ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరి చూపు తమిళనాడు , బెంగాల్ , కేరళ రాష్ట్రాల మీద ఉంది . అందుకు ఒక కారణం ఉంది . బెంగాల్ లో ఈసారి ఎలాగైనా దీదీని పడగొట్టి కాషాయం జెండా ఎగరేయాలని మోదీ , షాలు స్వయంగా రంగంలోకి దిగి వ్యూహాలు పన్నారు . ఆ వ్యూహం కూడా ఏదో మొక్కుబడిగా ఎన్నికల ముందు పన్నింది కాదు . మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిలో హ్యాట్రిక్ కొట్టి బెంగాల్ లో పాతుకుపోయిన మమతా బెనర్జీని ఓడించడం అంత తేలిగ్గా అయ్యే పని కాదని బీజేపీ నాయకత్వం గుర్తించింది . దానికితోడు దేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రి రానంత దూకుడుగా మమతా బీజేపీ మీద పోరాటం చేసింది . గతంలో కేసీఆర్ కూడా బీజేపీ కి వ్యతిరేకంగా దూకుడుగా పోరాటం చేయాలని నిర్ణయించుకుని ప్రాంతీయ పార్టీ పేరును బిఆర్ఎస్ గా మార్చి ఢిల్లీ , తమిళనాడు , పంజాబ్ , తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి కార్యాచరణ చేయాలని ప్లాన్ చేసుకున్నారు . కానీ అనూహ్యంగా ఆయన పార్టీ తెలంగాణలోనే ఓడిపోవడంతో జాతీయ రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించి ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు . ఇక బీజేపీ నిర్ణయాలను గట్టిగా వ్యతిరేకించి పోరాటం చేసిన పార్టీల జాబితాలో క్రేజ్రీవాల్ ఆప్ పార్టీ కూడా ఉంది . లిక్కర్ స్కాం లో ఇరుక్కోవడం కారణం కానివ్వండి , క్రేజ్రీవాల్ ప్రభుత్వ నిర్ణయాల మీద వ్యతిరేకత కానివ్వండి నిరుటి ఎన్నికల్లో ఆ పార్టీ కూడా బీజేపీ చేతిలో ఓడిపోయి అధికారం కోల్పోయింది . కానీ వీరందరికన్నా బీజేపీకి మమత గట్టి టార్గెట్ గా నిలిచింది . సందర్భం వచ్చినప్పుడల్లా ఆమె కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల అడుగడుగునా తన నిరసనను తెలియచేస్తూనే ఉంది .
అందుకే బీజేపీ నాయకత్వం ఎన్నికలకు చాలా ముందుగానే గట్టి నిర్ణయం తీసుకుంది . బెంగాల్ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల్లో మమతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి తీరాలని తీర్మానించుకుంది . అందుకు అనుగుణంగా వ్యూహాలు పన్నింది . సాధారణంగా అసెంబ్లీకి జరిగే జనరల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేస్తుంది.. వాటిని జాతీయ నాయకత్వం మానిటర్ చేస్తుంది . ఢిల్లీలో బీజేపీ పెద్ద తలకాయలు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు . కానీ బెంగాల్ విషయంలో అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు . బెంగాల్ లో తరతరాలుగా పాతుకుపోయిన అక్రమ వలసదారులను గుర్తించారు . తృణమూల్ పార్టీ వోట్ బ్యాంకును గుర్తించారు . బెంగాల్ లో ఆ పార్టీని అధికారం నుంచి తప్పించాలంటే మూలాల మీద కొట్టాలని అర్ధం అయ్యింది. సరిగ్గా అదే పనిచేసారు . సర్ ఆక్ట్ రంగంలోకి దిగడంతో బెంగాల్ లోని 24 పరాగణాలలో షుమారు పది లక్షల అక్రమ ఓట్లను తొలగించారు . సర్ కు వ్యతిరేకంగా మమత పోరాటం చేసినప్పటికీ న్యాయస్థానాల ఆదేశాలతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది . ఎన్నికలకు ముందు చాపకింద నీరులా బీజేపీ తన వ్యూహాలను అమలుచేసుకుంటూ వచ్చింది . తమ వ్యూహం ఫలిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో బీజేపీ కూడా ముందే పసిగట్టింది . అందుకే ప్రధాని మోదీ సైతం మరే రాష్ట్రంలో చెప్పనంత కాన్ఫిడెన్స్ గా బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి రాబోతుందని చెప్పారు . వారు ఊహించినట్టుగానే బెంగాల్ లో బీజేపీ మెజారిటీ దిశగా దూసుకుపోతుంది . ఎన్నికల్లో తన ఓటమి ఖాయమని దీదీ కూడా ముందే ఊహించినట్టు ఉంది . అందుకే బీజేపీ ఓట్ చోరీకి పాలపడిందని , ఈవీఎం టాంపరింగ్ జరిగిందని ఎన్నడూ లేని విధంగా రకరకాల ఆరోపణలతో విరుచుకుపడ్డారు .
తమిళ రాజకీయం
ఇక ఇప్పుడు తమిళనాడు విషయానికి వస్తే ఫైట్ AIADMK , DMK పార్టీల మధ్య జరిగిఉంటే ఇంత ఆసక్తికరంగా ఉండేది కాదు . దేశంలో అందరి చూపు తమిళనాడు ఎన్నికల మీద పడటానికి TVK చీఫ్ విజయ్ ఒక కారణం . ఎందుకంటే అతడు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల బరిలోకి వంటరిగా దిగాడు . ఈ విషయంలో విజయ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫార్ములా ఫాలో అయ్యాడు . ఏపీకి జరిగిన ఎన్నికల్లో కూడా జగన్ వంటరిగా పోటీ చేసి అధికార పీఠం దక్కించుకున్నాడు .
ఇక రెండో అంశం సినీ నటులకు తమిళ రాజకీయాల్లో స్పేస్ ఎంతవరకు ఉంటుంది అనేది ప్రశ్నార్ధకం . ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలనుంచి భిన్నమైన తీర్పులు వచ్చాయి. ఎన్టీఆర్ తర్వాత సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటుడు చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది . అధికారం దక్కించుకోవడం సంగతి అటుంచితే ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక స్థానంలో ఓడిపోయారు . ఎన్టీఆర్ తర్వాత సినీ నటులకు రాజకీయాల్లో స్పేస్ లేదని తెలుగు ప్రజలు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం విషయంలో స్పృష్టమైన తీర్పు ఇచ్చారు .
ఇక రాజకీయాల్లోకి దిగే సినీ నటుల పట్ల తెలుగు ప్రజలు అంత స్పృష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో ప్రాంతీయ పార్టీ స్థాపించి ఎన్నికల బరిలోకి దిగారు . ఈ ఎన్నికల్లో ఆయన కూడా ఓడిపోయారు . దాంతో ప్రజల పల్స్ మరోసారి బయటపడింది . సినీ గ్లామర్ వేరు , రాజకీయాలు వేరు .. ఈ రెండిటి మధ్య చిన్న విభజన రేఖ ఉందని ఓటర్లు చెప్పకనే చెప్పారు . ఎందుకంటే పవన్ కళ్యాణ్ రోడ్ షో కి కానీ , బహిరంగ సభలకు కానీ జనం పోటెత్తేవారు . కానీ ఆ జనంలో మూడొంతులమంది కేవలం సినీ నటుడిగా మాత్రమే పవన్ కళ్యాణ్ ను అభిమానించే వివిధ పార్టీల కార్యకర్తలు . మళ్ళీ వారిలో చాలామంది ఓటు హక్కు లేని వాళ్లే . ఆ విషయం ఫలితాల్లో ప్రతిబింబించింది . ఇక తిరిగి రెండోసారి పవన్ సింగిల్ గా కాకుండా కూటమితో ముందుకురావడంతో ఆయన డిప్యూటీ సీఎం స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది .
ఇప్పుడు తమిళ రాజకీయాల సంగతికి వద్దాం .
తమిళనాట షుమారు 49 సంవత్సరాల క్రితం సినీ నటుడు ఎంజీఆర్ రాజకీయ పార్టీ పెట్టిన మొదటి ప్రయత్నంలోనే అధికారం దక్కించుకుని ముఖ్యమంత్రి కాగలిగారు . తమిళ రాజకీయాల్లో ఎంజీఆర్ మొదటి రికార్డ్ నెలకొల్పి చరిత్ర సృష్టించారు . తిరిగి ఆ రికార్డును ఎవరూ బద్దలుకొట్టలేకపోయారు . జయలలిత ముఖ్యమంత్రి కాగలిగారు కానీ కేవలం ఎంజీఆర్ వారసురాలిగా మాత్రమే ఆమె రికార్డ్ పరిమితం అయ్యింది .
తమిళ నటుడు విజయ కాంత్ పొలిటికల్ పార్టీ పెట్టినా ఆయన సక్సెస్ కాలేకపోయారు . ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు కానీ ఎందుకో మధ్యలోనే ఆయన ఆ ప్రయత్నం విరమించుకున్నారు . ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఉంటే తమిళనాట పరిస్థితులు ఇంకో రకంగా ఉండేవి .
ఇదే సమయంలో మరో నటుడు కమల్ హాసన్ సొంతంగా రాజకీయ పార్టీ స్థాపించి రాజీకీయాల్లోకి దిగారు కానీ ఆయన దూకుడుగా ముందుకు వెళ్లలేకపోయారు . చివరికి డీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని రాజ్య సభ సభ్యత్వంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది .
ఇలా ఒకరివెంట ఒకరు ముగ్గురు సినీ నటులు రాజకీయాల్లో ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయారు . ఈ పరిస్థితుల్లో వాళ్లందరికంటే జూనియర్ నటుడైన విజయ్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు .
విజయ్ రాజకీయ ప్రస్థానం
విజయ్ రాజకీయాల్లోకి రావాలని తీసుకున్న నిర్ణయాన్ని మొదట్లో రాజకీయ వర్గాలు పెద్దగా పట్టించుకోలేదు . ఎప్పుడో 49 ఏళ్ళ క్రితం ఎంజీఆర్ తోనే సినీ నటుల రాజకీయ ప్రస్థానం ముగిసిపోయిందని అందరూ భావించారు . దానికి తోడు విజయ్ కాంత్ , రజనీకాంత్ ,కమల్ హాసన్ లాంటి సీనియర్ నటులే రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయారు . ఇక కొత్తగా రంగంలోకి దిగే విజయ్ వల్ల ఏమౌతుంది ? అని కొట్టిపడేసారు . దానికి తోడు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినీ నటులకు జరిగిన అనుభవాలను గుర్తు చేసారు .
కానీ విజయ్ స్ట్రాటజీ వేరు . తమిళ రాజకీయాల పట్ల అతడు ఫుల్ క్లారిటీతో ఉన్నాడు . రాజకీయాల పేరుతో ఓవర్ నైట్ ఎంట్రీ ఇవ్వకుండా మెల్లిగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చాడు . సినిమాల్లో నటిస్తూనే 2009 లో విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో ప్రజల మధ్యకు వచ్చి సేవాకార్యక్రమాలు మొదలుపెట్టాడు . ఈ సంస్థ స్థాపనతో అతడు ప్రజలకు మరింత చేరువ అయ్యాడు . 2022 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అభిమానులను నిలిపి తన బలాన్ని పరీక్షించుకున్నాడు . అక్కడ విజయ్ కి తిరుగులేని స్థానాలు రావడంతో రాజకీయాల్లో తన ఛరిస్మా ఏంటో ఆయనకు అర్ధం అయ్యింది . దాంతో ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ల ముందు 2024 TVK ( తమిళగ వెట్రి కళగం ) పేరుతో రాజకీయ పార్టీ స్థాపించాడు . తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ తన ప్రధాన ప్రత్యర్థి అని , సిద్ధాంతపరంగా బీజేపీ తన మరో ప్రత్యర్థి అని ప్రకటించాడు . అప్పటికీ విజయ్ రాకను ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు . రాజకీయాల ముందు సినీ గ్లామర్ పనిచేయదనే అందరూ భావించారు . చివరికి కమల్ హాసన్ మాదిరి విజయ్ కూడా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోక తప్పదు అనుకున్నారు .
కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించాడు . అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని అతడు తీసుకున్న డేరింగ్ నిర్ణయానికి తలలు పండిన సీనియర్ రాజకీయ విశ్లేషకులు సైతం నోళ్లు తెరిచారు . దీనివెనుక మాస్టర్ మైండ్ ప్రశాంత్ కిశోర్ ది . ఏపీలో జగన్ ఫార్ములాని ఫాలో అవడానికి విజయ్ ను ఒప్పించాడు . ఒకవేళ పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి అయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించాడు . మిగిలిన విషయాలను ఐ ప్యాక్ నుంచి బయటికి వచ్చిన ప్రధాన వ్యక్తి నడిపించాడు . అందుకే విజయ్ పొలిటికల్ స్ట్రాటజీలు ఫర్మ్ గా కాంక్రీట్ గా ఉన్నాయి . నిర్ణయం తీసుకున్న తర్వాత అతడు ఎక్కడా వెనుకడుగు వేయలేదు . అన్నాడీఎంకే నుంచి బయటికి వచ్చిన సీనియర్ నేత ఆధ్వర్యంలో వార్ రూమ్ ఏర్పడింది . అక్కడ ప్రణాళికలు రచిస్తుంటే విజయ్ అమలుచేసుకుంటూ పోయాడు .
సినిమా కష్టాలు
అలా ముందునుంచీ పక్కాగా గ్రౌండ్ వర్క్ చేయడంతో నేడు తమిళనాట అతడు అధికార పీఠానికి చేరువగా వచ్చాడు . అలా అని విజయ్ రాజకీయ ప్రస్థానం అంతా పూలబాటలో నడవలేదు . సినిమా కష్టాలు చాలా పడ్డాడు . విజయ్ రాజకీయ ప్రస్థానానికి మొదటి అడ్డంకి అతడి ఇంట్లోనే పడింది . రాజకీయ పార్టీ విషయంలో తండ్రి కొడుకులు చెరో దారి అయ్యారు. పార్టీ మీద హక్కుల కోసం ఇద్దరి మధ్య వార్ నడిచింది . ఆఖరికి ఎలాగోలా తండ్రితో రాజీ కుదిరింది అనుకునే సమయానికి భార్య రూపంలో మరో అడ్డంకి వచ్చింది . అతడికి ఒక సినీ నటితో అక్రమ సంబంధం ఉందని , అందుకే విడాకులు కోరుకుంటూ కోర్టుకి ఎక్కింది . ఒకపక్క బిజీ రాజకీయాల్లో ఉంటూనే ఆమెతో కూడా సమస్య పరిష్కారం చేసుకున్నాడు . మరోపక్క కరూర్ తొక్కిసలాటలో పలువురు మృతి చెందటంతో కేసు అయ్యింది . మరోపక్క ఈడీ , సిబిఐ కేసులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది . ఇన్ని సినిమా కష్టాలు వచ్చినప్పటికీ అడుగు వెనక్కి వేయలేదు విజయ్ . అతడి కష్టానికి ఫలితం ఎన్నికల రూపంలో వచ్చింది . మొత్తం 234 స్థానాలకు గానూ 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్ కు చేరువగా ఉన్నాడు . ఎంజీఆర్ తర్వాత మరో చరిత్ర సృష్టించి అధికార పీఠం అధిష్టించబోతున్నాడు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ .
కేరళం
ఇక కేరళం ఫలితాలు కూడా చాలామంది ముందుగానే ఊహించినవి . అక్కడి కమ్యూనిస్టుల పాలనలో విసిగిపోయిన ప్రజలు ప్రత్యామ్నాయంగా ఏ పార్టీని ఎన్నుకుంటారో ఎవరైనా ఇట్టే చెప్పేయవచ్చు . చివరకు అదే జరిగింది కేరళం లో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారు.
