందర్నీ విసుక్కుంటూ ఉంటాడు . అన్నికుట్టన్ ప్రవర్తన చూసి తల్లి కూడా బాధ పడుతూ ఉంటుంది . కానీ ఆమె మాత్రం ఇరుగుపొరుగుకు సాయం చేస్తూ ఉంటుంది .

అన్నికుట్టన్ ప్రవర్తన వెనుక ఓ చేదు నిజం ఉందని అతడి మేనమామ అసలు విషయాన్ని రివీల్ చేస్తాడు .

ఇదిలా ఉండగా అన్నికుట్టన్ ఎదురింట్లో నివసిస్తున్న అమ్మాయికి పాప పుడుతుంది . ఆ అమ్మాయి ఏడ్చినప్పుడల్లా అన్నికుట్టన్ విసుక్కునేవాడు . పాప ఏడ్పు వల్ల తను పనిచేసుకోలేకపోతున్నాని , డిస్ట్రబెన్స్ గా ఉందని పాప తల్లితండ్రులను విసుక్కుంటూ అన్ని తలుపులు వేసుకుని పని చేసుకుంటూ ఉంటాడు .

ఇంతలో ఓ రోజు భారీ వర్షాల కారణంగా ప్రకృతి విపత్తు సంభవించి కొండ చరియలు జారి వీళ్ళ ఇళ్లమీద పడతాయి . దానికి తోడు కూలిపోయిన ఇళ్లను ఉప్పెనలా వరద వచ్చి ముంచేస్తుంది . అన్నికుట్టన్ కూడా ఆ వరద ప్రళయానికి భూమిలోకి జారిపోతాడు .

అపుడేం జరుగుతుంది ?
అన్నికుట్టన్ అందర్నీ కులం పేరుతో విసుక్కోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి ?
వరద ప్రళయంలో మునిగిపోయిన అన్నికుట్టన్ పునర్జన్మ పొందుతాడా ?
పాప ఏడ్పు విని విసుక్కున్న అన్నికుట్టన్ ను అదే పాప ఏడ్పు కాపాడుతుందా ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది .

ఎలా ఉంది ?

కథాపరంగా కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు . గతంలో ఇలాంటి నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి . కాకపోతే కేరళ వయనాడ్ లో నిజంగా జరిగిన ప్రకృతి ప్రళయం ఆధారంగా దర్శకుడు కథ అల్లుకుని ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది . ఈ సినిమాని నిలబెట్టింది ప్రకృతి ప్రళయంలో చిక్కుకుని బయటపడ్డ ఫహద్ ఫాసిల్ నటనే . ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని ఫహద్ చెప్పాడు . నిజమే క్లైమాక్స్ చూస్తే అతడి కష్టం కనిపిస్తుంది. పాతాళం లోతుకి బురదలో కూరుకుపోయిన అతడ్ని షూట్ చేయడానికి మైక్రో కెమెరాలు వాడాల్సి వచ్చిందట . నాచురల్ ఎఫెక్ట్ కోసం చాలా కష్టపడ్డారని తెలుస్తుంది .

మంజుమ్మాళ్ బాయ్స్ సినిమాలో కూడా సొరంగంలో పడిపోయిన మిత్రుడ్ని కాపాడే పాత్రలో సౌబిన్ సాహిర్ తాళ్లతో లోయలోకి దిగుతున్నప్పుడు సహజత్వం కోసం మైక్రో కెమెరాలనే వాడారట . మలయంకుంజులో కూడా చివరి ముప్పై నిమిషాల్లో ఫహద్ నటన , కెమెరా పనితనం , రెహమాన్ మ్యూజిక్కు మ్యాజిక్కులు చేసాయి .

కాకపోతే ఫస్టాఫ్ కొంచం బోర్ గా సాగుతుంది . అదేపనిగా ఫహద్ అందర్నీ విసుక్కోవడం , కనిపించినప్పుడల్లా పాత టీవీలు , కంప్యూటర్లు రిపేర్లు చేస్తూ కూర్చోవడం , పదేపదే చూసిన సన్నివేశాలే రిపీట్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది . సెకండాఫ్ లో అతడి ప్రవర్తన వెనుక కల అసలు కారణాన్ని రివీల్ చేసేవరకు అతడి క్యారక్టర్ అస్సలు అర్ధం కాదు . పైగా కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది .

ఎపుడైతే ఫహద్ ప్రళయంలో చిక్కుకుంటాడో అప్పట్నుంచి క్యూరియాసిటీ పెరుగుతుంది . టార్చ్ లైట్ వెలుగు సాయంతో బురదలోనుంచి బయటికి రావడానికి ప్రయత్నించడం , మధ్యలో బ్యాటరీ దొరికితే తనకు తెలిసిన సాంకేతికత సాయంతో దానికి వైర్లు కలిపి ఫోకస్ లైట్ ఆన్ చేయడం , పొట్టలో దిగిన రాడ్ ను బయటికి తీసినప్పుడు ఆపకుండా కారుతున్న రక్తానికి అడ్డుకట్ట వేయడానికి బురద అడ్డు పెట్టడం , దాహం వేయడంతో అక్కడే దొరికిన పాత గుడ్డను పిండుకుని నీటి బొట్లు తాగడం , పాప ఏడ్పు విని పొన్ని ,పొన్ని అంటూ పిల్ల కోసం ఏడుస్తూ వెతకడం వంటి సన్నివేశాలు హైలెట్ అవుతాయి .

అతడిలోని అహంకారాన్ని ప్రకృతి పటాపంచలు చేస్తుంది . ప్రకృతి కి ముందు కులాలు ,మతాలు పట్టింపులు ఉండవని నిరూపించింది . ప్రళయం వస్తే అందరూ సమానమే అన్న విషయం తెలుసుకుని అన్నికుట్టన్ రియలైజ్ అవుతాడు . పునర్జన్మ అతడిలో మార్పు తీసుకువస్తుంది . చివరికి తనని బతికించిన పాప కోసం ,తను బతికించిన పాప కోసం అన్నికుట్టన్ ఐసియు లోకి వెళ్లి పాపను ముద్దాడే సన్నివేశంతో ఒక మెసేజ్ ఇచ్చి సినిమాని ముగించాడు దర్శకుడు .

ఎవరెలా చేసారు ?

ఈ సినిమాకి వన్ మ్యాన్ ఆర్మీ ఫహద్ ఫాసిల్ అవుతాడు . క్లైమాక్సులో అతడి నటన చూసినవారు ఎవరైనా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు . అది కూడా సెకండాఫ్ లోనే అతడిలోని నటుడు పూర్తిగా బయటికి వచ్చి విశ్వ రూపం చూపిస్తాడు . నిజంగా క్లైమాక్స్ సన్నివేశంలో నటించాలంటే ఏ నటుడికైనా డెడికేషన్ ఉండాలి . క్లైమాక్సులో అతడి ఫీలింగ్స్ చూస్తే నిజంగా ఊపిరి అందటం లేదేమో అన్న అనుమానం వస్తుంది . అంత డెడికేటెడ్ గా నటించాడు . మిగిలినవాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించారు .

సాంకేతికత

సాంకేతికత విషయం చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఇద్దరు అద్భుతాలు చేసారు . అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించిన మహేష్ నారాయణ్ గురించి చెప్పుకోవాలి . అసలు క్లైమాక్స్ విజువల్స్ ఆయన ఎలా సృష్టించాడో కానీ మ్యాజిక్ చేసాడు . ఇక రెండోవారు తనదైన స్టైల్ లో మ్యూజిక్ అందించి మ్యాజిక్ చేసిన ఏఆర్ రెహమాన్ . సాజిమోన్ దర్శకత్వం బాగానే ఉంది కానీ ఫస్టాఫ్ మీద కూడా మరింత శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది .

విశ్లేషణ

కథాపరంగా చూసుకుంటే కొత్తదనం ఏమీ లేదు కానీ సినిమాని నడిపించిన కధనం బాగుంది. ఫస్టాఫ్ చాలావరకు నిరాశ పరుస్తుంది . రొటీన్ ఫార్మాట్లో సినిమా సాగిపోతుంది . దానికి తోడు పదేపదే ఫహద్ రిపేర్ల సన్నివేశాలు , నిద్రపోయే ముందు ప్రార్థనలు చేయడాలు , పొద్దున్నే బావి దగ్గర స్నానాలు చేయడం వంటి సాగతీత సన్నివేశాలు రిపీట్ కావడంతో బోర్ కొడుతుంది . ఫహద్ ఫాసిల్ జీవితంలో జరిగిన ఫ్లాష్ బ్యాక్ ఇన్సిడెంట్ రివీల్ అయిన తర్వాత కథ కొంచం అర్ధం అవుతుంది . కారణాలు ఏమైనా కానివ్వండి, అతడిలో పాతుకుపోయిన కులమతాల జాడ్యాలను ప్రకృతి ప్రళయం సృష్టించడం ద్వారా పునర్జన్మ ఫార్ములాను బయటికి తీసి చనిపోయిన అతడి తండ్రి వచ్చి ఫహద్ కు ఆ పాపని రక్షించమని చెప్పడంతో దర్శకుడు ఒక మెసేజ్ కూడా ఇచ్చినట్టు అయ్యింది . జస్ట్ వన్ టైం వాచ్ మూవీ కింద మలయంకుంజు మూవీ చూడొచ్చు . కాకపోతే అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో మలయాళం వెర్షన్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాలి .

నటీనటులు : ఫహద్ ఫాసిల్ , అర్జున్ అశోకన్ తదితరులు
సంగీతం : ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ : మహేష్ నారాయణన్
దర్శకతం : సాజిమోన్ ప్రభాకర్
విడుదల : అమెజాన్ ప్రైమ్
రేటింగ్ : 2.5 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!