సింగీతం శ్రీనివాసరావు పేరు వినగానే మనకు అసలు మాటలే లేని పుష్పక విమానం సినిమా గుర్తుకొస్తుంది .. సింగీతం శ్రీనివాసరావు పేరు వినగానే టైం మిషన్లో మనల్ని కృష్ణదేవరాయల కాలానికి తీసుకెళ్లిన ఆదిత్య 369 సినిమా గుర్తుకొస్తుంది . సూపర్ స్టార్ కృష్ణ పేరు చెప్తే మనకు మొదటి కౌబాయ్ సినిమాలు , 70 mm సినిమాలు , ఈస్ట్ మన్ కలర్ సినిమాలు ఎలా గుర్తుకువస్తాయో సింగీతం శ్రీనివాసరావు పేరు చెప్తే తెలుగు సినిమాల్లో సరికొత్త ప్రయోగాలు చేసి విజయం సాధించిన దర్శకుడు గుర్తుకొస్తాడు . తెలుగు సినిమాల్లో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చేసిన ప్రయోగాలు మరే దర్శకుడు చేయలేదేమో ?
కమల్ హాసన్ హీరోగా ఆయన మాటల్లేని మూకీ సినిమా పుష్పక విమానం మొదలుపెడితే అందరూ నవ్వారు . మూకీ యుగం ఎప్పుడో ముగిసింది . ఇప్పుడు సినిమాల్లో మాటలు లేకుండా , పాటలు లేకుండా మూగ సైగలతో సినిమా చేస్తే ఎవరు చూస్తారు ? అని చాలామంది ఎగతాళి చేసారు . కానీ ఆశ్చర్యంగా పుష్పక విమానం బాక్సాఫీస్ కలెక్షన్ల రికార్డును బద్దలుకొట్టింది .
ఇప్పుడు ఆయన వయసు 94 . కానీ సినిమాల విషయంలో మాత్రం ఆయన ఆలోచనలు నిత్య నూతనంగా , యవ్వనంగా ఉంటాయి అని సింగ్ గీతం నిరూపించింది . సింగ్ గీతం ఆలోచన సింగీతంది . ఆ ఆలోచనలను వెండితెరమీదకు సజీవంగా తీసుకొచ్చింది నాగ్ అశ్విన్ . ఒకరకంగా చెప్పాలంటే సింగీతం ద్రోణాచార్యుడు అయితే నాగ్ అశ్విన్ ఏకలవ్యుడి మాదిరి ఈ సినిమాకి పనిచేసారు . వయోభారంతో నేరుగా షూటింగులలో పాల్గొనలేకపోయినా ఈ సినిమాకోసం ఆయన నాగ్ అశ్విన్ సహకారంతో పర్యవేక్షణ చేసారు .
జూన్ 12 న థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే ? మాటల స్థానంలో పాటలను చేర్చి సింగ్ గీతం అంటూ సరికొత్త ప్రయోగంతో మనముందుకు వచ్చారు .
ఇప్పుడు సింగ్ గీతం ఎలా ఉందో చూద్దాం .
కధేంటంటే ?
జైలుశిక్ష అనుభవించి బయటకు వచ్చిన ప్రతాప్ ( అయాన్ ) కు అతడి లాయర్ కలిసి తండ్రి రాసిన వీలునామా పేపర్లు అందచేస్తాడు . ఆ వీలునామా ప్రకారం కుబేరపురం అనే ఊరిలో వందల ఎకరాల భూములు అతడికే చెందుతాయి . తన పేరున అంత ఆస్తి ఉందని తెలియడంతో ప్రతాప్ కుబేరపురం బయలుదేరతాడు . అక్కడికి వెళ్లి తనపేరున ఉన్న ఆస్తులను అమ్ముకుని బయటపడాలని ప్రతాప్ ప్లాన్ .
కానీ కుబేరపురం వెళ్లిన ప్రతాప్ కి అక్కడ గోల్డ్ మైన్స్ ఉన్నాయని తెలుస్తుంది . ఇతడు వెళ్లేసమయానికి అక్కడ ఇంకో గోల్డ్ మైన్స్ ఓనర్ కూతురు రేణు ( షాలిని ) ప్రతాప్ వాటా కూడా కొట్టేసి మొత్తం గోల్డ్ మైన్స్ ను ఒక విదేశీయుడికి అమ్మటానికి ప్రయత్నిస్తుంది . ప్రతాప్ రావడంతో రేణు అతడితో రాజీపడి ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ లో ఆ మైన్స్ ను విదేశయుడికి అమ్మటానికి ఒప్పందం చేసుకుంటుంది .
తన వాటా అమ్మేసుకుని డబ్బులు తీసుకుని వెళ్ళిపోదామని నిర్ణయించుకున్న ప్రతాప్ రేణు ప్రపోజల్ కు ఒప్పుకుంటాడు . దాంతో ఊళ్ళో ఉన్న ఏకైక పెద్ద చెట్టును తొలగించి తవ్వుదామని ప్రయత్నాలు మొదలుపెడతారు . కానీ వీళ్ళ ప్రయత్నాలను ఊర్లోని గని కార్మికుడి కూతురు ..చెట్లను ప్రాణప్రదంగా ప్రేమించే గౌరీ ( అహల్య ) అడ్డుకుంటుంది . అయినా రేణు బలవంతంగా ఆ చెట్టును కొట్టేయిస్తుంది . దాంతో ఏడుస్తూ కుబేర దేవుడి విగ్రహం దగ్గరికి వెళ్లిన గౌరీ గుహలో పడిపోతుంది . అక్కడ చెట్టును కొట్టేసినవాళ్ల మీద గౌరీ శాపనార్దాలు పెడుతుంది .
ఆశ్చర్యంగా ఆ మర్నాటినుంచి కుబేరపురంలో అందరికీ మాటలు పోయి పాటలు వస్తాయి . తాము ఏం మాట్లాడినా పాటల మాదిరి దీర్ఘాలు రావడంతో ఊరి జనం తమకేదో శాపం తగిలిందని , తెలియని రోగం వచ్చిందని కంగారు పడతారు .
మరి ఈ శాపం నుంచి బయటపడటానికి ఊరి జనం ఏం చేస్తారు ?
జైలునుంచి విడుదలై కుబేరపురం వచ్చిన ప్రతాప్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి ?
కుబేరపురంలో ఉన్న చెట్టుకు .. గోల్డ్ మైన్స్ కు ఉన్న కనెక్షన్ ఏంటి ? అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది ?
మూవీ స్టార్టింగ్ అన్ని సినిమాల మాదిరే ఇందులో కూడా జైలునుంచి విడుదలైన హీరో మాములుగా మాట్లాడటం , తన పేరున ఆస్తి ఉందని తెలుసుకుని కుబేరపురం చేరుకోవడం, అక్కడ గౌరీ పరిచయం అవడం , తనకు తెలియకుండా గోల్డ్ మైన్స్ అమ్మేయాలని చూసిన రేణుని కలవడం వరకు మూవీ రొటీన్ ఫార్మాట్ లోనే సాగుతుంది . ఈ బిగినింగ్ చూసి ఇదేంటి సింగీతం గారు తెలుగు సినీ చరిత్రలోనే ఏదో సరికొత్త ప్రయోగం చేసారని ప్రమోషన్లలో ఉదరగొట్టేసారు కదా ? మరి మూవీ చూస్తుంటే ఫక్తు రొటీన్ తెలుగు సినిమాల మాదిరే ఉంది కదా ? అని కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం . కానీ ఎప్పుడైతే ఊర్లో ఉన్న ఏకైక చెట్టును కొట్టేస్తారో .. గౌరీ కుబేరగుహలో పడి శాపనార్దాలు పెడుతుందో సింగీతం మార్క్ మూవీ మొదలౌతుంది .
షుమారు మొదటి ముప్పై నిమిషాల తర్వాత సింగీతం ప్రయోగం సింగ్ గీతం మొదలౌతుంది . బహుశా తెలుగు సినిమా చరిత్రలో మాటలనే పాటలుగా మార్చిన మొదటి సినిమా ఇదే అవుతుందేమో ? ఆకస్మికంగా తమలో వచ్చిన మార్పు గురించి కూడా ఊరి జనాలు ‘ బాబోయ్ ఏదో అయిపొయింది .. మాటలు రావట్లేదు .. పాటలు ఆగట్లేదు .. ఇదేదో ఆగట్లేదు ..అంటూ మాటలనే పాటలుగా మార్చి పలకడం కొత్తగా ఉంది .. బావుంది . దానికి తోడు ఈ మాటల పాటలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం తోడయ్యిందేమో వినటానికి బావుంది .. వెరైటీగా అనిపించింది . నిజంగా తెలుగు సినిమా చరిత్రలో సింగీతం చేసిన ప్రయోగం సరికొత్త రికార్డులతో నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు . మూస కథనాలనుంచి వైవిధ్యభరితమైన కధనం వైపు సింగ్ గీతం నడిపించిన ఘనత సింగీతానికే దక్కుతుంది .
కుబేరపురంలో అందరికీ ఇలాగే అవడం , తమకేదో రోగం వచ్చిందని ఊరి జనం కంగారు పడటం , పూజారిని , వైద్యున్ని నమ్ముకున్నా మాములు కాకపోవడం వంటి సన్నివేశాల ద్వారా కొంత కామెడీ ట్రాక్ నడిపారు . అయితే ఓ పావుగంట వరకు ఈమ్యూజిక్ చేసిన మ్యాజిక్ బాగానే ఉంది కానీ అదే ఫార్ములాని చివరివరకు కంటిన్యూ చేయడంతో కొత్త పోయి పాత అవుతుంది . పైగా ఈ మాటల పాటల కోసం చాలా సన్నివేశాలను సాగదీసినట్టు అనిపిస్తుంది .
కథ గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు . పర్యావరణానికి హాని చేస్తే మానవాళి ఎటువంటి దుష్ప్రభావాలను ఎదుర్కొంటుంది ? అనే లైనులో ఆయన కథ రాసుకున్నట్టున్నారు . నిజానికి ఈ లైన్ డాక్యుమెంటరీ ఫిల్మ్ గా తీయదగ్గ స్టోరీ లైన్ . ఈ లైనునే దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా మలిచారు .
ఈ మూవీలో లాజిక్కులు వెతికితే మనకు చాలా లోపాలు కనిపిస్తాయి . మూవీ స్టార్టింగులోనే జైలు , లాయర్ చూపించిన దర్శకుడు కుబేరపురం విషయానికి వచ్చేసరికి ప్రపంచానికి దూరం పెట్టేసాడు . కుబేరపురంలో గోల్డ్ మైన్స్ అక్రమంగా తవ్వుకుంటున్నా అడిగే నాధుడు లేడు . కుబేరపురంలో పోలీసులు , చట్టాలు , ప్రభుత్వాలు మనకు ఎక్కడా తగలవు . ప్రతాప్ జైలుకు ఎందుకు వెళ్ళాడు అనే విషయం మీద క్లారిటీ ఉండదు . ఊరినుంచి వెళ్లిపోయిన ప్రతాప్ తండ్రి గురించి ఎవరికీ తెలీదు .
క్లైమాక్సులో గోల్డ్ మైన్స్ గుహలోకి వెళ్లిన జనాలు బంగారు విగ్రహాలుగా మారిపోవడం , మిగిలిన జనాలు ఆకాశం వంక చూస్తూ పాటలు పాడటంతో మాములు మనుషులు అయిపోవడం వంటి సన్నివేశాలు పూర్తి రొటీన్ ఫార్మాట్ లో ఉంటాయి . క్లైమాక్సులో రంగప్రవేశం చేసిన విజయ్ దేవరకొండతో కామెడీ చేయించాలని ప్రయత్నించడం ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది .
ఎవరెలా చేసారు ?
ప్రతాప్ పాత్రలో అయాన్ బాగానే చేసాడు . తన గతం తెలుసుకున్న సందర్భంలో వచ్చిన సన్నివేశాలలో భావోద్వేగాలను బాగానే పండించాడు . గౌరితో ప్రేమలో పడిన లవర్ బాయ్ రూపంలో బాగున్నాడు .
గౌరీ పాత్ర పోషించిన అహల్య నటన కూడా బాగుంది . చెట్లను ప్రేమించే పాత్రలో ఒదిగిపోయింది .
రేణు పాత్రలో షాలిని నటన బాగుంది . మొదట్లో నెగిటివ్ షేడ్ లోనూ , తర్వాత మారిన మనిషిగా పాజిటివ్ షేడ్ లోనూ చక్కగా నటించింది .
మిగిలినవాళ్లు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు .
సాంకేతికత
సాంకేతికత గురించి చెప్పుకోవాలంటే ఈ మూవీకి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ గురించి ముందు చెప్పుకోవాలి . ఎందుకంటే సినిమాలో వచ్చే నాలుగైదు పాటలకు సంగీతం అందివ్వడం వేరు .. సినిమాలో ప్రతి మాటా పాటగా మారిన సందర్భంలో సంగీతం వేరు . దేవిశ్రీ అందించిన సంగీతం వల్లనే పాటల్లా పలికిన ఆ మాటలు వినసొంపుగా అనిపించాయి. ఇక డబ్బింగ్ చెప్పినవాళ్లు కూడా పర్ఫెక్ట్ గా చెప్పారు . మాటలను రిథమిక్ గా చెప్పడంతో చక్కగా కుదిరాయి .
కుబేరపురం కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ బాగుంది . కుబేర విగ్రహం సెట్టింగ్ విషయంలో కళాదర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది . సినిమాటోగ్రఫీ బాగానే ఉంది .
విశ్లేషణ
మాటలనే పాటలుగా మార్చి తెలుగు సినీ చరిత్రలో సింగీతం శ్రీనివాసరావు సరికొత్త ప్రయోగం చేసారు . మూవీ చూసినవారిలో చాలామందికి ఈ ప్రయోగం నచ్చుతుంది . మ్యూజిక్ లవర్స్ కి మరింత నచ్చుతుంది . అయితే క్లైమాక్స్ వరకు అదే ఫార్ములాని కంటిన్యూ చేయడంతో కొంతమందికి ఓవర్ అయినట్టు కూడా అనిపించవచ్చు . దానికి తోడు లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించవచ్చు కూడా .. ఓవరాల్ గా చూసుకుంటే ఆ మాటలు కూడా ప్రత్యేక ట్యూన్లు కట్టుకుని రిథమిక్ గా ఉండటంతో రొటీన్ ఫార్మాట్లో చూసి విసిగిపోయిన మనకు ఫ్రెష్ ఫీల్ వస్తుంది .
మ్యూజికల్ ఫాంటసీ మూవీ కింద ఈ సినిమా చూసేవాళ్ళు మాత్రం పెద్దగా డిజప్పాయింట్ కారు . ఎందుకంటే ఒక గొప్ప సందేశాన్ని ప్రెజెంట్ చేసే సందర్భంలో దర్శకుడు కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు . మనిషి డబ్బు మీద , బంగారం మీద ఆశతో స్వార్థంతో చెట్లను నరికేస్తూ పర్యావరణానికి చేస్తున్న హాని గురించి సినిమాటిక్ లిబర్టీతో తెలియచేస్తూనే దర్శకుడు గొప్ప మెసేజ్ ఇచ్చాడు . అందుకే ఈ మూవీని మ్యూజికల్ ఫాంటసీ జోనర్లో భావించుకుని చూడాలి .
ఓవరాల్ గా 94 సంవత్సరాల వయసులో కూడా వినూత్నమైన ఆలోచనతో , వైవిధ్యభరితంగా , తెలుగు సినీ చరిత్రలో మొదటిసారిగా మాటలనే పాటలుగా మార్చి సింగ్ గీతం చేసిన మ్యూజికల్ మ్యాజిక్ మనల్ని నిరాశపరచదు .
నటీనటులు : అయాన్ , అహల్య , షాలిని , తులసి తదితరులు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత : నాగ్ అశ్విన్
దర్శకత్వం : సింగీతం శ్రీనివాసరావు
విడుదల : 12-06-2026
రేటింగ్ : 3 / 5
