Home » కూమన్ ( kooman movie) సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూ

కూమన్ ( kooman movie) సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూ

Spread the love

ఓటిటిలు రాకముందు మనం బోలెడు మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలు మిస్ అయ్యాము . కానీ ఇప్పుడా బాధలేదు . మనకు నచ్చిన , బాగా రేటింగ్ వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు . ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారికోసం బోలెడు మలయాళం సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి . వీటిలో చాలావాటికి మంచి రేటింగులు కూడా ఉన్నాయి . థియేటరిక్ రిలీజ్ అయి మలయాళంలో మంచి వసూళ్లు సాధించిన సినిమాలు ఉన్నాయి . కాకపోతే గతంలో ఆ వసూళ్లు మలయాళం వరకే పరిమితం అయ్యేవి . ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ , అమెజాన్ వంటి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ మంచి రేట్ పెట్టి వాటి రైట్స్ కొనుక్కుని స్ట్రీమింగ్ చేస్తున్నాయి వీటిలో చాలావరకు తెలుగు డబ్బింగ్ వెర్షన్లో కూడా అందిస్తున్నాయి .

ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే కూమన్ మూవీ విషయానికి వస్తే దీని దర్శకుడు జీతూ జోసెఫ్ . ఈ దర్శకుడి పేరు చెప్పుకోగానే మనకు చప్పున దృశ్యం మూవీ గుర్తుకు వస్తుంది . మలయాళంలో దృశ్యం చేసిన సంచలనం గురించి అందరికీ తెలుసు . తర్వాత హిందీ ,తెలుగు తదితర భాషల్లో కూడా రీ మేక్ అయి పాన్ ఇండియా సినిమాగా కలెక్షన్ల సునామి సృష్టించింది . ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీలు తీయడం అతడికి కొట్టిన పిండి . అందుకే ఆ దర్శకుడి నుంచి వచ్చిన సినిమాల మీద కొంతమంది ప్రేక్షకులు లుక్ వేస్తారు .కూమన్ మూవీ కూడా 2022 లోనే మలయాళంలో థియేటరిక్ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది . ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది .

మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం .

కధేంటంటే ?

కేరళలోని ఓ గ్రామీణ ప్రాంతం పోలీస్ స్టేషన్లో గిరి శంకర్ ( అసిఫ్ అలీ ) కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఉంటాడు . అయితే అపరాధ పరిశోధనలో ఇతడికి డిపార్ట్మెంట్లోనే మంచి పేరు ఉంటుంది . సినిమా ప్రారంభంలోనే ఇతడి తెలివితేటల గురించి తెలియచేసే సన్నివేశం ఉంటుంది . ఒక ఇంట్లో జరిగిన డైమండ్ రింగ్ చోరీ కేసులో మిగిలిన పోలీసులు పనిమనిషి మీద అనుమానపడి ప్రశ్నిస్తుంటే గిరి మాత్రం అప్పటికప్పుడే అసలు దొంగని పట్టుకుంటాడు .

అయితే గిరి పనిచేస్తున్న స్టేషన్ సిఐ రిటైర్ కావడంతో కొత్త సిఐ వస్తాడు . అక్కడ్నుంచి గిరికి కష్టాలు మొదలౌతాయి . కొత్త సిఐ గిరిని చిన్నచూపు చూస్తూ ఉంటాడు . గిరికి ప్రాధాన్యత తగ్గడంతో ఊరివాళ్ళు కూడా అతడ్ని హేళన చేస్తుంటారు . దానికి తోడు ఊరిలో కబడ్డీ పందాలు జరుగుతున్న సందర్భంలో ఇరువర్గాలకు ఘర్షణ జరుగుతుంది . ఆ ఘర్షణ అవుదామని ముందుకెళ్లిన గిరి మీద ఆగ్రహంతో అతడ్ని సిఐ బురదలోకి తోసేస్తాడు . దాంతో ఈ అవమానం భరించలేక గిరి బార్ కు వెళ్లి మందు తాగుతుండగా అక్కడ ఒక దొంగ పరిచయం అవుతాడు . గతంలో అతడ్ని కూడా ఒక సిఐ టార్చర్ పెట్టడంతో మనసులో కక్ష పెంచుకుని ప్రత్యేకంగా ఆ సిఐ పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ ప్రాంతంలోనే దొంగతనాలు చేస్తాడు . అతడి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు ఎక్కువ అవడంతో పై అధికారులు అతడిని సస్పెండ్ చేస్తారు .

దాంతో తాను పనిచేసే సిఐ మీద కూడా అలాగే కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకుని పగలు పోలీస్ ఉద్యోగం చేస్తూనే రాత్రిళ్ళు దొంగతనాలు చేస్తుంటాడు . అలా ఓరోజు రాత్రి ఊళ్లోని ఒకతని ఇంట్లో దొంగతనానికి వెళ్తాడు . కానీ ఆ ఇంటి ఓనర్ గిరిని గుర్తుపడతాడు . అతడ్ని తప్పించుకుని పారిపోయిన గిరి వేరే ఊళ్ళో లాడ్జిలో దాక్కుంటాడు . చివరికి చేసిన తప్పు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోదామని ఊరికి వచ్చిన గిరికి అక్కడ అనుకోని విషయం ఒకటి తెలిసి షాక్ అవుతాడు .

లొంగిపోదామని వచ్చిన గిరికి ఆ ఊరిలో ఎటువంటి అనుభవం ఎదురౌతుంది?
గత రెండేళ్లుగా కేరళ , తమిళనాడు బోర్డర్ గ్రామాల్లో ప్రతి నెలా పౌర్ణమికి కొంతమంది సూసైడ్ చేసుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి ?
అవి హత్యలా ? ఆత్మహత్యలా ?
వాటి వెనుక ఎవరు ఉన్నారు ?
చివరికి గిరి ఆ రహస్యాన్ని ఎలా ఛేదిస్తాడు ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది .

ఎలా ఉంది ?

కూమన్ కథ కొత్తదేమీ కాదు . గతంలో తాంత్రిక పూజల మీద , మూఢ నమ్మకాల మీద బోలెడు సినిమాలు వచ్చాయి . ఈమధ్య కూడా వస్తున్నాయి . అయితే పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గిరి ఒక సైకలాజికల్ డిజార్డర్ తో దొంగతనాలు చేయడం అనేది కొత్త కాన్సెప్ట్ . పగలు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూనే రాత్రిళ్ళు దొంగతనాలు చేస్తుంటాడు . దాదాపు ఫస్టాఫ్ అంతా గిరి చేసే దొంగతనాలతో నడిచిపోతుంది . ఈ క్రమంలో చాలా సాగతీత సన్నివేశాలు ఎదురై మనకు బోర్ కొట్టిస్తాయ్ . మరీ సిఐ మీద కోపంతో కానిస్టేబుల్ దొంగతనాలు చేయడం ఏంటని జనాలు లాజిక్ వెతుకుతారని దర్శకుడు భావించాడో ఏంటో ఒక సైక్రియాట్రిస్టు ద్వారా అదేదో సైకలాజికల్ ప్రాబ్లమ్ అన్నట్టుగా చెప్పించాడు . ఆశ్చర్యం ఏంటంటే అతడి ప్రాబ్లమ్ తెలుసుకున్న రిటైర్డ్ సిఐ ట్రీట్మెంట్ ఇప్పించాల్సింది పోయి సప్పోర్ట్ గా తాను కూడా రంగంలోకి దిగుతాడు . ఈ కాన్సెప్ట్ ప్రేక్షకుల లాజిక్కుకు అందదు .

అంత తెలివైన కానిస్టేబుల్ కూడా దొంగతనాలు ఎలా చేయాలో ఒక దొంగ నుంచి నేర్చుకుంటాడు . అంత తెలివైన దొంగ కూడా కానిస్టేబుల్ గిరి చెప్పగానే మారుమాట్లాడకుండా పోలీసులకు లొంగిపోతాడు . ఇదీ లాజిక్కుకు అందదు .

దొంగతనం చేస్తుండగా గిరిని గుర్తుపట్టిన వ్యక్తి తర్వాత ఆత్మహత్య చేసుకోవడంతో అసలు కథ మొదలౌతుంది . అప్పటిదాకా కానిస్టేబుల్ దొంగతనాలు చేయడమే ఇందులో కథ అయ్యుంటుంది అనుకుంటాం . కానీ ఊళ్ళో జరిగింది సూసైడ్ కాదని , అది మర్డర్ అని గిరి అనుమానపడి సొంతంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడంతో కధలో సంఘర్షణ మొదలౌతుంది .

ఫస్టాఫ్ తో పోలిస్తే అసలు కధంతా సెకండాఫ్ లోనే నడుస్తుంది . కేరళ , తమిళనాడు బోర్డర్ గ్రామాల్లో వరుసగా జరుగుతున్న ఆత్మహత్యల వెనుక తాంత్రిక శక్తులు ఉన్నాయని కనుక్కుంటాడు . కేరళ అడవిలోని ఓ దేవాలయంలో ఒక వ్యక్తి ఈ తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నాడని తెలుసుకుని అడవి మార్గం పట్టడం , అక్కడ కిల్లర్ ఎవరో కనిపెట్టడం వంటి సన్నివేశాలు థ్రిల్ పంచుతాయి .

ఇంతా చేసి దర్శకుడు క్లైమాక్స్ మాత్రం ఫక్తు రొటీన్ ఫార్మాట్లో ముగించేశాడు . క్లైమాక్స్ ట్విస్ట్ కూడా పెద్దగా థ్రిల్ ఇవ్వదు . ప్రీ క్లైమాక్స్ లోనే అసలు కిల్లర్ ఎవరనేది తెలిసిపోవడంతో కొత్తగా థ్రిల్ ఫీల్ అవడానికి ఏమీ లేదు . బహుశా ఇలాంటి ప్రయోగాలు చేసి ,చేసీ దర్శకుడు జీతూ జోసెఫ్ రాటుదేలిపోయి దృశ్యం మూవీ తీసి హిట్ కొట్టి ఉంటాడు .

ఎవరెలా చేసారు ?

ఎవరెలా చేసారని చెప్పుకోవాలంటే ఏం చెప్తామ్ ? దాదాపు సినిమా అంతా కానిస్టేబుల్ గిరి ఒక్కడే ఎక్కువగా కనిపిస్తాడు . ఇక అతడి గురించే చెప్పుకోవాలి . గిరి పాత్రలో అసిఫ్ అలీ పూర్తి న్యాయం చేసాడు .
మిగిలినవాళ్లు తమ పాత్ర పరిధిలో నటించారు .

సాంకేతికత

షరా మాములుగా కేరళ గ్రామీణ ప్రాంతాల అందాలను చక్కగా కేప్చర్ చేసారు . కేరళ సినిమాల్లో ఏదో ఒక సన్నివేశంలో అడవిని టచ్ చేయాల్సిందే . గ్రామీణ వాతావరణానికి తోడు పచ్చటి అందాలను , అడవులను కెమెరా పనితనంతో కళ్ళకు కట్టారు . ఓవరాల్ గా సినిమాటోగ్రఫీ బాగుంది .
ఇక ఈ మూవీకి బీజీఎమ్ కూడా ప్రాముఖ్యత వహిస్తుంది . ఆ పరంగా బాగానే ఉంది .నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి .
జీతూ జోసెఫ్ మార్క్ దర్శకత్వం పూర్తిస్థాయిలో కనిపించకపోవడం మైనస్ .

విశ్లేషణ

సస్పెన్స్ , థ్రిల్లర్ జానర్ మూవీలు ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చుతుంది . కాకపోతే పోలీస్ కానిస్టేబుల్ దొంగతనాలు చేసే సన్నివేశాలతో ఫస్టాఫ్ బోరెత్తిస్తుంది . అవి కేవలం సాగతీత కోసం సృష్టించిన సన్నివేశాల మాదిరి అనిపిస్తాయి కానీ కధలో భాగంగా నడుస్తున్నట్టు అనిపించదు . ఇక సెకండాఫ్ వచ్చేసరికి అసలు కథలోకి వెళ్తాం . గిరి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడంతో కథనంలో వేగం పెరుగుతుంది . గ్రామంలో జరుగుతున్నవి హత్యలా ? ఆత్మహత్యలా ? అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయడం బాగానే ఉంది కానీ చివరికి తాంత్రిక పూజలుగా తేల్చేయడంతో గాలి పోయింది . ఈ స్టోరీలు ఇప్పటికే చాలా సినిమాల్లో చూసి చూసీ రాటుదేలిపోయాం . కొత్తగా థ్రిల్ ఫీల్ అవడానికి ఇంకేముంటుంది ? క్లైమాక్స్ కొత్త కోణంలో చూపించి ఉంటే బాగుండేది . అడవిలో వేసిన దేవాలయం సెట్టింగ్ కూడా చిన్నప్పుడు విఠలాచార్య సినిమాల్లోనే చూసేసాం కాబట్టి వావ్ అనుకోవడానికి ఏమీ లేదు . హీరో మెడకు ఉరితాడు బిగించి విలన్ కళ్ళుమూసుకుని తాంత్రిక పూజలు చేసుకుంటుంటే , హీరోగారు జేబులోనుంచి లైటర్ తీసుకుని తాడుకు నిప్పు అంటించి కట్లు విప్పుకోవడం మూకీ సినిమాల నుంచి ఉన్నదే . దానిబదులు పాత సినిమాల్లోని బిట్లు తీసి ఇక్కడ అతికిస్తే శ్రమ తప్పేది కదా ? ఓవరాల్ గా సినిమాలో ఇలాంటి లోపాలు చాలా ఉన్నాయి . అందుచేత లాజిక్కుల జోలికి పోకుండా ఇంట్లోనే కాబట్టి ఏదైనా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూద్దామనుకునేవారు వన్ టైం వాచ్ కింద అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు . మితిమీరిన వయొలెన్స్ , అశ్లీలత వంటి గోల లేదు కాబట్టి ఫ్యామిలీతో నిరభ్యంతరంగా చూడొచ్చు .

నటీనటులు : అసిఫ్ అలీ , జార్జ్ మర్యన్ తదితరులు
దర్శకత్వం : జీతూ జోసెఫ్
విడుదల : అమెజాన్ ప్రైమ్
రేటింగ్ : 2 .5 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!