విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో సూర్యవశిష్ఠ , దీప్శిక చంద్రన్ కథా నాయికానాయకులుగా నటించిన ఎమోషనల్ లవ్ స్టోరీ రమణి కళ్యాణం మూవీ మే 22 న థియేటర్లలో విడుదలై మిక్సెడ్ రెస్పాన్స్ తెచ్చుకుని జూన్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది .
చూపులేని అమ్మాయికి .. నడవలేని అబ్బాయికి మధ్య జరిగిన ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అని ట్రైలర్ చూసినవాళ్ళకి అర్ధమయ్యే ఉంటుంది . గతంలో ప్రేమకధలతో తెరకెక్కిన మూవీలు చాలా వచ్చాయి కానీ దర్శకుడు రమణి కళ్యాణం కోసం వైకల్యం ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోని కోణంలో ఇద్దరు ప్రేమికుల మధ్య లవ్ స్టోరీని రాసుకున్నట్టున్నారు.
ఇప్పుడు రమణి కళ్యాణం ఎలా ఉందో చూద్దాం .
కధేంటంటే ?
స్కూల్లో భరతనాట్యం ప్రోగ్రాం లో పాల్గొనటానికి సంజన ( దీప్శిక చంద్రన్) తల్లితండ్రి ,సోదరితో కలిసి కారులో వెళ్తుండగా అతి వేగంగా వచ్చిన ఒక లారీ గుద్దుతుంది. ఈ ఆక్సిడెంట్లో ఆమె తల్లితండ్రులు , సోదరి మరణించగా తలకు బలమైన దెబ్బలు తగలడంతో సంజన చూపు కోల్పోతుంది .
కట్ చేస్తే ,
సంజన పెరిగిపెద్దయి ఒక కిషోర్ కి ( శ్రీనివాసరెడ్డి ) చెందిన పబ్ లో సింగర్ గా జాయిన్ అయి పాటలు పాడుతూ ఉంటుంది . తనకు చూపు లేకపోయినా సంజన ఆత్మవిశ్వాసంతో జీవితం కొనసాగిస్తూ ఉంటుంది . నలుగురు అనాధపిల్లలు , బామ్మ సంజన లోకం . అయితే సంజన పాటలు పాడే పబ్ లోనే ఓనర్ కిషోర్ స్నేహితుడు రాజ్ ( సూర్య వశిష్ఠ ) పరిచయం అవుతాడు . క్రికెట్ ఆటలో నేషనల్స్ కు సెలెక్ట్ అయిన రాజ్ అనుకోని ప్రమాదంలో చిక్కుకుని తల్లితండ్రులను కోల్పోవడమే కాకుండా తలకు తగిలిన బలమైన గాయంతో పక్షవాతం వచ్చి కాళ్ళు పడిపోయి వీల్ చైర్ కి పరిమితం అవుతాడు . దాంతో రాజ్ డిప్రెషన్లోకి వెళ్లిపోయి సూసైడ్ కూడా చేసుకోవాలనుకుంటాడు .
ఈ పరిస్థితుల్లో రాజ్ కు సంజన పరిచయం అవుతుంది . ఆమె పరిచయంతో రాజ్ లో డిప్రెషన్ తగ్గి మళ్ళీ మాములు మనిషి అవుతాడు . ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారుతుంది . దాంతో తమ ప్రేమకు వైకల్యం అడ్డురాదని , ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని సంతోషంగా గడపాలని నిర్ణయించుకుని పెళ్ళికి సిద్ధం అవుతారు .
సరిగ్గా ఇదే సమయంలో కిషోర్ కి రాజ్ గురించి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది .
రాజ్ గురించి కిషోర్ కి తెలిసిన షాకింగ్ న్యూస్ ఏంటి ?
కిషోర్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి ?
చివరికి సంజన .. రాజ్ లు పెళ్లి చేసుకుంటారా ? అనేది మిగిలిన కథ .
ఎలా ఉంది ?
ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళకి అంగవైకల్యం అసలు అవరోధమే కాదనే పాయింట్ ఆధారంగా దర్శకుడు కథను అలుకున్నట్టున్నాడు . అయితే అదే మెసేజీని మాములుగా చెప్తే డాక్యుమెంటరీ ఫిల్మ్ అవుతుంది . అందుకే తాను చెప్పాలనుకున్న మెసేజీని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేవిధంగా సినిమాటిక్ లిబర్టీ తీసుకుని లవ్ స్టోరీ రూపంలో చెప్పాడు . దర్శకుడి ఫార్ములా ఫలించింది . ప్రేక్షకులకు బలమైన మెసేజ్ వెళ్లడంతో పాటు కర్చీఫులు కూడా తడిసాయి .
లవ్ స్టోరీకి అందమైన ముగింపు ఇవ్వకుండా ఎమోషనల్ టచ్ తో కథను మలుపుతిప్పాడు . తెలుగు సినిమాల్లో ఇటువంటి ముగింపులు కొత్త కానప్పటికీ వైకల్యంతో బాధపడుతున్న ప్రియురాలి కోసం త్యాగం చేసిన ప్రియుడి రూపం థియేటర్ బయటికి వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది . హృదయాలను టచ్ చేసిన భావన కలుగుతుంది . ఎమోషనల్ డ్రామా పండించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు . కమెడియన్ శ్రీనివాసరెడ్డితో సీరియస్ రోల్ చేయించడం తెలివైన పని .
అనవసరమైన కామెడీల జోలికి పోకుండా కథను రాజ్ .. సంజనల చుట్టూనే తిప్పారు . కాళ్ళు లేని హీరో ..కళ్ళులేని హీరోయిన్ ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని జయించి ప్రేమించుకుని పెళ్ళిచేసుకుని శుభం కార్డు వేసుంటే రొటీన్ ఫార్మాట్ అయ్యేది . ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ కధకు కీలకం అవుతుంది .
ఎమోషనల్ పార్ట్ వరకు కధనాన్ని పకడ్బందీగా నడిపిన దర్శకుడు మధ్యమధ్యలో కొన్నిసాగతీత సన్నివేశాలను ఇరికించినట్టు అనిపిస్తుంది . పబ్ లో తాగుబోతులతో సంజన గొడవ , రేడియో జాకీ ఉద్యోగంలో ఆఫీసులో నడిచే కొన్ని సన్నివేశాలు సాగతీత కోసం పనికొస్తాయే కానీ కధలో భాగంగా ఉన్నట్టు అనిపించవు . చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోయి అనాధ అయిన సంజన చుట్టూ నలుగురు అనాధ పిల్లలు , బామ్మ ఎక్కడ్నుంచి వస్తారో క్లారిటీ ఇవ్వలేదు .
సంజనకు చూపు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో ఉంటుంది అనే పాయింటును దర్శకుడు బాగానే ఎస్టాబ్లిష్ చేసాడు కానీ కొన్ని సన్నివేశాల్లో ఆమెకు చూపు లేదన్న సంగతి దర్శకుడు మర్చిపోయినట్టున్నాడు . ఐస్ క్రీమ్ తీసుకుని సంజన రోడ్డు మీద చకచకా నడవడం , వీల్ చైర్ మీద కూర్చున్న హీరోని ముందుకు తీసుకెళ్లడం , వంటి సన్నివేశాలు చూసినప్పుడు ఆమెకు చూపు వచ్చిందేమో అనుకుంటాం . కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఆమె చేతికర్ర లేకుండా అడుగు కూడా ముందుకు వేయలేదు . ఆర్జే ఆఫీసుకు వెళ్ళినప్పుడు అక్కడి అటెండర్ తో మాట్లాడుతూ ‘ నాకు చూపు లేదు కాబట్టి నేను ఆఫీసు నుంచి బయటికి వెళ్ళేవరకు నువ్వే దగ్గరుండి దారి చూపాలి ‘ అంటుంది . అలాగే వీల్ చైర్ నెట్టుకుంటూ హీరో ఎంతదూరమైనా రోడ్ల మీద ఒక్కడే వెళ్లడం కొంత సహజత్వానికి దూరంగా ఉంది .
వైకల్యం అనే పాయింట్ ఆధారంగా ప్రధాన కధనం నడిపారు కాబట్టి ఆ విషయంలో దర్శకుడు మరింత ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది .
ఎవరెలా చేసారు ?
ఈ మూవీకోసం హీరో ,హీరోయిన్లు అంకిత భావంతో పనిచేశారని వాళ్ళ నటన చూసినవాళ్లకు అర్ధమౌతుంది . రాజ్ పాత్రలో సూర్య వశిష్ఠ ఒదిగిపోయాడు . లవర్ బాయ్ గా అతడు పలికించిన హావభావాలు బాగున్నాయి . ఒక్కో యాంగిల్ లో అతడ్ని చూస్తుంటే మరో నటుడు విష్వక్సేన్ గుర్తుకొస్తాడు . ఈసారి మీరు గమనించి చూడండి .
ఇక సంజన పాత్రలో హీరోయిన్ దీప్శిక చంద్రన్ నటన బాగుంది .. ఎందుకంటే చూపులేని రోల్ చేయాలంటే అందుకు చాలా సాధన చేయాలి . హావభావాల్లో కానీ , చూపు తిప్పడంలో కానీ ఏ మాత్రం తేడా వచ్చినా భావం చెడుతుంది . సినిమాలో మనకు దీప్శిక చంద్రన్ కనిపించదు .. సంజన మాత్రమే కనిపిస్తుంది
ఇక కమెడియన్ శ్రీనివాస రెడ్డికి నటుడిగా తనను తాను నిరూపించుకునే మంచి రోల్ దక్కింది . రొటీన్ కామెడీకి విరుద్ధంగా గంభీరంగా , పెద్దరికంగా అతడి నటన బాగుంది .
సాంకేతికత
సూరజ్ ఎస్ కురుప్ అందించిన సంగీతం బాగుంది .
అరవింద్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది .
నిర్మాణవిలువలు పర్లేదు .
విశ్లేషణ
చూపులేని సంజన ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని గడపడం , సంజన పరిచయంతో డిప్రెషన్ పోగొట్టుకుని సంతోషంగా గడిపే రాజ్ .. వీళ్ళ పరిచయం ప్రేమగా మారడం , వీరి ప్రేమకు శ్రీనివాసరెడ్డి , శ్యామలలు అండగా ఉండటం వంటి సన్నివేశాలతో దాదాపు ఫస్టాఫ్ అంతా ఫీల్ గుడ్ మూవీ మాదిరి నడుస్తుంది . ఈ మూవీలో హీరో , హీరోయిన్లు ఇద్దరికీ ఫ్లాష్ బ్యాక్ లు ఉండటం , ఆక్సిడెంటల్గా ఇద్దరూ తమ పేరెంట్స్ ని కోల్పోవడం , అదే సమయంలో ఇద్దరికీ అంగవైకల్యం కలగడం , ఈ ఇద్దరి ఫ్లాష్ బ్యాక్ లకు ఒక కామన్ కనెక్షన్ ఉండటం వంటి అంశాలను ఎక్కడా లింక్ తెగకుండా దర్శకుడు పకడ్బందీగా రాసుకుని తెరకెక్కించాడు .
ఎప్పుడైతే కిశోర్ కి రాజ్ గురించి షాకింగ్ న్యూస్ తెలుస్తుందో స్టోరీ ఎమోషనల్ టర్న్ తీసుకుని హృదయాలను బరువెక్కిస్తుంది . ప్రీ క్లైమాక్సుతో ఆ బరువు భారం మరింత పెరుగుతుంది . ఫైనల్గా క్లైమాక్సులో కంటతడి పెట్టిస్తారు . మధ్యమధ్యలో వచ్చే ఒకట్రెండు సాగతీత సన్నివేశాలు మినహా మూవీ మరీ అంత బోర్ ఏమీ కొట్టదు . బోర్ స్థానంలో ఆ రెండు పాత్రల మీద జాలితో హృదయాలు బరువెక్కుతాయి . అసలు ఈ మూవీకి రమణి కళ్యాణం అనే టైటిల్ ఎందుకు పెట్టారో తెలీదు కానీ హీరోయిన్ పేరు సంజన బదులు రమణి అని పెట్టుంటే యాప్ట్ గా ఉండేది .
నటీనటులు : సూర్య వశిష్ఠ , దీప్శిక చంద్రన్ , శ్రీనివాసరెడ్డి , శ్యామల తదితరులు
సంగీతం : సూరజ్ ఎస్ కురుప్
సినిమాటోగ్రఫీ : అరవింద్
నిర్మాత : విజయ్ ఆదిరెడ్డి
దర్శకత్వం : విజయ్ ఆదిరెడ్డి
విడుదల : అమెజాన్ ప్రైమ్ ఓటిటి (12-06-2026 )
రేటింగ్ : 2.5 / 5
