ఫోటో చూసారుగా
ఈ ఫోటో వెనుక ఓ చరిత్ర ఉంది .
1980 దశకంలో వంగవీటి మోహన రంగా మీద , ఆయన అనుచరుల మీద పోలీసుల అణచివేతలు , నిర్బంధాలు కొనసాగుతున్న రోజులు . తదుపరి రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రావడం , విజయవాడ పోలీస్ కమిషనరేట్ స్థాయికి ఎదగడంతో మునుపెన్నడూ లేనివిధంగా రంగా అనుచరులపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు . వంగవీటి అనుచరులపై పోలీసులు దూకుడు పెంచటానికి కూడా కారణం ఉంది . కంకిపాడు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ సోదరుడు మురళి హత్యకు గురి కావడంతో పోలీసులు వంగవీటిని టార్గెట్ చేసారు .
పోలీసులు అనుక్షణం వంగవీటి మోహన రంగా కదలికలను పసిగట్టడం మొదలుపెట్టారు . రంగా ఇంటినుంచి బయలుదేరి తిరిగి ఇంటికి చేరుకునేవరకు పూర్తి నిఘా పెట్టారు . పోలీసులు తనమీద నిఘా పెట్టారని అప్పటికే వంగవీటికి కూడా తెలుసు . అందుకే పోలీస్ చర్యలకు వ్యతిరేకంగా న్యాయసహాయం కోసం హైకోర్టు ను ఆశ్రయిద్దామని ఆయన తరపు న్యాయవాదులు సలహా ఇచ్చినప్పటికీ వంగవీటి ఒప్పుకోలేదు . జనం నా పక్కన ఉన్నంతవరకు పోలీస్ బెటాలియన్లు దిగినా నన్నేమీ చేయలేవని అభిమానుల మీద నమ్మకాన్ని ఉంచారు .
మరోపక్క పోలీసులు అప్పటికే రంగా ముఖ్య అనుచరులను అరెస్ట్ చేసి బందరు కు తరలించారు . మచిలీపట్టణం దాటి వెళ్లరాదని , రోజూ పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టాలని ఆంక్షలు విధించారు . ముఖ్య అనుచరులు అందరూ కండిషన్ బెయిల్ మీద మచిలీపట్నంలో ఉండటంతో రంగాను మట్టుబెట్టడానికి ఇదే సమయమని శత్రువులు వ్యూహం పన్నటం మొదలుపెట్టారు . ఒకపక్క పోలీసులు , మరోపక్క శత్రువులు తనకోసం కాచుకుని కూర్చున్నారని వంగవీటికి కూడా అర్థమైంది . తమాషా ఏంటంటే ఆ రోజుల్లోనే వంగవీటికి సొంత ఇంటిలిజెన్స్ నెట్ వర్క్ ఉండేది . పోలీస్ ఇంటిలిజెన్సుకు ధీటుగా ఆయనకు క్షణాల్లో సమాచారం వచ్చేది .
ఈ పరిస్థితుల్లో వంగవీటిని కొన్నాళ్లపాటు అజ్ఞాతంలోకి వెళ్లాల్సిందిగా ఆయన అభిమానులు కోరారు . కానీ వంగవీటి మోహన రంగా అజ్ఞాతంలోకి వెళ్ళడానికి బదులు పోలీసు అణచివేతలకు వ్యతిరేకంగా తన గళం వినిపించటానికే సిద్ధం అయ్యారు . పిరికివాడిలా అజ్ఞాతంలోకి వెళ్లి నమ్ముకున్న అనుచరుల నమ్మకాలను వమ్ము చేసేకన్నా శత్రువులతో పోరాటం చేయడానికే ఆయన నిర్ణయించుకున్నారు . ఇదే విషయాన్ని ఆయన తన ముఖ్య అనుచరులకు చెప్పారు . పోలీస్ అణచివేతలకు వ్యతిరేకంగా తన గళాన్ని ప్రజల సమక్షములోనే వినిపిస్తానని చెప్పారు .
అందుకు విజయవాడ గాంధీ నగరంలోని జింఖానా గ్రౌండ్స్ లో వేదికను నిర్ణయించుకున్నారు . ఓ సాయంత్రం వేళ జింఖానా గ్రౌండ్స్ లో సభ నిర్వహించటానికి ఏర్పాట్లు జరిగాయి . పోలీస్ అణచివేతలకు వ్యతిరేకంగా రంగా గ్రౌండ్స్ లో మాట్లాడనున్నారని తెలియడంతో అటు ప్రజలు , ఇటు పోలీసులు భారీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు . విజయవాడ నగరంలో ఎటు చూసినా ఇదే చర్చ . సభలో రంగా ఎలాంటి ప్రకటన చేయబోతున్నారని ప్రజల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి మొదలైంది . దాంతో అందరికళ్ళు విజయవాడ జింఖానా గ్రౌండ్స్ మీద పడ్డాయి . ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు కూడా లేవు . కానీ ఈ వార్త క్షణాల్లో కోస్తా జిల్లాలు అంతటా పాకిపోయింది .
ఈ సభకు విజయవాడ నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఆయన అభిమానులు తరలి వచ్చారు . అప్పటికే గ్రౌండ్స్ లో జనం తో పాటు పోలీసులు కూడా నిండిపోయారు . మాములుగా వంగవీటి సభలకు పోలీసులు వస్తారు కానీ ఎన్నడూ లేని రీతిలో కనిపించిన ఆ బందోబస్త్ చూసి జనాలు ఆశర్యపోయారు . చూస్తుంటే అందరికీ అక్కడ యుద్దవాతావరణం కనిపించింది .
మరోపక్క వంగవీటి రంగాను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని , ఆయన ఈ మీటింగ్ కు రాలేరని పుకార్లు బయలుదేరాయి .
ఈ మీటింగ్ కి రంగా వస్తారా ?
లేకపోతే పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ని ఆపుతారా ?
గ్రౌండ్లో ఇసకేస్తే రాలని జనాల్లో ఎటుచూసినా ఉత్కంఠత , ఉద్వేగం
అందరి ముఖాల్లో టెన్షన్ .
అందరి చూపులూ మెయిన్ గేట్ వైపే .
సభ ఆరు గంటలకు ప్రారంభం అన్నారు కానీ ఏడు గంటలు కావస్తున్నా రంగా జాడ లేదు. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ సమాచారం లేదు . అయినా సరే జనం మాత్రం గ్రౌండ్ లోనుంచి కదల్లేదు .
ఇటువంటి టెన్షన్ వాతావరణంలో ఎవరో అరిచారు ” అదిగో టైగర్ రంగా వస్తున్నారు ” అని .
అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న గ్రౌండ్లో ఒక్కసారిగా కలకలం రేగింది
అందరి చూపులు గ్రౌండ్ ఎంట్రన్స్ వైపు మళ్ళాయి
కొన్ని కార్లు వాయువేగంతో వరుసగా మైదానంలోకి దూసుకొచ్చి ఆగాయి
ఆ కార్ల కాన్వాయి చూసి అక్కడే ఉన్న మఫ్టీ పోలీసులు సైతం ఉలిక్కిపడ్డారు . బహుశా ఆ రోజుల్లోనే బయటికి వస్తే భారీ కాన్వాయిలు ఫాలో అయ్యే నాయకుడు ఒక్క వంగవీటి మోహన రంగా అయ్యుంటారు . ఇంత భారీ కాన్వాయి మరే నాయకుడి విషయంలో చూడలేదు. నిజానికి ఆ రోజు వంగవీటి ఇంటినుంచి మొదలుకుని నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలలో పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు .
అప్పటికే ఇంటిదగ్గర ఆయన లేరన్న సమాచారం వచ్చింది . అలా అని నగరంలో ఎక్కడున్నారో తెలీదు . ఈలోపు జింఖానా గ్రౌండ్స్ లో మీటింగ్ కి ఆయన వస్తున్నారని తెలియడంతో పోలీసులు పోలోమంటూ మైదానంలో కాపుకాశారు .
ఈ పరిస్థితుల్లో ఎవరూ ఊహించని విధంగా గ్రౌండ్లో వంగవీటి కాన్వాయి వచ్చి ఆగింది . అంతే అప్పటిదాకా స్తబ్దుగా ఉన్న గ్రౌండ్లో ” టైగర్ రంగా జిందాబాద్ ” నినాదాలు మిన్నుముట్టాయి . ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉద్విగ్న వాతావరణం కమ్ముకుంది . రంగా ఏ కారులో ఉన్నారో తెలీదు . జనం ఒక్కసారిగా అన్ని కార్ల చుట్టూ మూగారు . ఆయన కోసం ఆత్రుతతో ముందుకు తోసుకురావడం మొదలుపెట్టారు . మెల్లిగా ఒక కారులోనుంచి చిరునవ్వులు చిందిస్తూ దిగారు వంగవీటి .
జనసందోహ నినాదాల మధ్య చకచకా నడుచుకుంటూ వేదిక వద్దకు వెళ్లారు వంగవీటి. వేదిక మీదకు చేరుకోగానే ఆయన మైక్ అందుకోవడంతో అప్పటిదాకా నినాదాలతో హోరెత్తిన మైదానంలో చీమ చిటుక్కుమన్నా వినిపించని నిశ్శబ్దం ఆవరించింది .
రంగా ఏం చెప్తాడా ? అని ఆయన అభిమానులు , గ్రౌండ్లో ఉన్న మఫ్టీ పోలీసులు చెవులు రిక్కించి వినడం మొదలుపెట్టారు .
వంగవీటి మైక్ అందుకుని ,
“ఈ సభకు నన్ను రానీకుండా చేద్దామని అష్టకష్టాలు పడ్డ పోలీస్ దొరగారికి నేను చెప్పేది ఒకటే .. ప్రజల అభిమానం ఉన్నంతవరకు రంగాను ఆపటం నీ వల్ల కాదు కదా.. నీకు ఆదేశాలు ఇస్తున్న నీ సీఎం వల్ల కూడా కాదు ” అని ఇంకా మాట్లాడబోతుండగా ఒక్కసారిగా విధ్యుత్ సరఫరా నిలిపివేశారు .
దీంతో ఒక్కసారిగా గ్రౌండ్లో కలకలం చెలరేగింది . అరుపులు ,కేకలతో గ్రౌండ్ దద్దరిలిపోయింది .
చుట్టూ చిమ్మ చీకటి . హఠాత్తుగా గాఢాంధకారం అలుముకోవడంతో అక్కడేం జరుగుతుందో అర్ధం కాలేదు . రంగాకు ఎవరైనా హాని తలపెడుతున్నారేమో అని అభిమానులు ఆందోళన పడ్డారు .
కానీ మఫ్టీలో ఉన్న పోలీసులు సైతం ఆశ్చర్యపడేలా అకస్మాత్తుగా గ్రౌండ్లో కొంతమంది చేతుల్లోనుంచి బ్యాటరీ లైట్లు వెలిగాయి . చిమ్మచీకటిగా ఉన్న గ్రౌండ్లో అక్కడక్కడా కొన్నిచోట్ల వెలుగురేఖలు పర్చుకున్నాయి .
చీకట్లోనే ఒక అభిమాని వేదిక వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి వంగవీటిని జనాలకు కనిపించేలా బ్యాటరీ లైట్ చేతిలో పట్టుకుని చూపించాడు . అప్పటికే రంగాకు రక్షణగా ఆయన చుట్టూ వలయంగా అభిమానులు నిలబడ్డారు . బ్యాటరీ లైట్ వెలుగులో రంగాను చూసిన ఆయన అభిమానులు నినాదాలతో హోరెత్తించారు .
కొద్దినిమిషాలకు కరెంట్ రావడంతో రంగా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ,
” వ్యానుల్లో పోలీస్ బెటాలియన్నే దింపుతారో , బహిరంగ సభలో కరెంటే తీసేస్తారో వాళ్ళని ఏదైనా చేసుకోనివ్వండి . అభిమానులే నా బలం . మీ అభిమానం ఉన్నంతవరకు ఇటువంటి పోలీసు దొరలు ఇంకో వందమంది వచ్చినా రంగాను ఏమీ చేయలేరని గుర్తుపెట్టుకోండి ” అంటూ అభిమానులను చూపిస్తూ మాట్లాడారు .దాంతో పావుగంటసేపు నినాదాలతో గ్రౌండ్ హోరెత్తిపోయింది .
ఆ రాత్రే ఉన్నతాధికారులకు ఇంటలిజెన్స్ నివేదికలు వెళ్లాయి .
రంగా ముఖ్య అనుచరులను మచిలీపట్నం తరలించినప్పటికీ సైన్యం మాదిరి అతన్ని నీడలా వెన్నాడుతూ కాపు కాచుకునే అభిమానులు ఉన్నారని.. ప్రస్తుత పరిస్థితుల్లో రంగాను అరెస్ట్ చేస్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం కష్టమౌతుందని రిపోర్ట్స్ ఇచ్చారు .
ఇది జరిగిన కొద్దిరోజులకే బందరు రోడ్డు మీద వెళ్తున్న రంగా వాహనాలను పోలీసులు ఆపి ఆయుధాలు ఉన్నాయనే నెపంతో తనిఖీ చేయడం జరిగింది . ఆయుధాలు లేవని నిర్దారించుకున్న పోలీసులు వాహనాలను వదిలివేయడంతో ,
రంగా నిరాయుధుడిగా తిరుగుతున్నాడనే సంకేతం శత్రువులకు చేరాలనే పధకం ప్రకారమే పోలీసులు వాహనాలు తనిఖీ చేసారని ఆయన అభిమానులు ఆరోపించారు .
దరిమిలా రంగా పోలీస్ అణచివేతలకు నిరసనగా మరికొన్ని డిమాండ్లతో గవర్నర్ పేటలోని తన ఇంటి ఎదురుగా నిర్మల్ హృదయ్ భవన్ గోడకు అనుకుని ఉన్న పేవ్మెంట్ మీద నిరాహార దీక్ష చేస్తుండగా డిసెంబర్ 26 హత్యకు గురయ్యారనే సంగతి అందరికీ తెలిసిందే !
అయితే తనను హత్య చేస్తారని రంగాకు ముందే తెలుసా ?
అందుకే ఆయన నిరాహార దీక్షలో ఉన్నప్పుడే ముఖ్యమైన అనుచరులకు సంకేతాలు ఇచ్చారా ?
ఈ సందర్భంగా ఉండవల్లితో వంగవీటి మోహన రంగా ఏం చెప్పారు ? లాంటి వివరాలన్నీ తరువాయి భాగంలో తెలుసుకుందాం !
ఈ ఆర్టికల్ షేర్ చేయదల్చుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ , ఫేస్ బుక్ , ఇతర సోషల్ మీడియా ఐకాన్ల ద్వారా చేయొచ్చు
