మరీచిక (mareechika movie) సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ( అమెజాన్ ప్రైమ్ ) రివ్యూ !

Spread the love

సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీలు చూడటానికి ప్రత్యేకమైన ఆడియన్స్ ఎప్పుడూ ఉంటారు . ఈ జానర్లో మలయాళం సినీ ఇండస్ట్రీ పెట్టింది పేరుగా ఉండేది . కానీ ఈ మధ్య తెలుగు దర్శకులు కూడా ఈ జానర్లో సినిమాలు తీసి కొంతవరకు ఆడియన్స్ ను మెప్పించగలుగుతున్నారు . అయితే ఇంకోరకంగా చెప్పుకోవాలంటే తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలు ప్రయోగాల దశలోనే ఉన్నాయి . అసలు ఇలాంటి ప్రయోగాలు చేయాలన్న తెలుగు దర్శకుల ఆలోచనను అందరూ అభినందించాల్సిందే . మొదట్లో కొన్ని తడబాట్లు ఎదురైనా సరిదిద్దుకుని ముందుముందు మలయాళ థ్రిల్లర్ సినిమాలని మించిన స్థాయిలో తెలుగు సినిమాలు కూడా ఉంటాయని ఆశిద్దాం .

మే 29 న థియేటర్లలో రిలీజ్ అయిన మరీచిక (mareechika movie) మూవీ జూన్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది .

కధేంటంటే ?

ఏ సినిమాకైనా బిగినింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే ప్రేక్షకుల ఎంగేజ్మెంట్ కూడా అంత బలంగా ఉంటుంది .
మరీచిక మూవీ ప్రారంభమే ఓ మర్డర్ తో మొదలౌతుంది . మరీచిక ( రెజీనా కసాండ్ర ) నలుగురు స్నేహితుల సాయంతో సంజయ్ ( విరాజ్ అశ్విన్ ) ను మర్డర్ చేస్తుంది . ఈ దృశ్యాన్ని చాటునుంచి చూసిన వెంకట లక్ష్మి ( అనుపమ పరమేశ్వరన్ ) ఏడుస్తూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తుంది .

తాను ప్రేమించిన సంజును మరీచిక దారుణంగా చంపేసిందని , వెంటనే వెళ్లి ఆమెను అరెస్ట్ చేయమని పోలీసులతో గొడవకు దిగుతుంది .

కానీ అనూహ్యంగా సంజు పోలీస్ స్టేషన్ కి వచ్చి తనను ఎవరూ చంపలేదని , తాను బతికే ఉన్నానని చెప్తాడు . కానీ వెంకటలక్ష్మి మాత్రం మరీచిక సంజును చంపడం తాను కళ్లారా చూశానని చెప్తుంది . దీంతో ఏం చేయాలో తెలీక ఇన్స్పెక్టర్ అంజిబాబు ( అజయ్ ఘోష్ ) తలపట్టుకుంటాడు .

అసలు మరీచిక ఎవరు ?
వెంకటలక్ష్మికి , సంజుకు ఉన్న కనెక్షన్ ఏంటి ?
బతికి ఉన్న సంజును మరీచిక చంపేసిందని వెంకటలక్ష్మి పోలీస్ స్టేషన్లో ఎందుకు చెప్తుంది? అనేది మిగిలిన కథ

ఎలా ఉంది ?

ఓ సన్నివేశంలో ఇన్స్పెక్టర్ అక్కడే ఉన్న డాక్టర్ తో మాట్లాడుతూ ” పురాణాల్లో మారీచుడు అనే పేరు గురించి విన్నాను కానీ ఈ మరీచిక అనే పేరు ఇంతవరకు వినలేదు ..ఇలాంటి పేర్లు కూడా ఉంటాయా ?” అని ఆశ్చర్యంగా అడుగుతాడు .

అప్పుడు డాక్టర్ ” మరీచిక అంటే ఎండమావులు ” అని చెప్తాడు .

ఈ మూవీ చూసినవాళ్ళకి మరీచిక అనే టైటిల్ చాలా యాప్ట్ గా ఉంది అని అర్ధమౌతుంది . దూరంనుంచి చూసేవాళ్ళకి అక్కడేదో నీటిచెలమ ఉన్నట్టు కనిపిస్తుంది . కానీ దగ్గరికెళ్లి చూస్తే ఏమీ ఉండదు . మళ్ళీ అక్కడ్నుంచి చూస్తే దూరంగా ఎండమావులు కనిపిస్తాయి . మళ్ళీ దగ్గరికెళ్తే ఏమీ ఉండదు .

చూసారా.. ఒకే విషయాన్ని రెండుసార్లు చెప్తేనే మీకు బోర్ కొట్టిందా ? అలాంటిది పదేపదే చెప్తే ఎలా ఉంటుంది ? మొదటిసారి దూరంలో ఏదో కనిపించిందని ఎగ్జైట్ అవుతాము . దగ్గరికెళ్లి చూసిన తర్వాత అసలు విషయం తెలుసుకుని ఓహో ఇందులో ఏమీ లేదు అనుకుంటాం . ఆ తర్వాత ఎన్నిసార్లు ఎండమావులు కనిపించినా మనం ఎగ్జైట్ అవ్వం . పైగా లైట్ తీసుకుంటాం . మరీచిక మూవీలో జరిగిన పొరపాటు అదే .

ఎక్కడో దూరంలో మరీచికను చూపించి మనల్ని ఎగ్జైట్ చేయాలన్న దర్శకుడి ప్రయత్నం బాగానే ఉంది కానీ అదే విషయాన్ని పదేపదే గోకితే పుండు అవుతుంది మినహా ఎగ్జైట్ అవదు.

ఫస్టాఫ్ లో ఈ ఎండమావుల్ని .. అదే మరీచికను చూసి నేను కూడా థ్రిల్ ఫీల్ అయ్యా . సంజును మరీచిక చంపేసిందని వెంకటలక్ష్మి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం , తనను ఎవరూ చంపలేదని తాను బతికే ఉన్నానని సంజు పోలీస్ స్టేషన్ కి వచ్చి మరీ చెప్పడం థ్రిల్ పంచుతుంది . ఇది మొదటి ఎండమావి .

ఈ థ్రిల్ లోనుంచి బయటపడకముందే దర్శకుడు రెండో ట్విస్ట్ వదిలి మనల్ని సర్ప్రైజ్ చేస్తాడు . అసలు మరీచిక అనే క్యారక్టరే లేదని , అదంతా వెంకటలక్ష్మి సృష్టించిన పాత్ర అని , సంజు ప్రేమ దక్కలేదనే డిప్రెషన్ లో ఆమెకు వచ్చిన సైకలాజికల్ ప్రాబ్లమ్ అని డాక్టర్ చెప్పడంతో ఆ పోలీసాయనతో పాటు కధలో అసలు మరీచిక అనే పాత్రే లేదని మనం కూడా అనుకుంటాం . ఇది రెండో ఎండమావి .

చనిపోయిందనుకున్న మరీచిక దయ్యంలా మారి సంజు వెంటపడటం , చివరికి వెంకటలక్ష్మి వెంట కూడా పడటం జరుగుతుంది . దాంతో వాళ్లిద్దరూ మరీచిక దయ్యమై వచ్చి తమను పీడిస్తోందని భయపడతారు . మరీచిక నిజంగా దయ్యమా ? లేకపోతే భ్రమా అని సంజు , వెంకటలక్ష్మిలతో పాటు మనం కూడా భ్రమలో మునుగుతాం . ఇది మూడో ఎండమావి .

ఇన్ని ఎండమావులను చూసిన తర్వాత మీకు ఏం అనిపిస్తుంది ? ఒక సన్నివేశంలో ఇన్స్పెక్టర్ అజయ్ ఘోష్ ” నేను సర్వీసులో బోలెడు కేసులు చూసాను కానీ నాకు ఒక్కముక్కా అర్ధం కాని కేసు ఇదే ” అంటాడు . ప్రీ క్లైమాక్స్ చూసిన చాలామంది ప్రేక్షకులది ఇదే పరిస్థితి .

ఆదివారం అనుబంధం మ్యాగజైన్లలో వచ్చే ప్రహేళిక గడులు నింపటానికి మనం మెదడుకు పదును పెట్టినట్టు ఇందులో కొన్ని సన్నివేశాలు అర్ధం చేసుకోవడానికి మెదడుకు పని .. కాదు ..కాదు ..పదును పెట్టాలి . ఒకే సన్నివేశం నాలుగైదు వెర్షన్లలో రిపీట్ అవుతుంటుంది . ఇందులో ఏది నిజమో ? ఏది అబద్దమో తెలియక ప్రేక్షకుల మెదళ్ళు కొంచం స్ట్రైన్ అవుతాయి . ఆ స్ట్రైన్ లో నిజం ఎప్పుడు బయటికి వస్తుందా అని చూడటానికి చివరి ప్రయత్నం చేస్తాడు. ఆ నిజం చెప్పడానికి కూడా దర్శకుడు చాలా టైం తీసుకున్నాడు . ఒకానొక దశలో సినిమా అయిపోయిందని కుర్చీలోనుంచి లేవబోతుంటే ఇంకో పదినిమిషాలు బోనస్ చూపించారు .

రాసుకున్న కథ ఖచ్చితంగా మనకు థ్రిల్ పంచేదే . కానీ కథనంలో జరిగిన పొరపాట్లు కథను కిల్ చేసింది . మితిమీరిన ఎండమావులు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి . ఒకట్రెండు ట్విస్టుల వరకు మూవీ మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది . ఈ మూవీలో పేకాట రాజబాబు అని ఒక క్యారక్టర్ ఉంటాడు . అతడి భాషలో చెప్పాలంటే దర్శకుడు పేకాటలో ముక్కలు సరిగా పేర్చలేకపోయాడు .

ఫస్టాఫ్ లో ఎదురయ్యే కొన్ని సాగతీత సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి . సంజుని వెంకటలక్ష్మి ప్రేమించడం , విదేశాలనుంచి వచ్చిన మరీచికను సంజు ప్రేమించడం , అందరూ బేకరీలోను , ఇంట్లోనూ కేకులు తినడంతో ఫస్టాఫ్ స్లోగా నడుస్తుంది.

ఎప్పుడైతే ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాస్తా మర్డర్ మిస్టరీ జానర్లోకి మారుతుందో మూవీపట్ల ఉత్సుకతను పెంచుతుంది . పోలీస్ స్టేషన్లో జరిగే డ్రామా క్యూరియాసిటీ గా సాగుతుంది . ఒకపక్క క్యూరియాసిటీని పెంచుతూనే ఇన్స్పెక్టర్ అజయ్ ఘోష్ తో చక్కటి కామెడీని పండించారు . సెకండాఫ్ లో కూడా కధనం కొంతవరకు అదే టెంపోలో వెళ్తుంది . కానీ ఎప్పుడైతే మరీచిక దయ్యం అని చెప్పి ఇంకో ఎండమావిని చూపించాలని దర్శకుడు ప్రయత్నించాడో అప్పుడే కధనం గాడి తప్పింది .

ఇక ఈ మూవీలో లాజిక్కుల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది . మర్డర్ జరిగిందని పోలీస్ స్టేషన్ కు వచ్చి చెప్పినా ఇన్స్పెక్టర్ కుర్చీలోనుంచి లేవడు . సినిమా మొత్తమ్మీద ఆయన కుర్చీలోనుంచి లేచి జీపులో ఇన్వెస్టిగేషన్ కు బయలుదేరింది ఒక్క క్లైమాక్సులో మాత్రమే . కాబట్టి ఈ మూవీలో పోలీసులు ఆటలో అరటిపళ్ళు అనుకుంటే ఏ గొడవా ఉండదు .

మరీచిక కోసం లక్ష్మి భూపాల రాసుకున్న కథ కొత్తదే . కానీ ఆయన రాసుకున్న కథ తెరమీదకు వచ్చేసరికి తడబడింది . అదే ఈ సినిమాలో లోపం . ప్రీ క్లైమాక్స్ తర్వాత వచ్చే సన్నివేశాల మీద దర్శకుడు మరింత శ్రద్ద పెట్టి ఉంటే ఈ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండేది . అయినా ముందు అనుకున్నట్టు మూవీలో కొన్ని తడబాట్లు ఉన్నప్పటికీ దర్శకుడి ప్రయత్నం మాత్రం అభినందనీయమే . క్లైమాక్స్ సన్నివేశంలో ఇన్స్పెక్టర్ ద్వారా క్లారిటీ ఇవ్వడంతో అప్పటిదాకా ఉన్న కొన్ని కన్ఫ్యూజన్లు కూడా క్లియర్ అయిపోతాయి .

ఎవరెలా చేసారు ?

ఈ సినిమా మొత్తం ప్రధానంగా మూడు పాత్రల చుట్టూనే తిరుగుతుంది . వారిలో మొదటిపాత్ర సంజు . ఈ పాత్రలో విరాజ్ అశ్విన్ బాగానే నటించాడు . లవర్ బాయ్ గానూ , నెగిటివ్ షేడ్ లోనూ చక్కగా నటించి మెప్పించాడు .

ఇక రెజీనా కసాండ్ర నటన కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది . ఎన్నారై పాత్రలో గ్లామర్ బాగానే ఒలకపొసింది .

అనుపమ పరమేశ్వరన్ కూడా నటిగా తననుతాను ఎప్పుడో ప్రూవ్ చేసుకుంది . కానీ ఎందుచేతనో కానీ ఈ మధ్య ఆమె మరీ చిన్నపిల్లలా కనిపిస్తుంది . మేకప్ మహత్యమో ఏంటో కానీ ఫస్టాఫ్ లో మరీ టెన్త్ క్లాస్ అమ్మాయిలా కనిపిస్తుంది . అయితే నటన పరంగా అనుపమ బాగా చేసింది .

ఈ ముగ్గురూ కాకుండా నాలుగోవాడిని చెప్పుకోవాలంటే అజయ్ ఘోష్ గురించి చెప్పుకోవాలి. ఈయన ఫేస్ చూస్తే ఒక్కోసారి కోట శ్రీనివాసరావు గారు గుర్తుకొస్తారు . అజయ్ ఘోష్ విలనిజం ఎంతబాగా పండిస్తారో కామెడీని కూడా అంతే బాగా పండిస్తారు . మూవీలో కొన్ని పజిల్స్ అర్థంకాక కన్ఫ్యూజ్ అయిన ప్రేక్షకులకు అజయ్ ఘోష్ స్ట్రెస్ బూస్టర్ గా పనిచేసారు .

సాంకేతికత :

ఈ మూవీకి ఇళయరాజా సంగీత సారథ్యం వహించారని తెలిసి ఆశ్చర్యపోయాను . ఇళయరాజా సంగీతానికి పరవశించనివారు ఎవరుంటారు ? అసలు మూవీ టైటిల్ కూడా చూడకుండా ఇళయరాజా మ్యూజిక్ కోసమే మూవీకి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు . అలాంటి మాస్ట్రో ఇళయరాజా ఈ మూవీకి మ్యూజిక్ అందించారంటే సంగీతాభిమానులలో బోలెడు అంచనాలు ఉంటాయి . కానీ ఈ మూవీలో ఆయన మార్క్ మ్యాజిక్ కనిపించకపోవడంతో కొంత నిరాశకు లోను అవుతాము . ఇళయరాజా మ్యూజిక్ బాగుంది అనడం వేరు .. ఇళయరాజా మ్యూజిక్ దుమ్ము లేపింది అనడం వేరు . హీరో హీరోయిన్ల మధ్య పాటలు పెద్దగా లేకపోవడంతో ఏంటో కానీ ఆయన మార్క్ బీట్లు పడలేదు .

అరవింద్ కన్నాభిరాన్ అందించిన సినిమాటోగ్రఫీ బాగానే ఉంది .
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి .

విశ్లేషణ :

మీరు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీలను ఇష్టపడతారా ? అయితే ఓ లుక్ వేయండి . మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే కథనంలో మీకు అక్కడక్కడా థ్రిల్ పంచుతుంది . ముఖ్యంగా పోలీస్ స్టేషన్ ఎపిసోడ్లు ఉత్సుకతను కలిగిస్తాయి .

ఫస్టాఫ్ లో కొన్ని సాగతీత సన్నివేశాలు ఉండటం , కధనం స్లోగా నడవడం వంటివి మనల్ని డిజప్పాయింట్ చేసినా , సెకండాఫ్ లో వచ్చే కొన్ని ట్విస్టులు మనకి థ్రిల్ పంచుతాయి . ఆ ఫ్లోలో వచ్చే కొన్ని సన్నివేశాలు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి కూడా .

అక్కడక్కడా తడబాట్లు ఉన్నా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో వినూత్నంగా ఉండాలని దర్శకుడు చేసిన ప్రయత్నం మాత్రం అభినందనీయమే . మీరు ఆ జానర్ ఇష్టపడేవారైతే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉందికాబట్టి వన్ టైమ్ వాచ్ కింద ఓ లుక్ వేయండి .

నటీనటులు : విరాజ్ అశ్విన్ , రెజీనా కసాండ్ర . అనుపమ పరమేశ్వరన్ , అజయ్ ఘోష్ తదితరులు
సంగీతం : ఇళయరాజా
సినిమాటోగ్రఫీ : అరవింద్ కన్నాభిరాన్
నిర్మాత : రాజీవ్ చిలక
దర్శకత్వం : సతీష్ కాసెట్టి
విడుదల : అమెజాన్ ప్రైమ్ ( 19-06-2026 )
రేటింగ్ : 2 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!