Home » విజయ్ సీఎం అయ్యేనా ? మమత కుర్చీ దిగేనా? హీటెక్కిన తమిళ , బెంగాల్ రాజకీయాలు!

విజయ్ సీఎం అయ్యేనా ? మమత కుర్చీ దిగేనా? హీటెక్కిన తమిళ , బెంగాల్ రాజకీయాలు!

Spread the love

మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే మూడు పెద్ద రాష్ట్రాల్లో ప్రభుత్వాల మార్పు కోరుతూ ప్రజలు తీర్పు ఇచ్చారు . ఎన్నికల ఫలితాలతో కేరళం , తమిళనాడు , బెంగాల్ రాష్ట్రాల్లో నూతన ప్రభుత్వాలు ఏర్పడాలి . కానీ ఈ ఎన్నికల్లో కేరళం , బెంగాల్ రాష్ట్రాల్లో ప్రజలు స్పృష్టమైన మెజారిటీతో ఆయా పార్టీలను ఎన్నుకున్నారు . కాబట్టి అక్కడ ప్రభుత్వాల స్థాపనకు ఎటువంటి ఇబ్బంది లేదు . ఒక్క తమిళనాడులో మాత్రం సినీ నటుడు విజయ్ స్థాపించిన TVK పార్టీ మాత్రం మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన 10 సీట్ల దూరంలో ఆగిపోయింది . మాములుగా అయితే అత్యధిక స్థానాలు సాధించిన సింగిల్ లార్జెస్ట్ పార్టీ అధినేతకు అధికార పీఠం అప్పచెప్పటం ఆనవాయితీగా వస్తుంది . అదే ఆనవాయితీ పాటిస్తారు అనుకున్నారేమో ఒక పక్క ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్న సమయంలోనే అప్పటికే అత్యధిక స్థానాలు సాధిస్తున్న TVK పార్టీ చీఫ్ విజయ్ ను డిజిపి స్వయంగా ఆయనింటికి వెళ్లి కలిసి శుభాకాంక్షలు చెప్పారు .

విజయ్ కి ప్రోటోకాల్ సెక్యూరిటీ కల్పించిన తమిళనాడు పోలీసులు

ఎన్నికల ఫలితాల్లో TVK పార్టీ 108 స్థానాలు సాధించి మ్యాజిక్ ఫిగర్ కు ఆమడ దూరంలో ఆగిపోయింది . అయినాసరే అత్యధిక స్థానాలు సాధించిన సింగిల్ లార్జెస్ట్ పార్టీ అధినేతగా TVK చీఫ్ విజయ్ కు ప్రోటోకాల్ ప్రకారం తమిళనాడు డిజిపి అప్పటికప్పుడు సెక్యూరిటీ ఏర్పాట్లు చేసారు . సీఎం హోదాలో విజయ్ ఇంటిదగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా , అయన బయటకు వెళ్తే సీఎం కాన్వాయ్ కూడా ఏర్పాటు చేసారు . విజయ్ కూడా పార్టీ కార్యాలయానికి అధికారికంగా తనకు కేటాయించిన అధికారిక వాహనాల్లోనే (సీఎం కాన్వాయ్) వెళ్లారు . దాంతో ప్రమాణ స్వీకారం చేయకముందే అనధికారికంగా విజయ్ తమిళనాడు సీఎం అయ్యారు . ఇంతవరకు కథ మామూలుగానే నడిచింది . కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ నడిచింది .

అప్పుడేమయింది ?

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు రెండు వారాల గడువు కావాలని ఎన్నికల ఫలితాలు వెలువడిన TVK పార్టీ ప్రకటన చేసింది . మరోపక్క ప్రభుత్వం స్థాపించటానికి అవసరమైన మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ సాయం కోరతామని విజయ్ తండ్రి మీడియాలో ప్రకటన చేసారు . ఆయన ప్రకటన దరిమిలా తమిళ రాజకీయాలు మారిపోయాయి . నిజానికి తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి దక్కినవి కేవలం ఐదు స్థానాలు మాత్రమే . మిగిలిన ఐదు స్థానాలు కమ్యూనిస్టులు ,చిన్నాచితకా పార్టీలనుంచి రాబట్టుకోవాలని TVK ప్లాన్ చేసింది . కానీ ఒకపక్క అప్పటికే అధికారం కోల్పోయిన డీఎంకే పార్టీతో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కూటమి రాజకీయాలు చేస్తుంది . విజయ్ రిక్వెస్ట్ మీద కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోవడానికి తటపటాయించింది . తమ నిర్ణయం జాతీయ రాజకీయాల్లో కూటమి పై ప్రభావం పడే అవకాశం ఉందని పసిగట్టింది .తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రాకపోయినా 59 స్థానాలతో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది . మరోపక్క తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం సృష్టించిన విజయ్ కి మద్దతు ఇవ్వడం రాజకీయంగా తమ పార్టీకి మేలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది . ఎందుకంటే తమ పార్టీకి సైద్ధాంతికంగా బీజేపీ ప్రధమ శత్రువు అని విజయ్ ఇప్పటికే ప్రకటించాడు . అందుకే బీజేపీ కి వ్యతిరేకంగా తాము చేసే పోరాటానికి విజయ్ ను కూడా వాడుకోవాలని ఆ పార్టీ వ్యూహం పన్నింది . ఫలితంగా తెలివితేటలుగా TVK పార్టీకి మద్దతు ఇచ్చే విషయం రాష్ట్ర పార్టీ నాయకత్వం చూసుకుంటుందని బాధ్యత వాళ్ళ మీద నెట్టేసి గేమ్ ఆడారు . ఈ ఐదు సీట్లతో కాంగ్రెస్ సాధించేది ఏమీ లేదు కానీ విజయ్ కి మాత్రం చాలా ఉపయోగపడుతుంది .

మారిన పరిస్థితులు

కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని స్థాపించవచ్చని కాన్ఫిడెన్స్ గా ఉన్న విజయ్ మీద మొదటి దెబ్బ పడింది . సీఎం హోదాలో అతడికి కల్పించిన సెక్యూరిటీ ని పోలీసులు ఉపసంహరించారు . ఈ నిర్ణయంతో విజయ్ ఇంటిదగ్గర సాధారణ భద్రతతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహన శ్రేణిని ఉపసంహరించారు . ఇదిలా ఉండగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు తనకు ప్రభుత్వం కల్పించే సెక్యూరిటీ అవసరం లేదని విజయే పోలీసులను కోరినట్టు అనధికార వార్తలు కూడా వస్తున్నాయి . విజయ్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరడమే ఈ పరిణామాలకు అసలు కారణం . విజయ్ ప్రకటనతో అటు AIADMK , DMK , BJP పార్టీలు ఏకకాలంలో రియాక్ట్ అయ్యాయి . తమ పార్టీనుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలు టీవీకే పార్టీలోకి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం రావడంతో అప్పటికప్పుడు తమ ఎమ్మెల్యేలను హడావుడిగా పుదుచ్చేరి క్యాంప్ కు తరలించారు . మరోపక్క AIADMK , DMK పార్టీల మధ్య సయోధ్య కుదిర్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించాలని కొందరు మధ్యవర్తులు ప్రయత్నాలు ఆరంభించారు . ఎందుకంటే DMK పార్టీకి 59 మంది ఎమ్మెల్యేలు ఉండగా , AIADMK పార్టీకి 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు . ఈ రెండు పార్టీలు కలిసినా మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలు కావాలి . మరోపక్క TVK పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోవడం అంటే ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశాలు ఉంటాయని వార్తలు రావడంతో బీజేపీ రంగంలోకి దిగింది . తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి భాగస్వామ్యం లభిస్తే అది రాజకీయంగా తమకు నష్టం చేకూరుస్తుందని బీజేపీ భావించింది .

గవర్నర్ నిర్ణయం

సాధారణంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ అధినేతను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానిస్తారు . కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెజారిటీ నిరూపించుకోవడానికి ముఖ్యమంత్రికి కొంత సమయం గడువిస్తారు . విజయ్ కూడా గవర్నర్ ఇదే సంప్రదాయాన్ని పాటిస్తారని భావించి గురువారం నాటికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు . కానీ కథ ఇక్కడే మలుపు తిరిగింది . పూర్తిస్థాయి మెజారిటీ సాధించని సందర్భాలలో గవర్నర్ తన విచక్షణా అధికారాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది . సదరు పార్టీ మెజారిటీ నిరూపించుకోలేదు అని గవర్నర్ భావించినప్పుడు ముందస్తుగా బల నిరూపణ కోరవచ్చు . ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు వారాల గడువులో మెజారిటీ నిరూపించుకుంటానని విజయ్ రాసిన లేఖను గవర్నర్ కార్యాలయం పెండింగ్ లో పెట్టినట్టు అనధికార వార్తలు వస్తున్నాయి . ఏదిఏమైనా ప్రస్తుతానికి విజయ్ ప్రమాణ స్వీకారం సస్పెన్సు లో పడింది .

స్టాలిన్ పరిణితి

ఈ పరిణామాల నేపథ్యంలో స్టాలిన్ పరిణితి ప్రదర్శించారు . ఓటమికి కుంగిపోకుండా తాను పోటీ చేసిన నియోజక వర్గానికి వెళ్లి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు . మ్యాజిక్ ఫిగర్ కోసం TVK పార్టీ చేస్తున్న ప్రయత్నాల పట్ల కూడా ఆచితూచి స్పందించారు . ప్రస్తుతానికి విజయ్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం తమకు ఎంతమాత్రం లేదని , అతడి పాలన తీరుతెన్నులను అంచనా వేయడానికి ఆరు నెలలు ఓపిక పడతామని చెప్పారు . అంతేకాదు DMK , AIADMK పార్టీల మధ్య పొత్తు ఉండే అవకాశాలు లేవని తేల్చి చెప్పేసారు . అధికారం కోల్పోయినా రెచ్చగోట్టే వ్యాఖ్యలు చేయకుండా ఓటమిని అంగీకరిస్తూ స్టాలిన్ ప్రదర్శించిన నిగ్రహాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు . ఈ విషయంలో స్టాలిన్ హుందాగా వ్యవహరించారని కొన్ని తమిళ రాజకీయ వర్గాలు హర్షం ప్రకటించాయి .

మమత దురుసుతనం

ఈ విషయంలో మూడు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మమతా బెనర్జీ స్టాలిన్ ను చూసి ఎంతైనా నేర్చుకోవాలి . ప్రజాతీర్పును అంగీకరిస్తున్నట్టు స్టాలిన్ ప్రకటించి సీఎం పదవికి వినమ్రంగా రాజీనామా చేసారు . కానీ మమత మాత్రం ఓడిపోయినా సరే కుర్చీ దిగేది లేదని మొండిపట్టు పడుతున్నారు . ఇలా మొండిపట్టు పట్టి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం సరైనపని కాదని మూడుసార్లు ముఖ్యమంత్రి పదవి అలంకరించిన మమతకు తెలియకుండా ఉంటుందా ? ప్రజల తీర్పును గౌరవించి హుందాగా పదవిలోనుంచి తప్పుకుంటే ఆమె గౌరవం నిలబడుతుంది . లేకపోతే రాజ్యాంగం ప్రకారం బలవంతంగా బయటికి పంపాల్సివస్తుంది . ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగలేదని భావిస్తే అందుకు న్యాయస్థానాల ద్వారా ఆమె న్యాయం పొందే అవకాశం ఎటూ ఉంది . స్టాలిన్ కూడా సిద్ధాంతపరంగా తనకు బీజేపీ ప్రధాన శత్రువని ఎప్పుడో చెప్పారు . అయినాసరే ఎన్నికల విషయంలో వ్యక్తిగతంగా పోకుండా ఆయన హుందాగా వ్యవహరించారు .

స్టాలిన్ ను కలిసిన రజనీకాంత్

సాధారణంగా ఎక్కడైనా సెలెబ్రిటీలు కాబోయే సీఎం ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీగా వస్తుంది . కానీ తమిళ రాజకీయాల్లో ఆ ఆనవాయితీ తిరగబడింది . కాబోయే ముఖ్యమంత్రి విజయ్ ను కలిసి శుభాకాంక్షలు చెప్పాల్సిన సూపర్ స్టార్ రజని కాంత్ అందుకు విరుద్ధంగా ఓడిపోయిన సీఎంను ముందుగా కలిసి పరామర్శించడం రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది . పైగా సినీ రంగానికి చెందిన సాటి కళాకారుడు విజయ్ ను విస్మరించి అంత అత్యవసరంగా ఆయన ప్రత్యర్థి స్టాలిన్ ను కలవాల్సిన అవసరం ఏంటని ? రజనీ తీరుపట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

ముగింపు : ఏదిఏమైనా హీరో విజయ్ సినిమా క్లైమాక్సుకు వచ్చింది . సస్పెన్సు థ్రిల్లర్ సినిమా క్లైమాక్సులో ట్విస్టులు సహజమే ముగింపు ఎలాగైనా ఉండొచ్చు . కాబట్టి ఈ పొలిటికల్ క్లైమాక్సులో విజయ్ ఏ విధంగా విన్ అవుతాడనేది త్వరలోనే తెలుస్తుంది .


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!