ఒక సినిమాలో రావుగోపాల రావు ‘ జ్యోతిలక్ష్మికి తక్కువ..జయమాలినికి ఎక్కువ లాంటి డైలాగులు వాడతాడు. జెట్ లీ సినిమా పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది .
ఈ సినిమా ఏ జానర్ కిందికి వస్తుందో చప్పున చెప్పడం కష్టం. కామెడీ జానర్ అనుకుందామా అంటే అక్కడక్కడా సీరియస్ ప్లాట్ లు తగులుకుంటాయి. పోనీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ అనుకుందామా అంటే పంచు కామెడీలు తగులుకుంటాయి . ఈ విషయం సినిమా మొత్తం తుదకంటా చూసినవాళ్ళకు అర్థమౌతుంది .
సినిమా మొత్తం చూసినవాళ్ళకి దర్శకుడు అన్ని జానర్ లు మిక్సి లో వేసి మిక్సింగ్ చేసి వదలాడని పూర్తిస్థాయిలో గ్రహించబడతాడు. సరే సినిమా ఏ జానర్ కిందికి వస్తుందో అనే విషయాన్ని కాసేపు పక్కనబెట్టి ఎలా ఉందో చూద్దాం.
కథేంటంటే?
సినిమా ప్రారంభమే చిరంజీవి న్యాయం కావాలి మూవీ పోస్టర్ తో మొదలౌతుంది.
ముగింపు చిరంజీవి డూపులాంటి టీవీ సీరియల్ నటుడు రాజశేఖర్ ఇచ్చే ఎలివేషన్లతో ముగుస్తుంది. మొత్తానికి చిరంజీవిని అలా వాడుకున్నారు .
స్వింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వ్యాపారవేత్త ప్రజాపతి ( అజయ్) ( బహుశా దర్శకుల వారు విజయ్ మాల్యాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రజాపతి క్యారెక్టర్ డిజైన్ చేసినట్టున్నారు) ప్రజలు బ్యాంకులో దాచుకున్న డిపాజిట్లు సొంత వ్యాపారాలకు వాడుకుని 15 వేల కోట్లు నష్టపోతాడు. దీంతో ప్రజలు.. మీడియా పెద్దఎత్తున బ్యాంక్ వద్దకు చేరుకుంటారు.
వాళ్ళు ఆందోళన చేస్తుండగానే బ్యాంక్ సీఈవో హరిచంద్రను ( శుభలేఖ సుధాకర్) హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ప్రజాపతి దుబాయ్ పారిపోతాడు.
ఈ విషయం అల్లరి అవడంతో కేంద్ర హోమ్ మంత్రి మెల్కోటే ( శ్రీనివాస్ వడ్లమాని) మేల్కొని ప్రజాపతిని అరెస్ట్ చేసి ఇండియాకు పట్టుకొచ్చే బాధ్యతను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ శివానీ రాయ్ కి అప్పచెబుతాడు .
శివానీ రాయ్ దుబాయ్ వెళ్ళి ప్రజాపతిని అరెస్ట్ చేసి విమానంలో ఇండియా బయలుదేరుతుంది. మరోపక్క ప్రజాపతి తనకు జజీరా గ్రూప్ నుంచి ప్రాణహాని ఉందని ఏజెంట్ శివానీకి చెప్తాడు. కానీ ఈ విమాన ప్రయాణం నుంచి తప్పించుకుని ఎవరికీ దొరక్కుండా పారిపోవడానికి ప్రజాపతి ప్లాన్ వేస్తాడు.
ఈ పరిస్థితుల్లో విమానం వాష్ రూమ్ లో గతాన్ని మర్చిపోయిన స్థితిలో డాక్టర్ వేద వ్యాస్ ( సత్య) ఎంటర్ అవుతాడు.
ఇండియాకి చేరుకోకుండా ప్రజాపతి వేసిన ప్లాన్ ఏంటి?
ప్రజాపతిని విమానంలోనే చంపాలని ఎవరు ప్రయత్నిస్తారు?
గతాన్ని మర్చిపోయిన సత్య ఎవరు? అనేది మిగిలిన కథనంలో తెలుస్తుంది.
ఎలా ఉంది?
ఈ సినిమా మీద ప్రేక్షకులకు కొన్ని అంచనాలు ఉండటానికి కారణం గతంలో ఇదే దర్శకుడు రితేష్ రానా మత్తు వదలరా మూవీని డిఫరెంట్ గా తెరకెక్కించడం ప్రధానమైనది. కొంచం కామెడీ.. కొంచం క్రైమ్ మిక్సిలో వేసి రుబ్బి ఆ సినిమాతోనే జనాల మత్తు వదిలించాడు.
అదే దర్శకుడి చేతినుంచి జెట్ లీ దూసుకురావడంతో సహజంగా ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు కమెడియన్ సత్య లీడ్ చేయడంతో కాసేపు కడుపుబ్బ నవ్వుకోవచ్చని హాస్య ప్రియులు జెట్ వేగంతో సినిమా చూసారు.
నిజమే.. ప్రేక్షకులు ఆశించినట్టు సత్య ఎంట్రీ ఇస్తూ కితకితలు పెట్టకుండానే తనదైన శైలిలో నవ్వించే పని మొదలెట్టాడు.
విమానం వాష్ రూమ్ నుంచి గతాన్ని మర్చిపోయిన స్థితిలో బయటికి రావడం, తన కడుపులో పెన్ను ఎవరు దించారో తెలియక అందరి మీద అనుమానపడటం.. తన పక్క సీటులో కూర్చున్న వెన్నెల కిషోర్ సత్యని బ్లైండ్ డాక్టర్ వేద వ్యాస్ గా గుర్తు పట్టడం.. కడుపులో బాంబులు పరిగెడుతున్నాయని వాష్ రూమ్ కి పరుగులు పెట్టె దుబాయ్ షేక్.. చీటికీ మాటికీ భయపడే పాత్రలో శ్రీనివాస రెడ్డి ఫస్టాఫ్ లో యధాశక్తి నవ్వించడానికి ప్రయత్నం చేశారు.
సరే వీటిలో కొన్ని సన్నివేశాలకు నవ్వగలిగేవాళ్లు నవ్వారు.. నవ్వలేని వాళ్ళు నెక్స్ట్ సీన్ ఏంటని ఎదురు చూసారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు గందరగోళం సెకండాఫ్ నుంచి మొదలౌతుంది .
సెకండాఫ్ లో సత్య.. వెన్నెల కిషోర్ లు ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించాలని ప్రయత్నం చేశారు కానీ నవ్వు సంగతి ఏమో కానీ కొంతమందికి ఆ దుబాయ్ షేక్ మాదిరి కడుపులో నొప్పి వచ్చింది.
దర్శకుడి స్టోరీ లైన్ లో ఎక్కడో తీగ తెగింది. సాగతీత సన్నివేశాలతో విమానం ఎటు పోతుందో తెలీనట్టే స్టోరీ ఎటు పోతుందో అర్థం కాదు. ఉన్న కమెడియన్లు అందరూ ఒక్కసారిగా తమ టాలెంట్ చూపించటానికి ఒకరికి పోటీగా మరొకరు దూసుకురావడంతో ప్రేక్షకులు నవ్వడం మర్చిపోయారు.
పైగా సెకండాఫ్ లో దర్శకుడు కామెడీని విమానం నుంచి గాల్లోకి విసరడమే కాకుండా ఖండాంతరాలు దాటిస్తాడు. సత్య విమానంలోనుంచి జారి గాల్లో పడిపోయి తిరిగి అదే గాల్లో ఎగురుకుంటూ విమానంలోకి చేరే సన్నివేశం జెట్ లీ కామెడీకి పరాకాష్ట. విమానం కార్గోలో వెన్నెల కిషోర్ సుత్తి పెట్టి కనిపించిన డబ్బాల మీద కొడుతుండటంతో ప్రేక్షకులు నవ్వడం మర్చిపోయి భయపడటం మొదలుపెడతారు .
దానికి తోడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి సత్య విమానాన్ని నడపడం అనే భయంకరమైన కామెడీని జీర్ణించుకోవడానికి ప్రేక్షకులకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలీదు.
క్లైమాక్సులో నైజీరియా వాళ్ళు కాల్చే బుల్లెట్ గుండ్లను సత్య తన జాకీ చాన్ సైకిల్ చైన్ తో మినప గుండ్ల మాదిరి ఆడుకోవడంతో ఇక మాటల్లేవ్..మాట్లాడుకోవడలు లేవు.
ఓవరాల్ గా ఫస్టాఫ్ లో కామెడీ బాగుంది .. సెకండాఫ్ లో డబుల్ డోస్ తో వికటించింది .
ఎవరెలా చేసారు ?
నిజానికి కామెడీ టైమింగ్ లో సత్య పర్ఫెక్ట్ . కానీ అతడేం చేస్తాడు ? దర్శకుడు దూకమంటే విమానంలోనుంచి దూకాల్సిందే కదా ? అయినా ఫస్టాఫ్ లో తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు . సెకండాఫ్ లో మాత్రం కామెడీకి బౌండరీలు చెరిపేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు.
ఇక ఇంకో కామెడీ జతగాడి గురించి కూడా చెప్పుకోవాలి . అతడే వెన్నెల కిశోర్ .. అతడి టైం ఏంటో కానీ అతడి మూస కామెడీ చూసి చూసీ ప్రేక్షకులకు మొనాటని వచ్చేసింది . వెన్నెల కిశోర్ కామెడీలో కొత్తదనం ఉండటం లేదు . ఇందులో కూడా నవ్వించటానికి చాలా ప్రయత్నాలు చేసాడు . కానీ పెద్ద ఔట్పుట్ రాలేదు . గుండు సుదర్శన్ నటన కూడా అంతే .
శ్రీనివాస రెడ్డి , వైవా హర్షలు కూడా మంచి కమెడియన్లే కానీ దర్శకుడు వాళ్ళని విమానం సీటుబెల్ట్ బిగించి మరీ కూర్చోబెట్టేసాడు . సరిగా వాడుకుంటే శ్రీనివాస రెడ్డి కూడా మంచి ఛాయిస్ .
ఇక అందాల పోటీలో నెగ్గిన హీరోయిన్ పిల్ల రియా సింఘా చేత కూడా జాలిలేకుండా ఫైటింగులు గట్రా చేయించేసారు . అయినా శివానీ రాయ్ పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది .
ఎప్పటిలానే అజయ్ సహజ విలనిత్వం బాగా పండించాడు .
సాంకేతికత
కాలభైరవ అందించిన సంగీతం బావుంది . సినిమాటోగ్రఫీ కూడా బావుంది . ఇక ఆ విమానం సెట్టింగ్ ఎవరు వేసారో కానీ పర్ఫెక్ట్ గా దించేశారు . నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి .
విశ్లేషణ
జెట్ లీ సినిమా అంతా విమానంలోనే నడుస్తుంది . అసలు ఈ సినిమాకి గాల్లో దీపం అని పేరు పెడితే యాప్ట్ గా ఉండేది . ఎందుకంటే గాల్లో ఎగురుతున్న విమానంలో ఉన్న అజయ్ ని చంపటానికి ప్లాన్ వేసిన నేపథ్యంలో కథ సాగుతుంది కాబట్టి ఆ టైటిల్ అయితే బాగుండేదేమో ? సినిమా మొత్తం పాత్రలతో పాటు మనం కూడా విమానంలో ప్రయాణం చేయాల్సిందే . ఫస్టాఫ్ లో ఎగ్జిక్యూటివ్ క్లాసులో ప్రయాణం చేయడంతో హాయిగా ఉంటుంది .
ఇక సెకండాఫ్ లో మాత్రం హఠాత్తుగా జనరల్ భోగీలోకి మారిన పాసెంజర్ మాదిరి ఉంటుంది మన పరిస్థితి . దానికి తోడు విమానంలో ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చి కుదుపులతో అటూఇటూ ఊగిపోతోంది . ఆ కుదుపులు తట్టుకోలేక మనం కూడా అటూఇటూ ఊగిపోతాం . ఫైనల్ గా ఒకే టికెట్ మీద రెండు సినిమాలు చూసినట్టు , ఒకే టికెట్ మీద రకరకాల సినిమాలు చూసిన ఫీలింగ్ తో బయటికి వస్తాం .
ఓవరాల్ గా సినిమా ఫస్టాఫ్ బాగుంటుంది .. సెకండాఫ్ ఊగిపోతోంది . అది తట్టుకుని జారిపోకుండా సీట్ బెల్ట్ గట్టిగా కట్టుకుని కూర్చుని చూడగలిగితే వన్ టైం వాచ్ కింద బాగానే ఉంటుంది .
నటీనటులు : సత్య , వెన్నెల కిశోర్ , అజయ్ , వైవా హర్ష , శ్రీనివాస రెడ్డి , తదితరులు
సంగీతం : కాలభైరవ
సినిమాటోగ్రఫీ : సురేష్ సారంగం
దర్శకత్వం : రితేష్ రానా
విడుదల : జియో హాట్ స్టార్
రేటింగ్ : 2 / 5
