Home » బైకర్ మూవీ రివ్యూ

బైకర్ మూవీ రివ్యూ

Spread the love

నటుడు శర్వానంద్ ఇటు క్లాస్ ఆడియన్సును , అటు మాస్ ఆడియన్సును మెప్పించగలడు . సీరియస్ రోల్ లో ఎంత పర్ఫెక్ట్ గా ఒదిగిపోగలడో , కామెడీ టైమింగ్ లో అంత పర్ఫెక్ట్ గా నటించి మెప్పించగలడు . క్రికెట్ భాషలో చెప్పాలంటే శర్వానంద్ ఆల్ రౌండర్ లాంటివాడు . ఆ మధ్య నారీ నారీ నడుమ మురారితో చక్కటి కామెడీ పండించిన శర్వానంద్ ఇప్పుడు బైక్ రేసర్ గా మారి భావోద్వేగాలను పండించాడు .

చిత్ర నిర్మాణ సంస్థ ఈ మూవీ ప్రమోషన్ గట్టిగానే చేసింది . బైకర్ హిట్ కొడతాడని శర్వానంద్ కూడా నమ్మకం పెట్టుకున్నాడు . ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఆయన అదే మాటలు చెప్పుకుంటూ వచ్చాడు . దానికి తోడు ఈ మూవీలో చాలాకాలం తర్వాత సీనియర్ నటుడు రాజశేఖర్ ఫుల్ లెన్త్ లో ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపించడంతో ఇండస్ట్రీ లో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి .

ఏప్రిల్ లో థియేటర్లలో రిలీజ్ అయిన శర్వానంద్ బైకర్ మూవీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటిటి లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది .
మరి చిత్ర హీరో శర్వానంద్ నమ్మకం పెట్టుకున్నట్టు బైకర్ హిట్ కొట్టాడా ? లేదా ? అనేది ఇప్పుడు చూద్దాం .

కధేంటంటే ?

సునీల్ నారాయణ్ ( రాజశేఖర్ ) ఇండియాకు కూడా అంతర్జాతీయ మోటోక్రాస్ రేసింగులలో గుర్తింపు రావాలని తపన పడుతుంటాడు . క్రికెట్ , హాకీ , వాలీబాల్ వంటి క్రీడలకు గుర్తింపు వచ్చినట్టే మోటోక్రాస్ రేసింగులకు కూడా గుర్తింపు రావాలని కోరుకుంటాడు . స్వతహాగా సునీల్ నారాయణ్ కూడా బైక్ రేసర్ . గతంలో అతడు పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తాడు . అయితే తన కొడుకును అంతర్జాతీయ మోటోక్రాస్ ఈవెంట్లో ఛాంపియన్ ను చేయాలని భావించి తానే గురువు అయి కోచింగ్ ఇస్తూ ఉంటాడు . సునీల్ నారాయణ్ కొడుకే కధానాయకుడు వికాస్ నారాయణ్ అలియాస్ విక్కీ .

ఇదిలా ఉండగా సినిమా ప్రారంభం 2003 లో ప్రారంభం అవుతుంది . విక్కీ తన భార్య అనన్య ( మాళవిక నాయర్ ) కొడుకు ఇషాన్ లతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు . కొడుక్కి కూడా చదువులకంటే క్రీడల మీదనే ఇంట్రెస్ట్ ఎక్కువ . దాంతో విక్కీ కూడా అతడి చదువు గురించి పెద్దగా పట్టించుకోకుండా ప్రోత్సహిస్తుంటాడు . ఒకసారి తోటి స్కూల్ పిల్లవాడ్ని ఇషాన్ కొట్టాడని తెలియడంతో ఎందుకు కొట్టావని ప్రశ్నిస్తే , వాడు నా డాడీని తిట్టాడు . డాడీని ఎవరైనా తిడితే నేను ఊరుకోను ..కొడతా ‘ అని చెప్తాడు .
తన కొడుకు మాటలతో విక్కీ తన తండ్రి సునీల్ నారాయణ్ పట్ల తాను ప్రవర్తించిన తీరును గుర్తు తెచ్చుకుని బాధపడతాడు .

మళ్ళీ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే విక్కీ తన తండ్రి సునీల్ నారాయణ్ కోచింగ్ లో మోటోక్రాస్ ఈవెంట్లలో పాల్గొంటూ ఉంటాడు . కొడుకుని ఇంటర్నేషనల్ ఛాంపియన్ చేయాలని అనుకుని ఐఎన్జి సంస్థ అధిపతి ఇంద్రనీల్ తో ( అతుల్ కులకర్ణి ) స్పాన్సర్షిప్ ఒప్పందం కుదుర్చుకుంటాడు .

ఈ పరిస్థితుల్లో ఇకపై తాను బైక్ రేసింగులలో పాల్గొననని తండ్రికి చెప్పి వెళ్ళిపోతాడు విక్కీ. దాంతో సునీల్ నారాయణ్ మీద మీడియాలో బాడ్ ప్రాపగాండా చేయిస్తాడు ఇంద్రనీల్ .

ఈ పరిస్థితుల్లో సునీల్ నారాయణ్ ఏం చేస్తాడు ?
విక్కీ బైక్ రేసింగుల నుంచి అర్దాంతరంగా ఎందుకు తప్పుకుంటాడు ?
చివరికి సునీల్ నారాయణ్ కోరుకున్న లక్ష్యాన్ని విక్కీ సాధిస్తాడా ? లేదా ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది .

ఎలా ఉంది ?

కథ విన్నారుగా ? క్రీడా నేపధ్యం ఉన్న స్టోరీ . నిజానికి గతంలో క్రీడా నేపధ్యం ఉన్న మూవీలు చాలా వచ్చాయి . క్రికెట్ , హాకీ , వాలీబాల్ ,కబడ్డీ ఇలా చాలా ఆటల్ని సినిమాల్లో వాడేశారు . మళ్ళీ అదే పాట ఎత్తుకుంటే పాత పల్లవే అవుతుంది . అందుచేత దర్శకుడు ఇందులో బైక్ రేసింగ్ ప్రధాన ఇతివృతంగా తీసుకున్నట్టు ఉన్నాడు . ఎందుకంటే క్రికెట్ నేపధ్యం తీసుకుంటే చప్పున మనకు నానీ నటించిన జెర్సీ గుర్తుకొస్తుంది . అందుకే అటువంటి పాత ఆటల జోలికి పోకుండా దర్శకుడు మోటోక్రాస్ రేసింగులను ఎంచుకున్నాడు . ఆ కధాంశమే ఈ సినిమాకి బలం . మన ఇండియాలో తక్కువ కానీ విదేశాల్లో బైక్ రేసింగులకు క్రేజీ బాగా ఉంది . ఇక్కడా కొన్ని రాష్ట్రాల్లో బైక్ రేసింగ్ ఇవెంతలకు యూత్ బాగా కనెక్ట్ అవుతారు . అందుకే దర్శకుడు బైక్ రేసింగ్ ఈవెంట్లకు కోయంబత్తూర్ ను ఎంచుకున్నట్టు ఉన్నాడు .

అయితే దర్శకుడు బైక్ రేసింగ్ ఇతివృత్తాన్ని ఎంచుకోవడం సాహసమే అని చెప్పాలి . ఇటువంటి ఇతివృత్తానికి అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అవుతారా ? లేదా ? అన్నది అనుమానమే ? ఈ అనుమానమే దర్శకుడికి కూడా వచ్చినట్టు ఉంది . ఉట్టి బైక్ రేసింగులు చూపిస్తే వీడియో గేములు చూస్తున్నట్టుగా ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే అవకాశాలు ఉండొచ్చని గమనించి ముందు జాగ్రత్తగా ఎమోషనల్ వంటకాన్ని కూడా మెనూలో యాడ్ చేసారు . ఇదీ కరెక్ట్ ఆలోచనే కానీ మెనూలో ఎమోషనల్ డోస్ తగ్గింది . బైక్ రేసింగ్ స్పీడ్ లో పడి భావోద్వేగాల సంఘర్షణ పాళ్ళు పట్టించుకోలేదు . ఆ దినుసులు కొద్దిగా దట్టంగా దట్టించి ఉంటే కథ వేరేలా ఉండేది .

ఫస్టాఫ్ లో పెట్టిన కొన్ని సాగతీత సన్నివేశాలు సినిమాకి మైనస్ అవుతాయి . ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది . మధ్య మధ్యలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కి , వర్తమానానికి మధ్య సరైన ఎడిటింగ్ లేకపోవడంతో ప్రేక్షకులు కొంత కన్ఫ్యూజ్ అవుతారు . గోడల మీద సర్టిఫికెట్లు , పేపర్ కటింగులు కాకుండా రాజశేఖర్ ఫ్లాష్ బ్యాక్ కొంతైనా చూపించి ఉంటే బాగుండేది . ఎంతసేపూ కొడుకు చేత హార్డ్ వర్క్ లు చేయిస్తాడు కానీ కోచ్ పాత్రలో సునీల్ నారాయణ్ ఇంట్రడక్షన్ కూడా చూపించి ఉంటే బాగుండేది .

ఓవరాల్ గా సినిమాకి హైలెట్ బైక్ రేసింగులే . కొంత గ్రాఫిక్స్ వాడినా మనకు ఎక్కడా కృతకంగా కనిపించదు . చాలా సహజంగా రేసింగ్ రోడ్ వేసినట్టు అనిపిస్తుంది . క్లైమాక్సులో చూపించిన మోటోక్రాస్ ఈవెంట్ కూడా వీడియో గేముల మాదిరి కాకుండా చాలా నాచురల్ గా పిక్చరైజ్ చేసారు . చూస్తుంటే నిజంగా బైక్ రేసింగులు జరుగుతున్నాయా అనుకునేంతగా కెమెరా పనితనం కనిపించింది .

ఇక ఈ రేసింగుల వరకు ఓకే కానీ కధలో బోలెడంత స్కోప్ ఉన్న ఎమోషనల్ పార్ట్ మిస్ అయినట్టు అనిపిస్తుంది . తండ్రి , కొడుకుల మధ్య చూపించాల్సిన ఎమోషన్ల కన్నా ఇద్దరూ ఏదో మెకానికల్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు చూపించారు . తండ్రి తక్కువ మాట్లాడుతాడు . కొడుకు ఎక్కువగా ఆవేశపడతాడు . క్లైమాక్సులో మినహా ఇద్దరి మధ్య సరైన కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ కాలేదు . కాకపోతే రాజశేఖర్ మనవడితో ఆడుకునే సన్నివేశాలు కొద్దిగా భావోద్వేగాలకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి అనుకునేంతలోనే మళ్ళీ బైక్ రేస్ లోకి వెళ్లిపోయారు .

ఎవరెలా చేసారు ?

బైక్ రేసర్ పాత్ర కోసం శర్వానంద్ పడిన కష్టం సినిమాలో కనిపిస్తుంది . అటు ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేసే భర్త ,తండ్రి పాత్రలలో ఇమిడిపోతూనే , ఇటు తండ్రి ఆశయం కోసం కష్టపడే బైక్ రేసర్ పాత్రలో మెప్పించాడు .

ఇక సీనియర్ నటుడు రాజశేఖర్ గురించి చెప్పుకోవాలి . ఆయనకు ఇంతకుముందు కూడా ఇలాంటి తండ్రి పాత్రలు వచ్చినా చేయడానికి ఇష్టపడలేదు . కానీ మొదటిసారిగా బైకర్ మూవీలో శర్వానంద్ తండ్రిగా ఫుల్ లెన్త్ పవర్ ఫుల్ పాత్రలో నటించి మెప్పించాడు . ఈ సినిమాతో రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ సరికొత్త మలుపు తీసుకుంటుంది అనడంలో సందేహం లేదు . కోచ్ పాత్రలో పర్ఫెక్ట్ గా ఇమిడిపోయాడు . ఒక కోచ్ కు ఉండవలసిన గంభీరత , బాడీ లాంగ్వేజ్ , హావభావాలు ప్రదర్శించి పర్ఫెక్ట్ గా ,చాలా బాలన్సుడ్ గా నటించాడు .

ఇక మాళవిక నాయర్ హీరోయిన్ పాత్ర వరకే పరిమితం అయినట్టు ఉంది . కొడుకు పుట్టిన తర్వాత ఆమె పాత్ర చూస్తుంటే జెర్సీ లో నాని భార్య పాత్ర గుర్తుకొస్తుంది . అయినా పాత్ర పరిధి మేరకు ఆమె నటన బాగానే ఉంది .

అతుల్ కులకర్ణి యధాప్రకారం తనదైన స్టైల్ లో నటించి మెప్పించాడు . ఇక బ్రహ్మాజీ విషయానికి వస్తే దర్శకుడు అతడ్ని పూర్తిగా వాడుకోలేదు అనిపిస్తుంది . అటు కామెడీ కాక , ఇటు సీరియస్ కాక మధ్యస్థ పాత్రలో నటించాడు . అయినా బ్రహ్మాజీ నటనలో వంక పెట్టాల్సిన పని లేదు . బాగానే చేసాడు .

సాంకేతికత

సినిమా మొత్తం బైక్ రేసింగులతో నడుస్తుంది కాబట్టి కెమెరా పనితనం ప్రముఖ పాత్ర పోషిస్తుంది . యువరాజ్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది .
దాని తర్వాత జిబ్రాన్ అందించిన సంగీతం బాగుంది .
నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి .
దర్శకుడు కథలో భాగంగా మోటోక్రాస్ రేస్ ను నడిపించిన విధానం బాగుంది .

విశ్లేషణ

క్రీడా నేపథ్యంతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి . దర్శకుడు ఏ క్రికెట్ ఆటనో తీసుకుంటే మోనాటని వచ్చేది . అందుకే బైక్ రేసింగుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . మూవీలో మోటోక్రాస్ రేస్ ఒక్కటే కొత్తది . బైక్ రేసింగులలో శర్వానంద్ చూపించిన పెర్ఫార్మన్స్ , కోచ్ రూపంలో డాక్టర్ రాజశేఖర్ చూపించిన పెర్ఫార్మన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి . ఫస్టాఫ్ లో అన్వర్ తో నడిచే బైక్ రేసింగులు రీళ్లు ఖర్చుచేయడానికి పనికొస్తాయి అనిపిస్తుంది . అక్కడ కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది . బైక్ రేసింగ్ సన్నివేశాల్లో మరీ వీడియో గేములు ఆడుతున్నట్టు చూపించకుండా నాచురాలిటీ వచ్చే విధంగా షూట్ చేయడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది . భావోద్వేగాల సంఘర్షణకు కధలో మరింత స్కోప్ ఇవ్వాల్సింది . ఓవరాల్ గా సినిమా అక్కడక్కడా కొద్దిగా బోర్ అనిపించినా , కొన్ని సన్నివేశాల్లో వాటిని కవర్ చేసారు . ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటిటి లో స్ట్రీమింగ్ కు వచ్చింది కాబట్టి వన్ టైం వాచ్ మూవీగా చూడొచ్చు .

నటీనటులు : శర్వానంద్ , డాక్టర్ రాజశేఖర్ , మాళవిక నాయర్ , అతుల్ కులకర్ణి , బ్రహ్మాజీ తదితరులు
సంగీతం : జిబ్రాన్
సినిమాటోగ్రఫీ : యువరాజ్
దర్శకత్వం : అభిలాష్ రెడ్డి
విడుదల : నెట్ ఫ్లిక్స్ ఓటిటి
రేటింగ్ : 2 .75 /5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!