మలయాళం సస్పెన్సు థ్రిల్లర్ సినిమాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే కట్టిపడేసే స్క్రీన్ ప్లే . సినిమా ప్రారంభం నుంచి చివరివరకు అదే టెంపో మెయింటైన్ చేస్తారు . మధ్యలో హీరో హీరోయిన్ల మధ్య నాలుగు పాటలు , ఒక హీరో వందమంది రౌడీలు గాల్లో ఎగిరి కొట్టుకోవడాలు , హీరో సైడ్ జబర్దస్త్ కామెడీ బ్యాచ్ తో వెకిలి కామెడీ చేయించటాలు పెట్టి సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కాన్సెప్ట్ చెడగొట్టరు . తాము తీసుకున్న జానర్ కు పూర్తిగా కట్టుబడి ఉంటారు . పొగడటం కాదు కానీ టాలెంట్ ఏ భాషలో ఉన్నా ఒప్పుకోవాలి .
అసలు మూవీ టైటిల్ ela veezha poonchira తెలుగులో పలకడానికి కూడా కొంచం ఇబ్బందిగా ఉంది . కానీ మలయాళంలో పెట్టిన ఆ టైటిల్ కు ఆకులు రాలని ప్రాంతం అని తెలుగులో అర్ధం ఉంది . మూవీ డిస్క్రిప్షన్ చూస్తే సస్పెన్స్ డ్రామా అన్నారు . మరి టైటిల్ చూస్తే సాదాగా ఉంది . అయినా సరే మలయాళంలోనే కాదు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ పొందిన సౌబిన్ సాహిర్ ఇందులో కధానాయకుడు అనగానే ఎవరికైనా మూవీ చూడాలని క్యూరియాసిటీ కలుగుతుంది . ఎందుకంటే అతడి నటన అంత సహజంగా ఉంటుంది . తలకు విగ్గులు ,మేకప్పులు , కాస్ట్యూమ్ హంగామాలు ఉండవు . సింపుల్ గా ఉంటాడు . రోడ్డుమీద మనకు ఎదురుపడే పరిచయస్తుడిలా ఉంటాడు .
నిజానికి ఈ మూవీ 2022 లోనే మలయాళంలో థియేటరిక్ రిలీజ్ అయి మంచి వసూళ్లు సాధించింది . అదే మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో స్ట్రీమింగ్ కు వచ్చి మంచి రేటింగులను సాధించింది .
ఇప్పుడు మూవీ ఎలా ఉందో చూద్దాం
కధేంటంటే ?
సినిమా ప్రారంభమే చెట్ల తుప్పల్లో పడిఉన్న మహిళ అరిపాదం అవయవాన్ని ఓ కుక్క పసిగట్టి తినడానికి ప్రయత్నించడంతో ప్రారంభం అవుతుంది . సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి దర్శకుడు ఓపెనింగ్ లోనే గట్టి ప్రయత్నం చేసాడు .
మధు ( సౌబిన్ సాహిర్ ) అనే వ్యక్తి కేరళలోని కొట్టాయం నుంచి పూంచిరా అనే హిల్ స్టేషన్ కు బస్ లో బయలుదేరటంతో అసలు కథ ప్రారంభం అవుతుంది . భూమికి షుమారు మూడువేల రెండు వందల అడుగులో ఉన్న హిల్ స్టేషన్ కు చేరుకోవాలంటే బస్ నుంచి కొంతదూరం జీపులో వెళ్లాల్సి ఉంటుంది . పూంచిరా హిల్ స్టేషన్ అంతటి రిమోట్ ఏరియా అన్నమాట . అక్కడికి వెళ్ళినతర్వాత కానీ అతడు పోలీస్ కానిస్టేబుల్ అనే విషయం తెలియదు . కొండపైన పిడుగులు పడి పర్యాటకులు చనిపోతుండటంతో ముందు జాగ్రత్తగా అక్కడికి విజిటర్స్ ఎవరూ రాకుండా పోలీసులు వైర్ లెస్ కమాండ్ సెంటర్ ఏర్పాటు చేస్తారు . మధుకి అక్కడ డ్యూటీ పడుతుంది . ఇతడికి తోడుగా సుధీ అనే పోలీస్ కానిస్టేబుల్ అక్కడ డ్యూటీ చేయడానికి వస్తాడు .
ఇద్దరూ కలిసి కొండపైకి విజిటర్స్ ఎవరూ రాకుండా ఆ ప్రాంతంలో వాచ్ చేస్తుంటారు . అధికారులు ఇన్స్పెక్షన్ కు వచ్చినప్పుడు మినహా మిగిలిన సమయాల్లో ఇద్దరూ యూనిఫార్మ్ వేసుకోకుండా లుంగీలు కట్టుకుని తిరుగుతూ ఉంటారు . ఖాళీ సమయాల్లో పేకాట ఆడటం , మందు తాగడంతో టైం పాస్ చేస్తుంటారు .
ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒక మహిళ దేహాన్ని ముక్కలు ముక్కలు చేసి కొండకింద చాలాచోట్ల పడేశాడని పోలీసులకు సమాచారం వచ్చి హంతకుడ్ని పట్టుకోవడానికి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు .
ఒకపక్క పోలీసుల దర్యాప్తు జరుగుతుండగానే వీళ్ళుంటున్న హిల్ స్టేషన్లో కూడా ఒక మహిళ చేయి పాతిపెట్టి ఉండటం గమనిస్తాడు సుధీ . వెంటనే అతడికి మధు మీద అనుమానం వస్తుంది .
మహిళను హత్య చేసి ముక్కలు చేసిన హంతకుడికి కానిస్టేబుల్ మధుకి ఏంటి సంబంధం ?
మరో పోలీస్ సుధికి మధు మీద ఎందుకు అనుమానం వస్తుంది ?
అసలు హత్య చేయబడిన మహిళ ఎవరు ? అనేవి మిగిలిన కధనంలో తెలుస్తుంది .
ఎలా ఉంది ?
జానర్ లో చెప్పినట్టుగా సినిమా ప్రారంభ సన్నివేశం చూస్తే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది . అంతలోనే మధు ( సౌబిన్ సాహిర్ ) బస్ లోను , జీపులోనూ పూంచిరా హిల్ స్టేషన్ కు బయలుదేరిన సన్నివేశాలు చూస్తుంటే కేరళ టూరిస్ట్ ప్లేసులు చూడటానికి వచ్చిన టూరిస్టుల మాదిరి మనకు ఫీలింగ్ వస్తుంది . ఫారెస్ట్ టచ్ చేయకుండా అసలు మలయాళం సినిమాలు తీయరేమో ? చుట్టూ పరచుకున్న పచ్చని అందాలు ఒకవైపు , చేతులను తాకుతూ వెళ్లే మేఘాలు మరోవైపు మనల్ని చూపులు తిప్పుకోనీయవు . ప్రకృతి ప్రసాదించిన సహజ అందాలకు తోడు కెమెరా పనితనం మనల్ని మరింత ఆహ్లదకరం వాతావరణంలోకి విహరించేలా చేస్తాయి .
అసలు ఫస్టాఫ్ చూస్తే చాలామందికి ఒక అనుమానం వస్తుంది . సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అన్నారు కదా? మరి సినిమా చూస్తుంటే ట్రావెలాగ్ వీడియోల మాదిరి కేరళ అందాలను చూపిస్తున్నాడు ఏంటా ? అనుకుంటాం . కానీ అదంతా ఫస్టాఫ్ వరకే . సెకండాఫ్ కి వచ్చేసరికి మనకి కావాల్సిన సస్పెన్స్ డ్రామా బోలెడు దొరుకుతుంది . కొండపైన ఈ ఇద్దరు పోలీసులు చేసే డ్యూటీకి , కొండకింద జరిగిన మహిళ హత్యకు ఏంటి సంబంధం అనుకుంటాం . ఆ ట్రాక్ వేరు .. వీళ్లిద్దరి ట్రాక్ వేరు అనుకుంటాం . కానీ దర్శకుడు తెలివిగా మహిళ హత్యకు తెలివిగా కనెక్షన్ కలిపాడు . అదే ఈ కధలో టర్నింగ్ పాయింట్ . సెకండాఫ్ లోనే దర్శకుడు చాలా గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే నడిపాడు .
సుధీ అనే పోలీసుకు మధు మీద అనుమానం రావడం , ఇద్దరి మధ్య దొంగా పోలీస్ ఆట మొదలవడం , తన అనుమానాన్ని ఎలాగైనా పై అధికారులకు చేరవేయాలని సుధీ ప్రయత్నాలు చేయడం , దాన్ని పసిగట్టి అతడి ఎత్తులను మధు చిత్తు చేయడం వంటి మైండ్ గేమ్ సన్నివేశాలు కధనం పట్ల క్యూరియాసిటీని మరింత పెంచుతాయి . మరోపక్క మహిళ హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో ఆమె ఎవరో తెలియడంతో కధలో కొత్త ట్విస్ట్ మొదలౌతుంది . అన్నిటికన్నా ప్రీ క్లైమాక్స్ లో సుధీ చేసిన పనిని మధు బయటపెట్టడం ద్వారా దర్శకుడు అసలైన ట్విస్ట్ రివీల్ చేస్తాడు .
క్లైమాక్స్ లో పోలీస్ ఇన్స్పెక్టర్ అసలు హంతకుడ్ని కావాలనే వదిలేస్తాడు . అతడు ఎందుకు వదిలేస్తాడో తెలియాలంటే అంతకుముందు ఇన్స్పెక్టర్ జీప్ డ్రైవర్ మధుతో చెప్పిన మాటలు తెలియాలి . అది ఇక్కడే చెపితే సస్పెన్స్ పోతుంది . అదేంటో ఓటిటి లో చూస్తేనే థ్రిల్ ఫీల్ అవుతారు .
ఎవరెలా చేసారు ?
ఈ మూవీలో సౌబిన్ సాహిర్ మినహా మరెవరినీ చెప్పుకోలేము . అంతగా సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకుని నడిపించాడు . చాలా సెటిల్డ్ గా , చాలా బాలన్సుడ్ గా , చాలా పర్ఫెక్ట్ గా నటించాడు . అతడు హిల్ స్టేషన్ పైకి చేరుకొని యూనిఫార్మ్ వేసుకునేవరకు పోలీస్ అని ఎవరూ కనిపెట్టలేరు . అంత క్యాజువల్ గా ఉంటాడు . మళ్ళీ యూనిఫార్మ్ వేసుకుంటే కేరళ పోలీస్ కళ్ళముందు ఉన్నట్టు ఉంటుంది . సినిమాలో తక్కువగా మాట్లాడుతాడు . కానీ చాలా సన్నివేశాల్లో కళ్ళతోనే భావాలు పలికించాడు . ముఖ్యంగా పై అధికారులు వస్తున్నారని తెలిసినప్పుడు అప్పటికప్పుడు గదంతా ఊడ్చి షేవింగ్ కూడా చేసుకుని యూనిఫార్మ్ వేసుకుని రెడీ అయ్యే సన్నివేశంలో చాలా నాచురల్ గా నటించాడు . సినిమా ప్రారంభంలో ఎలా అయితే షర్ట్ , లుంగీతో ఎంటర్ అవుతాడో , క్లైమాక్సులో కూడా అదే గెటప్ తో వెళ్లిపోవడం బాగుంది . సుధీ పాత్ర చేసిన సుధీ కొప్ప నటన కూడా బాగానే ఉంది .
సాంకేతికత
ఈ సినిమాలో సాంకేతికతకు దర్శకుడు పెద్ద పీట వేసాడు . 2022 లోనే మూవీని 4K HDR వెర్షన్లో డెవలప్ చేసాడు .
మనీష్ మాధవన్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి హైలెట్ . ఫస్టాఫ్ చూసినవాళ్ళకి ఆ ఫోటోగ్రఫీ టాలెంట్ అర్ధం అవుతుంది .
అనిల్ జాన్షన్ అందించిన మ్యూజిక్ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది .
రచయిత అందించిన పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ను మరింత పర్ఫెక్ట్ గా స్క్రీన్ ప్లే అందించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు .
విశ్లేషణ
మీరు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడతారా ? అయితే ఈ మూవీ చూసేయండి ..మీకు నచ్చుతుంది . మీరు ప్రకృతి ప్రేమికులా ? అయితే ఈ సినిమా చూసేయండి .. ఫస్టాఫ్ ఖచ్చితంగా నచ్చుతుంది . మొదట్నుంచి క్లైమాక్స్ వరకు టెంపో సడలకుండా సినిమాని నడిపించిన తీరు బాగుంది . నాలుగు ఫైట్లు , ఆరు పాటలు , మధ్యలో వెకిలి కామెడీ వంటి రొటీన్ రొడ్డకొట్టుడు ఫార్ములా జోలికి పోకుండా ఈ మూవీని మంచి గ్రిప్పింగ్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా మలిచాడు . ఫస్టాఫ్ మాములుగా నడిచినా సెకండాఫ్ మాత్రం క్రైమ్ కధనంతో ప్రేక్షకులని కూడా దర్శకుడు పరుగులు పెట్టించాడు . సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయినా ఎక్కడా మోతాదును మించిన వయొలెన్స్ జోలికి కానీ , అసభ్య సన్నివేశాల జోలికి కానీ పోలేదు కాబట్టి ఫ్యామిలీ తో కలిసి సినిమా చూడటానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు .కాకపోతే మూవీ మలయాళం వెర్షన్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాలి .
నటీనటులు : సౌబిన్ సాహిర్ , సుధీ కొప్ప తదితరులు
సంగీతం : అనిల్ జాన్షన్
సినిమాటోగ్రఫీ : మనీష్ మాధవన్
దర్శకత్వం : సాహి కబీర్
విడుదల : అమెజాన్ ప్రైమ్
రేటింగ్ : 3 / 5
