మెడికల్ మాఫియా అరాచకాలను బయటపెట్టే కధాంశంతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి . ఆమధ్య చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్ళ దోపిడీ దందాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు . ఈమధ్య అడవి శేష్ నటించిన డెకాయిట్ మూవీలో కూడా కార్పొరేట్ హాస్పిటళ్ళ దోపిడీలను చూపించారు . సినిమాల్లోనే కాదు .. నిజ జీవితంలో కూడా చాలామంది కార్పొరేట్ హాస్పిటళ్ళ దోపిడీకి బలైన వారు ఉన్నారు . వీటిలో చాలావరకు బయటికి రాని వార్తలుగానే మిగిలిపోతాయి .
కానీ మెడికల్ మాఫియా అక్రమాలను బయటపెట్టడంలో గత సినిమాలకు , ఈ సినిమాకి కొంత వ్యత్యాసం ఉంది . అదే రికార్డెడ్ ఎవిడెన్స్ . దోషులను సాక్ష్యాధారాలతో చట్టానికి పట్టించడానికి జోసెఫ్ తీసుకున్న నిర్ణయమే ఈ సినిమాకి హైలెట్ . ముగింపు బలంగా ఉండటంతో మలయాళం ఓటిటిలలో ఈ మూవీ మంచి రేటింగ్ సాధించింది .
2018 లోనే కేరళలో థియేటర్ రిలీజ్ అయిన జోసెఫ్ మలయాళం మూవీ కూడా మెడికల్ అక్రమాలను బయటపెట్టే కధాంశంతో రూపుదిద్దుకుంది . ఈ సినిమా కేరళలో మంచి వసూళ్లను సాధించింది . తర్వాత అదే సినిమాని 2022 లో నటుడు డాక్టర్ రాజశేఖర్ హీరోగా శేఖర పేరుతో రీమేక్ చేసారు . తెలుగులో మాత్రం ఈ సినిమా యావరేజ్ గా ఆడింది . ఇప్పుడు అన్నీ ఓటిటి లోకి వచ్చాయి . జోసెఫ్ మలయాళం మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు .
మరి జోసెఫ్ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం .
కధేంటంటే ?
కేరళ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేసి రిటైర్ అయిన జోసెఫ్ కు ( జోజు జార్జ్ ) డిపార్ట్మెంట్లో మంచి పేరు ఉంటుంది . ఎటువంటి క్లిష్టమైన కేసులనైనా జోసెఫ్ సాక్ష్యాధారాలతో సహా సునాయాసంగా ఛేదిస్తాడని పోలీస్ ఉన్నతాధికారులు సైతం నమ్ముతారు . అందుకే జోసెఫ్ రిటైర్ అయినా కూడా ఒక ఇంట్లో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసులో మిస్టరీ ఛేదించడానికి ఎస్పీ ఇతడికి కబురుపెడతాడు .
హత్యా స్థలానికి చేరుకున్న జోసెఫ్ ఆ ఇంటికి తెల్లవారు జామున పాలు పొసే పాలవాడి మీదే అనుమానపడతాడు . ఈ మర్డర్ గురించి అందరికన్నా ముందే ఆ పాలవాడు పోలీసులకు ఫోన్ చేసి తెలియపరుస్తాడు . ఒకపక్కన పోలీసులు క్రైమ్ సీన్లో ఉండగానే పాలవాడితో మాట్లాడుతున్నట్టు నటించి అతడి వేలిముద్రలు తీసుకుంటాడు . ఆ వేలిముద్రలు క్రైమ్ సీన్ లో దొరికిన వేలిముద్రలతో సరిపోవడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేస్తారు . పాలవాడే ఈ హత్య చేసాడు అని రుజువు చేయడానికి కావాల్సిన ఆధారాలను ఎస్పీకి వివరిస్తాడు .
ఇదిలా ఉండగా రిటైర్ అయిన తర్వాత జోసెఫ్ తాగుడికి బానిస అవ్వడం అతడి మిత్రులు గమనిస్తారు . అదే విషయం అతడ్ని అడిగితే తన జీవితంలో జరిగిన విషాద సంఘటనల గురించి చెప్తాడు . పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న రోజుల్లోనే ప్రేమించిన అమ్మాయి వేరొకరిని పెళ్లిచేసుకోవడం , తర్వాత ఆమె హత్యకు గురికావడంతో జోసెఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తాగుడికి బానిస అవుతాడు . జోసెఫ్ ను పెళ్లిచేసుకున్న స్టెల్లా అతడి వ్యసనంతో విసిగిపోయి విడిపోయి పీటర్ అనే వ్యక్తిని పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతుంది . జోసెఫ్ కూతురు ఒక ఆక్సిడెంట్లో మరణించడంతో అతడు మరింత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు .
ఈ పరిస్థితుల్లో అతడి ఎక్స్ వైఫ్ స్టెల్లా కూడా ఆక్సిడెంట్లో మరణించినట్టు తెలుస్తుంది . కానీ తర్వాత అతడు తన మాజీ భార్యది ఆక్సిడెంట్ కాదు .. ఎవరో కావాలని ప్రీ ప్లాన్డ్ గా చేసిన మర్డర్ అని అనుమానపడతాడు . దాంతో పోలీస్ డిపార్ట్మెంట్లోనే పనిచేసి రిటైర్ అయిన తన తోటి మిత్రులతో కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు .
జోసెఫ్ కూతురు , ఎక్స్ వైఫ్ ల మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి ?
అతడి ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి విషయాలు తెలుస్తాయి ?
జోసెఫ్ కూతురు , మాజీ భార్యల ఆక్సిడెంట్లకు , కార్పొరేట్ హాస్పిటల్స్ కు ఉన్న లింక్ ఏంటి ? అనేవి మిగిలిన కధనంలో తెలుస్తాయి .
ఎలా ఉంది ?
మెడికల్ మాఫియా నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి . కానీ వాటిలో చూడని డిఫరెంట్ ముగింపు ఇందులో చూస్తాం . అదే ఈ సస్పెన్స్ మూవీకి థ్రిల్ పంచుతుంది . నిజానికి మెడికల్ మాఫియా అక్రమాలను హీరో బయటపెట్టడం , బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేయడం చాలా సినిమాల్లో మనం చూసిందే . కానీ హీరోనే బాధితుడిగా మరి మెడికల్ మాఫియా గుట్టును సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టడం కొత్తదనాన్ని ఇచ్చింది .
ఇక ఈ సినిమా మొత్తం స్లోగానే నడుస్తుంది . ఎంత స్లో అంటే జోసెఫ్ బీడీ నోట్లోపెట్టుకుని అగ్గిపెట్టెతో వెలిగించుకునేసరికి హైద్రాబాదులో ఓ డివైడర్ చుట్టి రావచ్చు . ఈ బీడీ వెలిగించుడు ప్రహసనం అసలే టైమ్ కిల్లింగ్ అవుతుందని అసహనంగా పెరిగిపోతుంటే , దానికి తోడు పొద్దస్తమానం బీడీ తీసుడు , నోట్లో పెట్టుకొనుడు , అగ్గిపెట్టెతో వెలిగించుడు , రైలింజన్ మాదిరి గుప్పెడు పొగను ఒదులుడుతో ప్రేక్షకులకు ఊపిరి ఆడదు . జోసెఫ్ రెండడుగులు వేయాలంటే రెండు గంటలు పడుతుంది . ఈ మలయాళం దర్శకులు స్లో నేరేషన్ చేస్తారని తెలుసుకానీ ఈ సినిమాలో నెమ్మది ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది .
పోనీ ఎలాగోలా ఆ స్లోని భరించి చూసినా ఫస్టాఫ్ లో అసలు కథలోకి రాము . జోసెఫ్ లవ్ స్టోరీ , వైఫ్ తో అతడి విడాకులు , బీడీ తాగడం , మందు తాగడంతో ఫస్టాఫ్ సునాయాసంగా ముగించేశారు . ఒకరకంగా చెప్పాలంటే ఫస్టాఫ్ లో సాగతీత సన్నివేశాలు ఎక్కువున్నాయి . ఇక సెకండాఫ్ లోకి వచ్చిన కాసేపు తర్వాతనే అసలు కథ మొదలౌతుంది .
ఎప్పుడైతే తన ఎక్స్ వైఫ్ స్టెల్లాది ఆక్సిడెంట్ కాదు మర్డర్ అని జోసెఫ్ అనుమానపడి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడో కధనంలో క్యూరియాసిటీ పెరుగుతుంది . స్టెల్లాను వెనుకనుంచి వచ్చిన జీపు గుద్ది వెళ్లిపోవడం , ఆ వెంటనే ఒక ఆడ ,మగలు కారులో వచ్చి ఆమెను హాస్పిటల్లో చేర్చడం , ఆ కారు నంబర్ ఫేక్ అని తెలియడం , హాస్పిటల్ వాళ్ళు బ్రెయిన్ డెడ్ కింద తేల్చి వీళ్ళ ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి సంతకాలు పెట్టించుకోవడం , స్టెల్లా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన పేషంట్ చనిపోవడం వంటి సన్నివేశాలతో కధనం పూర్తిస్థాయిలో క్రైమ్ జానర్ లో టర్న్ అవుతుంది . నిజానికి జోసెఫ్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినప్పటినుంచి స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ లోకి వచ్చింది .
సినిమా మొత్తానికి క్లైమాక్స్ ట్విస్ట్ బూస్ట్ ఇస్తుంది . కార్పొరేట్ హాస్పిటల్ అక్రమాలను న్యాయస్థానాల్లో సాక్షాధారాలతో జోసెఫ్ బయటపెట్టిన విధానం సినిమాకి హైలెట్ అవుతుంది. క్లైమాక్స్ ఆ విధంగా లేకపోతే జోసెఫ్ మూవీ కూడా రొటీన్ రొడ్డకొట్టుడు ఫార్ములా అయిపోయేది . దాదాపు సినిమా అంతా సాగదీసినా దర్శకుడు క్లైమాక్సులో మాత్రం తెలివిగా వ్యవహరించాడు .
ఎవరెలా చేసారు ?
జోసెఫ్ పాత్రలో జోజు జార్జ్ ఒదిగిపోయి బాగానే చేసాడు కానీ అతడి అతి నిదానం మాత్రం ప్రేక్షకుల బిపికి పరీక్షలు పెడుతుంది . అతడు డైలాగ్ చెప్పాలన్నా , నాలుగు అడుగులు వేయాలన్నా , బీడీ వెలిగించుకోవాలన్నా చాలా టైమ్ తీసుకుంటాడు అని మనం ఫిక్స్ అయిపోయి సినిమా చూస్తే అతడి నటనలో లోపాలు కనిపించవు . మిగిలినవాళ్లు సైడ్ క్యారెక్టర్ల మాదిరి జోసెఫ్ కు ఉపయోగపడటం తప్ప పాత్రలకు స్కోప్ లేదు కాబట్టి వాళ్ళ నటన గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు .
సాంకేతికత
రంజిన్ రాజ్ అందించిన సంగీతం బాగానే ఉంది . అతడికి తోడుగా అనిల్ జాన్సన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది .
మనీష్ మహదేవన్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది .
దర్శకుడు పద్మకుమార్ క్లైమాక్స్ మీద పెట్టిన శ్రద్ద ఫస్టాఫ్ మీద కూడా పెట్టి ఉంటే బాగుండేది .
విశ్లేషణ
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారికి జోసెఫ్ మూవీ నచ్చుతుంది . కాకపోతే ఈ సినిమాలో రెండు రకాల మానసిక హింసలను తట్టుకోవాలి . మొదటిది స్లోగా రన్ అయ్యే కధనం .. రెండోది ఫస్టాఫ్ లో కనిపించే సాగతీత సన్నివేశాలు .. ఈ రెండిటినీ తట్టుకుని ముందుకు వెళ్తే సెకండాఫ్ మిమ్మల్ని మెప్పిస్తుంది . ముఖ్యంగా క్లైమాక్స్ మరీ మెప్పిస్తుంది . కాకపోతే సినిమా ప్రారంభమే మర్డర్ జరిగినచోట ఎస్పీతో సహా పోలీసులందరూ రిటైర్ అయిన జోసెఫ్ కోసం రోడ్లమీద నిలబడి వెయిట్ చేయడం , జోసెఫ్ తీరుబడిగా బీడీ వెలిగించుకుని స్కూటర్ మీద రావడం కొంచం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది . అంతంత ఎస్పీ స్థాయి పై అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్లో జోసెఫ్ సలహాలు తీసుకుని ఆశ్చర్యపోవడం కొంచం లాజిక్కుకు అందదు . సెకండాఫ్ స్టెల్లా మర్డర్ తర్వాత వచ్చే సన్నివేశాలు మాత్రం మనకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి . ఫస్టాఫ్ ల్యాగ్ తో మనకు ఎదురైన అనుభవాలను క్లైమాక్సుతో మర్చిపోతాం . మనం అనుకున్న జానర్ లో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూశామన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది . జోసెఫ్ మలయాళం మూవీని అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు .
నటీనటులు : జోజు జార్జ్ , దిలీష్ పోతన్ తదితరులు
సంగీతం : రంజిన్ రాజ్
సినిమాటోగ్రఫీ : మనీష్ మహదేవన్
దర్శకత్వం : పద్మకుమార్
విడుదల : అమెజాన్ ప్రైమ్
రేటింగ్ : 2.75 / 5
