కేరళ స్టోరీ మొదటిభాగం కూడా వివాదాల మధ్య విడుదల అయినా వసూళ్ల పరంగా నిర్మాతలకు లాభాలను పంచిపెట్టింది . తర్వాత దానికి సీక్వెల్ గా కేరళ స్టోరీ 2 కూడా రిలీజ్ చేసారు . ఇది కూడా అన్ని సినిమాల్లా మాములుగా సెన్సార్ పూర్తి చేసుకుని థియేటర్లలో రిలీజ్ కాలేదు . కొన్ని సినిమాల మాదిరి సెన్సార్ కష్టాలను కూడా ఎదుర్కొంది . మూవీలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించిన తర్వాతనే సెన్సార్ UA సర్టిఫికెట్ ఇచ్చింది . సెన్సార్ గండం తొలగిపోయింది అనుకున్నంతలోనే హై కోర్ట్ సింగిల్ బెంచ్ స్టే రూపంలో మరో గండం ఎదురైంది . ఎట్టకేలకు డివిజన్ బెంచ్ స్టే ఎత్తివేయడంతో మూవీ థియేటర్లకు వచ్చింది . మొదటి భాగం మాదిరే రెండో భాగం కూడా మంచి వసూళ్లను సాధించింది . ఇప్పుడు జీ 5 ఓటిటి లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో స్ట్రీమింగ్ అవుతుంది .
ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం .
కధేంటంటే ?
కేరళ స్టోరీస్ 2 కధంతా జీవితంలో వివిధ రంగాల్లో సెటిల్ అవుదామనుకున్న ముగ్గురు అమ్మాయిలు ప్రేమ పేరుతో వేరే మతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు విసిరిన ట్రాప్ లో పడి తమను అల్లారుముద్దుగా పెంచిన తల్లితండ్రుల ప్రేమను కోల్పోవడమే కాకుండా ఆఖరికి తమ జీవితాలను కూడా ఏ రకంగా కోల్పోయారో తెలుపుతుంది . కధలో వేరు వేరు ప్రాంతాలలో ముగ్గురు అమ్మాయిల జీవితాల్లో సమాంతరంగా జరిగిన సంఘటనలను చూపించారు ..
దివ్య ( అదితి భాటియా ) కు చిన్నప్పటినుంచి డాన్స్ అంటే ఇష్టం . రీల్స్ చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ స్థాయికి ఎదగాలని ఆమె కోరిక . కానీ ఆమె తల్లితండ్రులు పాత తరం సాంప్రదాయ వాదులు . దాంతో తమ కూతురు పొట్టి దుస్తులు వేసుకుని డాన్సులు చేస్తూ రీల్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వాళ్లకు ఇష్టం ఉండదు . అందుకే అటువంటి రీల్స్ చేయడానికి వీల్లేదని తల్లితండ్రులు ఆమెను మందలించి కట్టడి చేస్తారు . కానీ దివ్య ఈ తరం స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి . తన ప్యాషన్ కు తల్లి అడ్డుపడుతోందని కోపం పెంచుకుంటుంది . మరోపక్క రషీద్ అనే యువకుడు దివ్య ప్యాషన్ కు తాను అండగా నిలబడతానని మాయమాటలు చెప్పి ఆమెను ప్రేమ పేరుతో లొంగదీసుకుంటాడు .
ఇక నేహా ( ఐశ్వర్య ఓజా ) అనే అమ్మాయిది ఇంకో కథ . ఈ అమ్మాయికి చిన్నప్పట్నుంచి క్రీడలు అంటే ఇష్టం . ఏనాటికైనా క్రీడల్లో రాణించి నేషనల్ ఛాంపియన్ అవ్వాలని ఆమె కోరిక . అందుకు అనుగుణంగా జావలిన్ త్రో విభాగంలో రాష్ట్ర స్థాయి లో ఆమె రాణిస్తుంది . కోచింగ్ తీసుకుని నేషనల్ ఛాంపియన్ గా ఎదగాలని ప్రయత్నాలు చేస్తుంది . ఈ పరిస్థితుల్లో ఆమెకు రాజు పరిచయం అవుతాడు . తనకు తెలిసిన కోచ్ ద్వారా ఆమెకు కోచింగ్ ఇప్పించి జాతీయ క్రీడలకు పంపించే ఏర్పాటు చేస్తానని మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపుతాడు . అతడి మాటలు నమ్మి పెళ్లిచేసుకున్న తర్వాత అతడి పేరు ఫైజాన్ అని తెలుస్తుంది .
ఇక మూడో అమ్మాయి పేరు సురేఖ ( ఉల్కా గుప్త ) . ఈ అమ్మాయి చిన్నప్పట్నుంచి చదువుల్లో టాపర్ . బాగా చదువుకుని ఐఏఎస్ కావాలని లక్ష్యం పెట్టుకుంటుంది . స్వతంత్ర భావాలు కలిగిన సురేఖకు జర్నలిస్ట్ సలీం తో పరిచయం ఏర్పడుతుంది . ఆ పరిచయం ప్రేమగా మారడంతో అతడితో లివ్ ఇన్ రిలేషన్ కు ఒప్పుకుంటుంది .
అలా ఈ ముగ్గురు అమ్మాయిలదే స్వతంత్ర భావాలు కలిగిన మనస్తత్వాలే . తమకు తెలియకుండానే రషీద్ , ఫైజాన్ ,సలీం అనే ముగ్గురు యువకుల లవ్ ట్రాప్ లో పడి తల్లితండ్రులను విడిచిపెట్టి వారితో ప్రయాణం సాగించటానికి వెళ్ళిపోతారు .
ఇలా తల్లితండ్రుల మాటలు పెడచెవిన పెట్టి ఇంట్లోనుంచి వెళ్లిపోయిన ఆ ముగ్గురు అమ్మాయిల జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ?
లవ్ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసేవారి అసలు లక్ష్యం ఏంటి ?
ఇల్లు వదిలిపోయిన తమ కూతుళ్ళ కోసం ఆ తల్లితండ్రులు ఏం చేస్తారు ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది .
ఎలా ఉంది ?
ప్రేమ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసి మోసం చేసిన కథలతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి . అదీకాకుండా అగ్రవర్ణాల అమ్మాయిలను అణగారిన వర్గాలకు చెందిన అబ్బాయిలు ప్రేమించడం వంటి కథలతో కూడా చాలా సినిమాలు వచ్చాయి . కానీ వాటికి రాని సంచలనం , వివాదం ఈ మూవీకి రావడం వెనుక కధలో మత కోణం ఉండటమే ప్రధాన కారణం . ఫస్టాఫ్ చూస్తే చాలావరకు రొటీన్ లవ్ స్టోరీలు అనుకుంటాం . ఇందులో వివాదం ఏముంది ? అని సందేహపడతాం కూడా . కానీ సెకండాఫ్ వచ్చేసరికి ఆ ప్రేమ పేరుతో అమ్మాయిలను వంచించిన ఆ ముగ్గురి క్రూరత్వాలను చూసి ఒళ్ళు జలదరిస్తుంది . ఆ ముగ్గురు అమ్మాయిలు పడుతున్న నరకాన్ని చూసి ఎంతటివాడికైనా కన్నీరు రాక మానదు . ఆ అమ్మాయిల తల్లితండ్రులు పడే మనోవేదనను చూస్తే ఎవరికైనా హృదయం ద్రవించక మానదు . ఇదిలా ఉండగా ఫస్టాఫ్ ఆ ముగ్గురు అమ్మాయిల ఇంట్రడక్షన్ , లవ్ ట్రాక్ పేరుతో కథ నిదానంగా సాగుతుంది . ఈ మధ్యలో కొన్ని సాగతీత సన్నివేశాలు కూడా ఉన్నాయి . ఇక సెకండాఫ్ కి వచ్చినప్పుడే కథ పరుగులు పెడుతుంది . కాకపోతే సెకండాఫ్ లో చూపించిన సన్నివేశాలు కొన్ని బయట మనం మీడియా ద్వారా విన్నవే ..చదివినవే . కాకపోతే అవే విషయాలను దృశ్య రూపంలో చూడటంతో ఒళ్ళు గగుర్పొడుస్తుంది .
కాకపోతే కథాపరంగా కొన్ని సన్నివేశాలు సహజత్వంగా ఉండవు . ఎంత స్వతంత్ర భావాలు ఉన్న అమ్మాయిలైనా ఈ రోజుల్లో ఏది చేయాలి ? ఏది చేయకూడదు ? అని తెలియనంత తెలివి తక్కువ వాళ్ళు కారు . పోనీ ఈ ముగ్గురూ చదువుకోని వాళ్ళా అంటే అదీ కాదు .. ముగ్గురూ విద్యావంతులే . జీవితంలో తమతమ రంగాల్లో ఎదగాలని ప్యాషన్ ఉన్నవాళ్లే . లోకం పోకడ పూర్తిగా అవగాహన ఉన్న ఆడపిల్లలే . అయినా ముక్కుముఖం తెలియని అబ్బాయిలతో అవలీలగా ప్రేమలో పడిపోతారు . ప్రేమలో పడటమే కాదు అల్లారుముద్దుగా పెంచిన తల్లితండ్రులను ఎదిరించి మరీ వాళ్ళవెంట వెళ్తారు . ఇటువంటి విషయాల్లో దర్శకుడు కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టు ఉన్నాడు . లవ్ పేరుతో అమ్మాయిలను ఒక వర్గం వారు ఎలా ట్రాప్ చేస్తున్నారో అనే విషయాన్ని ఫోకస్ చేయడం మీద దర్శకుడు ప్రధానంగా దృష్టి పెట్టినట్టు ఉన్నాడు . ఆ విషయంలో ఎటువంటి మొహమాటాలకు పోకుండా పూర్తి స్వేచ్ఛ తీసుకుని సన్నివేశాలను మలిచాడు .
గతంలో వచ్చిన కొన్ని సినిమాలకు , ఇప్పుడు వచ్చిన ఈ సినిమాకు తేడా ఏంటంటే , గతంలో శత్రు దేశంలో ఉన్న దుర్మార్గుల గురించి సినిమాలు వస్తే , ఈ సినిమాలో దేశంలో పెరిగిపోతున్న ద్రోహుల యొక్క లక్ష్యం వెనుక ఉన్న అసలు కోణాలను వెలికి తీసింది . ముగింపు మాత్రం రొటీన్ సినిమాల మాదిరే ఉంది . అన్ని సినిమాల్లో క్లైమాక్సులో ఎంటర్ అయిన మాదిరే ఇందులో కూడా పోలీసులు క్లైమాక్సులో ఎంటర్ అవుతారు . ఇక ఆ బుల్ డోజర్లు రంగంలోకి దిగడం , భవనాలను కూలగొట్టడం లాంటి సన్నివేశాలు మనం ఈ మధ్య వార్తల్లో చూసిన విషయాలే .
ఓవరాల్ గా దర్శకుడు బాధితుల కష్టాలను చూపడంలో పెట్టిన ఫోకస్ పరిష్కార మార్గాల్లో కూడా చూపించి ఉంటే బాగుండేది . క్లైమాక్సులో ప్రజల్లో చైతన్యం రావడం చూపించి హడావుడిగా ముగించినట్టు ఉంది . దానికన్నా ముందునుంచి సమాంతరంగా అమ్మాయిల్లో చైతన్యం వచ్చే విధంగా కొంత సినిమాటిక్ గా ఎడ్యుకేట్ చేసి ఉంటే బాగుండేది . ముగ్గురిలో ఇద్దరు అమ్మాయిల జీవితాలకు విచారకరమైన ముగింపు పలకడం అందరికీ నచ్చకపోవచ్చు . తమకు జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా ఎదిరించి పోరాడి బయటకు వచ్చి మిగిలిన అమ్మాయిలకు సందేశం ఇచ్చి ఉంటే కథ ఉద్దేశ్యం నెరవేరినట్టు అయ్యేది .
ఎవరెలా చేసారు ?
ఈ మూవీలో దివ్య పాత్ర పోషించిన అదితి భాటియా , నేహా పాత్ర పోషించిన ఐశ్వర్య ఓజా , సురేఖ పాత్ర పోషించిన ఉల్కా గుప్త లు ముగ్గురూ పోటీలు పడి నటించారు . ఎవరి పాత్ర పరిధిలో వారు బాగా నటించి మెప్పించారు . కొన్ని సన్నివేశాల్లో ఈ ముగ్గురినీ చూస్తే వీళ్ళు నిజంగా బాధితులేమో అన్న అనుమానం కూడా వస్తుంది .
మరోపక్క ఈ ముగ్గురు అమ్మాయిలను లవ్ పేరుతో ట్రాప్ చేసే రషీద్ , ఫైజాన్ ,సలీం పాత్రలలో అర్జున్ సింగ్ , యుక్తా ఖోశ్లా , సుమిత్ గహ్లావత్ చక్కగా ఒదిగిపోయారు . పైకి కనిపించని క్రూరత్వాన్ని పలికించడంలో ముగ్గురూ పోటీపడి నటించారు .
దర్శకుడు కామాఖ్యా నారాయణ్ సింగ్ కొన్ని వాస్తవ సంఘటనలకు కొంత సినిమాటిక్ లిబర్టీ జోడించి కేరళ స్టోరీని మలిచారు .
సాంకేతికత :
మన్నన్ షా అందించిన నేపధ్య సంగీతం బావుంది . దివ్య నర్తించిన పాట బాగుంది .
ఇక సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది . కొన్ని లొకేషన్లను కళ్ళకు కట్టినట్టుగా చూపించడంలో కెమెరా పనితనం కనిపించింది .
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి
విశ్లేషణ
స్వతంత్ర భావాలతో నేటి తరం అమ్మాయిలు చేస్తున్న తప్పులను ఇందులో స్పృష్టంగా చూపించారు . తమలాగా మరే ఆడపిల్ల మోసపోకుండా ఉండాలని సురేఖతో ఇప్పించిన మెసేజ్ టచ్ చేస్తుంది . అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుళ్ళ జీవితాల్లో లవ్ పేరుతో జరుగుతున్న ట్రాప్ చూసి ఆవేదనతో గుండె పగిలి ఏడ్చే తల్లితండ్రుల వేదన ప్రతిఒక్కరి హృదయాలను ద్రవింప చేస్తుంది . టీనేజీకి వచ్చిన కూతుళ్ళ విషయంలో తల్లితండ్రులు తెసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచెప్పారు . చూడటానికి సినిమా అయినా ఇందులోని పాత్రలను , సన్నివేశాలను నిజ జీవితంలో కూడా మీడియా ద్వారా చాలామంది వినే ఉంటారు .. చూసే ఉంటారు . ఈ సినిమాలో ఆడపిల్లల తల్లితండ్రులకు ఒక సందేశం ఉంది ..ఒక హెచ్చరిక కూడా ఉంది . ఈ మధ్య కూడా పుణేలో ఇటువంటి తరహా ట్రాప్ ఒకటి బయటపడినట్టు వార్తల్లో కూడా వచ్చింది . ఫస్టాఫ్ కొంత స్లోగా సాగుతున్నట్టు అనిపిస్తుంది . దానికి తోడు సమాంతరంగా వేరు వేరు అమ్మాయిల జీవితాలను పరిచయం చేయడంతో కొంత సాగతీత అయినట్టు అనిపిస్తుంది . సెకండాఫ్ లో ఒకరొకరి నిజ స్వరూపాలు బయటపడటంతో అసలు కథ తెరముందుకు వస్తుంది . సినిమా బోర్ అయితే కొట్టదు . ముఖ్యంగా ఆ ముగ్గురు అమ్మాయిలు తమ నటనతో ప్రేక్షకులను సినిమాలోకి తీసుకుపోతారు . జీ 5 ఓటిటి లో తెలుగు డబ్బింగ్ వెర్షన్లో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు .
నటీనటులు : అదితి భాటియా , ఐశ్వర్య ఓజా , ఉల్కా గుప్త , అర్జున్ సింగ్ , యుక్తా ఖోశ్లా , సుమిత్ గోహ్లావత్ తదితరులు
నేపధ్య సంగీతం : మన్నన్ షా
దర్శకత్వం : కామాఖ్యా నారాయణ్ సింగ్
విడుదల : జీ 5 ఓటిటి (తెలుగు )
రేటింగ్ : 2 .5 / 5
