Headlines

ఇకపై ఆ మలయాళ దర్శకుడు కొత్తగా చెప్పే దృశ్యం ఏమీ ఉండదేమో ? – దృశ్యం 3 మూవీ రివ్యూ

Spread the love

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీల్లో దృశ్యం మూవీ సృష్టించిన సంచలనం మామూలుదికాదు . మలయాళంలో థియేటర్ రిలీజ్ రావడంతోనే బాక్సాఫీస్ కలెక్షన్లు బద్దలుకొట్టింది . ఆ సినిమా ప్రభంజనం అంతటితో ఆగలేదు . తెలుగు , తమిళ , హిందీ భాషల్లో కూడా రీమేక్ అయి పాన్ ఇండియా మూవీ స్థాయికి ఎదగడమే కాకుండా రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టుకుంది . దృశ్యం , దృశ్యం 2 సినిమా తెలుగు రీమేక్ లో వెంకటేష్ , మీనాలు మలయాళం ఒరిజినల్ వెర్షన్ తో పోటీపడి నటించి మెప్పించారు .

దృశ్యం మూవీకి సంబంధించి పూర్తి క్రెడిట్స్ ఆ చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్ కు దక్కుతుంది . ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఏరికోరి ఎంచుకుని అతడు దృశ్యం మూవీ తీసాడు . అనుకోని పరిస్థితుల్లో హత్యానేరంలో ఇరుక్కున్న కూతుర్ని రక్షించుకోవడం కోసం ఓ తండ్రి పోలీసులతో ,చట్టాలతో ఏ విధంగా పోరాడుతాడు అనే ఒకే ఒక్క సింగిల్ లైన్ పాయింట్ ఆధారంగా క్రైమ్ స్టోరీని అల్లుకుని ఏకంగా మూడో సీక్వెల్ ప్లాన్ చేయడం అంటే మాటలు కాదు . సినిమా ప్రారంభం నుంచి ఎండ్ కార్డు పడేవరకు ప్రేక్షకులు కుర్చీలలోనుంచి కదలకుండా బిగి సడలని స్క్రీన్ ప్లే తో రెండు గంటల సినిమాని నడిపించాలంటే దానికి టాలెంట్ ఉండాలి . దృశ్యం మొదటి రెండు భాగాలు చూసిన ప్రేక్షకులు మూడో భాగం మీద కూడా చాలా అంచనాలు పెట్టుకున్నారు . కాకపోతే మొదటి రెండు భాగాలు తెలుగులో రీమేక్ చేయగా మూడో భాగం మాత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్లో థియేటర్లలో రిలీజ్ అయ్యింది .

మరి దృశ్యం 3 కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకుందో ? లేదో చూద్దాం .

కధేంటంటే ?

దృశ్యం మొదటి రెండు భాగాలు చూసినవారికి మూడో భాగం వెంటనే అర్ధమౌతుంది . అయినా ఇంతకుముందు భాగాలు చూడనివారికోసం టైటిల్స్ లోనే జరిగిన కథను బ్రీఫింగ్ ఇచ్చారు . పోలీస్ ఆఫీసర్ గీత కొడుకు వరుణ్ హత్యకేసులో డిఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో జార్జ్ కుట్టిని ( మోహన్ లాల్ ) ను హైకోర్టు నిర్దోషిగా భావించి విడుదల చేస్తుంది . దాంతో గీత డిప్రెషన్ తో అమెరికా వెళ్ళిపోతుంది .

మరోపక్క హైకోర్టు కేసు కొట్టివేయడంతో జార్జ్ కుట్టి , తన భార్య రాణి ( మీనా ) , ఇద్దరు కూతుళ్లతో ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాడు . అంతేకాదు థియేటర్ ఓనర్ అవడమే కాకుండా తన కథనే చిన్న చిన్న మార్పులు చేసి నిర్మాతగా సినిమా రిలీజ్ చేస్తాడు . ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది .

ఈ పరిస్థితుల్లో తన పెద్ద కూతురు అంజికి ( అన్షిబా హాసన్ ) పెళ్ళిచేయాలని సంబంధాలు వెతుకుతుంటాడు. అయినా జార్జ్ కూతురి మీద కొంతమంది చెడు ప్రచారాలు చేయడంతో వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి . చివరికి దుబాయిలో వ్యాపారం చేసుకునే అబ్బాయితో సంబంధం కుదురుతుంది . పగతో రగిలిపోతున్న గీత భర్త ప్రభాకర్ ఎలాగైనా అంజు పెళ్లి చెడగొట్టి ఆమెను జైలుకు పంపాలని ప్లాన్ వేస్తాడు . ఇందుకోసం అతడు గతంలో జార్జ్ కేసులో సస్పెండ్ అయిన పోలీస్ సహదేవ్ సహాయం తీసుకుంటాడు . ప్రభాకర్ ఐజితో కలిసి వరుణ్ మర్డర్ కేసును రీ ఓపెన్ చేయిస్తాడు .

జార్జ్ కూతురి పెళ్లి చెడగొట్టి ఆమెను జైలుకు పంపాలని ప్రభాకర్ వేసిన ప్లాన్ ఫలిస్తుందా ?
తన మీద కేసును రీ ఓపెన్ చేయడంతో జార్జ్ దానిని ఎలా ఎదుర్కొంటాడు ?
మరోసారి జార్జ్ తన కూతురిని ఏ విధంగా కాపాడుకుంటాడు ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది .

ఎలా ఉంది ?

దృశ్యం మొదటి రెండు భాగాలు చూసినవాళ్లకు మూడో భాగంలో గ్రిప్పు జారిందని అర్ధమౌతుంది . దృశ్యం మొదటి భాగంలో పోలీస్ ఆఫీసర్ కొడుకు మర్డర్ కేసులో కూతుర్ని కాపాడుకునేందుకు మోహన్ లాల్ ఆడే మైండ్ గేమ్ చూస్తుంటేనే ఉత్కంఠతకు లోనయ్యాం . గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో దర్శకుడు కధనాన్ని నడిపించిన తీరు గూస్ బంప్స్ తెప్పిస్తుంది . ఈ సన్నివేశం తర్వాత ఏం జరుగుతుందా ? అనే క్యూరియాసిటీని ప్రేక్షకులలో కలగచేయడంలో దర్శకుడు జీతూ జోసెఫ్ నూరు శాతం విజయం సాధించాడు . ఆ క్యూరియాసిటీతో జనం రెండో భాగం కూడా చూడటం కోసం థియేటర్లకు క్యూ కట్టారు . మొదటిభాగంతో పోలిస్తే కొంచం ఫ్లేవర్ తగ్గినట్టు అనిపించినా హిట్ టాక్ తెచ్చుకుంది . మొదటిరెండు భాగాలు ఇచ్చిన ఉత్సాహంతో దర్శకుడు మూడో భాగం కూడా తీసి వదిలాడు .

ఈ మూడోభాగం గురించి చెప్పుకోవాలంటే దర్శకుడి ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి చెప్పుకోవాలి. సింగిల్ లైన్ స్టోరీతో ఒక భాగం తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే గొప్ప . అటువంటిది దానికి సీక్వెల్ కూడా తీసి హిట్ కొట్టడం అంటే మాటలు కాదు . ఇంతటితో ఆగుంటే సరిపోయేది .. మొదటి రెండు భాగాలు ఇచ్చిన హిట్ తో దర్శకుడిలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయినట్టు ఉంది . అదే ఓవర్ కాన్ఫిడెన్సును దృశ్యం 3 లో కూడా చూపించాడు . ఇందులో మోహన్ లాల్ తన జీవితంలో జరిగిన సంఘటనను ఆధారంగా తీసుకుని సినిమా తీసినట్టు చూపించారు . ఆ సినిమా హిట్ గురించి దర్శకుడు ఎంతలా చెప్పాడంటే టీవీలు , డిస్ట్రిబ్యూటర్లు , థియేటర్ల ఓనర్లు , ఫారిన్ బయ్యర్లు రైట్స్ కోసం మోహన్ లాల్ చుట్టూ ఎగబడే సన్నివేశాలు దాదాపు ముప్పై నిమిషాలపాటు చూపించాడు . ఈ సన్నివేశాల ద్వారా జీతూ జోసెఫ్ తన సక్సెస్ గురించి సినిమాలో ఈ విధంగా డప్పు కొట్టుకున్నాడేమో అనిపించింది .

ఇక దృశ్యం 3 ని రెండు భాగాలుగా విభజించవచ్చు .. మొదటిభాగం పెళ్లి సంబంధాల దృశ్యం .. రెండో భాగం పెళ్ళిలో కిడ్నాప్ దృశ్యం అన్నమాట . అసలు ఫస్టాఫ్ చూస్తే దృశ్యం సినిమాకే వచ్చామా ? లేకపోతే పెళ్లిళ్ల పేరయ్య సినిమాకి వచ్చామా ? అనే డౌట్ వస్తుంది . దాదాపు ఫస్టాఫ్ అంతా పెళ్ళిసంబంధాలు చూసే ఓ పేరయ్య మాటిమాటికి మోహన్ లాల్ ఇంటికి రావడం , అతడి కూతురికి సంబంధాలు చెప్పడం , మోహన్ లాల్ ఇచ్చే డబ్బులు తీసుకుని పోవడం లాంటి సన్నివేశాలతో దర్శకుడు దిగ్విజయంగా రీళ్లను ఖర్చు చేసాడు . ఎంతకీ అసలు కథలోకి వెళ్లకుండా ఈ పెళ్ళిసంబంధాల గోల ప్రేక్షకుల అసహనానికి పరీక్ష పెడుతుంది . దీన్నిబట్టి దర్శకుడు ఫస్టాఫ్ లో కథ జోలికిపోకుండా పెళ్ళిసంబంధాలకు ఫిక్స్ అయిపోయాడని అర్థమైపోతుంది . ఎందుకంటే మూడో భాగం మొత్తానికి సరిపడా కథ అతడిదగ్గర లేకపోయి ఉండొచ్చు .

ఇక సెకండాఫ్ మాత్రమే మనం తిరిగి దృశ్యంలోకి వెళ్తాం . గీత భర్త ప్రభాకర్ సస్పెండైన పోలీస్ సహదేవతో మోహన్ లాల్ కూతురి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి రంగంలోకి దిగడంతో కథ క్రైమ్ జానర్ లోకి టర్న్ తీసుకుంటుంది . తనమీద తిరిగి కుట్రలు పన్నుతున్నారని గ్రహించి మోహన్ లాల్ ఎత్తులకు పై ఎత్తులు వేయడంతో కధనంలో వేగం పెరుగుతుంది . ఒకపక్క ఐజి , ప్రభాకర్ సహదేవ్ లు జార్జ్ ను తిరిగి కేసులో ఇరికించాలని ప్రయత్నాలు చేయడం , మరోపక్క జార్జ్ రిటైర్డ్ పోలీస్ అధికారి సాయంతో వాళ్లతో మైండ్ గేమ్ ఆడటంతో సినిమా చూసే ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరుగుతుంది . మళ్ళీ దృశ్యం మొదటి భాగం గుర్తుకువస్తుంది . ఇక ఆఖరి ముప్పై నిముషాలు అయితే మనల్ని చూపు తిప్పుకోనీయవు . క్లైమాక్సులో ఒకదానివెంట ఒకటి వరుసగా వచ్చే ట్విస్టులతో థ్రిల్ ఫీల్ అవుతాం . నిజానికి షుమారు రెండున్నర గంటల ఈ సినిమాకి ఊపిరి పోసింది మాత్రం క్లైమాక్స్ సన్నివేశాలే .

కాకపోతే ఇంతాచేసి ముగింపులో దర్శకుడు మోహన్ లాల్ క్యారక్టర్ ను కొంచం కన్ఫ్యూజన్లోకి నెట్టేశాడు . ఈ ముగింపు కుటుంబం కోసం పోరాడే అతడి తత్వానికి భిన్నంగా ఉండటం కన్విన్సింగ్ గా అనిపించదు . ఓవరాల్ గా దృశ్యం 3 కి ప్రాణం పోసింది సెకండాఫ్ మాత్రమే .

ఎవరెలా చేసారు ?

మోహన్ లాల్ నటన గురించి కొత్తగా చెప్పుకునేది ఏముంది ? ఎప్పటిలానే పర్ఫెక్ట్ గా నటించాడు . కాకపోతే దృశ్యం మొదటిభాగానికి .. మూడో భాగానికి ఆయన నటనలో మార్పు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది . ఎక్స్ప్రెషన్స్ విషయంలో అక్కడక్కడా కొన్నిచోట్ల తడబడినట్టు అనిపిస్తుంది . ఆ మధ్య రిలీజ్ అయిన తుడరం మూవీలో ఇంతకన్నా అద్భుతమైన పెర్ఫార్మన్స్ చూపించాడు .

ఇక మీనా మొదటి రెండు భాగాలతో సమానంగా నటించి మెప్పించింది . కాకపోతే ఈ సినిమాలో కొంచం లావు అయినట్టు ఉంది .

సస్పెండైన పోలీస్ సహదేవ్ పాత్రలో నటించిన కళాభవన్ షాజన్ కంట్లో ఏం కొట్టారో కానీ కళ్ళు ఎర్రగా ఉండి చూడగానే క్రూరంగా కనిపించాడు . అతడి నటన బాగుంది .
మిగిలినవాళ్లు కూడా తమ పాత్ర పరిధిమేరకు నటించారు .

సాంకేతికత

అనిల్ జాన్షన్ అందించిన నేపధ్య సంగీతం బావుంది . ముఖ్యంగా సెకండాఫ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టేసాడు .
సతీష్ కురుప్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది . కొన్ని సన్నివేశాలను డార్క్ మోడ్ లో చూపించటమే కాకుండా పనిలోపనిగా కేరళ అందాలను కూడా చూపించారు .
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి .
మొదటి రెండు భాగాలకు కూడా రచన , దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ మూడో భాగంలో మాత్రం కొంచం తడబడ్డాడు .

విశ్లేషణ

దృశ్యం మొదటి రెండు భాగాలు చూసినవాళ్లు అదే ఎక్స్పెక్టేషన్స్ తో ఈ సినిమాకి వెళ్తే కొంచం నిరాశ ఎదురుకావచ్చు . ముఖ్యంగా ఫస్టాఫ్ లో ఇరికించిన కొన్ని సాగతీత సన్నివేశాలు చూస్తే మాత్రం సహనం కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి . ఈ సినిమాకి మైనస్ ఫస్టాఫ్ మాత్రమే .. ఇక సెకండాఫ్ లో దర్శకుడు ఆ లోటును కొంత అధిగమించే ప్రయత్నం చేసాడు . ముఖ్యంగా ఆఖరి ముప్పై నిమిషాల్లో జీతూ జోసెఫ్ తనదైన మార్క్ దర్శకత్వాన్ని చూపించాడు .

ఇక ఈ సినిమాకి రెండో మైనస్ ఏంటంటే డబ్బింగ్ .. మొదటి రెండు భాగాలు తెలుగు రీమేక్ కావడంతో ఇక్కడి నేటివిటీకి అనుగుణంగా సినిమా చిత్రీకరించారు . దాంతో తెలుగు ప్రేక్షకులు సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు . కానీ దర్శక , నిర్మాతలు ఓవర్ కాన్ఫిడెన్స్ తో దృశ్యం 3 రైట్స్ ఎవరికీ అమ్మకుండా తనదగ్గరే ఉంచుకుని నేరుగా మలయాళం మూవీనే తెలుగు డబ్ వెర్షన్లో రిలీజ్ చేసారు . దీనివలన తెలుగు నేటివిటీ మాయం అయి ఫీల్ చెడింది . ఇందులో పాత్రల పేర్లు , లొకేషన్లు మలయాళం వారివే ఉండటంతో కొంచం కన్ఫ్యుజింగ్ గా ఉంటుంది .

దానికి తోడు డబ్బింగ్ అంతగా అతకలేదు .. కొన్ని సంభాషణలు వింటుంటే రైల్వే స్టేషన్లో అనౌన్సమెంట్ మాదిరి అనిపిస్తుంది . మీరు అతిగా ఎందుకు ఈ విషయంలో ఆలోచనలు చేస్తున్నారు వంటి అతికించిన పదాలతో వచ్చే సంభాషణలను అర్ధం చేసుకోవడానికి కొంచం ఇబ్బంది పడతాం.

ఒకటిమాత్రం నిజం మొదటి రెండు భాగాలతో పోలిస్తే దృశ్యం 3 నిరాశ పరుస్తుంది . ఇప్పటికే ఫ్లేవర్ తగ్గిపోయింది కాబట్టి ఈ దృశ్యాలను ఇంతటితో ఆపెయ్యడం బెటర్ .. ఎందుకంటే అప్పటిదాకా నోరు విప్పని గీత క్లైమాక్సులో మాత్రం నాకు అది కావాలి అంటుంది . దీనర్థం నాలుగో దృశ్యం కూడా రాబోతుందని మలయాళం రానివాళ్లకు కూడా అర్ధమౌతుంది . ఈ విషయం దర్శకుడే ఆలోచించుకోవాలి .

నటీనటులు : మోహన్ లాల్ , మీనా , బిజూ మీనన్ తదితరులు
సంగీతం : అనిల్ జాన్షన్
సినిమాటోగ్రఫీ : సతీష్ కురుప్
రచన , దర్శకత్వం : జీతూ జోసెఫ్
విడుదల : 21-05-2026
రేటింగ్ : 2.75 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!