రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేది కోట్లాదిమంది కాంగ్రెస్ కార్యకర్తల కోరిక .. కానీ ??

Spread the love

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేది కోట్లాదిమంది కార్యకర్తల కోరికే కాదు ..ఎప్పటినుంచో పార్టీనే నమ్ముకున్న నాయకుల ఆశయం కూడా . ఈసారి 2029 లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకుని రాహుల్ గాంధీని ప్రధాని పదవిలో నిలుపుతామని ఆ పార్టీ నాయకులు బహిరంగ వేదికల్లో చెప్తున్నారు . ఇదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పదేపదే చెప్తున్నారు . అయితే .. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకుంటున్నారు సరే ఇంతకీ తాను ప్రధాని పదవి చేపట్టాలని రాహుల్ గాంధీ అనుకుంటున్నారా ? లేదా ? అనేది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల ముందున్న అతి పెద్ద పజిల్ .

ఈరోజు కి ( జూన్ 19 ) 55 సంవత్సరాలు నిండి 56 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆయన రాజకీయ ప్రస్థానాన్ని విశ్లేషణ చేసుకుందాం .

భద్రతా సమస్యలతో రాహుల్ బాల్యం

1970 జూన్ 19 న ఢిల్లీలో రాజీవ్ గాంధీ , సోనియా గాంధీలకు ప్రధమ సంతానంగా రాహుల్ గాంధీ జన్మించారు . రాహుల్ గాంధీ పుట్టగానే గోల్డెన్ స్పూన్ తో జన్మించాడని అందరూ అనుకున్నారు కానీ ఆ పిల్లవాడు తన బాల్యాన్ని , స్వేచ్ఛాస్వాతంత్య్రాలను కోల్పోయి రహస్య జీవితం గడపాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు . దురదృష్టవశాత్తు అతడి తండ్రి రాజీవ్ గాంధీకి కూడా లేని చేదు అనుభవాలు ఈ పిల్లవాడికి కలిగాయి .

ఆడుతూపాడుతూ చదువుకుంటున్న రాహుల్ గాంధీ జీవితం మీద నాయనమ్మ ఇందిరాగాంధీ హత్య (1984 ) పెను ప్రభావం చూపింది . అతడి బాల్యం , చదువులు ఒక్కసారిగా ప్రశ్నార్ధకం గా మారిపోయాయి . ఇందిరాగాంధీ కుటుంబం మొత్తాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని బెదిరింపులు వచ్చాయి . ఏ క్షణాన అయినా వారి కుటుంబ సభ్యుల మీద అటాక్ జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు రిపోర్టులు ఇచ్చాయి . ఈ పరిణామాలతో సోనియా గాంధీ భయపడిపోయారు . ఇందిర స్థానంలో రాజీవ్ గాంధీని రాజకీయాల్లోకి వెళ్లవద్దని బతిమిలాడారు . డెహ్రాడూన్ స్కూల్లో చదువుకుంటున్న రాహుల్ గాంధీ , ప్రియాంకలను స్కూల్ మానిపించేసి ఇంట్లోనే చదువుకునే ఏర్పాటు చేసారు . బయటి ప్రపంచానికి పిల్లలు ఎవరో తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు . కనీసం పిల్లల ఫోటోలు కూడా బయటికి రాకుండా గది వరకే వాళ్ళని పరిమితం చేసారు . ఈ విధంగా రాహుల్ గాంధీ బాల్యం అనుక్షణం నిఘా నీడలో స్వేచ్ఛాస్వాతంత్రాలు లేకుండా గడిచిపోతున్న తరుణాన ఆ కుటుంబానికి ఇంకో పెద్ద ప్రమాదం వచ్చి పడింది .

ఇందిర మరణంతో అనుకోని పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ ప్రధాని పదవి చేపట్టాల్సి వచ్చింది . కానీ ఆ కుటుంబానికి భద్రతా ముప్పులు తప్పలేదు . ఏ క్షణాన అయినా రాజీవ్ గాంధీ కుటుంబ సభ్యుల మీద అటాక్ జరగొచ్చని ఇంటిలిజెన్స్ హెచ్చరికలు రావడంతో భయపడిన సోనియా తన కుమారుడు రాహుల్ గాంధీని రహస్యంగా హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేర్పించింది. కానీ 1991 లో రాజీవ్ గాంధీ కూడా హత్య చేయబడటంతో మరోసారి ఆ కుటుంబం అల్లకల్లోలం అయిపొయింది . ఇందిర , రాజీవ్ ల మీద ఉన్న పగలు ఆ కుటుంబాన్ని నీడలా వెంటాడుతున్నాయని నిఘా వర్గాలు పసిగట్టాయి . ఇదే విషయం వారు సోనియాతో చెప్పడంతో రాహుల్ మరోసారి కాలేజీ మారాల్సి వచ్చింది . కానీ ఈసారి రాహుల్ గాంధీ పేరుతో కాదు .. మారుపేరుతో ఫ్లోరిడాలోని రోలిన్స్ కాలేజీలో చదువు మొదలుపెట్టాడు.

చూసారా .. ఇందిరాగాంధీ మనవడు .. రాజీవ్ గాంధీ కొడుకు ఆఖరికి సొంత ఐడెంటిటీ కూడా లేకుండా బిక్కుబిక్కుమంటూ చదువుకోవాల్సి వచ్చింది . అతడి జీవితంలో జరిగిన విషాద సంఘటనలను తెలుసుకున్నవారెవరూ రాహుల్ గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు అనుకోరు . చిన్నతనంలోనే నాయనమ్మను , తండ్రిని కోల్పోయి కనీసం తన అసలు పేరు కూడా చెప్పుకోలేని దుర్భర పరిస్థితుల్లో అతడి బాల్యం , విద్యాభ్యాసం గడిచాయి . కాలేజీలో కూడా అతడి పేరు రాహుల్ అని భారత ప్రధాని కొడుకని ఒకరిద్దరికి మినహా ఎవరికీ తెలీదు . మరోపక్క ఉగ్రవాదులు రాహుల్ గాంధీ కోసం కూడా వెతికారు . కానీ వాళ్ళకి రాహుల్ ఆచూకీ దొరకలేదు .

రాజకీయాలకు దూరంగా రాహుల్

తన కుటుంబానికి జరిగిన అన్యాయంతో సోనియా గాంధీ బెంబేలెత్తిపోయింది . చూస్తుండగానే అత్తగారిని , భర్తను కోల్పోయింది . ఉగ్రవాదుల తదుపరి టార్గెట్ రాహుల్ అయితే ? ఈ ఊహే ఆమెను భయకంపితురాలిని చేసింది . రాహుల్ ఇండియా రావడానికి ఆమె ఇష్టపడలేదు . అందుకే ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ పూర్తిచేసిన రాహుల్ సాధారణ నిరుద్యోగి మాదిరే అక్కడే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఒక గొప్ప కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ షుమారు మూడేళ్లపాటు అనామకుడిలానే ఉద్యోగం చేసాడు . ఆ తర్వాత మెల్లిగా ముంబై చేరి తనే డైరెక్టర్ గా ఒక కంపెనీ పెట్టుకున్నాడు . అప్పటిదాకా రాహుల్ రాజకీయాల జోలికే రాలేదు .

రాహుల్ పొలిటికల్ ఎంట్రీ

రాజీవ్ గాంధీ మరణంతో భయపడిన సోనియా గాంధీ చాన్నాళ్లు రాజకీయాల పట్ల నిరాసక్తత చూపించింది . కానీ పార్టీ నాయకులు మాత్రం ఆమెను విడిచిపెట్టలేదు . రాజీవ్ తర్వాత సోనియానే పార్టీ నడపాలని పట్టుబట్టారు . మొదట్లో భయపడినా మెల్లిగా ఆమె పరోక్షంగా పార్టీ బాధ్యతలను చూసుకోవడం మొదలుపెట్టింది . రాజకీయాలు అనేవి ఒక విష వలయం . అవి ఎవర్నీ వదిలిపెట్టవు . చివరికి సీనియర్ నాయకులు ఎలాగైనా సోనియాగాంధీని ఒప్పించి పార్టీ బాధ్యతలను ఆమె చేతిలో పెట్టారు . వాళ్ళు అంతటితో ఆగలేదు .. గాంధీ వారసత్వం తీసుకురావాలని రాహుల్ గాంధీని కూడా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేలా పావులు కదిపారు . ఏ రాజకీయాలైతే తమ కుటుంబాన్ని దూరం చేశాయని భయపడ్డారో అదే రాజకీయాల ఉచ్చులో సోనియా , రాహుల్ లు పడ్డారు . 2004 లో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన ఉత్తరప్రదేశ్ లోని అమేథి నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ భారీ మెజారిటీతో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు . అక్కడ్నుంచి 2013 వరకు ఆయన ప్రభుత్వ పదవులు తీసుకోకుండా పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టి పనిచేసారు .

మోడీ రాకతో పడిపోయిన రాహుల్ గ్రాఫ్

2014 ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోడీని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో రాహుల్ గాంధీ విఫలం అయ్యారు . రాహుల్ గాంధీ వయసు , అనుభవం ,సమర్థత మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మోడీ ముందు పనిచేయలేదు . కేవలం 44 స్థానాలకే పరిమితం అయి కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది . పైగా అప్పటికి రాజకీయంగా రాహుల్ గాంధీకి పూర్తిస్థాయిలో పరిణితి లేకపోవడమో ? వయసు కారణమో ? కానీ బీజేపీ శ్రేణులు అతడ్ని పప్పు అని హేళనగా సంభోదించేవారు .

రాహుల్ రాజకీయ జీవితాన్ని మలుపుతిప్పిన జోడో యాత్ర

2017 లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీ కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో చురుకైన పాత్ర పోషించారు . రాహుల్ గాంధీ ప్రచారంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది . తిరిగి 2019 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం యాభై రెండు స్థానాలకే పరిమితం కావడంతో నైతిక బాధ్యతగా ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు . రాహుల్ పార్టీ పదవికి రాజీనామా చేసారు కానీ పార్టీ కార్యక్రమాలకు చేయలేదు . 2022 లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు షుమారు నాలుగువేల కిలోమీటర్ల దూరం భారత్ జోడో యాత్ర పేరిట రాహుల్ గాంధీ చేసిన పాదయాత్ర ఆయన రాజకీయ జీవితంలో అతిపెద్ద సానుకూల ఫలితాలను ఇచ్చింది . తనలోని నాయకత్వ సామర్ధ్యాన్ని మెరుగుపర్చుకోవడంలో రాహుల్ గాంధీకి జోడో యాత్ర ఉపయోగపడింది . రాహుల్ జోడో యాత్రల ఫలితంగా 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుని 99 స్థానాలకు ఎదిగింది .

ఇందిర , రాజీవ్ , రాహుల్ .. కొన్ని పోలికలు

పార్టీని నడపడంలో ఇందిర గాంధీ సుప్రీం కమాండర్ తరహాలో ఆధిపత్య ధోరణి వ్యవహరించింది. కాంగ్రెస్ అంటే ఇందిర .. ఇందిర అంటే కాంగ్రెస్ అనే రీతిలో పార్టీలో ఆమె ఆధిపత్య ధోరణి ఉండేది . నిర్ణయాలు తీసుకోవడంలో కఠినంగా ఉండేది . ముఖ్యమంత్రి అయినా సీనియర్ నాయకుడైనా తనకు నచ్చకపోతే తీసి పక్కనపెట్టేది .

ఈ విధానం రాజీవ్ హయం వచ్చేసరికి కొంతమారి మధ్యస్థంగా ఉండేది . ఆయన మరీ ఇందిరమ్మ అంత కఠినంగా ఉండకుండా సీనియర్ నాయకుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకునేవారు . అయినా ఆయన హయాంలో కూడా అంజయ్య అవమానం లాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి .

రాహుల్ గాంధీ నాయకత్వానికి వచ్చేసరికి ఈయన పూర్తిగా ఈగోలను పక్కనబెట్టినట్టు కనిపిస్తుంది . పరిపాలనలో ముఖ్యమంత్రులకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు . ఈ విధానం కాంగ్రెస్ పాలిత సీఎం లకు బిగ్ రిలీఫ్ . సీనియర్లకు రాహుల్ గాంధీ ఇచ్చే గౌరవం టీవీలు చూసే ఎవరికైనా కనిపిస్తుంది . సాధారణంగా కాంగ్రెస్ పార్టీ అధినేతకు చెప్పులు అందివ్వడానికి ద్వితీయ శ్రేణి నేతలు పోటీలు పడతారు . కానీ అందుకు భిన్నంగా మొదటిసారి రాహుల్ గాంధీ పెద్దాయన మల్లికార్జున ఖర్గేకు చెప్పులు అందివ్వడం ఆ పార్టీలో కొత్త పరిణామం . అంతేకాదు నడవలేని మల్లికార్జున ఖర్గేకు ఊతకర్రలా చేతి సాయం అందించడం , ఆయనకు భుజం నొప్పి వస్తే ఎటువంటి ఈగోలు లేకుండా భుజం నొక్కడం వంటి పనులతో రాహుల్ గాంధీ పెద్దల పట్ల తన సంస్కారాన్ని నిరూపించుకుంటున్నారు . పార్టీలో నాయనమ్మ మార్క్ కఠినమైన పనితీరు రాహుల్ లో కనిపించదు .

సోషల్ మీడియాలో వెనుకబాటు

మోడీతో పోలిస్తే రాహుల్ గాంధీకి సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేసుకోవడం అస్సలు రాదనే చెప్పాలి . ప్రస్తుతం మనం డిజిటల్ మీడియా యుగంలో ఉన్నాం . కాలానుకనుగుణంగా మనమూ మారాలి . ఈ అవకాశాన్ని మోడీ చక్కగా అందిపుచ్చుకున్నారు . ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడానికి కానీ , పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడానికి గానీ , వ్యక్తిగత ప్రచారం చేసుకోవడానికి కానీ ఆయన సోషల్ మీడియాని పూర్తిగా వాడుకుంటారు . అందుకే ఆయన డిజిటల్ మీడియాలో నంబర్ వన్ గా కొనసాగుతున్నారు . నిజానికి మోడీ కరెక్ట్ స్ట్రాటజీతో వెళ్తున్నారు . ఈ మధ్య మంత్రులను కూడా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండాలని ఆయన హితబోధ చేయడం అందరికీ గుర్తుండే ఉంటుంది . ఈ విషయంలో రాహుల్ గాంధీ కొంత వెనకపడి ఉన్నారు .

వాట్ నెక్స్ట్ ?

ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణులనుంచి వినవస్తున్న ప్రశ్న తర్వాత ఏంటి ? అనేది . 2029 లో జరగబోయే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకుని రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల , నాయకుల అభిమతం . అయితే కార్యకర్తల అభీష్టం నెరవేరాలంటే అందరికన్నా ముందు ప్రధాని పదవి మీద రాహుల్ కు ఇంట్రెస్ట్ ఉండాలి . రాజకీయాలను పార్ట్ టైమ్ జాబ్ కింద పరిగణించకుండా వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే పూర్తిస్థాయిలో ప్రణాళికలు రచించుకోవాలి . అన్నిటికన్నా ముఖ్యం ఈసారైనా మోడీ ధాటిని రాహుల్ ఎదుర్కోగలడా ? లేదా ? అనేది ఆలోచించుకోవాలి .


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!