ప్రేమ కథను వినూత్నంగా తెరకెక్కించిన సినిమా గర్ల్ ఫ్రెండ్ !

Spread the love

గతంలో లవ్ స్టోరీల ఇతివృత్తంగా చాలా సినిమాలు వచ్చాయి . హీరో , హీరోయిన్లు ప్రేమించుకోవడం , కులాలు వేరవడం , హీరో తండ్రి ఒప్పుకోకపోవడం , ఇలా అనేకానేక గొడవల తర్వాత క్లైమాక్సులో హీరో , హీరోయిన్లు పెళ్లిచేసుకోవడమో , చచ్చిపోవడమో జరిగేది. ఈ లోపు నాలుగు పాటలు , పది కన్నీళ్లు , ఇరవై బరువైన ఎమోషన్లు ఉంటాయి .

దాదాపు సినిమా ప్రేమ కధలన్నీ ఇలానే ఉంటాయని తెలుగు ప్రేక్షకుడు ఎప్పుడో ఫిక్స్ అయిపోయాడు . ప్రేమ కధల్లో క్లైమాక్సులో శుభం కార్డు వేయాలా , ట్రాజెడీ ముగింపు ఇవ్వాలా అనేది దర్శకుడి యుక్తాయుక్త విచచక్షణ బట్టిన్ను,ప్రేక్షకుడి ప్రాప్తం బట్టినూ ఉండును .

అందుకే గర్ల్ ఫ్రెండ్ చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రొటీన్ రోడ్డ కొట్టుడు ఫార్ములా జోలికి పోకుండా హీరోయిన్ అంటే కేవలం హీరో పక్కన గెంతులు వేయడం వరకే పరిమితం కాదని , ఆమెకూ సొంత వ్యక్తిత్వం ఉంటుందని , ప్రేమలో పడిన మధ్యతరగతి అమ్మాయిలకు మనోభావాలు ఉంటాయని , ప్రేమించిన మగడి నుంచి తను కూడా అటువంటి గౌరవ మర్యాదలు ఆశిస్తుందని , ఇలా కొన్ని పాయింట్లు పకడ్బందీగా రాసుకుని అల్లు అరవింద్ ని కలిసి ఈ కథ సినిమా తీసి ఆహా ఓటిటి లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని అడిగాడు .

కథ విన్న అల్లు అరవింద్ లోని నిర్మాత మేలుకున్నాడు . ఇది ఖచ్చితంగా మహిళలకు కనెక్ట్ అయ్యే స్టోరీ . ఎందుకంటే కధలో హీరోయిన్ పాత్రకు అంత డెప్త్ ఉంది . పాత తరం అమ్మాయిల మాదిరి కాకుండా స్వతంత్ర భావాలతో ఎదగాలనుకునే సొంత వ్యక్తిత్వం ఉంటుంది . తన లైఫ్ పార్ట్నర్ కి ఎలాంటి గౌరవ మర్యాదలు ఇస్తుందో , అలాంటి గౌరవ మర్యాదలనే అతడినుంచి ఆశిస్తుంది . ఈ తరం అమ్మాయిలకు పూర్తిగా కనెక్ట్ అయ్యే కథ .

హీరోయిన్ అంటే ఐటెం సాంగులకో , హీరో పక్కన గెంతులు వేయడానికో పరిమితం చేస్తున్న రొటీన్ సినిమాల నేపథ్యంలో ఒక మధ్య తరగతి అమ్మాయి అంతర్గత సంఘర్షణను ఫీల్ చెడకుండా రాహుల్ కథ రాసుకున్న విధానం అల్లు అరవింద్ కి నచ్చింది .

వెంటనే ఆహా అనేసి ఓటిటి కాదు థియేటర్ రిలీజ్ బొమ్మ ఇది అని కొబ్బరికాయ కొట్టేసారు.
అలా గర్ల్ ఫ్రెండ్ సినిమా తెరకెక్కింది .

అన్నట్టు ఈ సినిమా రిలీజ్ సందర్భంలోనే తాళి గురించి మాట్లాడి దర్శకుడు రాహుల్ రవీంద్రన్ , పీరియడ్స్ గురించి మాట్లాడి రష్మిక వార్తల్లో నిలిచారు ( సినిమా ప్రమోషన్లో ఇదీ భాగం కాదు కదా ? ) రష్మిక మాటలు చాలామందిని ఆలోచింపచేశాయి కానీ రాహుల్ రవీంద్రన్ మాటలు మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయినాయి . ఏదైతేనేమి ఇద్దరి వ్యాఖ్యలతో సినిమాకి అందరి దృష్టి సినిమా మీద పడింది .

ఇంతకీ గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ?

కధేంటంటే ?

మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన తల్లి లేని తండ్రి చాటు బిడ్డ భూమాదేవి ( రష్మిక) తండ్రిని ఒప్పించి పీజీ చదువుల కోసం హైదరాబాద్ సిటీ వచ్చి హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది . అప్పటిదాకా ఆమెకు చదువులు తప్ప ప్రేమా దోమలు తెలియవు . అందరి ఆడపిల్లలాగానే చదువు ఒకటే ధ్యేయంగా సిటీ చేరుతుంది . అక్కడ కాలేజీ , హాస్టల్ వాతావరణం అంతా కొత్తగా అనిపిస్తుంది .

అయితే అదే కాలేజీలో చదువుకుంటున్న విక్రమ్ ( దీక్షిత్ శెట్టి ) భూమాని ప్రేమిస్తాడు . చివరికి భూమా కూడా అతడి ప్రేమలో పడుతుంది . అలా ఇద్దరి మధ్య మొదలైన ప్రేమ కొనసాగుతుండగానే ప్రియుడి మేల్ ఈగో డామినేటింగ్ మనస్తత్వంతో అంతర్గత సంఘర్షణను ఎదుర్కొంటుంది భూమా దేవి . పురుషాహంకారంతో విక్రమ్ తన నిర్ణయాలను బలవంతంగా తన మీద రుద్దడం గమనిస్తుంది . తను చదువుకోవాలో ? వద్దో ? అతడే డిసైడ్ చేస్తుండటంతో ఆలోచనలో పడుతుంది .

విక్రమ్ ప్రేమలో భూమా దేవి ఎటువంటి అనుభవాలను ఫేస్ చేసింది ?
ఈ క్రమంలో తండ్రి రావు రమేష్ , ప్రియుడు విక్రమ్ ల మధ్య మాటల వల్ల ఎలా నలిగిపోయింది ?
ఒక పక్కన సంఘర్షణ పడుతూనే తన ప్రేమకు ఎలాంటి ముగింపు నిర్ణయం తీసుకున్నది అనేదే మిగిలిన కథ ?

సినిమా ఎలా ఉంది ?

నిజానికి దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రాసుకున్న గర్ల్ ఫ్రెండ్ స్టోరీ డిబేటబుల్ సబ్జెక్టు .
ఈ సబ్జెక్టు ను సందేశంలా చెప్తే జనాలకు ఎక్కదు . పోనీ స్త్రీ వాదాన్ని డామినేటింగ్ గా ప్రెజెంట్ చేస్తే మగ ఆడియన్స్ కనెక్ట్ కారేమో అన్న అనుమానం ఉంది . అందుకే తెలివిగా కధలో భాగంగా తాను చెప్పాలనుకున్న మెసేజీని సినిమాలో చూపించాడు .

పనిలోపనిగా దర్శకుడు కన్క్లూజన్ కి రాకుండా మీరే తేల్చుకోండి అని చర్చను జనాలమీదకు తోలి సినిమా చూసాడు . చెప్పాలనుకున్న విషయాన్ని ఎలాంటి కాంట్రావర్సీలకు పోకుండా సినిమాటిక్ గా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు . అందుకే సినిమాకి ప్రియురాలు అనే టైటిల్ పెట్టకుండా గర్ల్ ఫ్రండ్ అనే టైటిల్ పెట్టినట్టున్నాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో రష్మిక లేకపోతే సినిమానే లేదు . అంత మనసు పెట్టి జీవించింది . చదువు ఆపేసి తనని పెళ్ళిచేసుకోవాలని క్లాస్ రూమ్ తలుపులు వేసి మరీ విక్రమ్ తనని బలవంత పెట్టిన సన్నివేశం , విక్రమ్ తన స్నేహితులతో కలిసి ఆమె రూమ్ తలుపు మీద అసభ్య రాతలు రాసినప్పుడు ఏడుస్తూ చేతులతో తుడిచేయడానికి ప్రయత్నించిన సన్నివేశం , వాష్ రూమ్ లో కూర్చుని వెక్కివెక్కి ఏడ్చిన సన్నివేశం , ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన తర్వాత తన ఫోన్ లిఫ్ట్ చేసిన తండ్రితో భయమేస్తుందని తన గోడు చెప్పుకున్నప్పుడు ఆయన వెటకారంగా మాట్లాడటంతో రష్మిక హతాశురాలు అయిన సన్నివేశం , అలాగే క్లైమాక్సులో ఆమె పలికిన పవర్ ఫుల్ డైలాగులు సినిమాకి ప్రాణం పోసాయి .

ఒక మాములు అమ్మాయి కూడా పురుషాహంకారం మీద తిరగబడితే ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయో క్లైమాక్స్ లో తెలుస్తుంది . సమాజం కోసమో ,పరువు కోసమో , ప్రియుడి బ్లాక్ మెయిల్ కు లొంగిపోయో ఆమె తన కెరీర్ ను వదులుకోదు . తన స్వేచ్ఛను వదులుకోదు . స్వతంత్ర భావాలను వదులుకోదు . ధైర్యంగా తనకాళ్ల మీద తాను నిలబడుతుంది .

ఎవరెలా చేసారు ?

గర్ల్ ఫ్రెండ్ సినిమాలో మనకు రష్మిక కనపడదు.. మొత్తం భూమాదేవినే కనిపిస్తుంది. అంత అద్భుతంగా చేసింది . ప్రియుడికి , తండ్రికి మధ్య నలిగిపోయిన అమ్మాయి పాత్రలో మనకు భూమాదేవి మాత్రమే కనిపిస్తుంది . రష్మికను నటిగా మరో మెట్టు పైకి చేర్చిన సినిమా గర్ల్ ఫ్రెండ్.

రష్మిక ఇంత గొప్పగా నటించడం వెనుక ఒక కారణం కూడా ఉంది . కథ వినగానే రష్మిక భుమాదేవి పాత్రకు కనెక్ట్ అయిపోయింది . ఇన్నాళ్లు తాను ఎదురుచూసిన పాత్ర ఇన్నేళ్లకు దొరికిందని మురిసిపోయి వెంటనే ఓకే చేసేసింది . అందుకే ఈ సినిమా కోసం రష్మిక మనసు పెట్టి చేసింది . హీరోయిన్ మనసు పెట్టి చేసిన సినిమాలు ఫెయిల్ అయినట్టు చరిత్రలో లేదు కదా ?

హీరోయిన్ గా రష్మికను ఎంచుకున్న రాహుల్ ఛాయిస్ కూడా కరెక్టే . ఆమె మనసు పెట్టి చేసి కధకు ప్రాణం పోసింది . ముఖ్యంగా సెకండాఫ్ లో రష్మిక తన నట విశ్వరూపాన్ని చూపించింది . ఒకరకంగా సినిమా అంతటా తానే అయి నడిపించింది . ఎక్స్పోజింగ్ లేదు , గ్లామర్ కు అవకాశం ఉన్న పాత్ర కాదు . అయినా రష్మిక ఇప్పటిదాకా చేసిన సినిమాలకు భిన్నంగా భూమాదేవి పాత్రలో జీవించేసింది .

విక్రమ్ పాత్ర పోషించిన దీక్షిత్ శెట్టి కూడా మల్టీ షేడ్స్ లో చేసి మెప్పించారు .
ఇక రావు రమేష్ గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు . తండ్రి పాత్రల్లో అతడిది కొట్టిన పిండి.
రోహిణి కనిపించింది ఒకేఒక్క సీన్ లో అయినా హావభావాలతో తనదైన మార్క్ నటన చూపించింది .
రష్మిక కు కెరీర్ గైడెన్స్ ఇచ్చే మాస్టర్ పాత్రలో రాహుల్ రవీంద్రన్ కూడా బాగానే చేసాడు .
ఇక ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయల్ కూడా ఉంది కానీ ఎందుకుందో తెలీదు . నిజానికి ఆమె పాత్ర లేకపోయినా కధకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు .

సాంకేతికత

హేషమ్ అబ్దుల్ వహద్ అందించిన పాటలు బావున్నాయి
ప్రశాంత్ విహారి కూడా పాటలకు తగ్గ సంగీతం అందించారు
కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ కూడా బావుంది.

విశ్లేషణ

తీసుకున్న ఇతివృత్తం ప్రేమకు సంబంధించింది కాబట్టి ఎమోషన్లు , నాటకీయత , బరువైన డైలాగులు జొప్పించాలి కాబట్టి అక్కడక్కడా కధనం కొంత నత్తనడక నడుస్తుంది.. తప్పదు.
అది కొద్దిగా భరించాలి . కధనంలో వేగం ఆశించే నేటి తరం యూతు ప్రేక్షకులకు మాత్రం అప్పుడప్పుడు కొద్దిగా బోర్ అనిపిస్తుంది . ఇక విక్రమ్ మందు తాగుతూ చేసే హంగామా చూస్తుంటే అర్జున్ రెడ్డి గుర్తుకువస్తాడు . విఫల ప్రేమికులు మందు తాగడాలు..గడ్డాలు ..మీసాలు పెంచడం ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేసాం .

ఓవరాల్ గా ఈ గర్ల్ ఫ్రెండ్ భూమాదేవికి మహిళా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు . తమ గర్ల్ ఫ్రెండ్ రష్మిక నటన చూసి యువ ప్రేక్షకులు పూర్తిగా కనెక్ట్ అవుతారు!

నటీనటులు : రష్మిక , దీక్షిత్ శెట్టి , రావు రమేష్ , రోహిణి , రాహుల్ రవీంద్రన్
నిర్మాణం : గీతా ఆర్ట్స్ సమర్పణ , ధీరజ్ మొగిలినేని , విద్య కొప్పినీడి
దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్
విడుదల : నవంబర్ 7 , 2025
రేటింగ్ : 3 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!