Headlines

మెమోరీస్ (memories) సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రివ్యూ

Spread the love

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ తీసేటప్పుడు ఈ మలయాళం దర్శకులు ఒక ముఖ్యమైన ఫార్ములా ఫాలో అవుతారు . అదేంటంటే సినిమా ప్రారంభమే ప్రేక్షకులకు ఉత్సుకత కలిగేలా థ్రిల్లింగ్ సన్నివేశం ఒకటి ఖచ్చితంగా పెడతారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్న చందాన క్రైమ్ సినిమాల్లో బిగినింగ్ బాగుండేలా, థ్రిల్లింగ్ పెంచేలా జాగ్రత్తలు తీసుకుంటారు.

ఈ జానర్ లో వచ్చే మలయాళం సినిమాలను గమనించి చూడండి. టైటిల్స్ పడగానే ప్రేక్షకులకు క్యూరియాసిటి కలిగించే సన్నివేశంతో మొదలుపెడతారు . దాంతో తరువాతి సన్నివేశాలు ఎలా ఉంటాయో? అన్న క్యూరియాసిటి ప్రేక్షకులలో ఖచ్చితంగా కలుగుతుంది. అదే మలయాళ దర్శకుల మ్యాజిక్.

ఇక ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా ఇప్పటి సినిమా కాదు. 2013 లోనే దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మెమోరీస్ పేరుతో మలయాళంలో కేరళ థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ కలెక్షన్లను సాధించింది. తర్వాత జియో హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కూడా స్ట్రీమింగ్ కి వచ్చి మంచి రేటింగ్ సాధించింది. ఒకవేళ ఇప్పటికీ ఈ మూవీ చూడనివారికోసం ఈ రివ్యూ.

ఇప్పుడు మెమోరీస్ మూవీ ఎలా ఉందో చూద్దాం .

కథేంటంటే?

కథ చెప్పబోయేముందు పైన చెప్పినట్టుగా ఈ మూవీలో ప్రారంభ సన్నివేశం చూద్దాం.
తెల్లవారుజామున ఇంటింటికి పాలు పోసే వ్యక్తి సైకిల్ తొక్కుతూ హఠాత్తుగా ఓ దృశ్యం చూసి కింద పడతాడు. రోడ్డు పక్కన చెట్టుకి వేలాడుతున్న శవం చూసి ఉలిక్కిపడతాడు . అంతకుముందు ఓ ఎన్కౌంటర్ సన్నివేశం కూడా ఉంటుంది.

చూసారుగా మర్డర్ మిస్టరీతోనే స్టోరీ మొదలయ్యింది .

పోలీసులు వచ్చి దర్యాప్తు మొదలుపెడతారు. ఎవరో పదునైన ఆయుధంతో గుండెల మీద బలంగా అక్షరాలు చెక్కి చంపినట్టు పోస్టుమార్టం లో తెలుస్తుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలోనే ఇదే తరహాలో ఇంకో మర్డర్ కూడా జరుగుతుంది.

దాంతో ఈ హత్యలు ఎవరో సీరియల్ కిల్లర్ చేస్తున్నాడని పోలీసులు భావిస్తారు. మరోవైపు మీడియాలో సీరియల్ హత్యల గురించి రావడంతో పోలీసు అధికారుల మీద ప్రెషర్ పెరుగుతుంది. ఈ సమయంలో ఐజీ మీనన్ కారులో వెళ్తూ అలెక్స్ సామ్ ను చూస్తాడు.

గతంలో ఈ సామ్ అలెక్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి సమర్థుడైన ఆఫీసర్ గా పేరు తెచ్చుకుంటాడు . కానీ ఒక ఆపరేషన్లో సామ్ టెర్రరిస్టును కాల్చిచంపటంతో అతడి తమ్ముడు పగబట్టి సామ్ భార్యను , కూతుర్ని చంపేస్తాడు . దాంతో సామ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మద్యానికి బానిస అవుతాడు .

ఇక ప్రస్తుతానికి వస్తే నగరంలో వరుసగా జరుగుతున్న మర్డర్ల కేసును సామ్ అయితే వెంటనే ఛేదించి కిల్లర్ ను పట్టుకుంటాడని ఐజి మీనన్ నమ్మకం . అందుకే సామ్ ను కలిసి పోలీసులతోపాటు సమాంతరంగా ఈ కేసును పరిశోధించాలని రిక్వెస్ట్ చేస్తాడు . కానీ డిప్రెషన్లో ఉన్న సామ్ అందుకు ఒప్పుకోడు. చివరకు తల్లి కూడా కోరడంతో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒప్పుకుంటాడు .

అసలు సీరియల్ కిల్లర్ ఎవరు ?
సీరియల్ కిల్లర్ ప్రత్యేకంగా కొంతమందిని టార్గెట్ చేస్తూ ఒకేతరహాలో హత్యలు చేయడం వెనుక ఉన్న కారణాలు ఏంటి ?
సామ్ ఇన్వెస్టిగేషన్ సీరియల్ కిల్లర్ దొరుకుతాడా ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది .

ఎలా ఉంది ?

టైటిల్స్ తోనే స్పెషల్ పోలీస్ టెర్రరిస్టులను ఎన్కౌంటర్ చేయడంతో ప్రారంభంలోనే సినిమా మీద క్యూరియాసిటీ కలుగుతుంది . తర్వాత గుర్తుతెలియని హంతకుడు కస్టమ్స్ అధికారిని హత్య చేసి చెట్టుకు వేలాడదీయటంతో కధనం పట్ల ఇంట్రెస్ట్ కలుగుతుంది . ఆ తర్వాత వచ్చే సామ్ తాగుడు సన్నివేశాలు కొంత సాగతీత అనిపిస్తాయి . ఇది ఎలా ఉందంటే ఫస్టాఫ్ స్టోరీ ఫ్యామిలీ బాండింగ్ వైపు టర్న్ అవుతుంది . పెద్దకొడుకు తాగుడికి బానిస అవడం ,చిన్న కొడుకు స్వార్థంతో ఆస్తిలో తన భాగం తీసేసుకుని వేరొక అమ్మాయిని పెళ్ళిచేసుకుని వెళ్లిపోవడం , కొడుకు తాగుడిని మాన్పించటానికి అతడి తల్లి చర్చ్ ఫాదర్ ను హెల్ప్ అడగడం లాంటి వరుస సన్నివేశాలతో సినిమా కష్టాలన్నీ చూపించడంతో పొరపాటున ఫక్తు కుటుంబ కథా చిత్రానికి వచ్చామేమో అన్న అనుమానం కలుగుతుంది.

సినిమా డిస్క్రిప్షన్ లో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అన్నారు . మూవీ చూస్తుంటే మాత్రం గొప్ప కుటుంబ కథాచిత్రం అనిపిస్తుంది . ఇదేంటబ్బా అని ఆశ్చర్యపోయేంతలోనే దర్శకుడు జీతూ జోసెఫ్ మేల్కొని కథను క్రైమ్ మోడ్ లోకి టర్న్ చేసాడు . సీరియల్ హత్యల కేసును సామ్ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టడంతో కధనం ఆసక్తికరంగా సాగుతుంది . సెకండాఫ్ నుంచి జీతూ జోసెఫ్ మార్క్ దర్శకత్వం కనిపిస్తుంది . సీరియల్ కిల్లర్ తాను టార్గెట్ చేసే వ్యక్తులను చంపి వారి గుండెలమీద బైబిల్ సూక్తులను చెక్కడం , చంపినతర్వాత వారి శవాలను సిలువ మాదిరి చెట్టుకు వేలాడదీయడం వంటి పనులు చేయడంతో సామ్ ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు .

సామ్ ఇన్వెస్టిగేషన్ సీరియల్ కిల్లర్ గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి . కిల్లర్ ఈ హత్యలు చేయడం వెనుక కొంత ఫ్లాష్ బ్యాక్ ఉందని గ్రహిస్తాడు . గతంలో కోచింగ్ సెంటర్లో జరిగిన కొన్ని సంఘటనలే అతడ్ని హంతకుడిగా మార్చాయని గ్రహిస్తాడు . అందుకే అతడి టార్గెట్ లో ఉన్న మనుషులను నేరుగా చంపకుండా వారి భర్తలను టార్గెట్ చేసి చంపుతుంటాడు . చివరికి సామ్ కిల్లర్ ఆచూకీ కనుక్కుని తుదముట్టించడంతో కథ ముగుస్తుంది .

సెకండాఫ్ లో ఒకదానివెనుక ఒకటిగా వచ్చే ఈ సన్నివేశాలు ప్రేక్షకులను కధనంలో లీనమయ్యేలా చేస్తాయి . చివరిదాకా కిల్లర్ ను చూపించకుండా కేవలం క్లైమాక్సులోనే రివీల్ చేయడం దర్శకుడి టాలెంట్ . ఆల్మోస్ట్ సెకండాఫ్ అంతా స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ తో నడిపించాడు .

అలా అని సినిమాలో లోపాలు లేకపోలేదు . అతడు ఎంత డిప్రెషన్లో ఉన్నా కూడా పోలీస్ సర్వీస్ రూల్స్ తెలియనివాడు కాదు కదా .. ఐజి ,ఎస్పీ వంటి అధికారుల ముందే బాటిల్ ఎత్తుకుని మందు తాగడం , దాన్ని ఆ ఐజి చిరునవ్వుతో భరించడం , పైపెచ్చు ఈ కేసును సామ్ తప్ప ఇండియాలో వేరొకరు ఎవరూ పరిష్కరించలేరు అని అతడి వెంటపడి బతిమిలాడటం వంటి సన్నివేశాలు లాజిక్ ప్రకారం అతకవు . ఇంకో మలయాళం సినిమా జోసెఫ్ లో కూడా హీరోకి ఇలాంటి నేపధ్యమే ఉంటుంది . అతడు కూడా రిటైర్ అయి తాగుతూ ఉంటాడు . క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విషయంలో ఎస్పీ కూడా అతడి సలహాల కోసం వెంపర్లాడుతూ ఉంటాడు . దేనికి ఏది కాపీనో తెలియదు కానీ ఈ రెండు మూవీల్లో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లది దాదాపు ఒకటే తీరు .

ఓవరాల్ గా సాగతీత సన్నివేశాలతో ఫస్టాఫ్ కొంత విసిగించినా , ఆ లోటును దర్శకుడు సెకండాఫ్ లో కవర్ చేసాడు .

ఎవరెలా చేసారు ?

ఈ మూవీలో అలెక్స్ సామ్ పాత్ర పోషించిన పృథ్విరాజ్ సుకుమారన్ ఒక్కడికే స్కోప్ ఉన్న క్యారక్టర్ దక్కింది . మిగిలినవాళ్లు అందరూ దాదాపు సైడ్ ఆర్టిస్టులే . కాబట్టి వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు . ఇక పృథ్విరాజ్ సుకుమారన్ తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించాడు . కాకపోతే తాగుబోతు గెటప్ లో కన్నా పోలీస్ ఆఫీసర్ గెటప్ లోనే అతడు బాగున్నాడు .

సాంకేతికత

సుజిత్ వాసుదేవ్ అందించిన సినిమాటోగ్రఫీ బాగానే ఉంది . కాకపోతే కొన్ని సన్నివేశాలు డార్క్ మోడ్ లో చిత్రీకరించినప్పుడు కొంత క్లారిటీ ,క్వాలిటీ మిస్ అయ్యింది .
అనిల్ జాన్షన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది . సేజో జాన్ అందించిన సంగీతం పర్లేదు .
నిర్మాణ విలువలు కూడా పర్లేదు .
దర్శకుడు జీతూ జోసెఫ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ను నడిపించిన తీరు బాగుంది . కాకపోతే ఫస్టాఫ్ లో కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది .

విశ్లేషణ

సీరియల్ కిల్లర్ కధాంశంగా గతంలో చాలా సినిమాలు వచ్చాయి . అయితే ఏ సినిమా అయినా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మీదే ఫలితాలు ఆధారపడి ఉంటాయి . క్రైమ్ స్టోరీ చూపించేటప్పుడు అడుగడుగునా ఉత్సుకత కలిగించేలా సన్నివేశాలు ఉండాలి . మధ్య మధ్యలో మెరుపులాంటి ట్విస్టులు ఉండాలి . క్లైమాక్స్ లో అసలు విషయాన్ని రివీల్ చేయాలి . దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ ఫార్ములాని తూచా తప్పకుండా పాటించాడు . మరీ ముఖ్యంగా సెకండాఫ్ లో కధనం పైన ప్రత్యేక శ్రద్ద పెట్టాడు . సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీలు ఇష్టపడేవారికి మెమొరీస్ మూవీ నచ్చుతుంది . కాకపోతే క్లైమాక్స్ రొటీన్ ఫార్మాట్ ప్రకారం ముగించకుండా ఇంకాస్త వెరైటీగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది . జియో హాట్ స్టార్ లో మలయాళం వెర్షన్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు .

నటీనటులు : పృథ్విరాజ్ సుకుమారన్ , విజయ రాఘవన్ తదితరులు
సంగీతం : సేజో జాన్
సినిమాటోగ్రఫీ : సుజిత్ వాసుదేవన్
దర్శకత్వం : జీతూ జోసెఫ్
విడుదల : జియో హాట్ స్టార్
రేటింగ్ : 2.75 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!