Home » ఆ నలుగురు కుర్రాళ్ళు అల్లరి చేస్తారు ..నవ్విస్తారు ..ఏడిపిస్తారు – వాలా 2 (Vaaza2 movie) మూవీ రివ్యూ

ఆ నలుగురు కుర్రాళ్ళు అల్లరి చేస్తారు ..నవ్విస్తారు ..ఏడిపిస్తారు – వాలా 2 (Vaaza2 movie) మూవీ రివ్యూ

Spread the love

కొన్ని కొన్ని సినిమాలు సింపుల్ బడ్జెట్ తో తీసినా వసూళ్లు మాత్రం కోట్లలో సాధిస్తుంది . ఇలా అతి తక్కువ బడ్జెట్ తో తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలు అన్ని భాషల్లో ఉన్నాయి . వీటికి పెద్ద కథాబలం అక్కర్లేదు . పెద్దపెద్ద స్టార్లు కూడా అక్కర్లేదు . జస్ట్ అద్దంలో చూసుకుంటే మన ప్రతిబింబం కనిపించినట్టు సినిమా చూస్తుంటే ఎక్కడో మనం కనిపిస్తే చాలు కనెక్ట్ అయిపోతాం . నిజ జీవితంలో మాక్కూడా ఇలాగే జరిగేది కదా అన్న ఫీలింగ్ వస్తే చాలు సినిమా ఆడియన్స్ రీచ్ సాధించినట్టే .

వాలా కూడా అటువంటి సినిమానే . 2024 లో రిలీజ్ అయిన ఈ సినిమా రెండొందల కోట్ల కలెక్షన్లు సాధించింది . రెండొందల కోట్లు వచ్చాయి కాబట్టి ఇదేదో భారీ బడ్జెట్ సినిమా అయ్యుంటుంది అనుకుంటే తప్పులో కాలేసినట్టే . అలా అని ఏ మమ్ముట్టినో , ఏ మోహన్ లాలో ఇందులో హీరోలు అనుకుంటే మళ్ళీ తప్పులో కాలేసినట్టే . సినిమాకి ఎటువంటి స్టార్ డమ్ లేదు . భారీ బడ్జెట్ కూడా లేదు . అయినా ఎందుకు హిట్ కొట్టింది ? ఈ సినిమాలో దాదాపు ప్రతిఒక్కరు తమ స్టూడెంట్ లైఫ్ ను చూసుకుంటారు . ఈ సినిమాలో ప్రతి ఒక్క పేరెంట్స్ చిన్నప్పుడు తమ పిల్లలు చేసిన అల్లరిని చూసుకుంటారు . అందుకే ఈ సినిమా ట్యాగ్ లైన్ బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్ అని తగిలించారు . అంటే ఏంటన్నమాట ? నిజ జీవితాల్లో కనెక్ట్ అయ్యే కథనే రచయిత రాసుకున్నాడు . అందుకే ఈ సినిమాని చాలామంది భాషలకు అతీతంగా ఓన్ చేసుకుని మరీ చూసారు .

ఇప్పుడు దానికి సీక్వెల్ గా తీసిన వాలా 2 తెలుగు డబ్బింగ్ వెర్షన్లో ఓటిటి లకు కూడా వచ్చేసింది. మొదటి భాగానికి కొనసాగింపు అన్నాడు కానీ అందులో నటించిన పాత్రధారులు వేరు , ఇందులో వేరు . కాకపోతే కథ ఇతివృత్తం మాత్రం దాదాపు ఒకటే అంశాన్ని తీసుకున్నాడు . చిన్నపిల్లలు , చదువులు , అల్లరి చేయడం , చదువులు తప్పడం , పేరెంట్స్ కు తలనొప్పులు తెప్పించడం అనే పాయింట్ల ఆధారంగానే రెండు భాగాలు ఉంటాయి . కాకపోతే రెండిట్లో కామన్ పాయింట్ ఏంటంటే ఫస్టాఫ్ లో నలుగురు కుర్రాళ్ళు చదువుల్లో వెనకబడి అల్లరిఅల్లరి చేసి నవ్విస్తూ , చివరికి బరువైన సంఘర్షణతో మనల్ని ఎమోషన్ లోకి తీసుకెళ్తారు .

ఇప్పుడు వాలా 2 ఎలా ఉందో చూద్దాం

కధేంటంటే ?

ప్రత్యేకంగా ఇందులో కధేంటి అంటే చెప్పడం కష్టం . మీరు చిన్నప్పుడు స్కూలుకు వెళ్ళారా ? అక్కడ అల్లరి చేసారా ? పోనీ మీ స్నేహితులు అల్లరి చేసారా ? స్కూల్ కి బంక్ కొట్టి పొలం గట్ల వెంబడి , కొత్త సినిమాలు వెంబడి పరిగెట్టారా ? క్లాసులో అల్లరి చేసి టీచర్ చేతిలో బెత్తం దెబ్బలు తిన్నారా ? కాలేజీలో అమ్మాయిలకు సైట్ కొట్టారా ? సరిగా చదువుకోవడం లేదని ఇంట్లో పేరెంట్స్ మీకు క్లాస్ పీకారా ? చివరకు ఆ అల్లరినుంచి రియలైజ్ అయి జీవితంలో సెటిల్ అయిపోయి ఇప్పుడు గుర్తుతెచ్చుకుని నవ్వుకుంటున్నారా ? అయితే ఇది మీ కధే .. అందరి కధే .. వాలా కథ ఇదే .

అలన్ , అజీన్ , హషిర్ , వినాయక్ అనే నలుగురు కుర్రాళ్ళ చిన్ననాటి బ్యాక్ డ్రాప్ తో కథ మొదలౌతుంది . వీరిలో ఇద్దరు తమకు తోబుట్టువులు ఉంటే హాయిగా ఆడుతూ పాడుతూ ఇంట్లోనే అల్లరి చేయొచ్చని అనుకుంటారు . కానీ తోబుట్టువులు వచ్చిన తర్వాత ఆడుకోవడం సంగతి అటుంచి పొద్దస్తమానం తన్నుకుంటూ ఉండటంతో సర్దిచెప్పలేక తల్లితండ్రులు తలలు పట్టుకుంటారు . అలా అని ఈ నలుగురు కేవలం ఇంట్లో చేసే అల్లరితోనే సరిపెట్టుకోలేదు . స్కూల్లో కూడా అదే తంతు . వీళ్లు అల్లరిచిల్లరగా తిరగడం , ప్రేమలో పడటాలు , తోటి విద్యార్థులతో గొడవలు పడటం లాంటి పనులు చేయడంతో స్కూల్లోనూ ,కాలేజీలోనూ ప్రిన్సిపాల్ తో పేరెంట్స్ మాటలు పడుతూ ఉంటారు . పిల్లల పెంపకం గురించి పలుమార్లు ప్రిన్సిపాల్ తల్లితండ్రులను హెచ్చరిస్తుంది . తల్లితండ్రులు కూడా తమ పిల్లల్ని నయానబయానా బతిమాలినా ,కొట్టినా దారిలోకి రారు . అలానే అల్లరి చేస్తుంటారు .

ఒకసారి ఇలాగే ఈ నలుగురు అల్లరి చేస్తూ ప్రిన్సిపాల్ కు దొరికిపోవడంతో ఆవిడ పేరెంట్స్ ను పిలిపించి టీసీలు తీసుకుని వెళ్లిపొమ్మంటుంది . ఈ దశలో పిల్లల భవిష్యత్తు పాడైపోకూడదని భావించి పోలీస్ ఇన్స్పెక్టర్ జోక్యం చేసుకుని ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వారిని మందలించి వదిలేస్తాడు. విషయం పోలీసుల దాకా వెళ్లడం , తల్లితండ్రులు తలదించుకోవడం వంటి పరిణామాలతో ఆ నలుగురు కుర్రాళ్ళు ఈసారి ఎలాగైనా పరీక్షలు పాసయ్యి విదేశాలకు వెళ్లాలని అనుకుంటారు .

మరి అల్లరిచిల్లరగా తిరిగి తల్లితండ్రులను బాధ పెట్టిన ఆ నలుగురిలో మార్పు వచ్చిందా ?
పరీక్షలు పాసయ్యి లుక్ వెళ్లి మంచి ఉద్యోగాలు సంపాదించుకుని జీవితంలో సెటిల్ అవ్వాలన్న కుర్రాళ్ళ లక్ష్యం నెరవేరిందా ?
పిల్లల భవిష్యత్తు మీద గంపెడు అసలు పెట్టుకున్న పేరెంట్స్ వారి లక్ష్యానికి ఏ విధంగా ఉపయోగపడతారు ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది .

ఎలా ఉంది ?

కథ చూసారుగా .. ఇందులో ఎక్కడా కృత్రిమ కలర్స్ , ఘాటెక్కించే మసాలాలు వాడి వండి వార్చిన బిర్యానీ ఎక్కడా ఉండదు . చాలా సహజంగా ఇంట్లో తయారుచేసుకున్న ఘుమఘుమలాడే బిర్యానీ మాదిరి ఉంటుంది . మనం రోజూ సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ ఉంటాం కదా .. కొంతమంది కుర్రాళ్ళు కానీ , అమ్మాయిలు కానీ అద్భుతమైన రీల్స్ చేస్తారు . నిమిషం , రెండు నిమిషాల్లో తాము చెప్పదల్చుకున్న భావాన్ని చక్కగా ఆవిష్కరిస్తారు . వెతకాలే కానీ సోషల్ మీడియాలో అలాంటి టాలెంట్ బోలెడు దొరుకుతుంది అలా దొరికిన టాలెంటెడ్ ఆర్టిస్టులే వాలా లో నటులు . సినిమాలో వీళ్ళ పేర్లు అవే.. నిజ జీవితంలో కూడా అవే . వీళ్లకు మేకప్పులు లేవు , భారీ కాస్ట్యూమ్స్ లేవు . సింపుల్ అన్నమాట ..చూడగానే మన స్కూల్ స్నేహితులో , కాలేజీ స్నేహితులో గుర్తుకొస్తారు .

కాకపోతే ఈ సినిమాలో ఫస్టాఫ్ అంతా దర్శకుడు కామెడీ కోసం కేటాయించుకున్నాడు . దాంతో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి . అవసరం లేకపోయినా పదేపదే కిందపడి దొర్లుకుంటూ కొట్టుకోవడం ఎబ్బెట్టుగా అనిపిస్తాయి . పిల్లల అల్లరి గురించి పేరెంట్స్ కి ప్రిన్సిపాల్ చాలాసార్లు చెప్పినా వాళ్ళు నిస్సహాయంగా ఉండిపోవడం కొంత అసహజంగా ఉంది . కాలేజీ వాష్ రూంలో గోడల మీద రాతలు , సినిమా థియేటర్లో కుర్రాళ్ళు చేసే అల్లరి , అమ్మాయిలకు లైన్ వేయడం వంటి సన్నివేశాలు సహజంగా ఉండి కామెడీని కూడా పండించింది .

ఇక స్కూళ్ల నిర్వహణలో యాజమాన్యాల లోపాలు , పిల్లల పెంపకంలో తల్లితండ్రుల అలసత్వం వంటి అంశాలను తీసుకుంటూ ఇన్స్పెక్టర్ ద్వారా మెసేజ్ ఇప్పించిన విధానం బాగుంది .

ఫస్టాఫ్ అంతా ఆ నలుగురు కుర్రాళ్ళ అల్లరితో కామెడీగా నడిచిపోయినా ,సెకండాఫ్ వచ్చేసరికి అసలు కథలోకి వెళ్తాం . అప్పటిదాకా తేలికగా సాగిన కధనం ఒక్కసారిగా బరువెక్కుతుంది . పిల్లలకు , తల్లితండ్రులకు మధ్య భావోద్వేగాల సంఘర్షణ మొదలౌతుంది . చదువులు పూర్తి చేసుకున్న పిల్లలు మంచి జాబ్ లో సెటిల్ అవ్వాలని తలితండ్రులు పడే ఆరాటాలు , ఎలాగైనా సెటిల్ అయి పేరెంట్స్ కు సప్పోర్ట్ గా నిలబడాలని పిల్లలు పడే తపన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు . ఈ భాగోతం నిజ జీవితంలో చాలా ఇళ్లలో జరిగేదే . పై చదువుల కోసం పిల్లలు ప్రయత్నాలు చేయడం , దానికయ్యే ఆర్థిక వనరుల గురించి తల్లితండ్రులు ఆలోచించడం , పిల్లలు వెంటనే ఉద్యోగాల్లో సెటిల్ అయితే బాగుంటుందని అనుకోవడం దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉండేదే . ముఖ్యంగా మధ్య తరగతి , దిగువ మధ్య తరగతి ఇళ్లలో ఇవి మాములే . అందుకే ఇలాంటి సన్నివేశాలు ఉండటంతోనే వాలా చాలామందికి కనెక్ట్ అయ్యింది . ఓవరాల్ గా ముగింపు మాత్రం అందరూ ఊహించిన విధంగానే ఉంటుంది .

ఎవరెలా చేసారు ?

ముందే చెప్పినట్టు ఇందులో స్టార్ డమ్ లేదు . సోషల్ మీడియాలో రీల్స్ చేసుకులే సాధారణ కుర్రాళ్లే ఇందులో నటించారు . అది కూడా వారి పేర్లతోనే . అయితే సినిమా వీరి నటన చూస్తుంటే అసలు కొత్తవాళ్లు అని మనకి ఏ మాత్రం అనుమానం రాదు . ఎంతో అనుభవం ఉన్న నటుల మాదిరి సహజంగా నటించారు . అలన్ , అజీన్ , హషిర్ , వినాయక్ .. ఈ నలుగురి చుట్టూనే కథ నడుస్తుంది . ఇందులో ఒకరు ఎక్కువ , ఒకరు తక్కువ అని లేదు . నలుగురూ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు .

సాంకేతికత

ఏ టీమ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది . అఖిల్ లైలాసురన్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది . కేరళ గ్రామీణ వాతావరణం చక్కగా చూపించారు . తక్కువ బడ్జెట్ అయినా నిర్మాణ విలువలు బాగున్నాయి .

విశ్లేషణ

వాలా లో కథ కోసం వెతికేకన్నా నిజ జీవితంలో కనెక్ట్ అయ్యే కొన్ని సన్నివేశాలే మనకు ఎక్కువ కిక్ ఇస్తాయి . చిన్నప్పటి స్కూల్ లైఫ్ , కాలేజీ లైఫ్ , ఫ్రెండ్స్ తో కలిసి చేసిన అల్లరి , ఇంట్లో క్లాస్ పీకడాలు సినిమాలో చూస్తున్నప్పుడు ఎక్కడో మనసు పొరల్లో ఈ సన్నివేశాలు మన నిజ జీవితంలో జరిగినట్టు అనిపిస్తాయి . అప్రయత్నంగా పెదవుల మీద చిరునవ్వు ప్రత్యక్షం అవుతుంది . అది చాలదూ ? సినిమాకి కనెక్ట్ అవడానికి . కాకపోతే ఫస్టాఫ్ లో కామెడీ కోసం సృష్టించిన కొన్ని సాగతీత సన్నివేశాలు మనం భరించాలి . ఇక సెకండాఫ్ లో మరీ ముఖ్యంగా ఆఖరి ముప్పై నిమిషాల్లో మనముందుకు వచ్చే గుండె బరువెక్కించే భావోద్వేగ సన్నివేశాలతో కంట తడిపెట్టకుండా మనల్ని మనం నిగ్రహించుకోవాలి . ఓవరాల్ గా వాలా నిరాశపర్చదు . ఆ నలుగురు కుర్రాళ్ళు చేసే అల్లరితో కాసేపు నవ్వుకుంటాం . జీవితంలో సెటిల్ అవ్వాలనుకుని లక్ష్యాలు నిర్దేశించుకుని కష్టపడుతుంటే బరువెక్కిన హృదయాలతో చూస్తుండిపోతాం . అరె వీళ్ళు ఇంకా అల్లరి చేస్తేనే బాగుండేదే అనిపిస్తుంది . ఓవరాల్ గా వాలా టచ్ చేస్తుంది . జియో హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఇంట్లోనే హాయిగా చూసేయండి

నటీనటులు : అలన్ ,అజిన్ ,హషిర్ , వినాయక్
సంగీతం : ఏ టీమ్
సినిమాటోగ్రఫీ : అఖిల్
రచన : విపిన్ దాస్
దర్శకత్వం : సావిన్
విడుదల : జియో హాట్ స్టార్
రేటింగ్ : 3 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!