కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు … వీరభద్రుడు మూవీ (OTT) రివ్యూ

Spread the love

సూర్య హీరోగా నటించిన కరుప్పు మూవీ మే 15 న థియేటర్లలో రిలీజ్ అయి తమిళనాట పాజిటివ్ టాక్ తెచ్చుకుంది . అదే సినిమా తెలుగులో వీరభద్రుడు పేరుతో జూన్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది . నటుడిగా సూర్య తనని తాను ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు . ఇతడికి తమిళనాడులోనే కాదు తెలుగునాట కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.సింగం పేరుతో పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూర్య పోషించిన పవర్ ఫుల్ రోల్ ను ఎవరూ మర్చిపోలేరు . కొద్ది గ్యాప్ తర్వాత వీరభద్రుడు అవతారంలో సూర్య నటించిన సినిమా రిలీజ్ కావడంతో సినీ ఇండస్ట్రీలో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి .

దానికి తోడు నయనతార తో అమ్మోరు సినిమా తీసి టాక్ తెచ్చుకున్న ఆర్జే బాలాజీ ఈ సినిమాకి దర్శకత్వం వహించడమే కాకుండా లీడ్ రోల్ లో ఆయనే స్వయంగా నటించడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి . ఇన్ని అంచనాల మధ్య తెలుగులో వీరభద్రుడు పేరుతో ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందిందా ? లేదా ? అనేది ఇపుడు చూద్దాం .

కధేంటంటే ?

మూవీ స్టార్టింగ్ సన్నివేశం నాంపల్లి రైల్వే స్టేషన్లో మొదలౌతుంది . చెన్నై నుంచి మునుస్వామి ( ఇంద్రాస్ ) తన కూతురు మీనుతో కలిసి రైలులో నాంపల్లి స్టేషన్లో దిగుతాడు. మీను అప్పటికే లివర్ సమస్యతో బాధపడుతూ ఉంటుంది . అందుకే ఇంట్లో ఉన్న బంగారం అమ్మి అయినా సరే కూతురికి వైద్యం చేయించాలని బ్యాగులో బంగారం వేసుకుని ఆమెతో కలిసి మునుస్వామి నాంపల్లి చేరుతాడు . స్టేషన్లో కొంతమంది దొంగలు మునుస్వామి నుంచి బంగారం ఉన్న బ్యాగ్ ఎత్తుకుపోతారు . మునుస్వామి కూతురితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు .

పోలీసులు కొంతమంది పాత దొంగలను స్టేషన్ కు పిలిపించి విచారించగా అందులో ఇద్దరు దొంగలు ఈ దొంగతనం తామే చేశామని ఒప్పుకుని బంగారం తిరిగి ఇచ్చేస్తారు . కానీ పోలీసులు మొత్తం 60 సవర్ల బంగారం రికవరీ చూపించకుండా 45 సవర్ల బంగారమే దొరికిందని రికార్డులలో రాసుకుంటారు . రికవరీ చేసిన బంగారాన్ని కోర్టుకు అప్పచెబుతామని లాయర్ను పెట్టుకుని అక్కడే బంగారం కలెక్ట్ చేసుకోమని పోలీసులు మునుస్వామికి చెప్తారు .

దాంతో చేసేదేమీ లేక మునుస్వామి కోర్టుకు వెళ్తాడు . అక్కడ లాయర్ బేబీకృష్ణ ( ఆర్జే బాలాజీ ) బంగారం తిరిగి ఇప్పిస్తానని మునుస్వామికి చెప్పి ఈ కేసును టేకప్ చేసి వాయిదాలతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు . అంతేకాదు .. ప్రతి వాయిదాకి ఫీజుల పేరుతో వీళ్ళదగ్గర డబ్బులు గుంజుకుని పీడిస్తూ ఉంటాడు . ఈ పరిస్థితుల్లో మునుస్వామి కూతురికి సీరియస్ అయి హాస్పిటల్లో చేరుతుంది . దాంతో వెంటనే ఆ బంగారం తనకి ఇప్పించకపోతే తన కూతురు ప్రాణాలతో దక్కదని ఆవేశంతో కోర్టులో జడ్జి మీద అరుస్తాడు .
దాంతో ‘ నీ బంగారం నీకు ఎప్పటికీ దక్కదు ..ఏం చేసుకుంటావో చేసుకో ‘ అని లాయర్ బేబీ కృష్ణ మునుస్వామిని తిట్టడంతో ఆయన కోర్ట్ ఆవరణలో ఉన్న వీరభద్రుడి విగ్రహానికి మొక్కి న్యాయం చేయమని ఏడుస్తాడు .

కోర్టులో న్యాయం జరగని మునుస్వామికి న్యాయం చేయడానికి దేవుడే దిగి వస్తాడా ?
వీరభద్రుడి రాకతో మునుస్వామికి న్యాయం జరుగుతుందా ?
లాయర్ బేబీ కృష్ణ అరాచకాలకు చెక్ పడుతుందా ?
వీరభద్రుడి సాయంతో లాయర్ ప్రీతి ( త్రిష ) సమస్యలను ఎలా పరిష్కరించుకుంటుంది ? అనేది మిగిలిన కథ .

ఎలా ఉంది ?

ఏ దిక్కులేనివాడికి దేవుడే దిక్కు అనే సింగిల్ లైన్ పాయింటుతో దర్శకుడు రెండు గంటల స్టోరీ రాసుకున్నాడు . న్యాయం కోసం కోర్ట్ గడప తొక్కే బాధితులకు అక్కడా న్యాయం జరక్కపోతే న్యాయం కోసం ఎవర్ని అడగాలి ? అలాంటి బాధితుల కోసం దేవుడే దిగివచ్చి న్యాయం చేస్తే ? ఇదే ఈ స్టోరీ లైన్ .. గతంలో ఇలాంటి లైన్ తో చాలా సినిమాలు వచ్చాయి .. అయినా సరే ఈ లైన్ వరకు ఓకే .. కానీ ఈ మూవీ చూసినవాళ్ళని చాలా ప్రశ్నలు వెంటాడుతాయి ? . కోర్టులో న్యాయం జరగని బాధితులకు దిగివచ్చిన దేవుడు న్యాయం చేసినట్టు కధనం సాగాలి కదా ? అప్పుడు కదా ..టైటిల్ కు , స్టోరీ థీమ్ కు న్యాయం జరిగేది ? కింద ఉన్న మనుషులు చాలరు అన్నట్టు పైనుంచి దేవుడ్ని దింపి ఆయన చేత కూడా చుట్ట తాగించి మనిషిని చేస్తే ఎలా ? కధలో అనుకున్నది ఏంటి ? కధనంలో దొర్లింది ఏంటి?

పైగా త్రిషని చంపటానికి గుండాలు వెంటపడితే మాదాపూర్ నా జ్యూరిస్డిక్షన్ కాదు ..ఇక్కడ నా పవర్ పనిచేయదు .. నాంపల్లి వరకే నా పవర్ పనిచేస్తుందని దేవుడే స్వయంగా త్రిషకు చెప్పడం ఏంటి ? దేవుడికి కూడా పరిధులు , పరిమితులు ఉంటాయా ? పైగా ఒక్కో ఏరియాకి ఒక్కో క్షేత్ర పాలకుడు ఉంటాడని చేసిన తప్పును కవర్ చేసుకోవడం ఏంటి ? ఈ లాజిక్ లెస్ ప్లాట్ ప్రేక్షకులకు అస్సలు డైజెస్ట్ కాదు .

తన కూతురును కాపాడుకోవడం కోసమే కదా మునుస్వామి వీరభద్రుడి విగ్రహానికి కారం పూసి ఏడుస్తాడు . మరి వీరభద్రుడ్ని దింపిన దర్శకుడు మునుస్వామి కూతుర్ని పైకి పంపడం ఏ లాజిక్ కిందికి వస్తుందో అర్ధం కాదు . అసలు కథ మొదలయ్యిందే మునుస్వామి కూతుర్ని కాపాడుకోవడం కోసం కదా ? ఇంకో అసలు ఏంటంటే మునుస్వామి తన కూతురికి చెన్నైలోనే వైద్యం చేయించవచ్చు కదా ? బంగారంతో రైలెక్కి నాంపల్లి రావడం ఏంటి ? వీరభద్రుడి రూపంలో దిగిన సూర్య ఆ పని వదిలేసి లాయర్ బేబీ కృష్ణతో మైండ్ గేములు ఆడటం ఏంటి ? దేవుడితో ఆ లాయర్ ఒట్టు వేయించుకోవడం ఏంటి ?

అసలు ఈ మూవీ చూడటం మొదలుపెట్టిన తర్వాత ఇందులో హీరో సూర్యనా ? ఆర్జే బాలాజీనా ? అనే డౌట్ వస్తుంది . కోర్టులో కూడా లాయర్ బేబీ కృష్ణ అని ఒకటికి పదిసార్లు జడ్జి గారు పిలవడం .. కెమెరా లాయర్ బేబీ కృష్ణ బూట్లు , నల్లకోటు , పెన్ను నొక్కటాలతో మొదలుపెట్టి మెల్లిగా ముఖం మీదకు జరుగుతుంటే ఈయనే సూర్య అయ్యుంటాడని అనుకుంటాం . కానీ ఆశ్చర్యంగా ఆ కెమెరా ముఖం మీదకు జరగడంతో కొత్త ముఖం చూసి షాక్ అవుతాం . ఆయనే దర్శకుడు ఆర్జే బాలాజీ అని తెలుసుకుని మరోసారి షాక్ అవుతాం . అసలీ పాత్రకు అంత భారీ ఎలివేషన్లు ఎందుకు ? భవిష్యత్తులో సూర్యకు పోటీగా దర్శకుడు బాలాజీ స్టార్ హీరో అవుదామని అనుకుంటున్నారా ? దాదాపు మొదటి నలభై నిముషాలు సినిమా దర్శకుడు కమ్ నటుడు అయిన బాలాజీ చుట్టూనే తిరుగుతుంది . ఒకవేళ సూర్య ఇందులో గెస్ట్ రోల్ చేసాడేమో అని అనుమానపడతాం కూడా ?

చివరికి ఎలాగోలా వీరభద్రుడి అవతారంలో సూర్యని దింపారు . ఆయన్ని దింపింది కోర్టులో న్యాయం జరగని బాధితులకు న్యాయం చేయడం కోసమే కదా ? నువ్వు నీ పవర్ యూజ్ చేయకుండా కోర్ట్ ప్రొసీజర్ ప్రకారం న్యాయం చేయమని లాయర్ బేబికృష్ణ వీరభద్రుడితో ఒట్టు వేయించుకోవడంతో ఆయన కేసును త్రిషకు అప్పగించి సైడ్ అవుతాడు . కోర్టులో వీరభద్రుడి పవర్ ప్రభావంతో లాయర్ బేబికృష్ణ అన్నీ నిజాలే చెప్తాడు . ఇక్కడ దర్శకుడు ఆ ఒట్టు సంగతి మర్చిపోయినట్టు ఉన్నాడు .

ఓవరాల్ గా ఈ సినిమా చూస్తుంటే దేవుడి కన్నా లాయర్ బేబీ కృష్ణే పవర్ ఫుల్ ఏమో అన్న అనుమానం చాలామందికి వస్తుంది . దర్శకుడు తన పాత్రను అలా డిజైన్ చేసుకున్నాడు మరి . కాంతారా సినిమా తర్వాత క్లైమాక్సులో ఊగిపోయి పూనకాలు తెప్పించే ఫార్ములాలను చాలామంది దర్శకులు ఫాలో అవుతున్నట్టున్నారు . ఇందులో కూడా వీరభద్రుడి రౌద్ర తాండవం చూపిస్తారు . అయితే ఈ మూవీలో వీరభద్రుడ్ని దేవుడిగా చూపించిన సన్నివేశం ఏదన్నా ఉందంటే అది క్లైమాక్స్ తాండవమే . మిగతాదంతా దర్శకుడి తాండవమే .

ఎవరెలా చేసారు ?

ఈ మూవీ ఏ కొంచమైనా పాజిటివ్ టాక్ తెచ్చుకుందంటే అది కేవలం సూర్య నటన వల్లే .. కోర్టులో లాయర్ పాత్రలో కానీ , వీరభద్రుడి గెటప్ లో కానీ సూర్య పూర్తి న్యాయం చేసాడు . దర్శకుడు తన మీద ఫోకస్ పెట్టుకోకుండా సూర్య మీద ఫోకస్ పెట్టి ఉంటే సినిమా కథ నెక్స్ట్ లెవెల్లో ఉండేది .

ఇక లాయర్ ప్రీతి కధలో కీలకం అయినప్పటికీ దర్శకుడు త్రిష నుంచి సరైన నటన రాబట్టుకోలేదనిపిస్తుంది . సూర్య కనిపించినప్పుడల్లా వావ్ అనడం మినహా ఆమె పాత్రకు పెద్ద స్కోప్ ఇవ్వలేదు . దర్శకుడు త్రిషకు , సూర్యల మధ్య లవ్ ట్రాక్ నడపకపోవడం సంతోషించదగ్గ విషయం .

లాయర్ బేబికృష్ణ పాత్రలో దర్శకుడు ఆర్జే బాలాజీ నటన బాగానే ఉంది కానీ ఆయన ఈ మూవీలో హీరోకి ఎక్కువ స్పేస్ ఇచ్చి ఉండాల్సింది .

మునుస్వామి పాత్రలో ఇంద్రాస్ నటన బాగుంది .నిజం చెప్పాలంటే మునుస్వామి ఉన్నంతసేపు కథ ఇంట్రెస్టింగ్ గా నడిచింది . ఆయన్ని పక్కకి పంపడంతో కథ కూడా పక్కకిపోయింది .

సాంకేతికత

సాయి అభ్యంకర్ అందించిన సంగీతం పర్లేదు . కాకపోతే కొన్నిచోట్ల సాహిత్యాన్ని సంగీతం మింగేసింది .

ఇలాంటి మూవీలకు విజువల్స్ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి . క్లైమాక్స్ తాండవం చూస్తున్నప్పుడు కాంతారా పూనకాల రేంజులో ఫీల్ రాలేదు . గ్రాఫిక్స్ మీద మరింత శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది .
నిర్మాణ విలువలు పర్లేదు .

విశ్లేషణ

లాజిక్కులు జోలికి వెళ్లకుండా ఒక సోషియో ఫాంటసీ జానర్లో మూవీ చూస్తున్నామనుకుని ఫిక్స్ అయిపోయి ప్రొసీడ్ అయితే ఎవరూ డిజప్పాయింట్ కారు . కానీ లాజిక్కులు లేకుండా సినిమా ఏంటి ? అనుకునేవాళ్ళకి మాత్రం ఈ మూవీ నిరాశ పరుస్తుంది .

మూవీ బిగినింగ్ నుంచి మునుస్వామి , మీనుల ఎపిసోడ్లు సాగినంతవరకు కధనం ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది . సూర్య ఎంట్రీతో ఆ ఇంట్రెస్ట్ మరింత బూస్ట్ అవుతుందని ఎదురుచూసిన వాళ్ళని మాత్రం దర్శకుడు పూర్తిగా డిజప్పాయింట్ చేసేసాడు . వీరభద్రడు అనే పవర్ ఫుల్ రోల్ కి పవర్స్ లేకుండా చేసినప్పుడే సినిమా గాడి తప్పింది .ఒకానొక దశలో సూర్య ఒక మాములు హీరో .. లాయర్ బేబికృష్ణ ఒక సూపర్ విలన్ అనుకునేంత రేంజులో సినిమా సాగుతుంది . అవన్నీ దర్శకత్వ లోపాలే .

కొన్ని లాజిక్కులను , దర్శకత్వ లోపాలను పట్టించుకోకపోతే మూవీ పెద్దగా బోర్ కొట్టదు . వన్ టైం వాచ్ కింద ప్రయత్నించవచ్చు . స్ట్రైట్ తమిళ్ సినిమా కరుప్పు ని వీరభద్రుడు పేరుతో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చడంతో మనకు డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉండదు .

నటీనటులు : సూర్య , త్రిష , ఆర్జే బాలాజీ , ఇంద్రాస్ తదితరులు
సంగీతం : సాయి అభ్యంకర్
సినిమాటోగ్రఫీ : జికె విష్ణు
రచన , దర్శకత్వం : ఆర్ జె బాలాజీ
విడుదల : అమెజాన్ ప్రైమ్ ఓటిటి ( 12-06-2026 )
రేటింగ్ : 2.5 /5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!