ఎట్టకేలకు గతకొన్నిరోజులుగా జరుగుతున్న సస్పెన్సుకు తెరపడింది . నాలుగురోజుల క్రితమే తన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకున్న విజయ్ గవర్నర్ నిర్ణయంతో ఆ ఏర్పాట్లను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది . తన పదవీ ప్రమాణ స్వీకారానికి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అధినేత అనే అర్హత ఒక్కటే సరిపోదని తమిళనాడు గవర్నర్ కార్యాలయం లోక్ భవన్ లోకి అడుగుపెట్టగానే ఆయనకు అర్థమైంది . తనకు వచ్చిన 108 స్థానాలకు ఇంకో 10 స్థానాలు కలిస్తే కానీ మ్యాజిక్ ఫిగర్ వస్తుందని , అందుచేత మొత్తం 118 మంది శాసనసభ్యుల సంతకాలతో రావాలని గవర్నర్ చెప్పడంతో విజయ్ సినిమా క్లైమాక్స్ సస్పెన్సులో పడింది . ఇదే అదనుగా అన్నాడీఎంకే పార్టీ అధికారం కోసం పావులు కదిపింది. సాధారణ పరిస్థితుల్లో అయితే అన్నాడీఎంకే పార్టీ పాచిక పారేదే . కానీ ఈ పొత్తు స్టాలిన్ కు ఇష్టం లేదు . ఇష్టం లేకపోవడానికి ఆయన పొలిటికల్ ఈక్వేషన్స్ ఆయనకు ఉన్నాయి . సరే ఎలాగైతేనేమి ఈ నాలుగు రోజుల్లో కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ లతో పాటు మరో రెండు పార్టీల మద్దతు కలుపుకుని నిన్న సాయంత్రం వారిచ్చిన లెటర్లను గవర్నర్ చేతిలో పెట్టాడు . మరోసారి వాయిదా వేసే అవకాశం గవర్నర్ కు ఇవ్వకుండా లోక్ భవన్ లోనే కూర్చుని ప్రమాణ స్వీకారానికి అధికారికంగా గవర్నర్ ఆమోదించిన ఉత్తర్వులు తీసుకుని బయటపడ్డారు . ఎప్పుడైతే గవర్నర్ నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చాయో అధికారులు క్షణాల్లో చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రు ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసారు .
ఈ ఉదయం ( ఆదివారం ) పదిగంటలకు విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు . టీవీల్లో ఆయన ప్రమాణ స్వీకార దృశ్యాలు చూసినప్పుడు కొన్ని దృశ్యాలు ఆకర్శించాయి .
విజయ్ ప్రమాణ స్వీకారంపై చిన్న విశ్లేషణ చేసుకుందాం .
తమిళ సాంప్రదాయ పంచకట్టుకు భిన్నంగా సూటులో కొత్త ముఖ్యమంత్రి
ఆదివారం ఉదయం పదిగంటలకు కొద్ది నిమిషాల ముందు విజయ్ జవహర్ లాల్ నెహ్రు ఇండోర్ స్టేడియానికి చేరుకున్నారు . అక్కడ ప్రోటోకాల్ ప్రకారం నూతన సీఎం కు స్వాగతం పలకడానికి అప్పటికే అధికారులు వేచి ఉన్నారు . తెల్లటి షర్ట్ తో టక్ చేసుకున్న విజయ్ కారులోనుంచి దిగి డీజీపీ , చీఫ్ సెక్రటరీ , మరియు ఇతర అధికారులనుంచి పుష్పగుచ్ఛాలు తీసుకుని వినమ్రంగా తిరిగి అభివాదం చేసారు . ఇప్పటిదాకా ఆయన తిరిగిన ఫార్మల్ డ్రస్ స్థానంలో నయా లుక్ లో విజయ్ హుందాగా కనిపించారు.
గవర్నర్ రాక – ప్రోటోకాల్ పొరపాట్లు
సభాస్థలికి తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్వేకర్ రావడంతో ప్రోటోకాల్ ప్రకారం విజయ్ పుష్పగుచ్చం అందించి ఆయనకు స్వాగతం పలికారు . పక్కనే ఉన్న సీనియర్ నాయకుడు సెంగోటియన్ శాలువా కూడా అందించి కప్పమనడంతో విజయ్ గవర్నర్ కు శాలువా కూడా కప్పి ఫోటోలు దిగారు . ప్రోటోకాల్ ప్రకారం అక్కడే ఉన్న మిగిలిన నాయకులను కూడా గవర్నర్ కు పరిచయం చేయాలి . గవర్నర్ ను సాదరంగా ఆహ్వానించి వేదిక వరకు తోడ్కొని తీసుకెళ్లాల్సిన బాధ్యత విజయ్ మీదే ఉంటుంది . కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత విజయ్ వడివడిగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు . కొద్దిదూరం వెనుకబడ్డ గవర్నర్ రెండు నిముషాలు ఆలస్యంగా వేదిక వద్దకు చేరుకున్నారు . బహుశా ప్రోటోకాల్ ఫార్మాలిటీ మీద విజయ్ కు అవగాహన లేకపోవడంతో జరిగిన పొరపాటు కావచ్చు . కానీ అక్కడే ఉన్న సెంగోటియన్ కానీ ,సీనియర్ అధికారులు కానీ ఈ విషయంలో విజయ్ కి ముందుగా బ్రీఫింగ్ ఇచ్చినట్టుగా లేరు .
వేదిక మీద రాహుల్ ప్రత్యక్షం
వేదికమీదకు రాహుల్ గాంధీ ఎప్పుడు వచ్చాడో , ఆయన్ని ప్రోటోకాల్ ప్రకారం ఎవరు తీసుకొచ్చారో కనిపించలేదు కానీ , విజయ్ అండ్ గవర్నర్లు వేదిక మీదకు వచ్చేసరికి అప్పటికే ఆయన అక్కడ ఉన్నాడు . నిజానికి విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిధి హోదాలో వచ్చారు . ఆ హోదా సంగతి అటుంచితే ఆయన పార్టీ తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది . సాధారణంగా సీఎం , గవర్నర్ లు వేదిక మీదకు వచ్చిన తర్వాత అధికారులు ముఖ్య అతిధిని కూడా వేదిక మీదకు పిలిచి పుష్పగుచ్ఛాలతో హానర్ చేయాలి . కానీ రాహుల్ గాంధీ విషయంలో అధికారులు ఇటువంటి ప్రోటోకాల్ ను పాటించినట్టు లేదు . అప్పటికే ఆయన వేదిక మీద ఉన్నారు . ఎప్పటిలానే ప్రోటోకాల్ ను పట్టించుకోకుండా చిరునవ్వుతో విజయ్ కి విష్ చేసి కూర్చున్నారు .
మంత్రివర్గ సహచరులను గవర్నర్ కు పరిచయం చేసిన విజయ్
ప్రమాణ స్వీకారానికి ముందు విజయ్ తన మంత్రివర్గ సహచరులు తొమ్మిది మందిని గవర్నర్ కు పరిచయం చేసారు .
వందేమాతర గీతాలాపన
అనంతరం నలుగురు తమిళ గాయనీమణులు వందేమాతరం గీతాలాపన చేయడంతో అందరూ లేచి నిలబడి జాతీయ గీతాలాపన చేసారు .
భావోద్వేగంలో విజయ్
అంతకుముందు టక్ లో దిగిన విజయ్ ప్రమాణ స్వీకారానికి ముందు మాత్రం పైన కోటు కూడా ధరించారు . ఇప్పటిదాకా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రులు తమిళ సంప్రదాయం అయిన పంచకట్టులోనే పదవీ ప్రమాణం చేసారు . మొదటిసారిగా విజయ్ సూటు బూటులో ప్రమాణ స్వీకారం చేసి తమిళ చరిత్రలో కొత్త సంప్రదాయానికి నాంది పలికారు . ప్రమాణ స్వీకారానికి ముందు కుర్చీలో కూర్చున్న విజయ్ తన అభిమానులను చూస్తూ భావోద్వేగానికి గురి అయ్యారు . ఆయన కంటిలో సుడులు తిరిగిన కన్నీరు స్పృష్టంగా కనిపించింది . వేదిక మీద విజయ్ ను చూసిన ఆయన తల్లితండ్రులు కూడా భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు .
ప్రమాణస్వీకారంలో పొరపాటు
సాధారణంగా ప్రమాణస్వీకారానికి ముందే అధికారులు సీఎం కి , మంత్రులకు ప్రోసిజర్ వివరిస్తారు . కానీ అధికారులు వీరికి అటువంటి ముందస్తు పాఠాలు ఏమీ చెప్పినట్టు లేదు . తన పేరు పిలవగానే విజయ్ మైక్ వద్దకు వెళ్లి ఏదో మాట్లాడబోగా , గవర్నర్ జోక్యం చేసుకుంటూ ముందు తాను ఐ ( నేను ) అని చదివిన తర్వాత మాత్రమే మీ పేరు చెప్పి ప్రమాణం చేయాలనీ చెప్పడంతో తన పొరపాటును సరిదిద్దుకుని విజయ్ ఆయన చెప్పిన ప్రకారమే అఫిడవిట్ లో ఉన్న ప్రకారం ఫార్మాట్ లో ప్రమాణం చదివారు . తర్వాత వచ్చిన ఒకరిద్దరు మంత్రులు కూడా ఇదే విధంగా పొరపాటు పడ్డారు . అంతకుముందు ఆయన విజయ్ అనే నేను అని మొదలుపెట్టినప్పుడు అభిమానుల ఈలలు , నినాదాలతో స్టేడియం దద్దరిల్లిపోయింది .
రాహుల్ గాంధీకి దక్కని గుర్తింపు
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ తన స్థానానికి వచ్చి గౌరవ సూచకంగా రాహుల్ గాంధీకి విష్ చేసారు . రాహుల్ గాంధీ కూడా లేచి నిలబడి ఆయనకు అభినందనలు చెప్పారు . ఇంతవరకు బాగానే ఉంది . కానీ తర్వాత ప్రమాణం చేసిన మంత్రులు మాత్రం నేరుగా విజయ్ వద్దకు వచ్చి నమస్కరించి వెళ్లిపోయారు . మంత్రులు వస్తున్నప్పుడు రాహుల్ గాంధీ మర్యాదపూర్వకంగా లేచి నిలబడినా వారు మాత్రం ఆయన వంక కన్నెత్తి చూడకుండా విజయ్ కి నమస్కరించి వెళ్లిపోయారు . కానీ రాహుల్ గాంధీ ఇదేమీ పట్టించుకోకుండా యధాలాపంగా చిరునవ్వుతో ఉండిపోయారు . రాహుల్ గాంధీ ని కూడా అక్నాలెడ్జ్ చేయమని కనీసం విజయ్ అయినా తన మంత్రులకు చెప్పి ఉండాల్సింది .
టీపాయ్ చేత్తో పట్టుకుని పక్కకి జరిపిన సీఎం
సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన విజయ్ కి ఎటువంటి ఈగోలు లేవని ఒక చిన్న దృశ్యం నిరూపించింది . సీఎం పదవి చేపట్టినా నలుగురిలో ఒకడిగా , మీ కుటుంబ సభ్యుడిగా సోషల్ గా మూవ్ అవుతానని ఆయన ప్రమాణస్వీకారంలోనే చెప్పారు . సీఎం పదవి అంటే చెప్పేది ఏముంది ? సీఎం కనుసైగ చేస్తే చాలు చెప్పులు తొడగటానికి కూడా వందలాదిమంది ముందుకు వస్తారు . కానీ విజయ్ మాత్రం సీఎం అయిన మొదటి క్షణంలోనే తన సింప్లిసిటీని బయటపెట్టుకున్నారు . అందరూ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత గవర్నర్ తో సీఎం , మంత్రులు గ్రూప్ ఫోటో దిగాలి . ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసుకోవడానికి ఒక్కసారిగా ముందుకు తోసుకు వచ్చారు . వారు ఫోటోలు తీసుకోవడానికి విజయ్ ముందున్న టీపాయ్ అడ్డంకిగా ఉంది . దాంతో విజయ్ లేచి స్వయంగా ఆ టీపాయ్ ను పైకి లేపి పక్కనబెట్టడానికి ప్రయత్నించారు . ఇది గమనించి సిబ్బంది పరుగున వచ్చి టీపాయ్ తీసుకెళ్లి పక్కనపెట్టడంతో ఫోటోగ్రాఫర్లు గ్రూప్ ఫోటోలు తీసుకున్నారు .
రాహుల్ గాంధీని పిలిపించుకున్న గవర్నర్
ఫోటో సెషన్ పూర్తి అయిన తర్వాత గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ నూతన సీఎం కి , మంత్రులకు అభినందనలు చెప్పి వీడ్కోలు తీసుకుని ముందుకు వెళ్లిపోయారు . కానీ ఈ సమయంలో వేదిక మీదనే ఉన్న రాహుల్ గాంధీని ఆయన గమనించలేదు . కొంతదూరం వెళ్లిన తర్వాత ఆయనకు గుర్తొచ్చి రాహుల్ గాంధీని పిలిపించుకుని మాట్లాడి మరీ సెలవు తీసుకున్నారు .
స్పెషల్ అట్రాక్షన్ త్రిష
సినీ నటుడు విజయ్ ప్రమాణస్వీకారానికి తమిళ చిత్ర పరిశ్రమనుంచి అతికొద్దిమంది మాత్రమే వచ్చారు . రజని కాంత్ , కమల్ హాసన్ వంటి సీనియర్ నటుల జాడ కనిపించలేదు . నటీనటులే కాదు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది పెద్దలు కూడా కనిపించలేదు . మొత్తమ్మీద త్రిష ఒక్కరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు .
మొదటి సంతకం
విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత 200 లోపు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించే ఫైల్ మీద మొదటి సంతకం పెట్టారు . రాష్ట్రంలో డ్రగ్స్ నిర్ములనకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసే ఫైల్ మీద రెండో సంతకం పెట్టారు . మహిళల భద్రత కోసం షి టీమ్స్ తరహాలో ప్రత్యక డిపార్ట్మెంట్ నెలకొల్పే ఫైల్ మీద మూడో సంతకం చేసారు .
విజయ్ స్పీచ్
విజయ్ స్పీచ్ సినిమా డైలాగుల స్టైల్లో సాగింది . ఆయన డైలాగులు చెప్తూ అభినయానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు . గాల్లో చేతులు ఊపడం , పిడికిలి బిగించడం అభిమానులను అలరించాయి . తన గురించి చెప్తూ , ఒకపై రాష్ట్రంలో ఒకటే పవర్ సెంటర్ ఉంటుందని , ఆ పవర్ సెంటర్ తానేనని పార్టీ శ్రేణులకు తానేంటో , ఎలా ఉండబోతున్నాడో చెప్పేసాడు. కష్టాలు ,కన్నీళ్ల విలువ తనకు తెలుసనీ , అందుకే మీలో ఒకడిగా మీ కుటుంబ సభ్యుడిగా ఉంటూ మీ కష్టాలను తొలగించే ప్రయత్నం చేస్తానని చెప్తూనే , ఇందుకోసం రాత్రికి రాత్రి నానుంచి అద్భుతాలు ఆశించకండని కూడా స్ట్రైట్ గా చెప్పేసాడు . అన్నీ సెట్ చేయాలంటే కొంత టైం పడుతుందని , అప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి తానేమీ దైవదూతని కాదని చెప్పడంతో విజయ్ చాలా ప్రాక్టికల్ గా ఉన్నాడని అర్ధం అవుతుంది . పనిలోపనిగా మొదటిసారిగా విజయ్ కొంత రాజకీయ స్క్రిప్ట్ కూడా చదివాడు . గత ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పులు చేసి ఖజానా ఖాళీ చేసిందని విమర్శిస్తూ ,త్వరలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేత పత్రం తయారుచేస్తామని ప్రకటించాడు .ఏదిఏమైనా తమిళ ద్రావిడ రాజకీయ వ్యవస్థను బద్దలుకొట్టి నూతన శకాన్ని ఆవిష్కరించిన విజయ్ పరిపాలన ఎలా ఉంటుందో అంచనా వేయాలంటే ఆయన ప్రత్యర్థి స్టాలిన్ చెప్పినట్టు ఆరు నెలలు గడువు ఇవ్వాలి .
