Home » మిడ్ నైట్ మర్డర్స్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రివ్యూ

మిడ్ నైట్ మర్డర్స్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రివ్యూ

Spread the love

2020 లో అంజామ్ పథిర అనే మలయాళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో రిలీజ్ అయి బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టుకుంది . ఈ సినిమా భారీ బడ్జెట్ తో తీసారా ? అంటే అదీ లేదు . సింపుల్ బడ్జెట్ తోనే సినిమాని పూర్తి చేసి థియేటర్లలో రిలీజ్ చేసారు . అయినా పెట్టిన బడ్జెట్ కి రెండింతలు లాభాలు సంపాదించిపెట్టింది . అలా అని ఈ సినిమాలో భారీ తారాగణం కూడా లేరు . అంతా అప్పుడప్పుడే మలయాళంలో ఎదుగుతున్న నటులు . అయినా సినిమా బాగా ఆడింది . ఎందువలన అంటే ? సినిమా టైటిల్ చూడగానే అది ఏ జానర్ మూవీనో చాలామందికి అర్ధమయ్యే ఉంటుంది . క్రైమ్ థ్రిల్లర్ మూవీలు తీయడంలో మలయాళ దర్శకుల టాలెంట్ అందరికీ తెలిసిందే . టైట్ స్క్రీన్ ప్లే మాత్రమే ఈ సినిమా విజయ రహస్యం .

అందుకే ఇదే సినిమాని మిడ్ నైట్ మర్డర్స్ పేరుతో తెలుగులోకి డబ్ చేసి ఆహా ఓటిటి లో రిలీజ్ చేసారు . మిడ్ నైట్ మర్డర్స్ అనే టైటిల్ చూడగానే ఇదేదో సీరియల్ మర్డర్స్ స్టోరీ అని మనకు అర్ధమౌతుంది . ఎస్ .. స్టోరీ అదే .. ఇంతకుముందు చాలా సినిమాల్లో సీరియల్ మర్డర్స్ కధలు చాలా చూసాం . ఇప్పుడు ఈ సినిమాలో కూడా అవే చూస్తాం . అయితే వాటికీ , ఈ సినిమాకి తేడా ఏంటి ? అంటే పట్టుసడలని కథనమే తేడా .. ఈ మూవీలో సినిమా మొదలైనదగ్గర్నుంచి క్లైమాక్స్ వరకు క్రైమ్ థ్రిల్లర్ జానర్ కాన్సెప్ట్ యొక్క పట్టు సడలకుండా ఒకే టెంపో తో చివరివరకు నడిపించిన విధానం ప్రేక్షకులని కట్టిపడేస్తుంది . మధ్యలో వాన పాటలు , వెకిలి కామెడీ పెట్టి మన కాన్సంట్రేషన్ ను డైవర్ట్ చేయకుండా సీరియస్ మోడ్ లో చివరివరకు ఉత్కంఠతగా నడపటంతో అపరాధపరిశోధన కథతో పాటు మనం కూడా ప్రయాణిస్తాం . అసలే మిడ్ నైట్ మర్డర్స్ .. దానికి సైకో కిల్లర్ తోడైతే కధనంలో ఉండే కిక్కే వేరు .

ఇప్పుడు ఈ మిడ్ నైట్ మర్డర్స్ కేసేంటో చూద్దాం .

కధేంటంటే ?

సినిమా ప్రారంభమే సీరియల్ కిల్లర్ ని ఒక సైక్రియాట్రిస్టు ఇంటర్వ్యూ చేయడంతో మొదలౌతుంది . పది మర్దర్లు చేసి ఉరిశిక్ష పడిన ఫంక్ రవిని.. అన్వర్ ( కుంచకో బోబన్ ) అనే సైక్రియాట్రిస్టు జైల్లో ఇంటర్వ్యూ చేస్తాడు . ప్రతి నేరం వెనుక నేరస్తుడ్ని ప్రభావితం చేసిన కొన్ని పరిస్థితులు ఉంటాయని అన్వర్ నమ్ముతాడు . ఆ పరిస్థితుల ప్రభావంతోనే కొందరు సైకోలుగా మారి నేరాలు చేస్తారనేది అతడి థీసిస్ . అందుకే పది మర్దర్లు చేసిన ఫంక్ రవి పెరిగిన వాతావరణం గురించి అడుగుతాడు . కానీ అతడు చెప్పిన కారణం విచిత్రంగా ఉంటుంది . చిన్నప్పుడు చికెన్ షాపులో పనిచేయడం వల్ల కోళ్లను చంపడం , ముక్కలు కొట్టడం వంటి పనులు చేయడంతో అతడిలో సైకలాజికల్ డిజార్డర్ మొదలౌతుంది . కోళ్లను అలా చంపడంలోనే థ్రిల్ ఫీల్ అవుతుంటాడు . పెరిగి పెద్దయ్యాక ఆ డిజార్డర్ మనుషుల్ని చంపేదాకా వెళ్తుంది .

కట్ చేస్తే ,

సైక్రియాట్రిస్టు అన్వర్ కి పోలీస్ డిపార్ట్మెంట్లో క్రిమినాలజిస్ట్ గా చేరి సైకో కేసులను పరిశోధించాలని కోరిక . అందుకే ఎసిపి అనిల్ ను కలిసి తన కోరికను చెప్తాడు . కానీ ప్రస్తుతానికి డిపార్ట్మెంట్ సిబ్బంది ఉన్నారు కాబట్టి అఫీషియల్ గా తానేమీ చేయలేనని , కాకపోతే అనఫీషియల్ గా అతడి హెల్ప్ తీసుకుంటానని చెప్తాడు .

అయితే ఇదే సమయంలో పోలీస్ శాఖలో డీఎస్పీగా పనిచేస్తున్న అభిమన్యు కౌశిక్ ను కళ్ళు , గుండె పీకేసి ఎవరో గుర్తుతెలియని కిల్లర్ దారుణ హత్య చేయడంతో ఏసిపి అనిల్ సైక్రియాట్రిస్టు అన్వర్ ను పిలిపించి సలహా అడుగుతాడు . ఈ రకమైన మర్డర్ చేసాడంటే కిల్లర్ ఖచ్చితంగా సైకో అయ్యుంటాడని అన్వర్ అభిప్రాయపడతాడు . ఒకపక్క పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుండగానే మరోపక్క ఇంకో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కిడ్నాప్ కావడం , మరుసటి రోజు కళ్ళు , గుండె పీకేసి డెడ్ బాడీలను వేరు వేరు చోట్ల పడేయడంతో పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అవుతుంది . కిల్లర్ టార్గెట్ పోలీస్ అధికారులు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని అన్వర్ పోలీస్ డిపార్ట్మెంట్ కి సూచనలు చేస్తాడు .

కిల్లర్ ను పట్టుకోవడానికి పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగానే అన్వర్ కూడా తనదైన సైకాలజీ నాలెడ్జ్ తో ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు . కిల్లర్ ఉట్టి సైకో మాత్రమే కాదు .. చాలా తెలివైనవాడు కూడా అని అన్వర్ భావిస్తాడు . ఎందుకంటే అతడు ముగ్గురు పోలీస్ ఆఫీసర్లను హత్య చేసినా వేలి ముద్రలు కానీ ,ఇతర ఆధారాలు కానీ దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు . సిసి కెమెరాలు రికార్డ్ చేయకుండా హ్యాక్ చేయడంతో చిన్న క్లూ కూడా దొరకదు . ఈ పరిస్థితుల్లో సైబర్ నిపుణుడైన ఒక వ్యక్తి సాయంతో అన్వర్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు . అతడి ఇన్వెస్టిగేషన్ కిల్లర్ తాను మర్డర్ చేసిన ప్రతి పోలీస్ ఆఫీసర్ డెడ్ బాడీ పక్కన కళ్ళకు గంతలు లేని న్యాయదేవత బొమ్మ ఉంచుతాడు . ఆ బొమ్మ ఆధారంగా అన్వర్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడంతో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి .

ఇన్వెస్టిగేషన్ లో అన్వర్ ఏం తెలుసుకుంటాడు ? కిల్లర్ పోలీస్ అధికారులనే టార్గెట్ చేసి మర్దర్లు చేయడం వెనుక అసలు కారణాలు ఏంటి ? అసలు కిల్లర్ ఎవరు ? అనేది మిగిలిన కధలో తెలుస్తుంది .

ఎలా ఉంది ?

సీరియల్ మర్దర్ల కథలతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి . ఆ జాబితాలో మిడ్ నైట్ మర్డర్స్ కథ కూడా చేరుతుంది . మరి ఈ సినిమా ప్రత్యేకత ఏంటి ? కట్టిపడేసే కథనమే ఈ సినిమా ప్రత్యేకత . ఎంచుకున్న కథ పాతదే అయినా దర్శకుడు తెరకెక్కించిన విధానం మాత్రం కొత్తదే . ఊరికే కధకు ప్లాట్ దొరికిందని దర్శకుడు సినిమా మొదలుపెటినట్టు లేదు. సైకో హత్యల నేపథ్యంలో కొంత స్టడీ చేసి సినిమాలో ఆ సన్నివేశాలు వాడుకున్నట్టున్నాడు .

సైక్రియాట్రిస్టు అన్వర్ ఓ క్లాసులో తన స్టూడెంట్స్ కి సైకాలజీ మీద లైసెన్స్ చెప్తూ , బెంజిమన్ లూయిస్ అనే సైకాలజీ డాక్టర్ రాసిన పుస్తకం ఖచ్చితంగా కొనుక్కుని అయినా సరే చదవమని తన స్టూడెంట్స్ కి చెప్తాడు . పుట్టి పెరిగిన వాతావరణం , చుట్టూ ఉన్న పరిస్థితులు మాములు మనిషిని కూడా నేరస్తుడిగా ఎలా మారుస్తాయో ఆ డాక్టర్ వివరంగా ఒక బుక్ రాసాడని చెప్తూ , తాను కూడా ఎన్నో విషయాలు ఆ బుక్ చదివే తెలుసుకున్నానని చెప్తాడు . కానీ క్లైమాక్సులో బెంజిమన్ లూయిస్ బుక్ కి , కిల్లర్ కి ఉన్న కనెక్షన్ చెప్పి దర్శకుడు భలే ట్విస్ట్ ఇస్తాడు .

నిజానికి ఫస్టాఫ్ లో షో రన్ అవుతుంది కానీ అసలు కథలోకి రాదు . పోలీస్ ఆఫీసర్లు మర్డర్ అవుతుంటారు .. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు .. సమాంతరంగా అన్వర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు .. దీంతో అసలు కిల్లర్ ఎవరు అనేది రివీల్ కాదు కానీ స్టోరీ సాగతీత సన్నివేశాలు కొన్ని తగులుకుంటాయి . గంజా బ్యాచ్ , సైకో సైమన్ సన్నివేశాలు సైకాలజీ క్లాసులో భాగంగా ఇరికించినట్టున్నారు .

ఇక సెకండాఫ్ లోకి వచ్చిన తర్వాతే కధనంలో వేగం పెరుగుతుంది . న్యాయదేవత విగ్రహాలు తయారుచేసిన వ్యక్తి ద్వారా కూపీ లాగడంతో అసలు స్టోరీలోకి వెళ్తాము . దాంతో కిల్లర్ ఆచూకీ గురించి చిక్కుముడులు ఒకటొకటిగా విడిపోతాయి . రొటీన్ క్లైమాక్స్ అయినా సినిమా మొదటినుంచి గ్రిప్పింగ్ తో నడవడంతో ఆసక్తి కలిగిస్తుంది .

ఎవరెలా చేసారు ?

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటులెవరూ ఇందులో లేరు . అయినా అన్వర్ పాత్రలో నటించిన కుంచకో బోబన్ సాలిడ్ నటన ప్రదర్శించాడు . సైక్రియాట్రిస్టు గా అతడు సెటిల్డ్ గా నటించాడు . నిజానికి సినిమాలో ఇతడి పాత్రకే ఎక్కువ స్కోప్ ఇచ్చారు . మిగిలినవాళ్లు తమ పాత్ర పరిధి మేరకు నటించారు .

సాంకేతికత

సుశాన్ శ్యాం అందించిన మ్యూజిక్ బాగుంది . ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో అతడు అందించిన బీజీఎమ్ బాగుంది .

ఇక ఖలీద్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది .. కిల్లర్ డెన్ లో లైటింగ్ ఎఫెక్ట్స్ బాగా చూపించారు .. అంతేకాకుండా సహజ అందాలకు పుట్టిల్లయిన కేరళ అందాలను కొన్నిచోట్ల చక్కగా చూపించాడు .

నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి .. బిగి సడలని గ్రిప్పింగ్ తో దర్శకుడు సినిమాని నడిపిన విధానం బాగుంది .

విశ్లేషణ

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది . రొటీన్ ఫార్మాట్ లో పోలీసులు , కిల్లర్ కోణంలో కాకుండా సైక్రియాట్రిక్ కోణంలో కథను నడపడంతో కొంత కొత్తదనం వచ్చింది . సీరియల్ మర్దర్లు జరగడం , పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి కిల్లర్ ను పట్టుకోవడం గతంలో చాలా సినిమాల్లో చూసేసాం . అందుకే మూస కధనం జోలికి పోకుండా ఈ సినిమాని సైకో కోణంలో దర్శకుడు నడిపించిన విధానం బాగుంది .

కాకపోతే ఒక ప్రైవేట్ సైక్రియాట్రిస్టు మీద మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఆధారపడటం కొంచం ఎబ్బెట్టుగా ఉంటుంది . కనీసం అతడు డిపార్ట్మెంట్ సైక్రియాట్రిస్టు అయినా ఒక లెక్క ఉండేది . డిపార్టుమెంటుకు సంబంధం లేని వ్యక్తి పూర్తి స్థాయిలో నిద్రాహారాలు మానుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం , డిసిపి స్థాయి ఆఫీసర్ కూడా అతడి సలహాలను ఫాలో అవడం లాజిక్ కి అందదు . అయితే ఆ లాజిక్ ను పక్కనబెడితే సినిమా ఒకరకమైన ఫ్లోలో సీరియస్ గా సాగిపోతుంది . ఎక్కడా అనవసరమైన కామెడీ ఉండదు . సైబర్ నిపుణుడి ద్వారా కొంత కామెడీ చేయిద్దామని ప్రయత్నించారు కానీ పర్లేదు .

ఇక క్లైమాక్స్ లో ఒక సన్నివేశం బాగుంటుంది . జైల్లో ఉన్న కిల్లర్ దగ్గరికి అన్వర్ వచ్చి ‘ నువ్వు ఏ పరిస్థితుల్లో ఈ మర్దర్లు చేసావో నాకు తెలుసు .. కనీసం ఇప్పటికైనా నీ నేరం ఒప్పుకుని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తే కనీసం శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది . అది కాకుండా నువ్వు చంపాలనుకున్న ఏసిపి అనిల్ ఇంకా బతికే ఉన్నాడు .. పాపం నీ టార్గెట్ మిస్ అయ్యింది .. అని జాలి పడతాడు .
అప్పుడు కిల్లర్ ‘ న్యాయదేవత ఇంకా బతికే ఉంది ‘ అని సమాధానం చెప్తాడు . అతడి మాటకు అర్ధమేంటో క్లైమాక్సులో తెలుస్తుంది .
ఓవరాల్ గా సినిమా టైటిల్ కు న్యాయం చేసింది . ప్రస్తుతం ఆహా ఓటిటి లో తెలుగులో అందుబాటులో ఉంది కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కూడా లేకుండా చూడొచ్చు .

నటీనటులు : కుంచకో బోబన్ , శ్రీనాథ్ బసి తదితరులు
సంగీతం : సుశీన్ శ్యాం
సినిమాటోగ్రఫీ : ఖాలిద్
రచన ,దర్శకత్వం : మిధున్ థామస్
విడుదల : ఆహా ఓటిటి ( తెలుగు )
రేటింగ్ : 2.75 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!